నువ్వు ఇట్లా నవ్వుతూ ఉంటే...
రాజ్యమెంత కసాయిదో శాశ్వతంగా చాటి చెప్పి కనుమూసిన నీ చావు ఒక చారిత్రక చాటింపే...
By : Admin
Update: 2024-10-15 13:07 GMT
నువ్వు ఇట్లా నవ్వుతూ ఉంటే రాజ్యానికి ఎంత కష్టమయ్యిందో! ఈ దేశ చరిత్రలోనే అత్యంత ముదునష్టపు కుట్ర పూరిత కుట్ర కేసు 10 ఏళ్లు... 3650 రోజులు.... ఎముకలను కూడా ఆసిడ్ లో కరగబెట్టే క్రిమినల్ తీరు...
వంగిపోయిన ఎముకలను అండా సెల్ జైల్లోఆసిడ్ అండలో మరగబెట్టి మరగబెట్టి, పీల్చి పిప్పి చేసి... ఒక్క మెదడు తప్ప అన్నింటినీ అన్ని అవయవాలను నిర్వీర్యం చేసి విడుదల చేసిన తీరు స్వాతంత్య్రాంతర భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక దుష్ట అధ్యాయం.
జీవితమంతా సమాజాన్ని చదువుతూనే ఉద్యమాల ఉపాధ్యాయుడిగా నువ్వు నడిచిన దారి... అందరికీ దీపస్తంభం అని నేను అనను కానీ... ఎప్పటికీ పరిమార్చలేని దీపశిఖ అని మాత్రం నీకు నువ్వే రుజువు చేసుకున్నావు.
ఈ ప్రపంచంలో చక్రాల బండిలో చక్ర భ్రమణం పొందే జ్ఞాపకాలలో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తీరు నీ పేరు చిరస్థాయి కామ్రేడ్.
నేను అందరిలా నీ గురించి దుఃఖపడడం లేదు. దుఃఖం అంతర్ముఖం మాత్రమే దుఃఖం లేని సమాజం కోసం సముద్రుడై నడిచే వాళ్లకు... నివాళి కూడా దుఃఖ అంతర్ముఖంలో ముగియాలి కదా!
ఏకకాలంలో మీ ఎడల, స్టాన్లీ స్వామి ఎడల జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అనుసరించిన కఠిన పాషాణ వైఖరి... వాళ్ల కిరాతకాన్ని శిలాఅక్షరం చేసింది. మిమ్మల్ని సిలువ వేసిన క్రీస్తు కంటే ఆధునిక కాల చరితార్ధుల్ని చేసింది.
కంప్యూటర్లలోకి ఒక మాల్వేర్ ఎక్కించి... రాజ్యం అనుకుంటే.. పాతకాలపు ఎన్కౌంటర్లు జరిగిన కాలంలో పక్కనే ఒక ఆలివ్ గ్రీన్ యూనిఫారం ఒక తుపాకీ, సాయుధ పోరాట సాహిత్యం తీరు.... ఆధునికత చాటుకోగలదని మీ కేసుల్లోనే కదా! అన్ని దేశాలకు తెలిసేలా జరిగింది.
యూనివర్సిటీలను ప్రభావితం చేసిన మేధావి, అడవులను, జన పదాలను.. సమస్త కళా రంగాలను,.. అన్నిటికంటే ముఖ్యంగా అనేక మానవ విలువలను ప్రభావితం చేయగలరని చెప్పడానికి మీరు ఈ కాలంలో ఒక లివింగ్ లెజెండ్.
ఇంకా చరిత్ర సృష్టించే సమయం చాలా మిగిలి ఉండగానే... పక్కకెముకలే సరిగా లేని ... కండరాలే సరిగా లేని.. అరివీర భయంకర టెర్రరిస్టు శరీరాన్ని అనకొండలా పరపరా విరిచేసిన మానని గాయాలు ఇప్పుడు మృత్యువై కబళించినాయి.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర... రాసుకున్నన్ని రోజులు,.. తొలి అడుగుల వరంగల్ డిక్లరేషన్ కు మీ కంట్రిబ్యూషన్ చెప్పకుండా దాటి వేయడం సాధ్యం కాదు.
దేశ రాజధానిలో మీరు విద్యార్థులు ప్రభావితం చేసిన తీరు... శాశ్వతంగా ఈ దేశంలో చాలామంది మేధావులని బుద్ధి జీవులని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసింది. అయితే కానీయ్.... ఇప్పుడు నీ మరణం తర్వాత... నీ చరిత్రను వైప్ అవుట్ చేయడానికి వాళ్ల దగ్గర నీ మీద కుట్రకు పనికి వచ్చిన మాల్వేర్ పనిచేయదు కదా!
అవును నువ్వు ఎప్పటికీ వెంటాడుతున్న జ్ఞాపకమే.
నీ అంతిమయాత్రను కూడా వేళ నిఘా నేత్రాలతో రికార్డు చేసే వాళ్లకు తెలియదు... ఒత్తుకున్న కంటిలో తడి తరువాత కూడా మోసులెత్తే మొలకలలాంటి మరణాంతర పురస్కారాలు ఉంటాయని.
నీ జ్ఞాపకాలతో ఎవ్వరిని భయపెడతావో నాకు తెలియదు గానీ.. నాలాంటి వాళ్లను పిరికివాళ్లుగా దిగజారకుండా ధైర్యం మందు నూరిపోస్తావని నమ్మకం ఉన్నది.
సాయిబాబా! రాజ్యమెంత కసాయిదో శాశ్వతంగా
చాటి చెప్పి కనుమూసిన నీ చావు ఒక చారిత్రక చాటింపే
(డాక్టర్ చెరుకు సుధాకర్ గారి ఫేస్బుక్ వాల్ నుండి)