
బాబు గుజరాత్ మోడల్ ని ‘జగన్ ఏపీ’ ఆపగలదా?
రెండుండచు ఖడ్గం వంటి బాబు మార్క్ రాజకీయాలను ఎదుర్కోవడానికి వయస్సులో బాబు కంటే 22 ఏళ్ల చిన్నవాడైన జగన్ మోహనరెడ్డి ఎంచుకున్న మార్గం ఏమిటి?
వాళ్ళు ‘క్లియర్’ గానే ఉన్నారు. మరి, వీళ్ళకి అటువంటి ‘క్లారిటీ’ ఎప్పటికి వస్తుంది అనేదే ఇంకా తెలియాల్సి ఉంది. పన్నెండు ఏళ్లనాడు పనిమాలా వాళ్ళు రాష్ట్ర విభజన చేయవద్దు అన్నది కూడా ఇందుకే. అది ఇక ఆగదు జరుగుతుంది అని అర్ధమయి అదీ అయ్యాక, జరగాల్సిన మరొక విభజన విషయంలో ఇప్పుడు వాళ్ళు మరింత ‘క్లారిటీ’తో ఉన్నారు. ఎందుకంటే, ‘మ్యాప్’ మారింది. రాజధాని ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నప్పుడు, వారికున్న రాజ్యవనరుల విస్తీర్ణం చాలా పెద్దది. అందువల్ల ఏవి ఎవరికి ఎంత మేర పందేరం అవుతున్నది అజ ఉండేది కాదు. పైగా అటువంటివి గ్రహించడం అనేది వర్ధమాన వర్గాలకు (‘ఎమర్జింగ్ కమ్యూనిటీస్’) వారి స్థాయికి మించిన పని. మొదటి నుంచి వాళ్ళు ‘విభజన’ వద్దు అన్న కారణమిదే! కాని రాష్ట్రం చిన్నదై, సమాచార వ్యవస్థ పెద్దదై అందరికీ అన్నీతెలిపే ‘కమ్యూనికేషన్’ రంగం దిగువకు చేరువై దాపరికం లేకుండా, అందరికీ అన్నీ తెలుస్తున్నాయి.
సహజంగా ఇటువంటప్పుడు పైనున్న ఎవరైనా ఎంతో కొంత ‘ఎకామిడేటివ్’ ఉంటూ, లేదా ఉన్నట్టుగా కనిపిస్తూ సరే వాళ్ళను కూడా బతకనిద్దాం అనే ధోరణితో ఎప్పటిలా తమ పని తాము పూర్తిచేసుకుంటారు. అలా జరగక పోవడం ఇప్పుడు కనిపిస్తున్న కొత్త ధోరణి. అంతేకాదు, ఇప్పుడది బాహాటంగా జరుగుతున్నది. వాళ్ళు తమ లక్ష్యాల్ని చేరుకోవడానికి అమలుచేసే వ్యూహం విషయంలో శషభిషలు లేకుండా అనుకున్నది అనుకున్నట్టుగా చేసేస్తున్నారు. ఇది చెప్పడానికి ‘వాళ్ళు’ – ‘వీళ్ళు’ అంటున్నప్పుడు, ఇదేమీ రెండు కుల శిబిరాల మధ్య విభజన కాదు. ఏపీ సామాజిక వాతావరణం దృష్ట్యా అలా అనుకునే అవకాశం ఎక్కువ కనుక, అది కాదు. ఇది ఆర్ధిక అంతరాల మధ్య విభజన, గడచిన ముప్పై ఏళ్లలో ఆర్ధిక అంతరాలు మారి, ప్రజల ‘శిబిరాలు’ మారడం ఎవరికీ తెలియకుండానే నిశబ్ధంగా జరిగిపోయింది. ఒకప్పటి మధ్యతరగతి ఇప్పుడు కొత్తగా తాము- ‘గేటెడ్ కమ్యూనిటీ’ అని అనుకుంటున్నది. దాంతో- మనం ఎవరి వైపు ఉండాలి అనేది వాళ్ళకు కొత్త సంకటంగా మారింది. వీరి స్థాయిలో వచ్చిన ఇటువంటి మార్పు వల్లనే, పాలకవర్గాలు వెరపు లేకుండా, ‘ఉచితాలు’ అనుచితం అనగలుగుతున్నాయి.
