జగన్ వేయబోయే కొత్త అడుగు ఎటు?

ఢిల్లీ - తాడేపల్లి మధ్య బంధం రంగు ఏమిటి?;

Update: 2025-08-06 05:18 GMT


గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాక, ఊహించని ఫలితాలు ఎదుర్కొన్న వైఎస్ ఆర్  కాంగ్రెస్  పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి బంగ్లా ప్రెస్ మీట్ లో వ్యక్తంచేసిన అనుమానం, ఢిల్లీ విజ్ఞానభవన్ లో గతవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ న్యాయ సదస్సులో అది ఇక ఏమాత్రం అనుమానం కాదని, పైగా ఆ విషయం ఆ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించడం చూశాక, వైసీపీని ఆ పార్టీ నాయకత్వాన్ని కూడా ఇకముందు జాతీయ వార్తల్లో కొత్త ‘సిండికేట్’లో ఉంచబోతున్న పరిణామం అయితే కావొచ్చు కూడా.

అయితే ఈ విషయం ఇక్కడితో ముగియలేదు. తాడేపల్లిలో మొదలైన ఈ అనుమానం... ఈ ఏడాది కాలంలో మరి కొన్ని రాష్ట్రాలను కూడా తనతో కలుపుకుని, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ నాయకత్వంలో నేరుగా అది భారత ఎన్నికల కమీషన్ ను శీలపరీక్షకు నిలబెట్ట బోతున్నది.

ఈ ఆరోపణ చేస్తున్న ఇద్దరు కూడా యువతరం నాయకులు కావడం, వారు తమ తమ పార్టీల్లోని సీనియర్ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసే హోదాలో ఉండడంతో, వీరు మొదటిసారి ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉనికిని సవాలు చేయడాన్ని నూరేళ్లకు చేరువ కాబోతున్న- ‘ఇండిపెండెంట్ ఇండియా’ ఇక ముందు చూడబోతున్నది.

దీనికి పూర్వరంగాన్ని కూడా గుర్తు చేసుకుంటే, మరింత స్పష్టంగా మనకు ఇది అర్ధం కావొచ్చు. ఇదే తాడేపల్లి నుంచి నాలుగేళ్ల క్రితం రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ జడ్జిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు లేఖ రాయడం, దాన్ని ఇదే బంగళా నుంచే సిఎం ప్రధాన సలహాదారు మీడియా ముందు వెల్లడించడాన్ని; గత వారం రాహుల్ గాంధీ మాటల్లో వినిపించిన పదునుతో కలిపి చూసినప్పుడు, నవతరం నాయకత్వ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉండడం మనకు కనిపిస్తుంది.

‘రాజ్యం’ నాలుగు ఉపాంగాలలో ఒకటైన ‘బ్యూరోక్రసీ’ పనితీరులో సంస్కరణలు అవసరమైన తరుణం అసన్నమైనప్పుడు, గతంలో ఆ పని చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. అందుకోసం 1966లో మొదటిది 2005లో రెండవది- ‘అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ కమీషన్’ నియామకం జరిగింది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ముప్పై ఏళ్ల ఆర్ధిక సంస్కరణల కాలంలో ‘ప్రైవేటీకరణ’ పేరుతో మనం తెరిచిన తలుపులు ఏ రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని పలచన చేసాయో లేదా తగ్గించాయో మదింపు చేసుకోవడానికి ఇరవై ఏళ్లు అంటే, అది తగిన విరామమే అవుతుంది.

కనుక 2024 ఎన్నికల ఫలితాలు చూశాక, కలిగిన అనుభవంతో రాహుల్ గాంధీ ఏకంగా ఎలక్షన్ కమీషన్ ఉనికిని ప్రశ్నించడం అయినా, ఆంధ్రప్రదేశ్ లో దాని దానివేటుకు గాయపడ్డ క్షతగాత్రుడుగా తనకున్న పరిమితులలో నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి- “ఏదో జరిగింది.. కానీ ఆధారాలు లేవు...” అనడం అయినా, రేపు అది రాజ్యాంగ పరిధిలో వాటికి పరిష్కారాలు వెదకడమే అవుతుంది కాని, అది ఏ వ్యవస్థ ఉనికిని సవాలు చేయడం కాదు. ఏడాది గడిచాక, రాహుల్ గాంధీ ఆరు నెలలుగా ‘ఆధారాలు’ వెతికే పనిలో ఉంటూ, ఇప్పుడు దాన్ని మేము ‘కనుగొన్నాము’ అనడం చూస్తే, తాడేపల్లి-డిల్లీ మధ్య ఒకే తీరుగా ‘వైబ్రేషన్స్’ ఉన్నట్టు కనిపిస్తున్నది.

