ఆర్ కృష్ణయ్య అంటే అన్ని పార్టీలకు అంత ఇష్టమెందుకు?
ఈ గురుకుల్ స్కూళ్ల ఏర్పాటు వెనక ఉన్న శక్తి, తెలుగు రాష్ట్రాల్లో యాబై యేళ్ల బిసి ఉద్యమంలో నిలకడగా నిలబడ్డ ఒకే ఒక వ్యక్తి ఆయనే;
ఆర్ కృష్ణయ్య సింహనాదాన్ని అక్షరీకరించిన కడియాల సురేశ్ కుమార్
‘బీసీల సింహ నాదం ఆర్ కృష్ణయ్య’ అనే ఈ పుస్తకాన్ని కడియాల సురేశ్ కుమార్ రచించారు. ఆర్ కృష్ణయ్య అందించిన సమాచారం, ఫోటోలతోపాటు అనేక విషయాలను స్వయంగా వెతికి వెలికి తీసి రూపొందించారు సురేశ్. ఇందులో పొందుపరిచిన ఫోటోలు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర పతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మొదలుకొని ఎంతమందిని కలిసారో బీసీల గురించి ఎన్ని విధాలుగా చర్చించారో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. చక్కని ఫోటోలు ఈ పుస్తకానికి ప్రాణం. కడియాల సురేశ్ నవతరం ఉద్యమ కార్యకర్త.
ఈ సమాజం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కలలు కంటూ కలం పట్టిన రచయిత. చైతన్యంలో , భావాల్లో సామాజిక ఉద్యమ కారుడు. తన బతుకు తాను బతుకుతూ సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న ఉన్నత విద్యావంతుడు. యం. టెసి చేసి డిఆర్డివోలో కాంట్రాక్టు ఇంజనీర్ గా పని చేస్తూ రచనా రంగంలో కొనసాగుతున్నాడు సురేశ్.
ఎంటెక్ వంటి పెద్ద చదువులు చదివినా సురేశ్ ధ్యాస సమాజం , సాహిత్యం , అధ్యయనం ఆయన హృదయ సీమ . అందులో ఎందరో మహనీయుల స్పూర్త్తి. బుద్ధుడు, మహాత్మా జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే, బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, భాగ్యరెడ్డి వర్మ, డాక్టర్ సి నారాయణ రెడ్డి , కాళోజీ , తెలంగాణ ఉద్యమ స్పూర్తిదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్, తదితరుల స్పూర్తిని వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ముందుకు సాగుతున్నాడు సురేశ్ కుమార్.
ఇంత చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది? అధ్యయనం ఒక్కటే కాదు… దానికి జీవితానుభవాలు తోడయ్యాయి. బాల్యంలో అనుభవించిన కష్టాలు అతని చైతన్యాన్ని నిగ్గు దేల్చాయి. చాలా విషయాల్లో నా బాల్యం లాగే గడిచింది. ఆ అనుభవాలే చైతన్యంగా మలుపుతిరిగింది.
కడియాల సురేశ్ బాల్యం పేదరికంలో గడిచింది. తండ్రి ఆర్ఎంపీ వైద్యుడు. కుటుంబం గడవడం కష్టంగా వుండేది. తండ్రికి అనారోగ్యం. సురేశ్ బడి సెలవు దినాలలోకూలి పనులకు వెళ్లే వాడు. పాఠశాల స్థాయిలో వ్యాస రచన తదితర పోటీల్లో బహుమతులు అందుకున్నాడు. సురేశ్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామం లో జన్మించారు. తల్లి కడియాల ధనలక్ష్మి. చతండ్రి కడియాల నాగేశ్వరరావు. సురేష్‌కు ఒక అన్న, ఒక చెల్లె. 6 డిసెంబరు 1989 లో జన్మించిన సురేశ్ 2004లో నల్లబెల్లిలో పదవ తరగతి చదివి, 2006లో నర్సంపేటలోఇంటర్ మీడియట్ చేసాడు.2010లో వరంగల్ లో బి. టెక్ చేసి, 2014లో హైదరాబాద్ లోని నల్ల మల్లారెడ్డి కళాశాలలో ఎం.టెక్ పూర్తి చేశాడు. కొంతకాలం హైదరాబాద్ లో ఘట్ కేసర్ లోని మెగా ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేసి డిఆర్ డివోలో కుదురుకున్నాడు.
