'శ్రీబాగ్'తోనే రాయలసీమ అభివృద్ధి!
శ్రీబాగ్ ఒప్పందంలోని కృష్ణా, తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రాంతానికి అందించాలంటున్న రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
By : The Federal
Update: 2025-11-16 03:34 GMT
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
నేటితో (నవంబర్ 11) శ్రీబాగ్ అవగాహనకు 88 ఏళ్లు. శ్రీబాగ్ రాయలసీమ ప్రజల భావోద్వేగ అనుబంధం మాత్రమే కాదు, అది రాయలసీమ కన్నీటి చరిత్రకు ముగింపు పలికే ఒప్పందం. శ్రీబాగ్ రాయలసీమ అభివృద్ధికి విడదీయరాని అనుబంధం. అంతేకాదు తొలి భాష ప్రయుక్త రాష్ట అవతరణ శ్రీబాగ్ తోనే సాధ్యం అయింది.
పాలకుల నిరాదరణకు గురైన రాయలసీమ 88 సంవత్సరాల తర్వాత కూడా శ్రీబాగ్ ఒడంబడికలోని అంశాల అమలు కోసం సీమ సమాజం ఎదురుచూస్తుండటం ఒక విషాదం.
చరిత్రలోకి వెళితే...
88 సంవత్సరాల క్రితం స్టులంగా ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రెసిడెన్సీ ఏలుబడిలో ఉండేది. భాషాబిమానం , రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలని మధ్యకోస్తాఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలోనే 1913 న బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ జరిగింది. భాష, సాంసృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయిన అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతంగా విడిపోవాలని కోరిక బలంగా ఉంది. రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు.
రాయలసీమ ప్రాంతం భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్రమహాసభ పెద్దలు సిమ ప్రాంత ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917 లో ఒక కమిటి ఏర్పాటు చేసి సీమలో పర్యటించింది. తదనంతర సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.
మద్రాసుతో సీమ అనుబంధం.
రాయలసీమకు అత్యంత సమీపంలో మద్రాసు మహానగరం ఉన్నది. నేటికి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లా ప్రజలు తమ ఉపాధి, వ్యాపార సంబంధాలు మద్రాసుతోనే కలిగి ఉన్నారు. చరిత్రలో శ్రీకాళహస్తి పానగల్లు నుంచి నాటి రాజులు మద్రాసు ప్రాంతాన్ని పరిపాలించినట్లు చరిత్ర చెపుతుంది. పానగల్లు పేరుతో నేటి చెన్నై నగరంలో ఒక పార్క్ కూడా ఉన్నది. మరో కీలక విషయం ఏమిటంటే తెలుగు ప్రాంతం కావాలని డిమాండు వస్తున్న నేపద్యంలో తమిళ సంఘాలు మదురై కేంద్రంగా ఒక సమావేశం నిర్వహించి ఎప్పటికైనా మద్రాసు నగరం తెలుగువారి స్వంతం అయ్యే అవకాశం ఉందని తమిళ రాష్టం మదురై కేంద్రంగా ఉంటే బాగుంటుందని ఒక తీర్మానం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలా మద్రాసు మహానగరంతో సీమ నెల్లూరు ప్రజలు విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నారు.
శ్రీబాగ్ ఒడంబడికకు దారితీసిన పరిస్థితులు
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మద్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలన వలన విద్య, కాటన్ బ్యారేజి, ప్రస్తుత ప్రకాశం బ్యారేజితో వ్యవసాయం వల్ల ఆ ప్రాంతం సీమతో పోల్చుకుంటే అభివృధ్ధిలో ముందు ఉన్నది. పెద్ద ప్రాంతం కూడాను.. మరో వైపు రాయలసీమకు అత్యంత సమీపంలో మద్రాసు నగరం ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృధ్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రాయూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవాలతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రాయూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. ఆంధ్రమహాసభ తీర్మానానికి భిన్నంగా నాటి ప్రజాప్రతినిధులు నాటి మద్రాసు అసెంబ్లీలో వ్యవహరించారు. ఈ పరిణామంతో పప్పూరి రామచర్యులు , టి యన్ రామకృష్ణా రెడ్డి లాంటి వారు ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా ( ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోవాలని ప్రతిపాదన చేశారు.
సీమ ప్రజల అంగీకారం లేకుండా రాష్టసాధన సాధ్యం కాదని భావించి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోతే నూతన రాష్ట్రంలో పాలనా ప్రాధాన్యతలు ఎలా ఉండాలనే అంశాలపై అవగాహన కోసం శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది.
శ్రీబాగ్ తోనే భాషాప్రయుక్త రాష్ట్ర అవతరణకు మార్గం సుగమం.
