మనుధర్మశాస్త్రానికి కర్త ఎవరు, కాలమేమిటి?

రామాయణంలో నిరుత్తరకాండ-25 : ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం విశ్లేషణ

Update: 2024-09-11 10:36 GMT

బాబిలోనియా పాలకుడు హమ్మురాబీ జారీచేసిన ధర్మశాస్త్రం క్రీ.పూ. 18వ శతాబ్దికి, హిట్టైట్ల ధర్మశాస్త్రం క్రీ.పూ.15వ శతాబ్దికి చెందినవిగా ఒకింత నిర్ధారణగా తెలుస్తోంది. అవి అప్పటి లిపిలో శిలాలిఖితమై మరీ కనిపిస్తున్నాయి. కానీ మనుధర్మశాస్త్రం విషయంలో అటువంటి వెసులుబాటు లేదు. అది మనుషుల లౌకికమైన నడవడి గురించి చెప్పేదైనా; వేద, పురాణ, ఇతిహాసాల్లానే అలౌకికమైన, లేదా దైవసంబంధమైన ముద్రతో ముందుకొచ్చింది; అందువల్ల పేరుకు అది ‘శాస్త్ర’మైనా, భక్తివిశ్వాసాలలో భాగమైంది.

ఏదైనాసరే భక్తివిశ్వాసాలలో ఎప్పుడైతే భాగమైందో అప్పుడిక లౌకికమైన విమర్శకు, విశ్లేషణకు అతీతంగా మారిపోతుంది; అందులోని ‘మంచి’నే తప్ప, చెడువైపు చూడకుండా, చూసినా పట్టించుకోకుండా మన చూపులను నియంత్రిస్తుంది. మనుధర్మశాస్త్రం విషయంలో కూడా అదే జరిగింది.

కొమరగిరి యోగానంద లక్ష్మీనరసింహారావు(కె. వై. ఎల్. నరసింహారావు)అనే వారు మనుధర్మశాస్త్రాన్ని తెలుగు వివరణతో 2003లో ప్రచురించారు. ‘మనువు అంటే నాకు చాలాకాలంనుంచి ఎంతో అవ్యాజమైన ఆరాధనాభావం’ అనే వాక్యంతో ఆయన తన ఉపోద్ఘాతాన్ని ప్రారంభిస్తారు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించిన స్వాయంభువమనువును విరాట్పురుషుడిగా, పురాణపురుషుడిగా, అయోనిజుడిగా అభివర్ణిస్తూ భక్తి ఉద్వేగాలను చాటుకుంటారు. ‘ముఖద్వారము’ అనే శీర్షికతో రాసిన పీఠికలో మనుధర్మశాస్త్ర కర్తృత్వం గురించి, కాలం గురించి ఆయన విపులంగా చర్చించారు. కాకపోతే, కాలం గురించి ఏమీ తేల్చకుండానే, తేల్చలేమంటూనే దానిని ముగించారు.

బ్రహ్మపురాణంనుంచి ఆయన పొందుపరచిన స్వాయంభువమనువు కథ ఇలా ఉంటుంది:

బ్రహ్మ ఒకానొక ప్రళయం తర్వాత స్వయంభువుగా అవతరించి తన తేజస్సుతో పంచభూతాలతో కూడిన ప్రపంచాన్ని ప్రకాశింపజేశాడు. తన సంకల్పమాత్రంతో నీటిని సృష్టించి అందులో తన బీజాన్ని నిక్షిప్తం చేశాడు. అది వేయిసూర్యుల కాంతితో బంగారు అండం(గుడ్డు)గా రూపొందింది. దానినుంచి హిరణ్యగర్భుడనే పేరుతో తనే జన్మించాడు. ఆ హిరణ్యగర్భుడే మళ్ళీ తనను పురుషునిగానూ, స్త్రీగానూ విభజించుకుని ఆ ఇద్దరి ద్వారా ఒక విరాట్పురుషుని పుట్టించాడు. ఆ విరాట్పురుషుడు తపస్సు చేసి సకలలోకాలకూ సృష్టికర్త అయిన ఒక తేజోమూర్తిని సృష్టించాడు. ఆయనే స్వాయంభువమనువు. అయోనిజ అయిన శతరూప అనే కన్య పదివేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ స్వాయంభువమనువును భర్తగా పొందింది.

