విగ్రహాలకు హారతులు, ఆశయాలకు పాతరలు

నిజమైన అంబేడ్కర్ అర్థం కాకుండా జరుగుతున్న కుట్రలను ఎదిరించాలి అంటున్న సామాజిక న్యాయ ఉద్యమకారుడు మలసాని శ్రీనివాస్

Update: 2025-12-07 07:49 GMT
Statue of Social Justice, Vijayawada Andhra Pradesh, is the world's tallest Ambedkar's statue.

-మలసాని శ్రీనివాస్)


భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి సైదాంతికంగా నిర్వచించి దానికున్న విశాలమైన అర్ధాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. 20వ శతాబ్దంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి అంబేడ్కర్ ఆలోచించిన స్థాయిలో ఆలోచించిన నాయకులు,మేధావులు మరొకరు లేరన్నది వాస్తవం. ప్రజాస్వామ్యం గురించి అంబేడ్కర్ ఆలోచనలు అత్యంత విప్లవాత్మకమైనవి. విస్తృతమైనవి.

ఒమాటలో చెప్పాలంటే అంబేడ్కర్ రాడికల్ డెమొక్రాట్. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ఆర్థిక సామాజిక సంక్షోభిత వాతావరణంలో అంబేడ్కర్ ప్రజాస్వామిక భావనలు అత్యంత ప్రాసంగీకమైనవి. నేడు దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి నేపథ్యంలో ఆయన భావాలను అధ్యయనం చేయడం ప్రస్తుత దశలో అత్యవసరం. ప్రజాస్వామ్యం గురించి జాతీయోద్యమ నాయకుల నుంచి స్వతంత్రానంతర నాయకులు వరకు చేసిన విశ్లేషణలకు,నిర్వచనాలకు అంబేడ్కర్ ఆలోచనలు మౌలికంగా భిన్నమైనవి. అంబేడ్క ర్ ను కేవలం రాజ్యాంగ నిర్మాతగాను కుల నిర్మూలన వాదిగాను వ్యాఖ్యానించడం ఆయన కృషిని పరిమితం చేసి చూపించి ప్రచారం చేయడంలో భారత పాలకవర్గాలు ఆధిపత్య కులాలు చాలావరకు సఫలీకృతునయ్యాయి.

ఇది అత్యంత ప్రజావ్యతిరేకమైనది.

అది ఈ దేశంలో ఉన్న విశాల ప్రజానీకానికి ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన కులాలు, మైనార్టీలు, స్త్రీలు ఆధిపత్య కులాల్లోని పేదలు ఇలా అందరికీ నష్టం చేసే కుట్ర పై వ్యాఖ్యానంలో దాగిఉంది. అలాగే ఆయనను కేవలం దళితుల నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా మాత్రమే చిత్రించడం ఈ దేశంలో 85 శాతంగా ఉన్న పేద కులాలకు ఆయనను దూరం చేయడం కోసమే.

అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అనే దానిపై అంబేడ్కర్ చేసిన అధ్యయనము, విశ్లేషణలపై నేడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులు పరిశోధనలు చేస్తున్నారు. అవి ఇప్పటికే పుస్తక రూపంలో ప్రచురితమయ్యాయి. ప్రజాస్వామ్యం గురించి చాలామంది మేధావులు నాయకులు చాలా సిద్ధాంతాలు చేశారు కానీ, అంబేడ్కర్ మాత్రం జీవితాంతం ప్రజాస్వామ్యాన్ని ఆచరించినవాడు. భారత్ లాంటి సంప్రదాయ సమాజంలో ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, ఎలాఉంటే ఈ దేశం ఒక నాగరికమైన సమాజంగా పరివర్తన చెందుతుంది అన్నదాన్ని శాస్త్రీయంగా, సైద్ధాంతికంగా, ఆచరణాత్మంకంగా, ప్రణాళికబద్ధంగా వివరించిన గొప్ప ప్రజాస్వామికవేత్త అంబేడ్కర్.

ఆయన రాడికల్ ప్రజాస్వామ్య ఆలోచనలతో ఉన్న గొప్ప రాజకీయ తత్వవేత్త. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే కాదని, కేవలం ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు తంతే కాదని, ఓటహక్కు ఒక్కటే కాదని అది మనుషుల జీవన విధానం, మానవసంబంధాలు, సామాజిక సంస్కృతులు ప్రజాస్వామిక సంస్కృతిగా మారడమని చెప్పాడు.అలాగే ప్రజాస్వామ్యం అంటే రాజకీయాల్లో మాత్రమే కాదు రోజువారి జీవితంలో మనుషుల జీవన విధానమై ఉండాలని అంబేడ్కర్ సూత్రీకరించాడు. ప్రజాస్వామ్యాన్ని ఎలా అమలు చేయాలి అన్నది కూడా ఆచరణాత్మకంగా చెప్పినవాడు ఆయన. అంబేడ్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే భారతీయ సమాజంలో ప్రతి మనిషి ఆత్మగౌరవం కలిగి ఉండాలి. ప్రతి మనిషి సమాన హక్కులు,సమాన అవకాశాలు కలిగి ఉండాలి. అయన అసలు పోరాటం ఒకే అంశం మీద కాదు. రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక, సామాజిక సమానత్వం ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాలన్నాడు.

