సమస్త అడవులకు కొత్త యజమానులు వస్తున్నారు

వాళ్లకు రహదారి వేస్తున్నదే ఆపరేషన్ కగార్;

By :  Admin
Update: 2025-02-04 12:43 GMT

-పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు

అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రాధమిక సమస్యల పరిష్కారం ప్రభుత్వ ఎజెండా కాలేదు. దేశ ప్రజలలో సింహభాగంగా వున్న రైతాంగం, కార్మికవర్గం నేడు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరలు, లేబర్ కోడ్లు రద్దుచేసి కార్మిక చట్టాల పునరుద్ధరణ అనే 2 ప్రధాన వర్గాల తక్షణ డిమాండ్లు ప్రభుత్వ ఎజెండాలో లేవు. దేశ జనాభాలో ఆదివాసీల వంతు 7 శాతంగానే వుండొచ్చు. కానీ, ఆదివాసీల నివాస ప్రాంతాలైన అడవులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ ప్రజల సంఖ్య 30 శాతంకి పైగా వుంది. 7 శాతం మందికి ప్రత్యక్ష నివాస ప్రాంతంగా; మరో 20 శాతం మందికి పరోక్ష జీవనోపాధికి ఆలంబనగా వున్న అటవీ ప్రాంతాల సంరక్షణ డిమాండు కూడా మోడీ ప్రభుత్వ ఎజెండాలో లేదు. ఇక, దేశ జనాభాలో వివిధ బాధిత సమూహాలైన ఉద్యోగ, యువజన, విద్యార్ధి, దళిత, మహిళా, మైనార్టీల డిమాండ్లు ఎజెండాలో చేరలేదు. కానీ, పిడికెడు మంది బడా కార్పొరేట్ల డిమాండ్లు మోడీ ప్రభుత్వ ఎజెండాలో తక్షణ పరిష్కార సమస్యలుగా మారాయి. అలాంటి కొన్నింటిలో ' కగార్ ఆపరేషన్ ' ఒకటి.

అడవులు ఆదివాసీలకు నివాస ప్రాంతాలు. అటవీ సంపద దేశ ప్రజలందరిది. దేశ సహజ సంపదలో అటవీ సంపద సింహ భాగంగా వుంది. కావున అటవీ సంపద పరిరక్షణ దేశ ప్రజలందరి హక్కు!

బ్రిటీష్ వలస పాలన నుంచి 21వ శతాబ్దం తొలి దశాబ్దం వరకూ వివిధ ప్రభుత్వాలు అటవీ ప్రాంతాల 'భూ ఉపరితల అటవీ సంపద'ను వాణిజ్య వర్గాలకు అ్పగించాయి. కాంగ్రెసు ప్రభుత్వం 'గ్రీన్ హంట్ ఆపరేషన్' తో 'భూగర్భ సంపద'ను కార్పొరేట్లకు అప్పగించ జూసింది. తద్వారా 1) భూ ఉపరితల సంపదకు బదులు భూగర్భ సంపద బదిలీ 2) సాంప్రదాయ వాణిజ్య వర్గాలకి బదులు కార్పొరేట్లకు బదిలీ అనే రెండు మౌలిక మార్పుల్ని గ్రీన్ హంట్ ఆపరేషన్ నాడు కొత్తగా ముందుకు తెచ్చింది. ఐతే అడవులు మాత్రం ప్రభుత్వరంగ ఆస్తిగానే వుంటాయి. దాని స్వభావం మారదు. అదో నిర్ధిష్ట దశ.

పై 'గ్రీన్ హంట్ ఆపరేషన్' దశకూ; ప్రస్తుత 'కగార్ ఆపరేషన్' దశకూ మధ్య మరో మౌలికబేధం కూడా వుంది. అడవులతో పాటు అటవీ సంపద ప్రాధమికంగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే ప్రక్రియ గత 'గ్రీన్ హంట్ ఆపరేషన్' కాగా అందుకు భిన్నంగా ఏకంగా సమస్త అడవులనే కార్పొరేట్ల పరంచేసే లక్ష్యం ప్రస్తుత 'ఆపరేషన్ కగార్' ది.

ఆదిమ కాలం నుంచి మధ్యయుగం వరకూ వేల ఏండ్లు అడవులు ఆదివాసీల సమిష్టి ఆస్తిగా వుండేవి. ఆనాటికి అడవులు ప్రభుత్వరంగ సంపదగా మారలేదు. ఆనాటికి చారిత్రికంగా జాతీయకరణ భావమే లేదు. ఐతే బ్రిటీష్ వలస పాలనతో దేశ ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం భాగమైనది. అడవులు ప్రభుత్వరంగ ఆస్తిగా మారడంతో ఆదివాసీలకు అడవుల్లో నివాస హక్కు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో వరసగా పైన పేర్కొన్న మూడు దశలుగా పరిణామం చెందింది.

