అమరావతికి కొత్త రూపు !

రాజధాని నీటి అవసరాల కోసం సరైన ప్రణాళికతో రిజర్వాయర్లు నిర్మించవలసిన అవసరం ఉంది. వాటి నిర్మాణం ముందుగా జరగకుండా మిగిలిన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితం ఉండదు.

Update: 2024-06-20 08:01 GMT

అమరావతి మళ్లీ ధగధగలాడుతోంది. కొత్త కాంతులు విరజిమ్ముతోంది. ఉద్దండరాయునిపాలెంలో గతంలో భూమిపూజ జరిగిన ప్రాంతాన్ని సిఎం చంద్రబాబు గురువారం స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించడంతో రాజధాని వాసులు, రైతుల కళ్లలో కొత్త వెలుగులు కనిపించాయి. గత ఐదేళ్లుగా చీకటిలో బిక్కుబిక్కుమంటున్న నగరం ఇప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది.


టిడిపి కూటమికి ఈనెల 4వ తేదీ ఎన్నికల ఫలితాల రోజున భారీ ఆధిక్యత తెలిసినప్పటినుంచే తొలుత ఆనందం వెల్లివిరిసింది అమరావతి లోనే. 34 వేల ఎకరాల మాగాణి ప్రాంతాన్ని రాజధాని కోసం ధారపోసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు రావాల్సిన పూర్తి పరిహారం ఇక చేతికొస్తుందనే ఆశాభావం కూడా వారు వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడగానే టిడిపి అధినేత నుంచి ఎటువంటి సంకేతాలు అందాయో ఏమో! ఆ మర్నాటి నుంచే అమరావతి లో కొత్త కాంతులు మొదలయ్యాయి. విద్యుద్దీపాలు వెలుగులు విరజిమ్మడం ఆరంభించాయి. కనిపించకుండా పోయిన రోడ్ల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ రోడ్లకు ఇరువైపులా అడవిలా పెరిగిన చెట్లను తొలగించడానికి డజన్ల కొద్దీ బుల్ డోజర్లు కదలడం ఆరంభించాయి.


ప్రభుత్వ యంత్రాంగం మళ్లీ అమరావతి వైపు దృష్టి సారించింది. తర్వాత కొద్దిరోజుల లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రి అధికారికంగా ఆదేశించడంతో అమరావతి కూడా కొత్త రూపు సంతరించుకోవడం ఆరంభించింది. ఆ వెంటనే 20న చంద్రబాబు అధికారికంగా అమరావతి లో పర్యటించి, అక్కడి లోటుపాట్లన్నిటిని పరిశీలించి తాజా ఆదేశాలు జారీ చేయడంతో అమరావతిలో ఇక వెండితెరలు పరఛుకొంటాయనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది.

అయితే అమరావతి పూర్తి స్థాయి నగరంగా ఎప్పటికీ రూపు దిద్దుకుంటుందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించలేదనే చెప్పాలి. మూడు రాజధానులు కావు.. అమరావతి ఒక్కటే రాజధాని అని చంద్రబాబు స్వయంగా ప్రకటించడం అందరికీ ఆనందం కలిగించినా తమ కలల రాజధాని ఎప్పటికి పూర్తిగా అనుభవం లోకి వస్తుందనే విషయం ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. పి. నారాయణ పట్టణాభివృద్ధి మంత్రిగా మళ్లీ నియమితులు కావడంతో నిర్మాణ కార్యక్రమాలపై ఒక అవగాహనతో కొనసాగిస్తారనే అభిప్రాయం చాలామందిలో కలిగింది.