అదే భాగవతం ప్రకారం చెప్పుకుంటే, ప్రజలను వృద్ధి చేయడానికి బ్రహ్మ తనను తనే పురుషుడిగానూ, స్త్రీగానూ విభజించుకున్నాడు. పురుషుడు స్వాయంభువమనువైతే, స్త్రీ శతరూప అయింది. స్వాయంభువమనువు ఏడు సముద్రాలను వడ్డాణంగా చుట్టుకున్న బ్రహ్మావర్త దేశానికి సమ్రాట్టు అయ్యాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనే ఇద్దరు కొడుకులు; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కూతుళ్ళు కలిగారు. ఆకూతి రుచికుడనే ఆయనను, దేవహూతి కర్దమప్రజాపతిని, ప్రసూతి దక్షప్రజాపతిని పెళ్లాడారు. వీరందరికీ కలిగిన సంతతితో క్రమంగా జగమంతా నిండిపోయింది.

తులసీదాసు రచించిన ‘రామచరితమానస్’ ప్రకారం, స్వాయంభువమనువూ, శతరూపా పరమాత్మ గురించి వేలసంవత్సరాలపాటు తపస్సు చేశారు. పరమాత్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నీలాంటి కొడుకును ఇమ్మని వారు అడిగారు. ‘మీరు వచ్చే జన్మలో దశరథుడిగానూ, కౌసల్యగానూ పుడతారు; నేనే మీకు కొడుకునై జన్మిస్తా’ నని పరమాత్మ వారితో అన్నాడు.

పై వివరణకర్త ఎక్కడిదో చెప్పని మరో కథనం ప్రకారం, స్వాయంభువమనువు ప్రజలను సృష్టించడానికి సంకల్పించి తపస్సు చేసి మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు మొదలైన పదిమంది ప్రజాపతులను సృష్టించాడు; వారు తమ వంతుగా స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు అనే ఆరుగురు మనువులను సృష్టించారు. ఒక్కొక్క మనువు పరిపాలనాకాలం లక్షల సంవత్సరాలలో ఉంటుంది. ఇప్పుడు మనం వైవస్వతమన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం. స్వాయంభువమనువు ఆయుర్దాయం ఇలాంటి డెబ్బయ్యొక్క మహాయుగాలు.

పై కథనాలు ప్రధానంగా స్వాయంభువమనువు గురించే చెబుతున్నా వాటిలో తేడా ఉండడాన్ని గమనించే ఉంటారు. అవి కూడా నిజమా, కల్పనా అన్న విచికిత్సకూ; మామూలు తర్కానికీ, హేతుబద్ధతకూ కూడా అతీతంగా ఉండడాన్నీ పోల్చుకునే ఉంటారు. కేవలం భక్తివిశ్వాసాలతో వాటిని నెత్తిన పెట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ, మన సాధారణబుద్ధితో అర్థం చేసుకోడానికి ప్రయత్నించామా, అయోమయపు కీకారణ్యంలోకి అడుగుపెట్టేస్తాం. అందులోనే ఏదో విధంగా దారి చేసుకుంటూ ముందుకు నడవగలిగితే ఎట్టకేలకు ఏదో ఒక అర్థవంతమైన గమ్యానికి చేరుకోవచ్చు, చేరుకోకనూ పోవచ్చు.

విషయమేమిటంటే, పైదంతా పౌరాణికకథనశైలి. మన దగ్గరే కాక, ఆ కథనశైలి ప్రతిచోటా అలాగే ఉంటుంది. కనుక ప్రత్యేకించి మన వాటినే వేలెత్తి చూపించనవసరం లేదు. నిశితంగా గమనిస్తే, ఆ శైలిలో అంతర్లీనంగా మన సాధారణబుద్ధితో అర్థం చేసుకోగలిగిన ఏదో ఒక వాస్తవం దాగి ఉంటుంది. ఆ పౌరాణికకథనాలకు మాత్రమే పరిమితమైతే ఆ వాస్తవాన్ని మనం గుర్తించలేం; వాటికి వెలుపల ఉన్న అధ్యయనాల సాయం తీసుకోవలసి ఉంటుంది.