మొదటి దశలో కలప, అటవీ ఉత్పత్తుల వంటి అటవీ భూ ఉపరితల సంపద వరకు సరుకుగా మారింది. రెండవ దశలో అదనంగా అడవుల్లోని భూగర్భ ఖనిజ సంపద కూడా మరో విలువైన సరుకుగా మారింది. మూడవ దశలో అడవుల పై ప్రభుత్వం తన హక్కు కోల్పోయి, కార్పొరేట్ల స్వంత ఆస్తిగా అప్పగించే ప్రక్రియకి దిగింది. ప్రస్తుత 'కగార్ ఆపరేషన్' లక్ష్యం రెండవ నిర్థిస్ట దశ నుంచి మూడవ నిర్దిష్ట దశకు మార్చడం!

మొదటిదశలో ఆదివాసీ ప్రజలు అడవుల పై స్వంత యాజమాన్య హక్కును కోల్పోయారు.

రెండవ దశలో నివాస భద్రత లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ ఆఖరి మూడో దశ విజయవంతం ఐనట్లైతే నివాస హక్కును కూడా కోల్పోతారు.

మూడవ దశ జయప్రదం ఐనట్లయితే దేశ ప్రజలు ఆధునిక యుగంలో మొదటిసారి అడవులపై హక్కును కోల్పోతారు. అడవులు ప్రభుత్వ రంగ ఆస్తిగా కొనసాగినంత కాలం సూత్రరీత్యా అది దేశ ప్రజల ఉమ్మడి ఆస్తిగానే వుంటుంది. 'ఆపరేషన్ కగార్' లక్ష్యం దేశ ప్రజల ఆస్తిని బడా కార్పొరేట్లకు యదేచ్చగా అప్పగించడం.

నివాస హక్కువరకే కోల్పోనున్న ఆదివాసీల కంటే యాజమాన్య హక్కును కోల్పోనున్న దేశ ప్రజలే ఎక్కువ నష్టదార్లు కానున్నారు.

కావున 'కగార్ ఆపరేషన్` ని ప్రతిఘటించడానికి, ఓడించడానికి నిజానికి ఆదివాసీల కంటే దేశ ప్రజల పాత్ర, బాధ్యతలు ఎక్కువగా వుంటాయి. నేడు 'ఆపరేషన్ కగార్ ' ప్రధానంగా ఆదివాసీల సమస్యగా ప్రచారం అవుతున్నది. పైగా, 'కగార్ ఆపరేషన్' ను ఓడించాల్సిన ప్రధాన బాధ్యత ఆదివాసీలదిగా, ఆ కర్తవ్య బాధ్యతలో భాగంగా ఆదివాసీలు సాగిస్తున్న ప్రతిఘటనా పోరాటానికి దేశ ప్రజలు సంఘీభావ ఉద్యమాలు సాగించాలనే ప్రచారం కూడా ఉనికిలో వుంది. ఈ ప్రచారం తెలిసి చేసినా, తెలియక చేసినా ఆచరణలో 'కగార్ ఆపరేషన్' వ్యతిరేక పోరాట లక్ష్యానికి నష్టం జరుగుతుంది. నిజానికి దేశ ప్రజల్లో నూటికి తొంభై మంది తమ ఉమ్మడి అటవీస్వామ్య హక్కు కోల్పోతున్న సందర్భంలో దాన్ని ప్రతిఘటించే అతి ప్రధాన బరువు, బాధ్యత కేవలం 7 శాతం మంది ఆదివాసీల పై వుందనడం నష్టకరమైనది. నిజానికి ఆచరణలో ప్రతిఘటనా పోరాట తీవ్రత, విస్తృతి, సాంద్రతల్ని తగ్గించడానికి దారి తీస్తుంది. సారంలో దేశ ప్రజలందరి ఉమ్మడి సంపదకు ఇప్పుడు రక్షణ కవచంగా మాత్రమే నిలబడ్డ అల్పసంఖ్యాక ఆదివాసీల్ని ఒంటరి చేసి వారిని అడవుల నుంచి తరిమివేసి, వాటిని తమ స్వంతం చేసుకునే బడా కార్పొరేట్ల లక్ష్యానికి ఉపకరిస్తుంది.

