'స్కాట్ చూపిన అద్దంలో మన తప్పులు కనబడతాయా?'
‘ప్రపంచీకరణ’ ఆద్యుడు మూడు సార్లు ఓడేందుకు కారణాలేమిటి?
చాలా విషయాల్లో బయలుదేరిన చోటికే తిరిగిరావడం మనకు పరిపాటిగా మారింది. అది వ్యక్తి జీవిత విషయమైనా లేక సామాజికం అయినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు ఒకేలా ఉంది. ఎనభై దశకంలో మూడవ ప్రపంచ దేశంగా మనం పిలవబడుతున్న రోజుల్లో అప్పటి మన లక్ష్యాలు వేరు. బ్యాంకులు జాతీయకరణ అంటే అప్పటికి మనకు అదొక ‘మైల్ స్టోన్’ విజయం. ఇప్పుడు ఆ చక్రం కూడా తిరగడం పూర్తయి, మళ్ళీ మొదటికొచ్చి- ‘ప్రైవేటీకరణ’ అంటూ బయలుదేరిన చోటికి చేరడానికి సిద్దమయ్యాము. తొంభై దశకంలో ‘ప్రపంచీకరణ’ అంటూ బయలుదేరిన ఇండియా విషయంలో గడచిన రెండు దశాబ్ధాల సమీక్ష ఇప్పటికే మొదలయింది. అయితే, ఈ ఇరవై ఏళ్లలో తేలింది ఏమిటి అని చూస్తున్నప్పుడే- ‘అంతా రివర్సల్’లో కనిపిస్తున్నది. అన్నిటి మాదిరిగానే అది మనకు అర్ధం కావడం కూడా ‘లేటు’ అవుతున్నది.
“ప్రపంచీకరణ తర్వాత 1990-2000 దశకాల్లోని వృద్ది అసమాన పెరుగుదల, మన దృష్టి కేంద్రీకరించాల్సిన దేశ అంతర్గత వాణిజ్యం వైపుకు వేలు చూపిస్తున్నది” అంటున్నారు ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోషియేషన్ - ఏసియా-ఫసిఫిక్ వైస్ ప్రసిడెంట్ స్కాట్ వాంగ్. ఈ ఏడాది ఆగస్టులో ఆయన మన దేశంలో పర్యటించినపుడు చేసిన ఈ వ్యాఖ్యలు, ఇక్కడున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈ సంస్థ 90 దేశాలలో తన 15,000 మంది వృత్తి నిపుణుల ద్వారా వాణిజ్య వృద్ది విస్తరణ కొరకు విభిన్న సమూహాలను ‘కనెక్ట్’ చేస్తున్నది. స్కాట్ అంటారు- “ప్రపంచం పలు శిబిరాలుగా విడిపోవడం వల్ల, అంతర్జాతీయ వాణిజ్య ముఖచిత్రం కూడా పలు శకలాలు కావడం తప్పడం లేదు. ఇటువంటప్పుడు వృద్ది క్రమంలో ఇంకా కలవకుండా వెనకపడి పోయిన వాళ్ళను కలుపుకోవడానికి (ఇంక్లూజివ్) గాను జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి అన్నివిధాలా తగిన కాలమిది” అంటున్నారు.
ఇది విన్నప్పుడు, రెండుగా విడిపోయిన తెలుగు ప్రజలుగా ఆయన మాటల్ని మనం ఎలా చూడాల్సి ఉంది అనేది ముఖ్యం. ఆయన ఈ మాట చెబుతున్నది ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన పదేళ్ళ తర్వాత. ఇప్పటికీ ఇంకా ఇక్కడ విభజన ఉన్నదా? అది నిజమైతే, ఇక్కడ ఎక్కువ కాలం అధికారంలో ఉంటూ ఉమ్మడి ఏపీలో ‘ప్రపంచీకరణ’కు తానే ఆద్యుడను అనే చంద్రబాబుకు 2004-14 మధ్య పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచిన అంశాలు ఏమిటి అనే పునశ్చరణకు సమయం చాలలేదా అంటే, జవాబు దొరకదు. పోనీ విభజనతో గత బరువు కొంత తగ్గితే చిన్నరాష్ట్రానికి సరైన ప్రణాళికతో తొలి ఐదేళ్ల పాలన సాగిఉంటే, మధ్యలో ఆయనకు మరో ఓటమి ఉండేది కాదు.