పై కథనాల నిర్మాణం ఎక్కడ మొదలై, ఎలా సాగిందో ఒకసారి గమనించండి; ఒకానొక ప్రళయం తర్వాత తిరిగి మొదలైన సృష్ట్యాదితో అది ప్రారంభమైంది. ఆ దశలో బ్రహ్మ స్వయంభువుగా అవతరించాడు… నీటిని సృష్టించాడు... ఆ నీటిలో తన బీజాన్ని నిక్షిప్తం చేశాడు...దానినుంచి ఒక అండం పుట్టింది... దానినుంచి మళ్ళీ తనే పుట్టాడు...మళ్ళీ తనను తనే పురుషుడిగానూ, స్త్రీగానూ విభజించుకున్నాడు... వారిద్దరికీ ఒక విరాట్పురుషుడు పుట్టాడు... ఆ విరాట్పురుషుడికి స్వాయంభువమనువు జన్మించాడు... అతడు ప్రజాసృష్టిని ప్రారంభించాడు...

ఇందులో పైనుంచి కిందికి దిగే ఒక అంచెలంచెల క్రమం కనిపిస్తుంది; బోర్లించిన గోపురం ఆకారంలోని నిర్మాణం కనిపిస్తుంది. ఇందులో మళ్ళీ సాధారణ స్థలకాలాల గుర్తింపునుంచి, గణన నుంచి మన ఊహల్ని తప్పించి, మన ఊహకు అతీతమైన, దివ్యమైన స్థలకాలాలను ప్రతిష్ఠించడం ఉంది. ఆ స్థలం విశ్వవ్యాప్తం; ఆ కాలం లక్షలు, బహుశా కోట్ల సంవత్సరాల పరిమాణం కలిగిన మహాయుగం, లేదా మన్వంతరం.

ఇంతకీ ఆ కిందికి దిగిరావడం మరెక్కడికో కాదు; మనం నిలబడిన ఈ నేల మీదికీ, మనం గుర్తించగలిగే స్థలకాలాలలోకే! దానిని కూడా పై కథాక్రమం ఇలా చెబుతుంది:

ఒకానొక శుభదినాన స్వాయంభువమనువు నిశ్చలమనస్కుడై కూర్చుని ఉన్నాడు. మహర్షులు ఆయనను సమీపించి నమస్కరించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగువర్ణాలవారి గురించీ, వారు పాటించవలసిన వర్ణధర్మాల గురించీ తెలపవలసిందని వినమ్రంగా ప్రార్థించారు. మనువు ప్రసన్నుడై పరమాత్మ చేసిన ప్రళయానంతర సృష్టి గురించి, ప్రజాపతులను సృష్టించడం గురించి వారికి చెప్పాడు. ఆపైన, బ్రహ్మే ఈ మనుధర్మశాస్త్రాన్ని రచించి తనకు ఉపదేశించాడనీ, తను మరీచీ మొదలైన ప్రజాపతులకు ఉపదేశించాననీ, అలాగే భృగుమహర్షి కూడా తన దగ్గర నేర్చుకున్నాడనీ, ఆయన దగ్గర మీరు నేర్చుకోండనీ అన్నాడు.

స్వాయంభువమనువు ‘బ్రహ్మావర్త’ దేశానికి సమ్రాట్టు అయ్యాడని పైన చెప్పుకున్న సంగతిని ఒకసారి గుర్తుచేసుకుందాం; ఆ బ్రహ్మావర్తం మన సాధారణ లోకజ్ఞానంతో గుర్తించగలిగిన నిర్దిష్టప్రాంతమే, మన దేశంలో ఉన్నదే! అంటే, స్వాయంభువమనువు గురించి పైన చెప్పిన అంచెలంచెల కథనం చివరికి మన దేశంలోని బ్రహ్మావర్తం దగ్గరికి వచ్చి ఆగిందన్నమాట. ఈ బ్రహ్మావర్తం ఎక్కడుందో, ఎలాంటిదో మనుధర్మశాస్త్రం, రెండవ అధ్యాయంలోని 17, 18 శ్లోకాలు ఇలా చెబుతాయి:

సరస్వతీ దృషద్వత్యో దేవనద్యో ర్యదంతరం/తం దేవనిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే

తస్మిన్ దేశే య ఆచారాః పారంపర్యక్రమాగతాః/వర్ణానాం సాంతరాళానాం స సదాచార ఉచ్యతే

సరస్వతి, దృషద్వతి అనే దేవనదుల మధ్య దేవతలు నిర్మించిన దేశాన్ని బ్రహ్మావర్తమంటారనీ; ఆయా వర్ణాలవారు, అంతర్వర్ణాలవారు పరంపరగా అనుసరిస్తున్న ఆచారాన్నే సదాచారమంటారనీ ఈ శ్లోకాలకు అర్థం.

