‘లిఫ్ట్’ ముసుగులో విశాఖలో కార్పొరేట్లకు చంద్రబాబు ‘భూదానం’
ఈ ఔదార్యం మానుకుని, భూముల కేటాయింపు మానుకోవాలి. లేకుంటే ముప్పే అంటున్న మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ;
టిడిపి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, GOMs No 32 dated 16-8-2025 ద్వారా, "లిఫ్ట్" (Land Allotment, Incentives, and Facilitation for Technology) అనే విధానం ముసుగులో, ఐటీ కంపెనీలకు, ముఖ్యంగా, కొన్ని అమెరికా కంపెనీలకు, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తారు అనే నెపంతో, వందలాది ఎకరాల అతి విలువైన ప్రభుత్వ భూములను, ఎటువంటి పరిమితి లేకుండా, కేవలం 99 పైసాలకు ధారాదత్తం చేయడం హాస్యాస్పదం గా ఉండడమే కాకుండా, అటువంటి భూముల కేటాయింపులు, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం; సుప్రీం కోర్టు వారి ఆదేశాలను ఉల్లంఘించడం అవుతుంది.
గత రెండు నెలల్లో, లిఫ్ట్ విధానం క్రింద, చేసిన భూకేటాయింపు వివరాలు, ఈ క్రింద సూచించబడ్డాయి.
జీవో నెంబర్ IT కంపెనీ ఇచ్చిన భూమి వివరాలు మార్కెట్ ధర ప్రభుత్వం ఎంత ధరకు వచ్చింది? హామీ ఇచ్చిన ఉద్యోగాలు కంపెనీ అన్ని ఉద్యోగాలు ఇవ్వగలదా?
GOMs No.7 Dated: 21-4-2025 టాటా కన్సల్టెన్సీ (TCS) 21.16 ఎకరాలు విశాఖపట్నం ఋషికొండ లో
కనీసం 900 కోట్ల రూపాయలు 22. 6 ఎకరాలు 99 పైసలకు 12,000 కొన్ని రోజుల క్రింద ముంబాయి, ఇతర నగరాల్లో, 12,000 మంది ఉద్యోగులను తొలగించింది
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడితే, ఉద్యోగాలు తగ్గుతాయి
GOMs.No.21 Dated: 1-7-2025 కాగ్నిజెంట్ 22. 19 ఎకరాలు విశాఖ నగరం మధురవాడలో కనీసం 900 కోట్ల రూపాయలు 22.19 ఎకరాలు 99 పైసలకు మాత్రమే 8,000 ఈ కంపెనీ, అమెరికా కంపెనీ, మనదేశంలో, కొన్ని నెలల క్రింద 10,700 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడితే, ఉద్యోగాలు తగ్గుతాయి
GOMs No 26 Dated:1-8-2025 ANSR గ్లోబల్ 10.29 ఎకరాలు,
విశాఖ నగరం ఋషికొండ, మధురవాడ లలో కనీసం 450 కోట్ల రూపాయలు 10.29 ఎకరాలు 99 పైసలకు మాత్రమే 10,000 ఈ కంపెనీ అమెరికా కంపెనీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడితే, ఉద్యోగాలు తగ్గుతాయి
1. టాటా కన్సల్టెన్సీ (TCS) కంపెనీ, బొంబాయి నగరం ఇతర నగరాల్లో, కొన్ని రోజుల క్రింద 12,000 మంది ఉద్యోగుల్ని పనిలో నుంచి తొలగించిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినా, అదే కంపెనీ, విశాఖలో 12,000 మందికి ఉద్యోగాలిస్తుందని అనడం, కూటమి ప్రభుత్వం ఆనెపంతో, వారికి, 900 కోట్లరూపాయల రాయితీతో 21. 6 ఎకరాల ప్రజల భూమిని అప్పగించడం, ఎంతవరకు సమర్ధనీయం? ఆకంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడుతున్నదని, ఆకారణంగా, విశాఖ స్థానిక యువతకు దక్కే ఉద్యోగాలు ఇంకా తగ్గుతాయని, ప్రభుత్వానికి తెలిసినా, తెలియనట్లు నటించడం ఎంతవరకు సబబు?
2. కాగ్నిజెంట్ కంపెనీ, బెంగళూరు ఇతర నగరాల్లో, కొన్ని రోజుల క్రింద 10,700 మంది ఉద్యోగుల్ని పనిలో నుంచి తొలగించిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినా, అదే కంపెనీ విశాఖలో 8,000 మందికి ఉద్యోగాలిస్తుందని అనడం, కూటమి ప్రభుత్వం ఆనెపంతో, వారికి, 900 కోట్లరూపాయల రాయితీతో 22.19 ఎకరాల ప్రజల భూమిని అప్పగించడం, హాస్యాస్పదం గా ఉంది. పైగా, ఆ కంపెనీ అమెరికాకు చెందిన కంపెనీ. ఒకవైపు, అమెరికా దేశం భారతదేశం మీద టారిఫ్ యుద్ధం ప్రకటిస్తుంటే, మీ ప్రభుత్వం అటువంటి దేశానికి చెందిన కంపెనీని స్వాగతించడం, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది.
3. ANSR గ్లోబల్ కంపెనీ కూడా అమెరికాకు చెందిన కంపెనీయే. IT కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడుతున్న సందర్భంలో, ఆ కంపెనీ విశాఖ స్థానిక యువత 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఎలాగ సాధ్యం అవుతుంది? మన దేశం మీద టారిఫ్ యుద్ధం ప్రకటించిన అమెరికా దేశానికి చెందిన అటువంటి కంపెనీకి, 450 కోట్ల రూపాయల రాయితీ తో సహా విశాఖ నగరానికి ఆహ్వానించడం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది.
4. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు వారు జగ పాల్ సింగ్ కేసులో (CA NO.1132/2011 @ SLP(C) No.3109/2011A) లో 28-1-2011 న ఇచ్చిన ఆదేశాల ఆధారంగా, లిఫ్ట్ విధానం క్రింద నిర్దేశించిన భూకేటాయింపులు చెల్లవని, ప్రభుత్వం గుర్తించాలి
5. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం కేసులలో, ప్రజల వనరులను, ప్రభుత్వం అతిచావుకగా ప్రైవేటు కంపెనీలకు కేటాయించడం, ప్రజా విశ్వాస సిద్ధాంతానికి వ్యతిరేకమని, ఆ విధంగా, అటువంటి వనరులను ప్రైవేటు కంపెనీలకు రాయితీలతో ఇస్తే, నిర్ణయం తీసుకున్న వారు, Prevention of Corruption Act క్రింద నిందితులుగా పరిగణించ బడుతారని, సుప్రీం కోర్టు వారు ఆదేశించడం జరిగింది. ఆ కోర్టు ఆదేశాలు, మీద సూచించిన భూ కేటాయింపులకు, లిఫ్ట్ విధానానికి వర్తిస్తాయని, మీ ప్రభుత్వం గుర్తించాలి.
ముఖ్యంగా, మీ ప్రభుత్వం అమెరికా కు చెందిన కంపెనీలకు, ఇష్టానుసారంగా, అతిచవుకగా విశాఖ ప్రజల భూములను సమర్పించడం, బాధాకరమైన విషయం. కొన్ని రోజులుగా, అమెరికా ప్రభుత్వం మన దేశం మీద చూపిస్తున్న వైఖరి, ఈ క్రింద సూచించిన సంఘటనల ఆధారంగా అర్థమవుతుంది.
1. అమెరికా అధ్యక్షుడు కొన్ని రోజుల క్రింద, ఆ దేశానికి చెందిన, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు, భారతీయ నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని ఆదేశించడం ) కారణంగా, H1-B వీసాలమీద పనిచేస్తున్న వేలాదిమంది భారతీయులు, ఉద్యోగాలు పోగొట్టుకుని, వెనక్కి వచ్చే అవకాశం ఉంది
2. కూటమి ప్రభుత్వం అమెరికా కంపెనీలకు, 22.19 ఎకరాలు, 10.29 ఎకరాల విశాఖ ప్రభుత్వ భూములను, రెండు రూపాయలకు తక్కువగా ముట్ట పెడితే, అదే అమెరికా దేశం, ఆ దేశంలో చదువు కోసం వెళ్తున్న విద్యార్థి వీసాకు 185 డాలర్ల ఫీజులు (సుమారు 16,000 రూపాయలు) వసూలు చేస్తున్నదనే విషయం మీరు, రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. లాభాల కోసం వచ్చే అమెరికా కంపెనీలకు ఒక న్యాయం, పేద విద్యార్థులకు ఇంకొక న్యాయమన్నమాట
3. అమెరికా ప్రభుత్వం, చదువులకోసం, పనులకోసం, ఆదేశం వెళ్లిన భారతీయులను, ప్రతిరోజూ భయభ్రాంతులుగా చేస్తూ, వలస పోయిన భారతీయులను సంకెళ్లతో బంధించి, వెనక్కి పంపించడం, మన దేశప్రజలను కించపరచడం, మరిచిపోలేని విషయాలు అయినా, కూటమి ప్రభుత్వం ఆ విషయాలను పట్టించుకోకుండా, ఆ దేశం కంపెనీలకు దాసోహం పలకడం, బాధాకరమైన విషయం
4. అమెరికా అధ్యక్షుడు, భారతదేశం మీద విధించిన అధికమైన సుంకాల కారణంగా, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు. ఉదాహరణకు, మన రాష్ట్రంలో రైతులు ఉత్పత్తి చేస్తున్న ప్రత్తి, మిరప వంటి వాణిజ్య పంటల ఎగుమతి ధరలు తగ్గి, వారికి నష్టం కలుగుతుంది. అదే విధంగా, మత్స్య సంపద మీద ఆధారపడే మన రాష్ట్రం చిన్నకారు మత్స్యకారులు కూడా నష్టపోతారు.
అన్ని విధాలుగా మన దేశానికి, మన రాష్ట్ర ప్రజలకు, నష్టం కలిగిస్తున్న అమెరికా దేశం కంపెనీలకు, వారు కావాల్సినన్ని ఉద్యోగాలు ఇవ్వలేరని తెలిసినా, చవకగా ప్రజలకు చెందిన భూములను, వేలాది కోట్ల రూపాయల టాక్స్ రాయితీలతో సహా ఇవ్వడం, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. మీద సూచించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, కూటమి ప్రభుత్వం లిఫ్ట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి.
అలాగే, కూటమి ప్రభుత్వం, చవకగా ప్రజల భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే పద్ధతి ని కూడా వెనక్కి తీసుకోవడం అవసరం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వం ఏకపక్షంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, సుప్రీం కోర్టు వారి ఆదేశాలను ఉల్లంఘిస్తూ, నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజలు హర్షించరు. మీద సూచించిన విషయాలు, అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత కలిగించాయనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి.
(ఇవి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలోని వివరాలు)