ప్రజల కోసం పని చేసే వారి పట్ల సురేశ్ కు అమితమైనా వీరారాధన. దశాబ్దాలుగా బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆర్ కృష్ణయ్య పట్ల గొప్ప అభిమానం. ఆ అభిమానంతోనే ఈ పుస్తకంలో వారి ఉద్యమాల చరిత్ర సంక్షిప్తంగా సమకూర్చడానికి పూనుకున్నాడు. దీనికి ముందు ప్రజా ఉద్యమాల నుండి ఎదిగి ప్రజా ప్రతినిధిగా , మహిళా సంక్షేమ మంత్రిగా వీరనారిగా ప్రశంస లందుకున్న ధనసరి సీతక్క గురించి చిన పుస్తకం రాసి అందించాడు.
కడియాల సురేశ్ మౌలికంగా తరయిత. నా డెబ్బయ్యవ జన్మదిన సందర్భంగా 2019 ఆగస్టులో రవీంద్ర భారతిలో విశాల సాహితి పురస్కారం సత్కారం అందుకున్నాడు. 5 రోజుల పాటు జరిగిన జరిగిన జన్మదిన ఉత్సవాల్లో ఎంతో ఉత్తేజ్ పూరితంగా సాగాయి. సురేశ్
2015లో “ ప్రజా సమస్య లు పరిష్కార విధానం” , 2016లో “ మెరుగైన జీవితం” పుస్తకాలు ప్రచురించి ప్రశంసలు అందుకున్నాడు. సమస్య ల పరిష్కారాలు పుస్తకంలో 50 అంశాలను వాటి పరిష్కారాలను సూచించాడు.
ఇలా సురేశ్ స్వయం కృషితో ఉన్నత విద్యను, సామాజిక చైతన్యాన్ని అంది పుచ్చుకొని తనదైన కృషి కొనసాగిస్తున్నాడు. చుక్కా రామయ్య , బి వి పట్టాయి రాం, లోక్ సత్తా డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, ప్రొఫెసర్ యం కోదండరాం, నాటి హోం మంత్రి నాయినా నర్సింహ్మా రెడ్డి , శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తదితరుల ప్రశంసలను ఆశీస్సులను అందుకున్నాడు. యువతకు మార్గ దర్శకుడిగా ఎదుగుతున్నాడు. రోజువారీ జీవిత సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పథకాలను ఎలా అందుకోవాలి సూచించి స్పూర్తి నందించాడు.. అదే క్రమంలో బంగారు తెలంగాణ, ఆత్మహత్యల నివారణ పేరుతో మరో రెండు పుస్తకాలను రూపొందించడాడు. యువ సాహిత్య రత్న అవార్డు అందుకున్నాడు. 2017లో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రవీంద్ర భారతిలో జరిగిన భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఓబీసీ ఫౌండేషన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డర్స్ , కలచరల్బుక్ ఆఫ్ రికార్డ్‌సు అధ్వర్యంలా నిర్వహించిన సభలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ చేతుల మీదుగా యువ సాహిత్య రత్న అవార్డు అందుకున్నాడు.
నేను బీసీ కమిషన్ చైర్మన్ గా పని చేస్తున్నుపుడు కలిసి సక్కరించడంతోపాటు సమ్మానంతో పాటు నా రచనలను కానుకగా అందుకున్నాడు. ఇలా రోజు రోజుకు ఉత్సాహంతో పాటు ప్త్సాహం తోడవ్వడంతో సమకాలీన ఉద్యమ నేతల జీవిత చరిత్రలను రాయడానికి పూనుకున్నాడు. అలా వెడుతున్నదే ఈ పుస్తకం ఆర్ కృష్ణయ్య విద్యార్థి దశనుండి బీసీ సంఘ నాయకుడుగా సుప్రసిద్ధుడు. పాఠశాల స్థాయి నుండి తనను తాను విద్యార్థుల నాయకుడుగా మలుచుకున్నాడు. క్రమంగా బీసీ ఉద్యమ నాయకుడుగా ఎదిగారు. ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడుగా సమైక్య రాష్ట్ర నాయకుడిగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు.