ఆ వెంటనే మనుధర్మశాస్త్రం ‘బ్రహ్మర్షి’ దేశం గురించి చెబుతుంది. కురుక్షేత్రం, మత్స్యదేశం, పాంచాలం, శూరసేనం దీనికిందికి వస్తాయి. బ్రహ్మావర్తం కన్నా దీనిది కొంచెం తక్కువ స్థాయి. ఇక్కడి మానవులే కాక, ఈ భూమి మీద ఉన్న ఎక్కడెక్కడి మానవులూ పై రెండు దేశాలలో జన్మించిన బ్రాహ్మణుల ద్వారా తాము నడచుకోవలసిన పద్ధతిని నేర్చుకోవాలని మనుధర్మశాస్త్రం చెబుతుంది.

ఆ తర్వాత మధ్యదేశాన్ని, ఆర్యావర్తాన్ని నిర్వచిస్తుంది. వింధ్య, హిమాలయపర్వతాలకు మధ్యలోనూ; సరస్వతీనదికి తూర్పునా, ప్రయాగకు పశ్చిమానా ఉన్న భూభాగం ‘మధ్యదేశం’. తూర్పు, పడమర సముద్రాలకు; వింధ్య, హిమాలయాలకు మధ్యలో ఉన్న ప్రాంతం ‘ఆర్యావర్తం’. ఆపైన, నల్లటి చారలు గల లేళ్ళు ప్రకృతిసిద్ధంగా ఎక్కడైతే జీవిస్తాయో అది మాత్రమే యజ్ఞాలకు అనుకూలమైన ప్రదేశమని మనుధర్మశాస్త్రం నిర్దేశిస్తోంది. అలాంటి లేళ్ళు లేని ప్రాంతాలు యజ్ఞాలకు పనికిరాని మ్లేచ్ఛదేశాల కిందికి వస్తాయంటుంది. కనుక, ద్విజన్ములైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎక్కడ పుట్టినా సరే, యజ్ఞానికి అనుకూలమైన భూమిలోనే నివసించడానికి ప్రయత్నించాలనీ, శూద్రులు తమ బతుకు తెరువు కోసం ఎక్కడైనా ఉండవచ్చనీ అంటుంది.

పైన చెప్పిన బ్రహ్మావర్తం, ఆర్యావర్తం, మధ్యదేశం అనే ప్రాదేశికనామాలు- ఆయా కాలాల వెంబడి దశల వారీగా జరిగిన వైదికజనాలూ, సంప్రదాయాల వ్యాప్తిని చెబుతాయనీ; మనుధర్మశాస్త్రంలో కూడా అలాగే దశలవారీగా ప్రవేశించాయనే అభిప్రాయం చరిత్రకారుల్లో ఉంది. టోనీ జోసెఫ్ తన ‘ఎర్లీ ఇండియన్స్(Early Indians)’ అనే రచనలో దీని గురించి కొంత చర్చ చేశారు. ఈ వ్యాసకర్త రచించిన ‘ఇవీ మన మూలాలు’ లో కూడా దానిని చూడవచ్చు.

*

మనుధర్మశాస్త్రం పుట్టుకకు సంబంధించి మన ఊహకు అతీతమైన స్థలపరిమాణం నుంచి, మనం ఉఃహించగలిగిన నిర్దిష్ట స్థలానికి దిగి వచ్చినట్టే, మానవాతీతమైన మహాయుగాల కాలగణనం నుంచి మామూలు కాలగణనంలోకి కూడా వద్దాం.

