ట్రంప్ ను భరించ లేక అమెరికా ప్రజలు రోడ్డెక్కారు

ఎన్ని ఘోరాలు జరిగినా ఇండియాలో జనం ఉలకరు,పలకరు;

By :  Admin
Update: 2025-04-07 03:49 GMT

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి


బాగా సుఖం మరిగిన అమెరికన్లు కూడా రోడ్ల మీదకు వచ్చేసారంటే ట్రంపేశ్వరుని అరాచక పరిపాలన జనాన్ని ఎలా అతలాకుతలం చేస్తూ ఉందో అర్ధం అవుతుంది . ట్రంప్-మస్క్ నియంతృత్వ వ్యాపార దృష్టి , ఏకపక్ష పాలన ఇట్టే అర్థం అవుతుంది .

ప్రజాస్వామ్య హక్కుల హననం , స్వేఛ్ఛాస్వాతంత్ర్యాల నిలువుదోపిడి , సుంకాల పెంపుతో గడబిడ కానున్న ఆర్ధిక జీవనాలతో నిరంతరం కంఫర్ట్ జోన్లో జోగే అమెరికన్లు సైతం రోడ్డున పడ్డారు .

ఈ పరిస్థితితో పోలిస్తే మన భారతీయులు ఎంత మంచివారో ! దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఏం పట్టని మధ్యతరగతి కంఫర్ట్ జోన్లోకి జారిపోయింది భారతీయులు . ప్రశాంత భారతం కలుషిత భారతం అయిపోయింది. జడ్జీల ఇళ్ళల్లో నోట్ల కట్టలు , దశాబ్దాలు దశాబ్దాలు ఆర్ధిక నేరస్తుల బెయిళ్ళు , జైళ్ళల్లో ఉంటూనే దాదాగిరో , పెరోల్స్ , కులం మతం ప్రాంతం పేరుతో దాడులు దందాలు , సాంస్కృతిక ఉగ్రవాదం , అబధ్ధపు అసాధ్య ఎలక్షన్ హామీలు , మస్క్ లాంటి క్రోనీ కేపిటలిస్టులు , వగైరా వగైరా వగైరా .

ఎన్ని రాజకీయ , ఆర్థిక , సాంస్కృతిక అరాచకాలు జరుగుతున్నా హాయిహాయిగా కుంభకర్ణ నిద్రలో జోగాడుతున్న సమాజం . నిజంగా మన ప్రజలు శాంతి ప్రియులు , అసలుసిసలైన గాంధీ వారసులు . ఇలాంటి పాలితులను పొందిన మన పాలకులు ఎంత అదృష్టవంతులో !

బహిరంగంగా ఎమర్జన్సీని విధిస్తే నెలలు నెలలు జైళ్ళల్లో మగ్గిన భారత సమాజం ఈనాడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నా హాయిగా నిద్రలో జోగుతున్నారు . ప్రతిపక్ష నాయకులు ఎవరి గోలలో వారు . దేశ వనరులు మస్కేయుల చేతుల్లో బందీ అవుతున్నా స్పందించని జనం .ఇల్లే వైకుంఠం బొందే కైలాసం .

ఎలక్షన్ల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటిస్తే అభ్యంతరం చెప్పకుండా ఎన్నికలు అయిపోయాక వాటిని విమర్శించే మాజీ ఉప రాష్ట్రపతులు , మాజీ ప్రధాన న్యాయమూర్తులు , టివి చానళ్లు . వారెవ్వా . ఇది కదా రెండు నాలికల భారతం !

నిద్రావస్థ నుండి జాగృదావస్థకు జాతి పయనిస్తుందని ఆశిద్దాం . అన్యాయాలను , అరాచకాలను , అప్రజాస్వామిక కార్యకలాపాలను ప్రశ్నించకపోయినా కనీసం లోలోపల గొణుక్కుందాం .

(వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్)


Tags:    

Similar News