Bangladesh | యూనస్ ఒక 'ఫాసిస్ట్': షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, హిందువులపై దాడుల తర్వాత ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.;
బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, హిందువులపై దాడుల తర్వాత ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు భారత్ కృషిచేస్తుండగా .. బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్‌ను "ఫాసిస్ట్" అని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. 'బిజోయ్ దిబోష్' సందర్భంగా ఒక ప్రకటనలో ప్రజల పట్ల బాధ్యత లేని "అప్రజాస్వామ్య సమూహానికి" యూనస్ నాయకత్వం వహిస్తున్నారని షేక్ హసీనా విమర్శించారు.
బిజోయ్ దిబోష్ ఎందుకు?
బంగ్లాదేశ్ డిసెంబర్ 16వ తేదీని 'బిజోయ్ దిబోష్' లేదా విక్టరీ డేగా జరుపుకుంటుంది. డిసెంబర్ 16, 1971లో 13 రోజుల యుద్ధం తర్వాత 93,000 మంది సైనికులతో పాటు అప్పటి పాకిస్తాన్ దళాల చీఫ్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ భారత సైన్యం, 'ముక్తి బహినీ' ఉమ్మడి దళాలకు లొంగిపోయారు. ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారింది.
మతోన్మాద శక్తులకు యూనస్ మద్దతు..
భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఆగస్టులో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వెళ్లిపోయిన హసీనా.. బెంగాలీ భాషలో ఒక ప్రకటనలో "దేశ వ్యతిరేక గ్రూపులు" రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకున్నాయని పేర్కొన్నారు. "ఫాసిస్ట్ యూనస్ నేతృత్వంలోని ఈ అప్రజాస్వామిక వర్గానికి ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత లేదు. అధికారాన్ని చేజిక్కించుకుని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కానందున, ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయడం లేదు. వారి ప్రధాన లక్ష్యం.. విమోచన పోరాట స్ఫూర్తిని, అనుకూల శక్తులను, వారి గొంతును అణచివేయడం." అని లేఖలో మండిపడ్డారు.
బలహీనపడ్డ భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు..
అవామీ లీగ్ నాయకురాలు బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టినప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ దేశంలో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతోన్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత కొన్ని నెలలుగా హిందూ సమాజంతో సహా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గత వారం ఢాకాను సందర్శించి, మైనార్టీలు, హిందువుల భద్రత, సంక్షేమానికి సంబంధించి భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ నేతలకు తెలిపారు.