పైన పేర్కొన్న కొమరగిరి యోగానంద లక్ష్మీ నరసింహారావు గారు మనుధర్మశాస్త్ర కర్తృత్వాన్నీ, కాలాన్నీ అటు సాంప్రదాయిక దృక్కోణం నుంచీ, ఇటు ఆధునిక దృక్కోణం నుంచీ కూడా పరిశీలించి యథాశక్తి సమన్వయించడానికి ప్రయత్నించారు. కాకపోతే, సాంప్రదాయిక దృక్కోణంవైపు ఎక్కువ మొగ్గు చూపడం కనిపిస్తుంది, వేదాలు బ్రహ్మదేవుని నిశ్వాసాలు కనుకా, అవి శ్రుతులు, అనగా వినబడినవీ; అపౌరుషేయాలు, అనగా ఏ ఒకరో రాయనివీ కనుకా; మనుధర్మశాస్త్రాన్ని కూడా బ్రహ్మదేవుడే సృష్టించాడు కనుకా, స్వాయంభువుమనువు దానిని దర్శించి మరీచీ మొదలైన శిష్యులకు ఉపదేశించాడు కానుకా అది కూడా అపౌరుషేయమే అవుతుందని ఆయన అంటారు. అలాగే అది వేదాలలానే శ్రుతి కూడా అవుతుందన్నమాట.

మళ్ళీ స్వాయంభువుమనువే భృగుమహర్షికి కూడా ఆ శాస్త్రాన్ని బోధించాడు; కాకపోతే ఇద్దరి మధ్యా ఒక తేడా ఉంది; స్వాయంభువమనువు పురాణపురుషుడు, అయోనిజుడైతే, భృగుమహర్షి చారిత్రకవ్యక్తి అని నరసింహారావు గారు అంటారు. సరే, మనువు పురాణపురుషుడు, అయోనిజుడు అనడానికి విశ్వాసమే ప్రమాణమనుకున్నా భృగుమహర్షి చారిత్రకవ్యక్తి అనడానికి ప్రమాణమేమిటో ఆయన చెప్పలేదు. నిజానికి బ్రహ్మే వేదాలను, మనుధర్మశాస్త్రాన్ని సృష్టించాడనడానికి కూడా విశ్వాసమే ప్రమాణం. మొదటే చెప్పినట్టు విశ్వాసం దగ్గర ఎలాంటి తర్కమూ, హేతుబద్ధతా పనిచేయవు.

అయితే, భృగుమహర్షి కూడా మనుధర్మశాస్త్రాన్ని రాయలేదనీ, ఆయన కుమారుడు సుమతి కానీ, ఆయన పరంపరలోని మరెవరో కానీ రాసి ఉంటారనీ ఆయనే అంటారు. భృగుమహర్షినుంచి మౌఖికపరంపరగా అందుతూవచ్చిన ఈ శాస్త్రాన్ని ఆయన సంతతిలోని వారో, శిష్యపరంపరలోని వారో, లేక అందరూ కలిసో కొన్ని తరాలుగా దానిని పెంచుతూ రాసి మహాభారతకాలంనాటికి దానికి తుదిరూపం ఇచ్చి ఉంటారనీ; ఇది ప్రాచీనగ్రంథరచనావిధానంలో ఒక మహత్తర సంప్రదాయమనీ ఆయన వివరిస్తారు. లిఖితసంప్రదాయం స్థిరపడని దశలో శాస్త్రమైనా, సాహిత్యమైనా వాఙ్మయం పేరిట మౌఖికంగానే వ్యాప్తి చెందడం తప్పనిసరి కనుక దానిని ‘మహత్తర సంప్రదాయ’మని అనలేము కానీ; తార్కికంగానూ, హేతుబద్ధంగానూ, చారిత్రకంగానూ చూసినా ఈ వివరణ అర్థవంతంగానే ఉంది. మొదట్లో సూత్రరూపంలో ఉన్న మనుస్మృతి తర్వాత శ్లోకరూపం ధరించిందనీ, అది ఎప్పుడు జరిగి ఉండచ్చో తెలుసుకోవాలనీ ఆయన అనడం కూడా హేతుబద్ధంగానే ఉంది.