నిజానికి ఈ తరహా (‘మోడెస్ ఆపరెండి’) పని విధాన వేగానికి డా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంత ‘బ్రేక్’ పడినా, మధ్యలో ఏ కొద్ది అవకాశం దొరికినా అదొక ‘ఫ్యాక్టర్’ రూపం తీసుకుని, తాత్కాలికంగా దించిన తలను పైకి ఎత్తుతూనే ఉంది. ఆర్ధిక సంస్కరణల అమలు కాలానికి ఇక్కడ పాలనా పగ్గాలను (1995లో) తన చేతిలోకి తీసుకున్న చంద్రబాబు టిడిపి గురించి కంటే, నేరుగా ఆయన గురించి మాట్లాడుకోవడమే విషయానికి దగ్గరదారి అవుతుంది. ఈ తరహా పాలనకు దేశంలోనే ఆద్యుడైన బాబు ‘ఐటి’ మనస్తత్వం మాదిరిగానే ‘ఇంటెల్ ఇన్-సైడ్’ అన్నట్టుగా ఆయన లోపల ఉన్నది- ‘డ్యూయల్ ప్రాసెసర్’ కావడంతో ఒకే కాలంలో అది ‘డిల్లీ’లోని రెండు రాజకీయ శిబిరాల ‘రాడార్’ లలోనూ సదా ‘యాక్టివ్’గానే ఉంటుంది. ఈ తరహా ‘విన్-విన్’ బిజినెస్ మోడల్ కార్పొరేట్ రంగం నుంచి తొలుత రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు. ఈ రాజకీయాల నమూనాకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీటితో కలిసి ఉండే పార్టీలు ఏ స్టేషన్లో అయినా అవి ‘ఇంజన్’ నుంచి విడిపోవడానికి సిద్దంగా ఉండే షరతుపై దాని వెనక బోగీలుగా ఉండాలి.
ఇటువంటి రెండు అంచుల ఖడ్గం వంటి బాబు మార్క్ రాజకీయాలను ఎదుర్కోవడానికి వయస్సులో బాబు కంటే 22 ఏళ్ల చిన్నవాడైన జగన్ మోహనరెడ్డి ఎంచుకున్నది- ‘కటింగ్ ఎడ్జ్’ పబ్లిక్ పాలసీ. ఎక్కువగా ‘ఇంజనీరింగ్’లో వినిపించే దీన్ని ‘పబ్లిక్ పాలసీ’కి అన్వయించి ఐదేళ్లపాటు జగన్ ముఖ్యమంత్రిగా పనిచేశాక, 2024 ఎన్నికల్లో అతణ్ని ప్రత్యర్ధిగా ఎదుర్కోవడానికి చంద్రబాబు పడిన కష్టం రెట్టింపు అయింది. అప్పట్లో- “నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి అనుభవం నాకు ఎదురు కాలేదు...” అన్నారు అంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్ధం అవుతున్నది. ఇది బాబుకు తెలిసిన- ‘డ్యూయల్ ప్రాసెసర్’ రాజకీయాలకు అలిమి అయ్యే రకం కాదు. ఉభయతారకం అనబడే ‘విన్-విన్’ బిజినెస్ మోడల్ కు జగన్ రాజకీయాల్లో చోటులేక, చివరికి ఆ ఉక్రోషం నుంచి వచ్చిన తిట్టే- ‘సైకో జగన్’!
సరే, ఆ రెండు క్యాంప్’ల నుంచి ఇవతలకు వచ్చి, వాళ్ళిద్దరి రాజకీయాలకు దూరంగా ఉంటూ మన సంగతి ఏమిటి అని చూసినప్పుడు, ఏపీలో కొత్తగా తాము ‘గేటెడ్ కమ్యూనిటీ’ అని అనుకుంటున్న వర్గం ఇక్కడి సామాన్య ప్రజలను వాళ్ళ మానాన వాళ్ళను వదిలేయడానికి నిశ్చయం అయిపోనట్టుగానే ఉంది. తన జేబులోని నలభై శాతం వోటు ఖాతాతో జగన్మోహన్ రెడ్డి కూడా తాను సామాన్యులతోనే ఉండడానికే ‘డిసైడ్’ అయినట్టుగా అర్ధం అవుతున్నది. మరి అధికారంలో ఉన్న ‘కూటమి’ ప్రభుత్వం సంగతి ఏమిటి అని చూసినప్పుడు; జిల్లా, రాష్ట్ర పాలనా యంత్రాంగం తమ ఉద్యోగ ధర్మంగా చేస్తున్న ‘డ్యూటీ చార్టు’ దాటి మరీ వారు చేసిది కానీ అందుకు చూపుతున్న చొరవ కానీ కనిపించడం లేదు. ఒకప్పుడు- ‘డ్వాక్రా’ తెచ్చింది నేనే, ‘ఐటి’ తెచ్చింది నేనే... అని బహిరంగంగానే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ‘ఏఐ’ అంటున్నాడు కానీ ‘మహిళా సాధికారికత’ ఊసు ఎత్తడం లేదు. బీసీ. ఎస్సీ, ఎస్టీల గురించి ఆయా శాఖల మంత్రుల ప్రకటన వార్తలు కూడా కనిపించడం లేదు.