అంబేడ్కర్  భారత్ లో ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయం అనేది పునాదిగా ఉండాలని సిద్ధాంతీకరించారు. దేశంలో నేడు నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అంబేడ్కరిజం మరింత అవసరం. అంబేడ్కర్ ఆలోచనలు కేవలం ఆయన రాసిన పుస్తకాల్లో మాత్రమే నిక్షిప్తమై ఉండిపోకూడదు. ఆయన పోరాటాలు, రాతలు భారత ప్రజాస్వామ్యానికి మార్గం చూపే దారి దీపాలు.

అంబేడ్కర్ ని అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన విషయం ఆయన ఒక విప్లవాత్మక విమర్శకుడు అన్నది గుర్తించాలి. ఆయన హిందూ సమాజంలోని కుల వ్యవస్థను మార్చడానికి తన బలమైన ఆలోచనలతో ప్రశ్నించి పోరాడాడు. కుల వ్యవస్థను నిలబెట్టే హిందూ ధార్మిక గ్రంథాలను, 'ధర్మశాస్త్రాలను సూటిగా విమర్శించాడు.

కులం లేని సమాజమే నిజమైన ప్రజాస్వామ్య సమాజం అన్నాడు. అంబేడ్కర్ చెప్పిన ప్రజాస్వామ్యం కేవలం పీడిత కులాలు మాత్రమే కాదు మనిషన్న ప్రతి ఒక్కరూ గౌరవం పొందడానికి సంబంధించింది. సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావం కేవలం రాజ్యాంగం లో రాసుకోవడం ద్వారా సమకూరే విషయాలు కావని, ప్రజల్లో మార్పు వచ్చే వరకు ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేదన్న సత్యాన్ని గ్రహించిన దూరదృష్టిగల మేధావి ఆయన.

దేశంలోని సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, కుల ఆధారిత వివక్షత,రాజకీయ వివక్షత, ఇతర ధార్మిక అణిచివేతలు ప్రజాస్వామ్యానికి ప్రధాన శత్రువులని అంబేడ్కర్ స్పష్టంగా ప్రకటించారు.

అందుకే అంబేడ్కర్ ఈ దేశంలో ముందుగా జరగాల్సిన కృషి సామాజిక విప్లవం అని నిర్ధారించాడు. అంబేడ్కర్ ఆశించిన సమాజం స్వతంత్రానంతరం ఈ దేశంలో నెలకొనలేదని మనందరి అనుభవం రుజువు చేస్తోంది. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన ఈ 75 ఏళ్ల కాలంలో అంబేడ్కర్ ఆలోచనలకు పూర్తి భిన్నంగా భారత పాలకవర్గాలు పరిపాలించేయనడానికి నేడు దేశంలో నెలకొన్న పరిస్థితులే రుజువు. అంతేకాకుండా ఆయన వారసత్వాన్ని పూర్తిగా వదిలి వేశాయన్నది అన్నది కూడా నిజం. అంబేడ్కర్ ను కేవలం ఒక విగ్రహంగా మార్చి ఒక ప్రతీకగా చేసి వేదికలపై నినాదాలకి పరిమితం చేయడాన్ని నేడు చూస్తున్నాం. ఆయనను కేవలం విగ్రహాలు జయంతులు వర్ధంతులు నినాదాల్లోనే ఉంచేస్తే ఆయన ఆలోచనలు చేరవలసిన జనానికి చేరకుండా పోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రయత్నాలు దశాబ్దాలుగా ఈ దేశంలో పాలకవర్గాలు, పెత్తందారి కులాలు చేస్తూ వస్తున్నాయి.

అంబేడ్కర్ ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకనే ప్రయత్నాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. భారత్ లో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుని ఈ దేశం ఒక నాగరిక సమాజంగా, అభ్యుదయ సమాజంగా సౌభాగ్యమైన సమాజంగా, ప్రతి మనిషి నిండైన మనిషిగా మారాలంటే అంబేడ్కర్ ఆలోచనలను, ఆశయాలను, సైద్ధాంతిక సూత్రీకరణలను వెలికి తీసి పునర్జీవింపచేసి వాటిని పీడిత కులాలైన ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీల విముక్తికి సాధనాలుగా మార్చవలసిన కర్తవ్యం ఈ తరంపై ఉంది.

అంబేడ్కర్ విప్లవకారుడిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన కృషి జరగాలి. నేడు దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, సామాజిక అణిచివేతలు, దోపిడీని ఎదుర్కోవడానికి సాంప్రదాయకంగా అంబేడ్కర్ ను చూస్తున్న దృక్పథంలో మౌలికంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది.

అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు అంబేడ్కర్ ను అర్థం కాకుండా చేసిన కుట్రలను పసిగట్టి నిజమైన అంబేడ్కర్ ను దర్శించాలి. విగ్రహాలు పెట్టడం జయంతులు వర్ధంతిలు జరపడం స్మరించుకోవడం అవసరమే. కానీ అది అంబేడ్కర్ ఆలోచనల అమలుకు దోహదబడేది అతి స్వల్పమే అన్నది గ్రహించాలి.

మార్పు కోసం ఆయన ఆశయాలను, ఆకాంక్షలను, ఆయన చేసిన పోరాటాలను, చేసిన సైద్ధాంతిక సూత్రీకరణలను మరింత లోతుగా నేడు అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత గతం కంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉందని గుర్తించాలి. ఆ దిశగా ప్రజా మేధావులు మార్పు కోరే కార్యకర్తలు కృషి చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ దేశ బహుజన కులాలు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్నది నూరు శాతం నిజం.

(డిసెంబర్ 6 అంబేడ్కర్ 69వ వర్థంతి సందర్భంగా రాసినది)


Tags:    

Similar News