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆయన ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బిజేపీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వారి పేరు ప్రసిద్దమైనంతగా వారి నేపథ్యం, కుటుంబం, వ్యక్తిగత వివరాలు చాలా మందికి తెలియవు. ఆ కొరతను సురేశ్ ఈ పుస్తకం ద్వారా చాలా మేరకు తీర్చాడు.
ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడుగా జాతీయ స్థాయిలో బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లపై తమ గొంతు వినిపిస్తున్నారు. ఎల్ బి నగర్ నుండి టిడిపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా 2014 - 2018 మధ్య పని చేసారు. అయినా ఎమ్మెల్యే గా కాకుండా బీసీ నాయకుడుగానే ప్రజలు రాష్ట్ర వ్యాపితంగా గుర్తించారు.
ఆర్ కృష్ణయ్య అన్ని పార్టీలకు కావలసినవాడు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లతోపాటు సిపిఐ, సిపి యం పార్టీలు కూడా గౌరవిస్తాయి. వారి జీవిత భాగస్వామి శబరీ దేవి గారు అనేక పిజీ లు చేసి ప్రభుత్వం లో గజిటెడ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. రిషి అరుణ్, శ్వేత దేవి.
ఆర్ కృష్ణయ్య పూర్తిపేరు ర్యాగ కృష్ణయ్య. 1954 సెప్టెంబరు 13లో రాళ్లగుడుపల్లి గ్రామం, మోమిన్ పేట్ , వికారాబాదు జిల్లాలో జన్మించాడు. ఆయన తండ్రిపేరు అడివప్ప గౌడ్, తల్లి రాములమ్మ. ఆయన విద్యార్హతలు ఎం.ఏ, ఎల్ఎల్ఎం., ఎంఫిల్. ఆర్.కృష్ణయ్య 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పై 12525 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి చట్ట సభల్లోకి అడుగుపెట్టాడు. అపుడు తెలుగు దేశం పార్టీ కి మెజారిటీ వస్తే ఆర్ కృష్ణయ్యే ముఖ్యమంత్రి అనుకున్నారు.
ఆర్ కృష్ణయ్య 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మే 17న ప్రకటించింది. 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేండ్లపాటు ఉండగానే 2024 శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయాక వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సెప్టెంబర్ 24న రాజీనామా చేశారు. ఆర్. కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 2024 డిసెంబర్ 9న బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆరేళ్లపాటా రాజ్యసభలో కొనసాగుతారు.
ఆర్ కృష్ణయ్య ఉద్యమ ప్రస్థానం 1976 లో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైంది. దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అది విస్మరించలేనిది. 1975 జూన్ 25 వ తేదీన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు పూనుకున్నారు. అలా 20 సూత్రాల పథకం ప్రాంభించారు. దళితులకు వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాల పంపిణీ, మొదలైన వాటితో పాటు పేద విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్ లు, ఉన్న హాస్టల్లలో వందదాక సీట్లు పెంచాలని ఆదేశించారు. అలా పెంచిన సీట్లను నింపడానికి హాస్టల్ వార్డెన్ గా ఎలుగందులలో పని చేస్తున్న నేను అనేక గ్రామాలు పర్యటించి విద్యార్థులను చేర్చాను. అలా చేరిన విద్యార్థుల్లో తెలంగాణ రాష్ట్ర తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పని చేసి ప్రస్తుతం అంబేద్కర్ ఒపెన్ యూనర్సిటీ వైస్ చాన్సలర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఘంటా చక్రపాణి ఒకరు.
