బాబు నైపుణ్యాలు ఆంధ్రాకిపుడు సరిపోతాయా?

బాబు తొలి కలెక్టర్ల సమావేశంలోనే తమది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని చెప్పి తన వైఖరి ఏమిటో ముందే చెప్పారు.

Update: 2024-11-04 08:02 GMT

ఇప్పటి సంగతి ఏమో తెలియదు కానీ, పాత రోజుల్లో కొత్త బంగారు నగను షావుకారు ముదురు గులాబీ రంగు కాయితం పొట్లాం విప్పి, రెండు చేతులతో భద్రంగా దాన్ని ‘ఆర్డర్’ ఇచ్చిన యజమాని భార్య ముందు బల్లపై పొందికగా పెట్టేవారు. అలా అది మనకంట్లో పడడానికంటే ముందు, అటువంటి దుకాణదారు తన ‘గెస్చర్స్’తో మనకు ఉత్సుకతతో కూడిన ఒక కొత్త ‘ఫీల్’ను అలా సృష్టించేవారు. ఇటువంటి ‘ట్రేడ్ ట్రిక్స్’ ఎలావున్నా ఇంతకీ ఆ ‘రంగు’ కాయితం మాట ఏమిటి? దానికి ఆ రంగు మాత్రమే ఎందుకు? ఆ రంగు నేపధ్యంలో బంగారపు వస్తువు వన్నె మరింతగా మెరిసినట్టుగా మన కంటికి మొదటి చూపులో వో క్షణం కలిగే భ్రమ కోసం ! ఈ ‘ట్రిక్’ను రాజకీయాల్లో ‘రివర్స్ ’లో ఉపయోగిస్తారు.

ఒకప్పుడు కాంగ్రెస్ లోపాలు బూచిగా చూపించి ‘టిడిపి’ ఇలాగె మేలు పొందేది. మునుపు వాళ్ళు చేసింది చూసారుగా.. అంటూ గతం ‘బ్యాక్ గ్రౌండ్’ చూపిస్తే చాలు పని అయిపోయేది. కానీ సీన్ మారింది. వై.ఎస్.ఆర్.సి.పి. ‘టీన్స్’లో వున్న యువ ప్రాంతీయ పార్టీ. పైగా అది ఒక ‘టర్మ్’ ప్రభుత్వంలో ఉన్నాక; మరో రెండు పార్టీలను కలుపుకుని గెలిచి కుర్చీలోకి వచ్చాక, మళ్ళీ పాత ‘విజన్’ టోన్ అంటే, ఎన్ని మైకులు పెట్టినా అది బయటకు రావడం లేదు. ఎన్నాళ్లని ఇంకా పాత ప్రభుత్వాన్ని తప్పు పడతారు. గెలిచారుగా ఇంకేంటి. పోనీ ఉన్న సమస్య ఏమిటో ఇది అని బాహాటంగా పైకి చెప్పరు. జగన్మోహన్ రెడ్డి సర్వం నాశనం చేసి వెళ్ళాడు అంటారు. దాన్ని సరిచేయడానికి జరుగుతున్నది ఏమిటో చెప్పరు.

ఎన్నికల ముందు ‘విధ్వంసం’ అనేవారు. ఆ ‘టైటిల్’తో రాసిన ఒక పుస్తకాన్ని కూడా బాబు విడుదల చేసారు. మరి ఇప్పుడు అది ఎక్కడ జరిగింది వివరంగా మరో పుస్తకం రాసి మరీ చెప్పవచ్చు. అటువంటిది ఇంకా మొదలు కాలేదు. అయితే, ఈ లోగా వస్తున్న వార్తలు మాత్రం అవి మన మధ్యతరగతి మేధావులకు పనిని బాగా పెంచుతున్నాయి. అదెలా అంటే ఈ ప్రభుత్వం- ‘జనాన్ని పధకాలతో సోమరుల్ని చేస్తున్నది’, ‘మేము కట్టే పన్నులు వాళ్ళను మేపడానికా?’ అయినా ‘సంక్షేమమేనా... అభివృద్ధి ఏదీ?’ వంటి ‘ట్యాగ్ లైన్స్’ అప్పట్లో మన “మధ్య-మేధో” వర్గం నుంచే ఎక్కువగా వినిపించేవి. అయితే కొత్తగా వీళ్ళు ఎప్పుడు ‘ట్యాక్స్ పేయర్స్’ అయ్యారు? వంటి వివరాల్లోకి మనం వెళ్ళకుండా వాళ్లు సంధించే ప్రశ్నలకు మాత్రమే మనం జవాబు చెప్పాలి. అలా ప్రభుత్వాలు ‘సంక్షేమం’ ఆపి, వారి మనోభావాలను గౌరవించాలి. జగన్ అలా చేయలేదు కనుక, ఫలితం అనుభవిస్తున్నాడు. అయితే ఇప్పటికీ ఇంకా వీళ్ళు ఇంకా ఇలాగే అనుకుంటున్నారా?

