ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా, 6 నెలలే పదవీ కాలమేంటీ?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఖరారయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు.
By : The Federal
Update: 2024-10-25 01:00 GMT
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఖరారయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. నవంబర్ 11న ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొదటి సాధారణ జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ చంద్రచూడ్ తన వారసుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించాలని సిఫార్సు చేస్తూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుత న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన మరుసటి రోజు నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జస్టిస్ చంద్రచూడ్ 2022 నవంబర్ 8న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఎన్వీరమణ స్థానాన్ని జస్టిస్ చంద్రచూడ్ భర్తీ చేశారు. జస్టిస్ ఖన్నా నియామకానికి ప్రభుత్వ ఆమోదాన్ని ధృవీకరిస్తూ కేంద్ర న్యాయ, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
“భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది. 2024 నవంబర్ 11 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది” అని మేఘవాల్ పోస్ట్ చేశారు.
జస్టిస్ ఖన్నా 183 రోజుల పాటు అంటే కేవలం ఆరు నెలలు మాత్రమే ఈ పదవిలో ఉంటూ 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్ రాజ్ మేనల్లుడు. అత్యవసరపరిస్థితి సమయంలో ఆర్టికల్ 21, ఆర్టికల్ 226 సస్పెన్షన్ కు సంబంధించిన ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో హన్స్ రాజ్ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. సంజీవ్ ఖన్నా తండ్రి దేవ్ రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి. చాలా కాలం హైకోర్టు జడ్జిగా పని చేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరు?
జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. 1977లో మోడరన్ స్కూల్ (న్యూఢిల్లీ) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1980లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లా ఫ్యాకల్టీ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించాడు.
తండ్రి కూడా న్యాయమూర్తి కావడంతో ఆయన కూడా న్యాయశాస్త్రం వైపే మొగ్గుచూపారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా తండ్రి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా 1985లో ఢిల్లీ హైకోర్టు నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆయన తల్లి సరోజ్ ఖన్నా ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో హిందీ లెక్చరర్‌గా పనిచేశారు. మొదట్లో ఢిల్లీలోని తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఢిల్లీలోని హైకోర్టు, ట్రిబ్యునళ్లలో రాజ్యాంగ చట్టం, ప్రత్యక్ష పన్నులు, మధ్యవర్తిత్వం వంటి విభిన్న రంగాలలో ప్రాక్టీస్ చేశారు. వాణిజ్య చట్టం, కంపెనీ చట్టం, భూమి చట్టం, పర్యావరణ చట్టం, వైద్యం వంటి రంగాలలో ఆయనకు ప్రావీణ్యత ఉంది. జస్టిస్ ఖన్నా వాద్ జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా పలు కీలక తీర్పులు ఇచ్చారు. 2024లో డివిజన్ బెంచ్‌కి నాయకత్వం వహించారు. ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ మెషిన్లలో ఓట్ల ధృవీకరణ కోసం వంద శాతం వీవీపాట్లను ఇవ్వాలన్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా ఒకరు. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు సక్రమమేనని తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ జస్టిస్ ఖన్నా ఉన్నారు. వివాహబంధం తిరిగి పునరుద్ధరించలేనంతగా విచ్ఛినమై పోయిన సందర్భంలో ఆర్టికల్ 142 కింద నేరుగా విడాకులు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్న తీర్పును పునరుద్ఘాటించిన ధర్మాసనంలో కూడా జస్టిస్ ఖన్నా ముఖ్యులు. జస్టిస్ ఖన్నా పారదర్శకత, జవాబుదారితనంలో తీర్పు ఇస్తారనే పేరుంది.