బెంగళూరు సౌత్ లో బిజెపిని ఇరుకున పెడుతున్న సౌమ్యారెడ్డి

ఎక్కడచూసినా బెంగళూరు సౌత్ నియోజకవర్గం టాకే. కాంగ్రెస్ అభ్యర్థిగా సౌమ్యారెడ్డి నిలబడటం బిజెపికిని ఇబ్బంది పెడుతూ ఉంది.

Update: 2024-04-22 13:32 GMT

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా ఉండబోతోంది. కమలం పార్టీ అభ్యర్థి ప్రధాని మోదీ వేవ్ ను నమ్ముకున్నారు. ఇక హస్తం పార్టీ అభ్యర్థి ..కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నమ్ముకుని ప్రచారంలో బిజీ అయ్యారు.

బెంగళూరు సౌత్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య వృత్తిరీత్యా న్యాయవాది.28 ఏళ్ల వయసులో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో 2019లోరాజకీయాల్లోకి వచ్చారు. బెంగళూరు సౌత్ జోన్ 1977లో ఉనికిలోకి వచ్చింది. గతంలో లోక్‌సభ స్పీకర్ జస్టిస్ కె. ఎస్. హెగ్డే, టీఆర్‌ శామన్న, వీఎస్‌ కృష్ణయ్య, ఆర్‌ గుండూరావు, ప్రముఖ ఆర్థికవేత్త వెంటకగిరిగౌడ్‌, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనంత్‌కుమార్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంత్ కుమార్ వరుసగా ఆరుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున సౌమ్యారెడ్డి పోటీచేస్తున్నారు. ఈమె సీనియర్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె. ప్రస్తుతం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సౌమ్యారెడ్డి న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు.

2018 నుండి 2023 వరకు జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై పోటీ చేస్తున్నారు.

సౌమ్యారెడ్డి రాజకీయాలకు కొత్త కాదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఆయన తండ్రి రామలింగారెడ్డికి మంచిపేరుంది. ఆయనను ఎదిరించే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కుమార్తె సౌమ్యారెడ్డి సాంకేతిక కారణాల వల్ల కేవలం 19 ఓట్ల తేడాతో ఓడిపోయారని ప్రజలు భావిస్తున్నారు. ‘‘గత ఎన్నికల్లో నా కూతురు దాదాపు విజయం సాధించింది. కానీ తిరస్కరణకు గురైన ఓట్ల లెక్కింపు చాలా తక్కువ. ఆ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. ఇంతకుమించి నేను ఎక్కువగా మాట్లాడలేను” అని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.

బీజేపీకి కంచుకోట...

బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 23,41,759. పోయిన సారి ఈ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 53.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు.. గోవిందరాజనగర్, విజయనగర్, చిక్కపేట, బసవనగుడి, పద్మనాభనగర్, బొమ్మనహళ్లి, జయనగర్, బీటీఎం లేఅవుట్. ఇందులో మూడు నియోజక వర్గాలు కాంగ్రెస్‌ ఆధీనంలో ఉండగా.. మిగిలిన 5 నియోజకవర్గాలు బీజేపీ చేతిలో ఉన్నాయి.

ఒకప్పుడు జయనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సౌమ్యారెడ్డి తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ హస్తం పార్టీకి ఓటు చేయాలని కోరుతున్నారు. యువ ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏమిటంటే.. గత ఎనిమిది ఎన్నికల్లో బీజేపీ వైపే మొగ్గు చూపింది.దాంతో ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగా భావించవచ్చు.

ఈ నియోజకవర్గంలో తొమ్మిదోసారి విజయం సాధిస్తామని జయనగర్ ఎమ్మెల్యే కె. సి. రామమూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన రామలింగారెడ్డి ప్రభావం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభావం సౌమ్య గెలుపునకు దోహదపడతాయని చెబుతున్నారు. పోయినసారి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బి. కె. హరిప్రసాద్‌కు 4,08,037 ఓట్లు రాగా, తేజస్వి సూర్య 3,31,192 ఓట్లు పడ్డాయి.

గెలిస్తే రికార్డే..

“ప్రజలు సౌమ్యారెడ్డిని ఆశీర్వదిస్తే సౌమ్య డబుల్ రికార్డ్ సాధిస్తుంది. "మొదటిది.. తొమ్మిదోసారి నియోజకవర్గంలో బిజెపి ఆధిపత్యాన్ని అంతం చేయడం, రెండోది.. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా ఎమ్మెల్యే కావడం" అని రామలింగారెడ్డి చెప్పారు. గత 73 ఏళ్లలో జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా ఎన్నిక కాకపోవడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత.

ఎంపీగా గెలిపిస్తే..

తనను ఎంపీగా గెలిపిస్తే బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో అమలు చేయాల్సిన ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని చెబుతున్నారు సౌమ్య.హరిత బెంగళూరు సౌత్‌కు కట్టుబడి ఉన్నానని అంటున్నారు.

తేజస్వీ హామీలివి..

పెండింగ్‌లో ఉన్న మెట్రో రెండో దశ, 2ఎ, 2బిలకు అనుమతులు పొందడం, మెట్రో లైన్‌ను పూర్తి చేయడం, సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం, రింగ్‌రోడ్డు పనులను ఖరారు చేయడం వంటి ముఖ్యమైన పనులపై పూర్తి చేయిస్తానని బీజేపీ అభ్యర్థి తేజస్వీ చెబుతున్నారు. మోడీ వేవ్‌లో తాను గెలవడం ఖాయమని నిస్సందేహంగా చెబుతున్నారు.

Tags:    

Similar News