ఇలా ఎమర్జన్సీ కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లో 20 సూత్రాల పథకం సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు జరపడం వల్ల ఎమర్జెన్సీ తరువాత 1977 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, అటు తరువాత 1978 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
దేశమంతటా జనతా పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడం బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడమే ప్రధాన కారణం. అలాంటి కృషిలో భాగంగా 1976 లో ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో హాస్టల్లు పెంచాలి అని, హాస్టల్ లలో సీట్లు వసతి సౌకర్యాలు పెంచామని ఉద్యమించారు. ఎమర్జెన్ ీ కలంలో ఏబీవీపీ, ఎస్ ఎఫ్ వై, డి ఎస్ ఓ, పిడి యస్ యూ, ఆర్ యస్ యూ వంటి విద్యార్థి సంఘాలపై జలగండా వెంగళరావు ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలు ప్రయోగించింది. ఎంతో మందిని ఎన్ కౌంటర్ల పేర హత్య చేసింది. ఆ భయ బీభత్స కాలంలో 20 సూత్రాల సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమించి ప్రజలకు మేలు చేసే నూతన నాయకత్వం అవసరమైంది. అలాంటి చారిత్రక ఆవశ్యకత నుండి ఆర్ కృష్ణయ్య విద్యార్థి నాయకుడుగా ఎదిగి వచ్చారు.
ప్రభుత్వానికి దరఖాస్తులివ్వడం, వాటి గురించి శాంతియుతంగా ఉద్యమాలు చేయడం అనే ఒక నూతన ఒరవడి ఉద్యమాలతో ఆర్ కృష్ణయ్య చరిత్ర సృష్టించారు. క్రమంగా తానే చరిత్ర నిర్మాత గా ఎదిగారు.
ఆ సమయంలో ఇది అశాస్త్రీయ విద్యావిధానం అంటూ విప్లవోద్యమాల ప్రచారం విస్తృతంగా సాగింది. ఎందరో చదువులు వదిలి ఉద్యమాల బాట పట్టారు. అందుకు భిన్నంగా ఆర్ కృష్ణయ్య గారు ఆధునిక విద్య ద్వారానే అన్ని అవకాశాలు తెరుచుకుంటాయ ి, విద్య ద్వారానే విజ్ఞానం జీవితం గెలుచుకోగలమని, విద్య తప్ప పేద ప్రజలకు ఎదగడానికి మరో మార్గం లేదని విస్తృతంగా ప్రచారం చేసారు. పేదలు చదువుకోవడానికి హాస్టల్ వసతి అవసరమని లేని ఎడల చదువు కోలేరని ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి నిలదీసి వందలాది హాస్టళ్లు గురుకుల రెసిడెన్షియల్ పాఠాశాలలు కళాశాలలు ఏర్పాటుకు కృషి చేశారు. దేశంలో ఎక్కడా లేనన్ని హాస్టల్లు రెసిడెడెన్షియల్ పాఠశాలలు మన రెండు రాష్ట్రాల్లో ఏర్పడడానికి లక్షలాదిమంది ఉన్నత విద్య అందుకొని సమస్త రంగాల్లో ఎదగడానికి చేసిన ఆర్ కృష్ణయ్య గారి కృషి ఒక గొప్ప చరిత్ర.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎమర్జెన్సీ కాలం లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడానికి ఉత్రాది రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్య వంటి స్వతంత్ర నాయకత్వం ఎదగలేదు. అలాంటి విద్యార్థి యువతరం అంతా 1974 లో లోక్ నాయక్ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ఎమర్జెన్సీలో జైళ్ల పాలయ్యారు. రహస్య జీవితంలోకి వెళ్లి పోయారు. అందువల్ల ఉత్తరాది లో ఎమర్జెన్సీ తరువాత వారు జనతాపార్టీ నాయకత్వంలో ఎమ్మెల్లేలుగా, ఎంపీలుగా ఎదిగారు. మంత్రులు ముఖ్యమంత్రులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యార్థి యువజన
ఉద్యమాలు ఎన్నికల బహిష్కరణ పిలుపుతో ముందుకు సాగడం వల్ల ఉత్తరాది వలె బీసీ ఎస్సీఎస్టీల నుంచి రాజకీయ నాయకత్వం ఎదగకుండా పోయింది. ఇలాంటి దశలో ప్రజల ఆశలకు ప్రతిధినిధిగా ఆర్ కృష్ణయ్య ఒక ఆశా కిరణంగా ఎదిగారు. లక్షలాది విద్యార్థులకు మేలు కలిగే అనేక ఉద్యమాలు చేపట్టారు. ఆర్ కృష్ణయ్య బీసీల జాతీయ నాయకుడుడా ఎదిగి స్థిరపడిన చారిత్రక నేపథ్యం ఇది.