ఇంటి స్వంతదారుడు తన ఇంటి రక్షణ కోసం నియమించిన సెక్యూరిటీ గార్డును చంపి ఇంటిని కొల్లగొట్టే బందిపోటు దొంగల్ని తరిమివేసే బాధ్యత ఆ సెక్యూరిటీ గార్డు ఒక్కడిదే కాదు. దొంగల దాడిని పసిగట్టి తాను ప్రతిఘటిస్తూనే, ఇంటి ఓనర్లను నిద్రలేపి అప్రమత్తం చేసే విజిల్ బౌలర్ పాత్ర సెక్యూరిటీ గార్డుది. అంతిమంగా దొంగల్ని తరిమే బాధ్యత ప్రధానంగా ఇంటి యొక్క స్వంతదార్లదే. నిజానికి దేశప్రజ భుజస్కందాల పై మోయాల్సిన ప్రాధమిక, నిర్ణయాత్మక బాధ్యతను కేవలం సంఘీభావ కర్తవ్యంగా మార్చడం ఆచరణలో 'ఆపరేషన్ కగార్' కు లాభిస్తుంది.

అడవులు, అటవీ సంపద ప్రభుత్వాధీనంలో వున్న కాలంలో కూడా ప్రకృతి సమతుల్యతను ప్రభుత్వాలు పాటించడం లేదు. పర్యావరణ విధ్వంసం యధేచ్ఛగా కొనసాగుతున్నది. అది కూడా దేశ ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది. రేపు 'ఆపరేషన్ కగార్' జయప్రదమై, అడవులు కార్పొరేట్ల స్వంతమైతే, పర్యావరణ విధ్వంసం పరాకాష్ట దశకు చేరుతుంది. ఇప్పటికే అడవుల సమతుల్యత పాటించని కారణంగా వర్షాలు, తుఫాన్లు, వరదలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక ప్రకృతి వైఫరీత్యాలు వరసగా సంభవించడం తెల్సిందే. మున్ముందు అడవులు కార్పొరేట్ల అడ్డాగా మారితే, ఈ ప్రకృతి వైఫరీత్యాలు, ప్రకృతి భీభత్సాలుగా మారక తప్పదు.

ఈ విధంగా, ఏ కోణంలో చూసినా, 'ఆపరేషన్ కగార్' సమస్త దేశ ప్రజలపై ఎక్కుపెట్టిన యుద్ధమే. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల వంటి దురాక్రమణ యుద్ధాల వంటివి కూడా, అవీ ప్రకృతి సంపద కోసమే. ఇవీ అంతే. అయితే అది ఒక దేశం మీద మరో దేశ సైన్యాలు చేసేవి. ఇది దేశ ప్రకృతి సంపదల కబ్జా కోసం స్వదేశీ ప్రజలపై సోకాల్డ్ స్వదేశీ ప్రభుత్వం సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం. దేశ ప్రజల ఉమ్మడి ఆస్తిని బడా కార్పొరేట్లు స్వంతం చేసుకునే లక్ష్యం గల 'కగార్ ఆపరేషన్ ' కూడా దురాక్రమణ స్వభావం గలదే. నిజానికి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా వంటి దేశాలలో ఒక్కొక్క దేశ సమస్త ఆస్తుల విలువ కంటే మించిన విలువైన ఆస్తి భారతదేశ అటవీ సంపదనే విషయం గమనంలో వుండాలి. అందుకే స్వదేశం పై విదేశీ దురాక్రమణ యుద్ధాన్ని ఎదిరించే లక్ష్యంతో దాదాపు సమానస్థాయి ప్రాధాన్యత కగార్ ఆపరేషన్ వ్యతిరేక ప్రతిఘటనకు కూడా వుంది. ఈ అవగాహన వెలుగులో 'ఆపరేషన్ కగార్' కు వ్యతిరేకంగా విశాల, సమైక్య, సంఘటిత, సమరశీల ప్రతిఘటనోద్యమ నిర్మాణం తక్షణ లక్ష్యం కావాలి. దీన్ని దేశ ప్రజల కర్తవ్యంగా మార్చాల్సిన ఆవసరం వుంది.

ఈ అవగాహన వెలుగు లో భిన్న దృక్కోణంతో 'ఆపరేషన్ కగార్ ' పై ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన తక్షణ ఆవశ్యకత వుంది. ఈ దృష్టితో తక్షణ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకోవాల్సి వుంది. అందుకోసం 'ఆపరేషన్ కగార్ ' ను నిర్వహిస్తున్న మోడీ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు, సంకీర్ణ పక్షాలు తప్ప, మిగిలిన అన్ని పక్షాలు, సంస్థలు, సంఘాలు, వేదికలు, బృందాలు, శక్తులు, వ్యక్తుల్ని ఈ కర్తవ్య నిర్వహణలో భాగం చేయాల్సి వుంది. ఇది ఆర్థిక, రాజకీయ, సామాజిక, నైతిక రంగాల్లో ప్రత్యామ్నాయ దృక్కోణంతో వుద్యమ నిర్మాణం చేయాల్సిన అంశం. అందుకోసం తగిన ఉమ్మడి కృషిని సాగించుదాం.

(ఇది నిన్న విజయవాడలో 'ఆపరేషన్ కగార్' కు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ లో అందించిన కీ నోట్)


(పీ ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ)

Tags:    

Similar News