ఇంత అయ్యాక కూడా రెండవ ‘టర్మ్’లో మళ్ళీ కేంద్రీకృత పాలన అంటున్నారు అంటే, రాష్ట్ర విభజనకు దారి తీసిన పరిస్థితులు ఏవీ ఆయన ఖాతరు చేయలేదు అనేది తెలుస్తూనే ఉంది. పోనీ వైసీపీ పాలనలో అమలు చేసిన వికేంద్రీకరణ పాలసీ, అందుకు ‘ట్యూన్’ అయిన ‘బ్యూరోక్రసీ’ని బాబు తనదైన ముద్రతో ఈ ఐదేళ్లు వినియోగించుకుంటే, తన పార్టీకి రాష్ట్రానికి కూడా అది కలిసొచ్చేది. కానీ దాన్ని ఆయన పట్టించుకోలేదు. ఇదంతా ఒక చిన్న రాష్ట్ర స్థాయి పరిధిలోని విషయం కావొచ్చు. అస్సలు ఈ నమూనా సరి కాదు అనేది అంతర్జాతీయ నిపుణుల మాట.
ఇక్కడ స్కాట్ అనేది ఏమంటే- “ఏకపక్షవాదం, రక్షణవాదం, జాతీయవాదం ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి, ఇటీవల కొత్తగా వస్తున్న ‘టారిఫ్’లు కూడా అటువంటివే, ఇవి తమ స్థానిక తయారీదారుల్ని, స్వంత మార్కెట్లను కాపాడుకోవడానికి ఆయా దేశాలు తమ అతర్ముఖ దృష్టి నుంచి వాటిని చేస్తున్నవి. అలాగని ఇది కేవలం ‘డొమెస్టిక్ మార్కెట్’ కోసమని కాదు. మన విదేశీ విధానం ‘రీజియన్ బేస్డ్’ లేదా ‘బ్లాక్ బేస్డ్’ కూడా అయినప్పుడు, మన సమీప దేశాల తీరాలు మనకు ‘స్నేహ-తీరాలు’ అవుతాయి” అంటున్నారు స్కాట్. ఇలా విషయం తీరం కూడా కావడంతో ఆంధ్రులకు ఇది నేరుగా ‘కనెక్ట్’ అవుతున్నది.
ఇక్కడే స్కాట్ చేసిన వ్యాఖ్య ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆయన అంటారు కదా- “ప్రస్తుత పరిస్థితి అదేదో అకస్మాత్తుగా సంభవించినది కాదు, ఎవరో ఒక వ్యక్తి కారణంగా జరిగింది అంతకన్నా కాదు. ఇది కేవలం 1990-2000 మధ్య జరిగిన ‘ప్రపంచీకరణ’ వల్ల జరిగింది. అయితే అదేమీ ఒక రాత్రికి రాత్రి జరిగింది కాదు. కనీసం పదేళ్ళ కాలంలో ఇటువంటి పరిస్థితి క్రమంగా సంభవించింది” అంటున్నారు. ఇవన్నీ స్కాట్ వాంగ్ తన న్యూయార్క్ ఆఫీసులో కూర్చుని చెప్పలేదు. డిల్లీలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ విషయాలివి. ఈ స్థాయి వ్యక్తి చెబుతున్నది విన్నప్పుడు, ఆగ్నేయ ఆసియా దేశాలకు సమీపాన ఉన్న సముద్ర తీర ప్రాంతమైన ఏపీని తెలంగాణ నుంచి వేరు చేయాలని 2014 నాటికి భారత ప్రభుత్వం ఎందుకు అనుకుందో అర్ధమవుతుంది.
ఆయన అంటారు- “ప్రపంచీకరణ ‘స్వర్ణ యుగం’ 1990-2000 దశకం గురించి మాట్లాడాలి అంటే, అది ప్రపంచ దేశాలలో శ్రేయోభావన, వృద్దిని ఇనుమడింప చేసింది. అయితే కొన్ని అభ్యంతరాలు అందులో ఉన్నాయి. అవి ఏమంటే, దేశాల మధ్య ఒక్కో దేశంలోని వర్గాల మధ్య సంపద పంపిణీ చాలా అసమంజసంగా జరిగింది. దీన్ని గుర్తించిన ప్రజలు ప్రపంచీకరణ ఫలాలు ఏ కొద్ది మందికో పరిమితం కావడాన్ని నిరసించి, దాన్ని వాళ్ళ వోటు ద్వారా, నిరసనల ద్వారా తెలియచేస్తున్నారు. అయితే ఇది వాణిజ్య విధానాలు, ఇమిగ్రేషన్ మార్గదర్శకాల సవరణలకు బలమైన కారణమయింది” అంటారు.
అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే, స్కాట్ 2025 ఆగస్టు 5న డిల్లీలో మాట్లాడితే 7న మన సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లోనూ, సెప్టెంబర్ లో నేపాల్లోనూ- ‘జెన్-జడ్’ తిరుగుబాటు జరిగింది. ఇవి చూశాక స్కాట్ ఇక్కడికొచ్చి మనకు జోస్యం చెప్పారా అనిపిస్తుంది!
“ప్రస్తుతం జాతీయ వాదం పెరగడం మనం చూస్తున్నదే, వలసలకు వ్యతిరేకత కూడా కొన్నిచోట్ల ఉంది. ఇదంతా ఒకప్పటి ఉవ్వెత్తున ఎగిసిన ప్రపంచీకరణ- “స్వర్ణదశ”కు ఆయా సమాజాల నుంచి ఎదురైన ప్రతిస్పందన. ఈ కారణం చేత ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ వైఖరి మారింది. ఇంకా ‘కలవని’ సమాజాల వైపు మేము దృష్టి పెట్టాము. అందరూ ప్రయోజనం పొందే విధంగా, అది స్థిరమైనదిగా ఉండేట్టుగా, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే రీతిలో ‘ప్రపంచీకరణ’ ఇకముందు ఉండాలని అనుకొంటున్నాము. అయితే, ఇంకా అక్కడికి మేము చేరుకోలేదు”
స్కాట్ చెబుతున్న ఈ మాటలు విన్నప్పుడు, బంగ్లాదేశ్ నుంచి 2012 లో మన దేశంలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించిన ‘రోహ్యంగా’లు మనకు గుర్తుకు వస్తారు. మనకు సరిహద్దున ఉన్న బర్మా వల్ల ఏర్పడిన ఎంతకూ తెగని మణిపూర్ సమస్య కూడా ఈ కోవలోకే వస్తుంది. స్కాట్ అనేది ఏమంటే, “బహుశా మనం ఇప్పుడు ఉన్నది పరివర్తన దశ కావవచ్చు, అటువంటప్పుడు చాలా విషయాల్లో స్పష్టత లేక విపరీతమైన అలజడి ఉంటుంది” అంటారు.
తెలుగు వారికి సంబంధించిన కీలక అంశం స్కాట్ చివరిలో చెబుతూ- “ప్రతి ఏటా ‘జియో-పొలిటికల్ ఏన్యూయల్ ట్రేడ్ రిస్క్ ఇండెక్స్’ (GATRI) అని ఒక సూచీని తమ సంస్థ WTCA, హేగ్ లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ తో కలిసి రికార్డు చేస్తాయని” అంటున్నారు. దేశాల మధ్య ఖండాల మధ్య ఈ భౌగోళిక-రాజకీయాలు (‘జియో-పొలిటికల్’) ఒక తీరుగా ఉంటే, ఒక దేశంలోని రాష్ట్రాల మధ్య కూడా అంతే స్పర్ధతో ఆ పోటీ ఉంటున్నది. మన తీరంలో ‘గుజరాత్ మోడల్’ వాణిజ్యం గురించి గతంలో ఇక్కడ ప్రస్తావన వచ్చింది.
ఇక్కడి బలహీనుల నోళ్ళు కొట్టి ఆధిపత్య వర్గాలు బాగుపడితే, ఇప్పుడు వాళ్ళను పక్కకు నెట్టడానికి ‘హిందీ కార్పొరేట్’ కుటుంబాలు మన తీరంలో స్థిరపడుతున్నాయి. అయితే, దీన్ని కూడా గమనిస్తున్న నిఘా యంత్రాంగం ఉంది అంటున్నారు స్కాట్. మేము రికార్డు చేస్తున్న ఈ ‘డేటా’ మూడు రకాలుగా ప్రపంచ దేశాలకు ఉపకరిస్తున్నది. అవి- దౌత్య వ్యవహారాలకు, రక్షణ రంగానికి, ఆర్ధిక సంబంధాల విషయంలో ఆయా దేశాల విధనాలు చర్చించి మరీ రూపొందించుకోవడానికి ఉపకరిస్తున్నాయి అంటున్నారు. మనం ఎక్కడ ఉన్నాము అని పరీక్ష చేసుకోవడానికి ఇటువంటివి మనకు ఎంతైనా ఉపకరిస్తాయి.
ఇది కూడా చదవండి
బాబు గుజరాత్ మోడల్ ని ‘జగన్ ఏపీ’ ఆపగలదా?