గ్లోబలీకరణ , కంప్యూటరీకరణ, ప్రయివేటీకరణ యుగంలో ఎదిగిన యువతరానికి ఈ చరిత్ర తెలిసే అవకాశం లేదు. అందువల్ల సురేశ్ ఈ పరిణామాలను పట్టుకోవడం అసాధ్యం అయింది. అయినప్పటికీ ఈ చారిత్రక పరిణామం తప్ప.
సురేశ్ మొదటిసారిగా ఆర్ కృష్ణయ్య జీవిత ప్రయాణాన్ని చక్కగా పట్టుకున్నారు. మొదటి సారి ఆర్ కృష్ణయ్య గురించి వీలైన అనేక సోర్సుల నుండి సేకరించి ఈ పుస్తకం రూపొందించారు. “బీసీల సింహ నాదం ఆర్ కృష్ణయ్య “ అనే పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకం ఆర్ కృష్ణయ్యగారి దశాబ్దాల కృషిని సంక్షిప్తంగ, సమగ్రంగా అందిస్తున్న తొలి పుస్తకం. ఈ పుస్తకంలో యాభయి ఏళ్ల బీసీ ఉద్యమాలను ఆర్ కృష్ణయ్య జీవితం ఉద్యమాలు అనే ఫ్రేంలో బిగించి అందించాడు. ఇందులో ఎంతో విలువైన సమాచారం ఉంది. ఆర్ కృష్ణయ్య ఉద్యమాల విజయ రహస్యం ఏమిటో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆయన చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న కష్టాలు, తీసుకున్న జాగ్రత్తలు , విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తు నందించిన తీరు, అందుకు హాస్టల్లు అత్యవసరమని గ్రహించి సాధించిన తీరు ఇందులో రికార్డు చేశారు.
ఆర్ కృష్ణయ్య ఉద్యమాల శైలి ప్రత్యేకమైనది. విశిష్టమైనది. ఆయనది గురి చూసి కొట్టే బాణం. ఏ సమయంలో ఏ ఉద్యమం అవసరమో అందుకు ఏ నినాదాలు , ఎవరిని సమీకరించా ో బాగా తెలిసిన ఉద్యమ నేత. పట్టు విడుపులు తెలిసిన నాయకుడు. ఎపుడు తగ్గాలో ఎక్కడ తగ్గావో ఎపుడు ఎక్కడ ఉగ్ర రూపంతో విజృంభించాలో తెలిసిన వ్యూహకర్త. మాతో సహా చాలా మంది ఉద్యమకారులను మనం చూస్తుంటాం. ఉదృతంగా ఉరికి వస్తారు. ఉవ్వెత్తున లేస్తారు. ఉద్యమాలను నిర్మిస్తారు.
ఎందుకో గాని ఐదు పదేళ్ల కు రూటు మారుస్తారు. ఇతర రంగాలకు వెళ్లి పోతారు. కొందరు స్టీరింగ్ వదిలేసి బస్సును ప్రజలను అక్కడే వదిలి తన దారిన తాను పోతుంటారు. కొందరు ఉద్యోగాల్లో చేరుతారు. కొందరు రాజకీయాల్లో తమ భవిష్యత్ ను వెతుకుకుంటారు. కొందరు విప్లవకారులుగా, మరి కొందరు మేధావులుగా, జర్నలిస్టులుగా మలుపు తిుగుతుంటారు.