మనుధర్మశాస్త్రానికి 1792లో విలియం జోన్స్ వెలువరించిన ఆంగ్లానువాదంతో ప్రారంభించి, 1825లో సర్ జి.సి. హాటన్, 1886లో జార్జి బూలర్, 1891లో ఆర్థర్ కోక్ బర్నెల్, హాప్కిన్స్, 1991లో వెండి డానిగర్, బ్రియాన్ కె. స్మిత్ లు చేసిన ఆంగ్లానువాదాలవరకూ ప్రస్తావించిన నరసింహారావు గారు; పాశ్చాత్యులూ, మనవారూ కూడా ఈ ధర్మశాస్త్రరచనాకాలం గురించి ఏం చెప్పారో కూడా క్లుప్తంగా పొందుపరిచారు. విలియం జోన్స్ క్రీ.పూ. 1250లోనూ, మాక్స్ ముల్లర్ క్రీ.పూ.600-200 మధ్యలోనూ, కీత్ క్రీ.పూ.600-250మధ్యలోనూ, భారతీయ చరిత్రకారుడు ఎస్.బి.రాయ్ క్రీ.పూ. 1400-1200 మధ్యలోనూ ఈ ధర్మశాస్త్రాన్ని రచించి ఉండవచ్చని భావిస్తే; ఎల్ఫిన్ స్టన్ క్రీ.పూ.900గా, బర్నెల్ క్రీ.శ.100-500 మధ్యకాలంగా, బూలర్ క్రీ.పూ.200-క్రీ.శ.200 మధ్యకాలంగా అంచనావేశారు. భారతీయచరిత్రకారులు పి. వి. కాణే, కురేండ్కర్ లు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు.

అయినా ఇప్పటికీ మనుస్మృతిని ఎవరు, ఎప్పుడు, ఏ యుగంలో రాశారో సాధికారంగా చెప్పలేమంటూ నరసింహారావు గారు ఈ చర్చను ముగించారు.

సరే, ఇవి మనుధర్మశాస్త్రం లిఖితరూపం ధరించిన కాలానికి సంబంధించిన అంచనాలు అనుకుందాం. ఇక ఇప్పుడు వేసుకోవలసిన ప్రశ్న, మనుధర్మశాస్త్రం మౌఖికంగా వ్యాప్తి చెందడం ఎప్పటినుంచీ మొదలైంది? అది, హమ్మురాబి(క్రీ.పూ.1800వ శతాబ్ది), హిట్టైట్(క్రీ.పూ.15వ శతాబ్ది) ధర్మశాస్త్రాల కాలంవరకూ వెడుతుందా, లేక అంతకన్నా ముందుకు వెడుతుందా; లేక ఆ తర్వాతి కాలానికి వస్తుందా!? ఇంతకుముందు చెప్పుకున్నట్టు, ప్రత్యేకించి హిట్టైట్లతో మనుధర్మశాస్త్రకారులకు భాషపరంగా, ఇతరత్రా సుదూర ఇండో-యూరోపియన్ బంధుత్వమూ; ఉభయుల ధర్మశాస్త్రాల రూపకల్పన వెనుక ఇండో-యూరోపియన్ జనాల వలసతో ముడిపడిన ఒకే విధమైన నేపథ్యం ఉన్నాయనుకుంటే, అవే ఉభయుల ధర్మశాస్త్రాల మధ్య ఏ మాత్రమైనా పోలికలకు కారణమై ఉండాలి.

అదలా ఉంచితే, నరసింహారావు గారు మనువుపై అమితమైన ఆరాధనను, సంప్రదాయవాఙ్మయంపై అపారమైన భక్తిప్రపత్తులను చాటుకుంటూనే పాశ్చాత్యపండితులను ప్రశంసించడం నేటి మన దేశీయవాతావరణంలో విశేషంగానే అనిపిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలతోసహా మన వాఙ్మయాన్ని చదివి, పరిశోధించి అమూల్యమైన గ్రంథాలను వారు వెలువరించారని అనడమే కాదు; మన సంస్కృతి గురించి ఎన్నో అద్భుత విషయాలు వారు చెప్పేదాకా మనకు తెలియదంటారు. ‘మన ప్రాచీన సంస్కృతసాహిత్యచరిత్రను ఆంగ్లవిద్వాంసులు ఎప్పుడో వ్రాసారు; మన పండితులెన్ని చరిత్రలు వ్రాశారు?’ అని ప్రశ్నిస్తారు.

2003లో ఆయన ఈ మాటలు రాసే నాటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది?!

Tags:    

Similar News