రతన్ టాటా నేర్పే ఐదు పాఠాలు

నిన్న మరణించిన 86 ఏళ్ల వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారీగా నివాళులు, శ్రద్ధాంజలులు, జోహార్లు, అశ్రు తర్పణాలు, వందనాలు, సంతాప సందేశాలు వెల్లువెత్తతున్నాయి.

By :  Admin
Update: 2024-10-11 09:44 GMT

డా. ఎస్ రాము

నిన్న మరణించిన 86 ఏళ్ల వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారీగా నివాళులు, శ్రద్ధాంజలులు, జోహార్లు, అశ్రు తర్పణాలు, వందనాలు, సంతాప సందేశాలు వెల్లువెత్తతున్నాయి. అయన మరణంతో దేశ వ్యాప్తంగా విషాదం అలుముకుంది. వ్యాపార, రాజకీయ, సినీ, మీడియా, క్రీడా రంగాల ప్రముఖులవి మాత్రమే కాకుండా సాధారణ ప్రజల హృదయాలు కూడా బరువెక్కాయి. కుటుంబ వ్యాపారాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా వివిధ రంగాలకు విస్తరించి వేల కోట్ల రూపాయల సంపద సృష్టించి, లక్షల మందికి భృతి కల్పించిన బ్రహ్మచారి రతన్ జీ మరణంతో దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది. విచిత్రం ఏమిటంటే--అత్యంత సంపన్నుడు మరణించాడని కాకుండా, ఒక మనసున్న మంచి మనిషి పోయాడని ప్రజలు బాధపడుతున్నారు. ఇక్కడే మనందరం నేర్చుకోవాలిసినవి ఎన్నో ఉన్నా ఒక ఐదు అద్భుత లక్షణాలు చూద్దాం.

1) మనుషుల పట్ల మర్యాద: నాలుగు డబ్బులు సంపాదించిన వారి మాటల్లో, చేతల్లో ఒంటినిండా పొగరు కనిపిస్తుంది. అందులో కొందరు బలుపు మాటలతో ఇతరులను చిన్నచూపు చూసి కించపరచడం మనం చూస్తుంటాం. జ్ఞానాన్ని బట్టి కాకుండా కేవలం డబ్బును బట్టి గౌరవం ఇవ్వడం మన సమాజంలో బాగా ఎక్కువ. సంపన్న కుటుంబంలో పుట్టినా రతన్ మనుషుల పట్ల ఎంతో మర్యాదతో ఆత్మీయంగా మెలిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అయన నుంచి అందరూ నేర్చుకోవాలి. డాబూ దర్పం, హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఆయన గడిపిన జీవితం కూడా మనకు ఆచరణీయం.

2) నైతిక నాయకత్వం: చిన్న వ్యాపారంలో రాణించినా చాలా మంది కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడతారు, మోసం చేయడం వ్యాపార సూత్రంలో భాగంగా మాట్లాడతారు. పరిశ్రమలు, వ్యాపార యజమానులు ధనార్జన యావలో పడి ఎథిక్స్ కు తిలోదకాలు ఇస్తారు. రతన్ గారి చర్యల్లో, చర్చల్లో, నిర్ణయాల్లో నైతికత, పారదర్శకత ఉంటుందని ఆయన ను కలిసిన వారు అబ్బురపడుతూ చెప్పే మాట మనకు ఆదర్శనీయం.

3) ఉద్యోగుల పట్ల కరుణ: మన సమాజంలో 'బాసు' అన్న ప్రతి ఆడా, మగా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించడం అనుభవంలో అందరికీ తెలిసిందే. కారుణ్యం, సమభావం వదిలి వదిలిపెట్టి వేధించడం, సాధించడం, పైశాచిక ఆనందం పొందడం ఎక్కువైంది. ఉద్యోగులకు ఫోన్ లో కూడా అందుబాటులో ఉండే సంస్కారం, వారి ఇబ్బందులను మానవత్వంతో పరిష్కరించడం అయన వ్యవస్థీకృతం చేశారు. మన ఇంట్లో పనిచేస్తున్నవారితో పాటు, తోటి ఉద్యోగులను మంచిగా చూసుకోవాలన్నది, ఉద్యోగాలు ఊడపీకడం మీద దృష్టి పెట్టకుండా, ఆదుకుని మంచి పని సంస్కృతిని పెంచి పోషించాలని రతన్ గారి నుంచి నేర్చుకోవాలి.

4) దానగుణం: దాతృత్వంలో రతన్ ఒక అద్భుత అధ్యాయం సృష్టించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో రతన్ టాటా గారు వేల కోట్లు విరాళంగా ఇవ్వడమే కాకుండా, మరణాల సంఖ్య తగ్గడానికి ఎంతో సేవ చేశారు. అయన దాన గుణం, మంచితనం వల్ల టాటా సంస్థల ఉద్యోగులతో పాటు ఇతరులూ ఎంతో ఊరట పొందారు. సంపదలో 50 శాతానికి పైగా సమాజానికి ఇవ్వడం వల్ల రతన్ జీ ప్రపంచ కుబేరుల లిస్టులో టాపర్ కాలేకపోయారు.

5) దేశ నిర్మాణంలో భాగస్వామ్యం: దేశంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి రతన్ నేతృత్వంలోని టాటా గ్రూప్ ఎంతో చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రతన్ కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీ ఎస్ ఆర్) నిబంధన రాకముందు నుంచే టాటా లు దేశ నిర్మాణం కోసం ముందున్నారు. స్టార్ట్ అప్ ల అభివృద్ధిలో అయన పాత్ర ప్రశంసనీయం. వ్యాపారాలు చేసి సంపాదించడమే కాకుండా తిరిగి ఇస్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నది రతన్ జీవిత సందేశం.

అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించిన వ్యాపారవేత్త కొన్ని తప్పులు చేయడం సహజం. 2010లో నీరా రాడియా,

2012 లో సైరస్ మిస్త్రీ, 2016 లో నస్లీ వాడియా ల ప్రమేయం ఉన్న సంఘటనలు టాటా ప్రతిష్ఠకు కొంత భంగం కలిగించినా రతన్ టాటా అదానీ, అంబానీ ల మాదిరిగా పెద్ద పెద్ద ఆరోపణలకు గురికాలేదన్నది గమనార్హం. వాటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకుని మంచి మనిషిగా ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోతున్నారు.

Tags:    

Similar News