యాభయి ఏళ్లు ఒకే రంగంలో ఒకే రీతిగా వెనుకంజ వేయకుండా కాలంతో పాటు నడుస్తూ ఉద్యమాలను నడపడం , తానే ఒక దిక్సూచిగా సింబల్ గా నిలబడడం అరుదు. ఒక గద్దర్, ఒక వర వరరావు, ఒక సీతారాం ఏచూరి, ఒక సురవరం ప్రతాపరెడ్డి, ఒక కాళోజీ, ఒక చుక్కా రామయ్య, ఒక మహాత్మా జ్యోతి రావు ఫూలే, ఒక సావిత్రి బాయి ఫూలే, ఒక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ , ఒక కాన్సీరాం, ఒక ఆచార్య కొంటా లక్ష్మణ్ బాపూజీ వంటి వారికే ఇది సాధ్యమైనది. అదే కోవలో ఆర్ కృష్ణయ్య ప్రయాణం సాగింది. ఎనుక ముందు చూసుడేందిర రాజన్ ఓ రాజన అని ఉత్తేజ్ పరుస్తాడు గూడ అంజయ్య. అలా కాదు వెనుక ముందు చూసుకుంటూ ముందుకు అడుగేయాలనేది ఆర్ కష్ణయ్య వ్యూహం ఎత్తుగడలు కార్య క్రమాలు.
రాజకీయాల్లో లేడు గానీ ఆర్ కృష్ణయ్య రాజకీయ నాయకులను నడిపించాడు. వారి ఎదుగుదలకు అవసరమైన రహస్య ఎత్తుగడలు వేసి బీసీ నాయకులను ముందు తోలిన నైపుణ్యం ఆర్ కృష్ణయ్యది. ప్రజా ఉద్యమాలలో ఆర్ కృష్ణయ్య నైపుణ్యాలపై ప్రత్యేక పరిశోధన అవసరం. తద్వారా అనేక వియా ు లోటుపాట్లతోపాటు విజయ రహస్యాలు సాధించిన విజయాలు తెలిసి వస్తాయి. ఒక్క ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోనే హాస్టళ్లు గురుకులాలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకైనాయో (తెలంగాణలో 268, ఆంధ్రాలో 190) ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేవో, ఇక్కడ ఇలా వుండడానికి గల నేపథ్యమేమిటో, అందులో ఆర్ కృష్ణయ్యగారి కృషి ఏమిటో తెలిసి వస్తుంది.
ఆర్ కృష్ణయ్య జీవితం, పరిణామం, ఉద్యమాలు, భారతీయ బీసీ ఉద్యమాలలో ఒక ప్రత్యేక చరిత్ర. ఐదు దశాబ్దాలుగా బీసీ సంక్షేమం, అభివృద్ధి , రాజకీయ అధికారం అనే ఏకైక నినాదంతో లక్ష్యంతో ముందుకు సాగిన చరిత్ర సంక్షిప్తంగా కడియాల సురేష్ కుమార్ ఈ పుస్తకంలో పొందుపరిచారు . ప్రధానమంత్రులు , రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు మొదలుకొని వందల వేల ప్రజాప్రతినిధులను, అధికారులను ఉద్యమకారులను కలిసి బీసీల సమస్యల పరిష్కారం చేసిన కృషికి ఇందులో చేర్చిన ఫోటోలు సాక్ష్యం ఇస్తాయి.
రెండువేలకు పైగా జీవోలు ఆర్ కృష్ణయ్య డిమాండ్లను పేర్కొంటూ వెలువడ్డాయంటే వారు ఎంత ప్రాక్టికల్ తార్యకర్తో, ఎంతటి దక్షతా దీక్ష పరుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా ఎన్జీవోల సంఘ నాయకుడు స్వామినాథం గారి ప్రత్యక్ష, పరోక్ష సహకారం మరువలేనిది. ఆర్ కృష్ణయ్య బీసీ విద్యార్థుల కోసం హాస్టల్ సీట్లు, హాస్టల్ల ఏర్పాటు, సౌకర్యాలు, ఫీజులు , ఉద్యోగాల గురించి, చట్ట సభల్లో. స్థానిక సంస్థల లో బీసీల ప్రాతినిధ్యం గురించి నిప్పు ఆరిపోకుండా నిరంతరం కృషి చేసారు. .పార్లమెంటు సమీపంలోగల డిల్లీ లోని జంతర్ మంతర్ లో దర్నా కార్యక్రమాలు … బీసీల ఆశలను ప్రతిఫలిస్తాయి. ఆర్ కృష్ణయ్య ఉద్యమాలతో ప్రయోజనం పొంది ఎందరో ఎమ్మేల్లేలుగా , యం పీలుగా మంత్రులుగా , ఉన్నతాధికారులుగా, జడ్జీలుగా, ప్రొఫెసర్ లుగా, వైస్ చాన్సలర్లుగా , టీచర్లుగా, సర్పంచులుగా ,జెపి చైర్మన్ లుగా, బీసీ నాయకులుగా ఎదిగారు. వారందరు ఆత్మీయంగా మా కృష్ణన్న అని పిలుచుకుంటారు.