అందుకే ‘ఇండియా’ కూటమితో ఆగస్టు మూడున రాహుల్ గాంధీ బంగాళాలో జరిగిన ‘డిన్నర్’ మీటింగ్ ప్రాధాన్యత గురించి రాజకీయ సమీక్షకులు చాలా చెబుతున్నారు. అందుకు కనిపిస్తున్న ప్రధాన కారణం బిజెపి గత పదేళ్లకు భిన్నంగా తగినన్ని స్వంత పార్టీ లోకసభ సీట్లు గెలవలేక జెడియు, టిడిపి వంటి రెండు ప్రాంతీయ పార్టీల మద్దత్తుతో కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం ఒకటైతే; ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయాలు కారణంగా ఏదో ఒక స్థాయిలో నష్టపోయిన పార్టీలు వీటిలో ఎక్కువ ఉండడం మరొక కారణం. మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల జాబితాలో- బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. అంతకు మించి 2027 లో జరిగే జనగణన మరింత కీలకం.

గత ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి మూడు రోజులు ముందు కలిసిన ‘ఇండియా’ కూటమి పార్టీలు ఈ మధ్యలో ఒక ‘వర్చువల్ మీటింగ్’ తప్ప మళ్ళీ  కలిసింది లేదు. అయితే, బీహార్ ఎన్నికల సందర్భంలో ‘ఎలక్షన్ కమీషన్’ ఓటర్ల జాబితా ప్రత్యేక వడపోత (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘సర్’) అంటుంటే, వారంతా దాని తీరుతో ఏడాది పాటుగా దిగమింగుకున్న ఆక్రోశం వెళ్లగక్కడానికి ఇది తగిన సమయం అని బలంగా నమ్ముతున్నారు. నిజానికి ‘సర్’ మళ్ళీ వీళ్ళను ఒక్కటిగా చేసింది.

ఈ సందర్భంగా దీనిపై “మళ్ళీ ‘రివిజన్’ అంటూ ఈ ‘కవరింగ్’ ఎందుకు, అదేదో ‘స్పెషల్ ఇంటెన్సివ్ డిలీషన్’ అనొచ్చుగా అంటూ, దేశంలో ప్రతి పౌరుని హక్కును కాపాడడానికి ‘ఇండియా’ బ్లాక్ పార్టీలు ఒక్కటి కావలిసిన సమయమిది” అని ఆర్జేడి రాజ్యసభ సభ్యుడు మనోజ్ కే. ఝా అన్నారు. పైన చెప్పుకున్న మూడు రాష్ట్రాలలో క్రియాశీలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ‘మండల్ కమీషన్’ తర్వాత క్రియాశీలం కావడం, ఈ రాష్ట్రాలు 2000 తర్వాత చిన్న రాష్ట్రాలుగా విభజనకు గురికావడం ఇక్కడ గుర్తించాల్సిన అంశాలు.

అదే ఆంధ్రప్రదేశ్ విషయం చూసినప్పుడు, 2014లో జరిగిన తాజా రాష్ట్ర విభజన ఇది. ఆ తర్వాత మొదటిసారి అధికారంలోకి వైఎస్ఆర్ సీపీ వచ్చింది. కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ మొదటి సారి రికార్డు గెలుపుతో ప్రభుత్వంలోకి రావడం, ‘సంక్షేమం’ మా ఎజెండా అనడం వరకూ బాగున్నప్పటికీ, స్వంత పార్టీ నాయకులు లోనే కొందరికి తమ పార్టీ ‘రాజకీయం’ ఏమిటో వారికే అర్ధం కాలేదు. పైగా ఒక ఏడాది ఆగస్టు 15 జెండా వందనం సందేశంలో- “పేదలకు పెత్తందార్లకు జరుగుతున్న యుద్దం ఇది..” అని కూడా జగన్మోహన్ రెడ్డి పైకే అనేశారు.

అయినా ఐదేళ్ల కాలంలో ఏ కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రభుత్వం గురించి ఒక మంచి మాట మాట్లాడింది లేదు. అలాగని జగన్ వాళ్ళను పిలిచి సలహాలు అడిగింది లేదు, వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని కలవడానికి చేసిన ప్రయత్నమూ లేదు. ఈ పదేళ్ళలో ప్రభుత్వాన్ని కలిసిన ‘అఖిల పక్షం’ అనే వార్త లేదు! ఇప్పుడు ‘ఎన్డీఏ’ రాజనీతి బాధితులం అని అనుభవం అయ్యాక, అందరూ ఒక్కటి అవుతున్న తరుణంలో, జగన్ వేయబోయే కొత్త అడుగు ఎటు అని దక్షణాది ఎదురు చూస్తుంటే, మరో పది రోజుల్లో జెండా పండగ ఉండగా, రాహుల్ బాటలోనే మంగళవారం తాడేపల్లిలో జగన్ కృష్ణా-గుంటూరు పార్టీ లీగల్ సెల్ లాయర్లను కలిశారు.

Tags:    

Similar News