ఈ నేపధ్యంలో విశాఖపట్టణంలో ‘సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025’ నవంబర్ 14-15 తేదీల్లో జరుగుతున్నది. కేంద్రంలోని ‘ఎన్డీఏ’ అనుబంధ ప్రభుత్వం ఏపీ తీరంలో ఇప్పటి ఈ ఘట్టానికి చేరడానికి ముందు అవసరమైన ‘స్టేజ్ సెట్’ గత పదేళ్లుగా (2015-25) ఇక్కడ ప్రభుత్వాలు ఏమున్నా అవి ఆగడం లేదు, యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం 2023 మార్చిలో ఇదే విశాఖలో జరిగిన ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర రవాణా మంత్రి నితీశ్ గడ్కారీ మాట్లాడుతూ- “సరుకు ఏపీ పోర్టులకు చేరడానికి డిల్లీ నుంచి నాగపూర్ వచ్చి, అక్కణ్ణించి కర్ణాటక, తెలంగాణ మీదుగా రావడం కంటే, బీహార్, ఒడిస్సా మీదుగా నేరుగా విశాఖ కాకినాడ పోర్టులు చేరడం తేలిక” అంటూ వాణిజ్యవర్గాల అంతర్యాన్ని మంత్రి ఆనాడు వెల్లడించారు. జరిగింది ఏమిటి- మొన్న 9 ఆదివారం నాడు కేంద్ర ఉక్కు శాఖ ఛత్తీస్ఘర్ నుంచి ఒడిస్సా మీదుగా అనకాపల్లి వద్ద రానున్న అర్స్లర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా యూనిట్ వద్దకు పైపుల ద్వారా నేరుగా గనుల వద్ద నుంచి ముద్ద ఇనుము చేర్చడానికి అనుమతి ఇచ్చింది.
మనమేమో నీరు, కరెంటు అంటూ... వైజాగ్ ‘గూగుల్ డేటా సెంటర్’ గురించి చేస్తున్న విమర్శ ఒకవైపు ఉంటే, అస్సలు అది సాధించడం మన శిఖరాగ్ర విజయం అంటూ మరోవైపు రెండు భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పుడు, అస్సలు ఆ ‘సెంటర్’ ను మనం చూడాల్సింది ఇక్కడ కూర్చుని కాదు, దాన్ని చూడాల్సింది జపాన్ లేదా ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి పడమర వైపుకు చూడాలి అని మరొక వాదన ఉంది. అక్కడేముంది అని చూసినప్పుడు, దక్షణ యూరోపియన్ దేశాల నుంచి సముద్ర మార్గంలో ఆసియా దేశాల్లోకి వెళ్ళడానికి వస్తున్న పలు ‘అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్స్’ ముందుగా అవి చేరుతున్న భారత భూభాగం మన విశాఖ నగరం. కనుక మన విదేశీ విధానం ‘యాక్ట్ ఈస్ట్’ అయినప్పుడు, ఉత్తర భారత దేశ ప్రధాన వాణిజ్య కుటుంబాలకు ఏపీ కూడలి అయినప్పుడు, మంత్రి గడ్కారీ అన్నట్టుగా ఉత్తరాది రోడ్లు అన్ని చేరాల్సింది ఇక్కడికే అయితే, అంతిమంగా ఇక్కడ అంచుల్లో మిగిలే వారికి ఆదరణ దొరికేది ఎక్కడ?