ప్రభుత్వంలో వున్న ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన అర్ధ సంవత్సరం అవుతున్నా, 2025 ‘కేలండర్ల’ తయారీదారులు అందుకు సిద్దం అవుతున్నా... కొత్త ప్రభుత్వం ఇంకా పాత ‘కేలండర్’లో మేకు కొట్టుకుని కూర్చుంటే, ఏమిటి చేయడం. ఇక్కడే మన “మధ్య-మేధో” వర్గానికి చేయగలిగితే చేతి నిండా పని కనిపిస్తున్నది. ఏదైనా కొత్త వార్త కొన్నాళ్లుగా ‘ఫాలో అప్’ లేకుండా ఉంటే ఎందుకని అని కారణాలు వెదకవచ్చు. లేదా ఒక కొత్త వార్త వచ్చాక దాని మూలాలు కోసం అవి ఎక్కడివి అని వెతికితే వెతకనూ వచ్చు. ఎందుకంటే, వీళ్ళంతా ‘ట్యాక్స్ పేయర్స్’ కనుక తాము కట్టే రూపాయి ఎలా సద్వినియోగం అవుతున్నదీ తెలుసుకోవడం వారి కర్తవ్యం!

అలా చూసినప్పుడు, గత ప్రభుత్వం నిర్మించిన పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ ప్రభుత్వం ‘ప్రైవేటు’కు అప్పగిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమే కావొచ్చు. కొద్ది రోజులు దానిపై చర్చలు జరిగి విషయం సద్దుమణిగింది. ప్రభుత్వం నుంచి అవును లేదా కాదు అని స్పందన లేదు. అయితే, రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ అక్టోబర్ మొదటి వారంలో డిల్లీలో ‘నీతి ఆయోగ్’ సభ్యుడు డా. కె. వినోద్ పాల్ ను కలిసాక, మంత్రి నోటి నుంచి కొత్త వార్తలు బయటకు వచ్చాయి. “మేము అడిగిన మీదట కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వేర్వేరు దశల్లో వున్న పదిహేడు మెడికల్ కాలేజీలకు ‘వైబులిటీ ఫండింగ్’ మంజూరు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని” మంత్రి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. “గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు” అని కూడా మంత్రి అన్నట్టుగా ఆ వార్త. సరే, వాళ్ళు ఏమి చేయకపోతే, ఆ కాలేజీలు ఎలా వచ్చాయి అని మనం అడగం కనుక, ఇటువంటివి మామూలే అనుకోవలసి ఉంటుంది. అయితే మంత్రి వార్తలో వీటిని ‘ప్రైవేటు’ పరం చేయడం అనే అంశం కనుమరుగైంది! దానర్ధం ‘నీతి ఆయోగ్’ దాన్ని అంగీకరించి ఉండకపోవచ్చుకూడా?

అటువంటిదే ఈ మధ్య ‘డ్వాక్రా’ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున ‘ఫుడ్ ప్రాసెసింగ్’ ఉత్పత్తులు తయారు చేయించాలనే ప్రణాళిక. “రాష్ట్రంలో విపరీతమైన పరిధిని కలిగి ఉన్న ‘ఫుడ్ ప్రాసెసింగ్’ రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) స్థాపనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు” అంటూ సెప్టెంబరు 12న వార్త. “గత ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏమాత్రం పురోగతి సాధించలేదని, అయితే ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం సమస్యల నుంచి కోలుకునేందుకు అవసరమైన చేయూతనిస్తుందని ఆయన అన్నారు”

సరే, ‘కోవిడ్’ను అందరూ ‘కన్వీనియంట్’గా మర్చిపోయారు. అయినా కోలుకుని గత వై.సి.పి. పాలనలోనే ‘ఫుడ్ ప్రాసెసింగ్’కు కొత్తగా ఒక ప్రభుత్వ శాఖ హోదాను ఇచ్చారు. అప్పటివరకు ఇది ఒక ‘సొసైటీ’గా ఉంటూ, అది- వ్యవసాయమా పరిశ్రమా తెలియని స్థితి! అయితే 2021 సెప్టెంబర్ లో విజయవాడలో జరిగిన ‘వాణిజ్య ఉత్సవ్’లో సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుతో పాటుగా ఆ శాఖ మొదటి సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా ఆ రోజు వేదికపై కూర్చున్నారు. అప్పట్లో ‘సిఎంవో.’ నుంచి సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఉండే సూచనలు అంత సూక్ష్మంగా ఉండేవి. ప్రతిదీ ‘బుక్’ మేరకు అధికారులకు తగిన ‘ప్లేస్మెంట్’ ఉండేది. అయితే బాబు తొలి కలెక్టర్ల సమావేశంలోనే తమది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని చెప్పి తన వైఖరి ఏమిటో ముందే చెప్పారు.

ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులకు వేర్వేరు ప్రాధాన్యతలు ఉన్నప్పుడు, ‘సమస్య’ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించిన రెండు అంశాలు విషయంలో గత ప్రభుత్వం ఇలా చొరవ చూపించి ఇది తన ‘ముద్ర’ అన్నట్టుగా, పై రెండు అభివృద్ధి అంశాల్లో ఒక పురోగతి సాధించడం చూస్తున్నాము. జగన్ ప్రభుత్వం సాంప్రదాయ వ్యవసాయం గిట్టుబాటుగా లేదని, ప్రత్యమ్నాయంగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించి ‘హార్టీకల్చర్’ను ప్రోత్సహించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం రెట్టింపు చేస్తాము, అంటున్నారు. కొత్తగా టి.జి. భరత్ ఈ శాఖకు మొదటి మంత్రి అయ్యారు. అంతేనా మారిన ఈ ముఖచిత్రంతో కొత్తగా ‘మ్యాంగో బోర్డు’ ‘బనానా బోర్డు’ ప్రారంభిచడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రం కేంద్రాన్ని అనుమతి అడిగింది.

వ్యవస్థల్ని బలోపేతం చేసే ప్రభుత్వాలు పనిచేసి వెళ్ళాక, ఆ తర్వాత వచ్చే ఏ పార్టీ ప్రభుత్వానికైనా ఇటువంటి “గులాబీ రంగు కాయితం” ఇబ్బంది, ఉంటుంది. కొన్ని పత్రికల్లో తరుచూ ‘వై.సి.పి. అధికారులు’ అంటూ వార్తలు కనిపించడానికి, ఈ ఉక్కపోతే కారణం. ఒక పార్టీ ‘బ్రాండ్’తో అధికారులు ఎందుకు ఉంటారు?! పై నుంచి క్రిందివరకు అన్ని స్థాయిల్లో ఐదేళ్లుగా జరిగిన నియంత్రణతో మునుపటిలా కాలుచెయ్యి కదపడానికి లేకపోయింది. ఇప్పటికే ప్రతి ‘సిస్టం’ పద్దతి ప్రకారం పనిచేసేటట్టుగా చేసాక, అటువంటిది కొనసాగడం ఇష్టం లేకుంటే వచ్చే ఇబ్బంది ఇలాగే ఉంటుంది. ఒక ఎమెల్యే బహిరంగ సభలో- “గత ప్రభుత్వం ‘ఆప్కోస్’ కార్పోరేషన్ అని పెట్టి ‘కాంట్రాక్టు’ & ‘అవుట్ సోర్సింగ్’ ఉద్యోగాల భర్తీకి ఒక పద్దతి పెట్టి వెళ్ళిపోయింది, దాంతో ఇప్పుడు మన వాళ్ళకు మనం ‘జాబ్స్’ ఇవ్వాలంటే కుదరడం లేదు” అని మాట్లాడుతున్న వీడియో సర్క్యులేషన్ లో ఉంది అంటే, పరిస్థితి అర్ధం అవుతుంది.

చివరిగా ఈ ఉక్కపోతకు మరో కారణం కూడా ఉంది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడే ప్రతి ప్రభుత్వ చెల్లింపుకు CFMS (Comprehensive Financial Management System) నంబర్ విధిగా ఉండాలి, అనే నిబంధన కొత్తగా అమలులోకి వచ్చింది. దాన్ని జగన్ ప్రభుత్వంలో ‘బ్యురోక్రసి’ పకడ్భందీగా అమలు చేసింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు 2018 ఏప్రెల్ నుంచి- Andhra Pradesh Center for Financial Systems and Services (APCFSS) పేరుతో ఒక కొత్త ప్రభుత్వ ఆర్ధిక వ్యయ నియంత్రణ వ్యవస్థ ఇక్కడ మొదలయింది. గత ఐదేళ్ళలో అది ‘ట్రజరీ’ శాఖ నుంచి వేరై, ఒక స్వతంత్ర డైరక్టరేట్ స్థాయిలోకి మారి అన్ని ఆర్ధిక లావాదేవీలకు కేంద్రమైన- ‘టెక్నికల్ ఫ్లాట్ ఫారం’గా మారింది. ఇప్పుడు ‘నిధి భవన్’ పేరుతొ తాడేపల్లిలో ఒక ప్రత్యెక భవనంలో ఈ ఆర్ధిక శాఖ కార్య కలాపాలు జరుగుతున్నాయి. గతంలో ‘జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ‘ఏడ్చారు’ అనే విమర్శకు అదే కారణం. అయితే, ఇకముందు, ఇటువంటివి కూడా మన “మధ్య-మేధో” వర్గానికి అర్థమైతే మంచిది.

Tags:    

Similar News