ఆర్ కృష్ణయ్య ఎన్ని రకాల ఉద్యమ రూపాలతో కదిలించారో చూస్తే ఆశ్చర్యం కొలుపుతుంది . మంత్రుల ఘెరావ్., ముఖ్యమంత్రుల ఘెరావ్. సభలు సమావేశాలు, అఖిల పక్ష సమావేశాలు, ఆఫీసుల్లో దిగ్బంధం, మంత్రులతో ముఖ్య మంత్రులతో చర్చలు, అధికారులతో చర్చలు, కేంద్ర మంత్రులతో ప్రధాన మంత్రులతో చర్చలు విజ్ఞాపనాలు, జంతర్ మంతర్ డిల్లీలో ప్రదర్శనలు,, ఇలా ఎన్నో! నిరుద్యోగుల తరఫున ఉద్యోగ నియామకాలకోసం, హాస్టల్ల పెంపు, గురుకుల పాఠశాలల పెంపు, ఆయా పార్టీల్లో బీసీలకు టికట్లకై నామినేటెటెడ్ పోస్టులకై, స్వయం ఉపాధికై లోన్ల గురించి, ఇళ్ల పక్కా ఇళ్ల గురించి బీసీల రాజకీయ అధికారం గురించి …. ఇలా అనేక వైవిధ్య పోరాటాలు నిర్వహించారు. ఎందరో నాయకులుగా ఎదిగి స్వతంత్ర నాయకులుగా ఉద్యమాలు చేస్తున్నారు. వారిలో చాలా మంది ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో కర్ఫీదు పొందిన వారే.
కెసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమాలు వేరు, బీసీల కోసం ఆర్ కృష్ణయ్య చేసిన ఉద్యమాలు నడవేరు. రెంటికి లక్ష్యాల్లో వైవిధ్యం ఉంది. 1996 నుండి వేగం పుంజుకున్న మలి తెలంగాణ ఉద్యమాలపై చంద్రబాబాబు ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలు ప్రయోగించింది. 2001 లో ముందుకు వచ్చిన కెసీఆర్ ఇక అలాంటి ఉద్యమ బాటలు మంచివి కావని భారీ బహిరంగ సభలు ఎన్నికల్లో పోటీ, రాజీనామాలు ఉప ఎన్నికలు వంటివి
పోరాట రూపాలుగా మలిచారు. సాహిత్య సాంస్కృతిక కళారూపాలు జర్నలిస్టు భావ జాల ఉద్యమాలు వేగ వంతం అయ్యాయి. బీసీ ఉద్యమాలు ప్రధానంగా సామాజిక ఉద్యమాలు.
ఆర్ కృష్ణయ్య ఇతరులను ఎదిగించడమే కాకుండా తాను కూడా ఎమ్మేల్లేగా, పార్లమెంటు రాజ్య సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. బిజేపి ద్వారా రెండోసారి రాజ్యసభ్యులుగా ఎన్నికైన ఆర్ కృష్ణయ్య గారు చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల సాధన అనే లక్ష్యం ఇంకా సాధించవలసిన వున్నది.
బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ అధికారం కోసం ఆర్ కృష్ణయ్య అనేక ప్రయత్నాలు చేసారు. అవి ప్రయోగాలుగా మిగిలి పోయాయి. ఆచార్య కొండలా లక్ష్మణ్ బాపూజీ తో మొదలుకొని, మందకృష్ణ మాదిగ, కెజి సత్యమూర్తి, ఉ సాంబశివరావు , వంటి సామాజిక ఉద్యమకారులతో కలిసి కొన్ని ఐక్య సంఘటన ఉద్యమాలు చేశారు. ప్రతి ఒకరు నేనే నంబర్ వన్ గా వుండాలనుకుంటే సమిష్టి నిర్మాణం ముందుకు సాగదు. ఇది గమనించి నెహ్రూ నంబర్ టూ గా ఉండడానికి సిద్దంగా లేడు అని గాంధీ చెప్పడంతో మెజారిటీ రాష్ట్రాలచేత ఎన్నికైన వల్లభాయి పటేల్ తగ్గి ఓడిపోయిన నెహ్రూ నాయకత్వాన్ని అంగీకరించి ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకున్నాడు.