రాజధాని పూర్తి స్థాయి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని ఆయన అంటున్నారు. నిర్మాణాలను మూడు దశలుగా విభజిస్తే మొదటి దశకు 48 వేల కోట్లు అవసరమవుతాయి. సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లో క్వార్టర్స్, ప్రభుత్వ సిబ్బంది వసతి సముదాయాలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్మితం కాలేదు. వాటి నిర్మాణాలు ఓ 70 శాతం పూర్తయిన దశలో 2019లో ప్రభుత్వం మారిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతి లో నిర్మాణ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. కొంతవరకు పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా తమకు బకాయిలు అందక పోవడంతో కొత్త మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి.

ఈలోగా మూడు రాజధానుల వివాదం మొదలవడంతో అమరావతికి స్థలాలిచ్చిన రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. బాబు-2 ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ తొలుత న్యాయం చేస్తామని తొలుత ప్రకటించారు గానీ ఆ న్యాయం ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోవడం గమనించవలసిన అంశం.

ప్రపంచం లోని ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనే లక్ష్యం ఉంది. దానికోసం సింగపూర్ ప్రభుత్వ సహాయంతో అత్యుత్తమ డిజైన్ కూడా రూపొందించారు. అయితే గత ఐదేళ్లుగా అటకెక్కిన ఆ డిజైన్ ను మొదట దుమ్ము దులపవలసి ఉంది. తొలి దశలో పనులు చేపట్టేందుకు గతంలో 48 వేల కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ఆ ఐదేళ్లలో కొన్ని నిర్మాణాలు 70 శాతం పూర్తయ్యాయి కూడా. అనుకున్న ప్రకారం సాగితే రెండో దశలో మెట్రో రైలు పరుగులు తీస్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటైంది గనుక ముందుగా రాజధాని నగరం నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించవలసి ఉంది.

రాజధాని నీటి అవసరాల కోసం సరైన ప్రణాళికతో రిజర్వాయర్లు నిర్మించవలసిన అవసరం ఉంది. వాటి నిర్మాణం ముందుగా జరగకుండా మిగిలిన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితం ఉండదు. అంతేగాక నీటి సౌకర్యం లేక రాజధాని వాసులు అల్లాడిపోవలసి వస్తుంది. 2015 అక్టోబర్ 22న ప్రధాని మోడీ అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2017 నుంచి సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే మంచినీటి సరఫరాకు సరైన రిజర్వాయర్ల నిర్మాణమే జరుగలేదు. తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తోనే ప్రస్తుతం సరిపెట్టుకుంటున్నారు. అందువల్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్ని రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించి అమలుచేయవలసి ఉంది. రాయిపూడి వద్ద 10 ఎల్ ఎం డి రిజర్వాయర్ ను నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. అయితే దానితోపాటు మరికొన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవలసి ఉంది.

రాజధానిలో సరైన విద్యుత్ సౌకర్యం ఇప్పటికీ లేదు. ప్రస్తుతం ఉన్న భవనాలకు కూడా సరైన విద్యుత్ కనెక్షన్లు లేక చీకటి లోనే అలమటించడం వాస్తవంగా కనిపిస్తున్న దృశ్యం. గత వారం పది రోజుల్లో చాలాచోట్ల విద్యుత్ పునరుద్దరణకు తాత్కాలిక ఏర్పాట్లు జరిగాయి గానీ శాశ్వత ప్రాతిపదికన రాజధాని అంతటా విద్యుత్ సౌకర్యం కలిగించవలసిన అవసరం ఉంది. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని విస్తరణకు గతంలో కొన్ని ప్రణాళికలు రూపొందించి భవన నిర్మాణాలు కూడా ఆరంభించారు కానీ గత ఐదేళ్లుగా అవికూడా స్తంభించాయి. ఇప్పుడు వాటి నిర్మాణం కూడా త్వరితగతిన సాగవలసి ఉంది. సిఎం చంద్రబాబు గురువారం జరిపిన పర్యటన తర్వాత ప్రజల్లో కొంత ఆశాభావం ఏర్పడింది కానీ వారి ఆశలు నిజంగా నిజం కావాలంటే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి. సత్వరమే అమలు చేయవలసి ఉంది.


Tags:    

Similar News