అలా సీమ, కోస్తా ఆంధ్ర పెద్దలు 1937 నవంబర్ 16 మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి స్వగృహం (శ్రీబాగ్) నందు జరిగిన సమావేశంలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలను నిర్ణయం తీసుకున్నారు. అదే శ్రీబాగ్ ఒడంబడిక. కోస్తా, సీమ ప్రజల పోరాటం మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష ఆత్మార్పణ ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా అవతరించింది.
శ్రీబాగ్ ఒడంబడికపై అసత్య ప్రచారం
శ్రీబాగ్ ఒప్పందంకు చట్టబద్ధత లేదని, కాంగ్రస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అని నేటికీ తప్పుడు ప్రచారం జరుగుతోంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని , హైకోర్టు రెండు ప్రాంతాల్లో ఉండాలి. రాజధాని , హైకోర్టు లో తమకు ఏమి కావాలో ఎంపిక చేసుకునే అవకాశం సీమకు ఇచ్చారు. 1953 రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజదాని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు అంటే అది శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కథ. కడప కోటిరెడ్డి కమిటి 1920 ప్రాంతంలో ఏర్పాటు చేశారు.( శ్రీబాగ్ గృహంలో కూర్చుని ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి కడప కోటిరెడ్డి కమిటి ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక) 1920 నాటికి స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంద. విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్న వారు నాడు కాంగ్రస్ లోనే ఉన్నారన్నది వాస్తవం కాదా.. మరి నాటి స్వాతంత్ర్య పోరాట యోధులకు ఒక పార్టీ ముద్ర వేయడం ఎంత వరకు సమంజసం.
శ్రీబాగ్ తో రాయలసీమ సమగ్రాభివృద్ధి
రాష్ట్రంలోని రాజకీయ వాతవరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమ కు రాజదాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. శ్రీబాగ్ ఒప్పందంలో రాజదాని అంశం ఉన్నా, అత్యంత కీలకైన అంశం కృష్ణా, తుంగభద్రలో లభించే రాష్ట వాటాలో ప్రథమ ప్రాదాన్యత సీమకు అందించాలని అందుకనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. నిజానికి రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కోటి ఎకరాల వ్యవసాయ యోగ్య భూమికి నీటి సౌకర్యం కల్పించాలి. కృష్ణా తుంగభద్ర లకు ముఖద్వారం రాయలసీమ అయినప్పటికీ సీమకు నీరు అందించడానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మాణం జరగలేదు పలితం సీమ వెనుకబడిన ప్రాంతంగా మిగిలింది. శ్రీశైలం నీటిని సత్వరం అందిపుచ్చుకునే విదంగా సిద్దేశ్వరం ఆలుగు, పోతిరెడ్డి పాడు వెడల్పు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విదంగా గుండ్రెవుల, కుందూ పై రిజర్వాయర్లు, గాలేరు నగరి, హాంద్రినివా, చెరువుల పునరుద్ధరణ జరిగితేనే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. 88 ఏళ్ల కిందటే శ్రీబాగ్ ఒడంబడికలో నాటి పెద్దలు పొందుపరిచారు. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందం లో పేర్కొన్న విధంగా కృష్ణా తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, త్రాగు నీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
మారిన పరిస్తితులలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా , తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. కృష్ణా పెన్నారు ప్రాజెక్టు సాకారం కాకపోవడం సీమకు చరిత్రలో కోలుకోలేని నష్టం జరిగింది. మారిన పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి నిర్మాణంలో బాగంగా కృష్ణ పై తీగల వంతన స్తానంలో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం జరగాలి. వరదల సమయంలో నీటిని తీసుకునే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడానికి అనుగుణంగా నిధుల కేటాయింపు జరగాలి. ముఖ్యంగా పుష్కలంగా నీటి లభ్యత ఉండి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేని తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో రాయలసీమకు వినియోగించుకునేలా గుండ్రేవుల, సమాంతర కాల్వ నిర్మాణం పై శ్రద్ధ పెట్టాలి. విసృతంగా వర్షపాతం కలిగి ఉన్న రాయలసీమలో రాజుల కాలంలో నిర్మాణం జరిగిన చెరువుల ద్వారానే నేటికి సీమకు నీరు అందుకుంది. సీమలో విసృతంగా ఉన్న చెరువుల మరమత్తులు చేయడం, ఆక్రమణలు తొలగించి చెరువుల అనుసంధానం చేయగలిగితే రాయలసీమకు పెద్ద ప్రయోజనం కలుగుతుంది.
ఏది ఏమైనా 88 సంవత్సరాల క్రితం కుదిరిన శ్రీబాగ్ ఒప్పందంలోని కృష్ణా, తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రాంతానికి అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయడం ద్వారా మాత్రమే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. ఆ వైపుగా పాలకులు ఆలోచించాలి.
(రచయిత- రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త)