బీజేపీలో కూడా ఈ సమస్య వచ్చింది. ఉద్యమాలు చేసింది ఎల్ కె అద్వానీ. కానీ ఎన్డీఏ లో చేరిన ఇతర పార్టీలు వాజపేయి ని వరించడంతో ఎల్ కె అద్వానీ ఉప ప్రదాని పదవితో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. జనతాపార్చీలో, జనతాదళ్ లో సీనియర్ నాయకులు ప్రతి ఒకరు నంబర్ కావాలనుకోవడం వల్ల చీలిపోయి ఓడిపోయారు. ప్రాంతీయ పార్టీల్లోనూ ఇదే జరిగింది. ఇక సామాజిక ఉద్యమాల్లో చివరకు కమ్యూనిష్టు నక్సలైట్ ఉద్యమాల్లో ఇదే జరిగి చీలిపోతూ ఓడిపోతూ వచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాలలో తమ గుర్తింపు అపుడపుడు ప్రారంభమవుతున్నందున ఓపిక పట్టలేక చీలిపోయి స్వతంత్ర ఉద్యమాలకు తెరతీసారు. ఇపుడు పదికి మించిన బీసీ ఉద్యమాలు ఎవరికి వారు కొనసాగిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య యాభయి ఏళ్లుగా ఒడిదుడుకులు తట్టుకొని తన్నుతాను నంబర్ వన్ గా నిలిచిపోయారు.
ఇలా ఆర్ కృష్ణయ్య జీవన యానంలో ప్రముఖ చారిత్రక ఘట్టాలు ఎన్నో వున్నాయి. ఈ పుస్తకం కృష్ణయ్యగారి వ్యక్తిత్వం, సంక్షిప్త జీవిత పరిచయం, కుటుంబ నేపథ్యం, వంశవృక్షంలో పరిమితమై అన్ని ఒక్కచోట చేర్చాడు సురేశ్. . కృష్ణయ్యగారి గురించి తొలి పుస్తకం ఇది. ఇంకా ఎన్నో పుస్తకాలు వెలువడాలి. బీసీల సమాజిక ఉద్యమాల చరిత్ర సంపూర్ణంగా సమగ్రంగా రికార్డు చేయాలి. అలాగే కృష్ణయ్య సాధించిన రెండువేల జీవోలను సేకరించి పుస్తకం తేవాలి. తద్వారా ఉద్యమాల ద్వారా ప్భుత్వాలనుండి ఎన్ని సాధించవచ్చా యువతరానికి తెలుస్తుంది. స్పూర్తినిస్తుంది.
పాత బడుతున్న సమకాలీన చరిత్రను, కనుమరుగవుతున్న జ్ఞాపకాలను తట్టి లేపుతుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం ద్వారా ఎమర్జెన్సీ1977 నుండి మలుపు తిరిగిన విద్యార్థుల ఉద్యమాలు , బీసీ రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక ఉద్యమాల్లో బీసీల నాయకుడుగా స్వయం కృషితో జాతీయ స్థాయికి ఏలా ఎదిగారో , అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేయలేని , అభిమానించే నాయకులుగా తన వ్యక్తిత్వ నిర్మాణం ఎలా సాగిందో ఇందులో గమనించవచ్చు. పలు కోణాలను స్పృశించిన ఈ పుస్తకం రాసిన కడియాల సురేష్ కుమార్ గారికి హృదయ పూర్వక అభినందనలు. శుభాకాంక్షలు, శుభాశీస్సులు. త్వరలో వెలువడే మలి ముద్రణలో మరిన్ని వివరాలు, విశేషాలు సేకరించి మరింత సమగ్రంగా వెలువరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.