ఉద్వేగంతో సాగిన ఏచూరి అంతిమయాత్ర

కన్నీళ్లు దిగమింగుకుని కడసారి వీడ్కోలు

By :  Admin
Update: 2024-09-15 06:25 GMT

-కొండూరి వీరయ్య

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి అకాల మరణానికి ఆకాశం కూడా కన్నీళ్లు పెట్టినట్టుంది. ఏచూరి భౌతిక కాయాన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌) నుండి ఆయన నివాసానికి తీసుకెళ్తున్నంత సేపూ భోరున కురుస్తూనే ఉంది. అంతటి భారీ వర్షంలో సైతం పార్టీ శ్రేణులు జవహర్‌ లాల్‌ విశ్వవిద్యాలయం విద్యార్ధి సంఘ నేతలు వెంటరాగా సీతారాం ఏచూరి భౌతిక కాయం జవహర్‌ లాల్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశించింది. అక్కడ ఆయన మూడు సార్లు విద్యార్ధి సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన జెఎన్‌యుఎస్‌యూ కార్యాలయం ప్రాంగణంలో సందర్శనార్దం ఉంచారు. అంతటి జోరు వానలో సైతం వందల సంఖ్యలో విద్యార్ధులు పదుల సంఖ్యలో అధ్యాపక సిబ్బంది వచ్చి నివాళులు అర్పించారు. పిమ్మట భౌతిక కాయాన్ని వసంత్‌ కుంజ్‌లోని ఏచూరి నివాసానికి తరలించారు. సెప్టెంబరు 13 రాత్రి సీతారాం ఏచూరి చివరిసారిగా తన నివాసంలో విశ్రమించారు. పధ్నాలుగో తేదీ ఉదయం షుమారు 10 గంటల ప్రాంతంలో గత ఐదున్నర నాలుగు దశాబ్దాలుగా తన కార్యస్థానంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం ఎకె గోపాలన్‌ భవన్‌కు చేరింది.
ఏచూరి భౌతిక కాయం పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరటానికి ముందే ఉదయం నుండీ వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, సీతారాం ఏచూరి అభిమానులు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్లూ, పార్టీ కార్యాలయ సిబ్బందీ కన్నీళ్లు దిగమింగుకుంటూ తమ ప్రియతమ నేతను కడసారి కళ్లారా చూసుకోవటానికి వేచి ఉన్నారు. నిరంతరం ఏదో ఒక చర్చ, సంభాషణలతో తుళ్లిపడుతూ ఉండే పార్టీ కార్యాలయంలో ఎటు చూసినా మౌనమే. ఎవరి కళ్లల్లోకి చూసినా ‘ఇదేమిటి? అలా ఎలా జరిగింది?’ అన్న ప్రశ్నలే. మరికొందరైతే ప్రపంచానికి మెడికల్‌ హబ్‌గా ఉన్న దేశంలో కోట్లమంది కరోనా పీడితులను కాపాడేందుకు సాయమందించామని చెప్పుకుంటున్న దేశంలో న్యుమోనియా లాంటి సాధారణ సమస్య నుండి దేశానికి అత్యంత అవసరమైన పుత్రుడిని కాపాడుకోలేకపోయామా అని భోపాల్‌కు చెందిన సాధనా ప్రధాన్‌ ప్రశ్నించారు. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని అనుకున్నప్పుడు కనీసం ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి తగిన చికిత్స లభ్యమయ్యే చోటికి తీసుకెళ్లటానికి ప్రభుత్వం అయినా ఎందుకు చొరవ చూపలేదు అన్నది అక్కడున్న కార్యకర్తల్లో ఉన్న చర్చ.
అంతలో ఏచూరి భౌతికకాయంతో ఉన్న వాహనం పార్టీ కార్యాలయం ముందు ఆగింది. అప్పటికే సిద్ధంగా ఉన్న రక్షణ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, భౌతికకాయం వెంట ఉన్న వలంటీర్లు వాహనం నుండి భౌతికకాయాన్ని దించి పార్టీ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరానికి తీసుకొచ్చారు. భౌతికకాయానికి ముందు ప్రకాష్‌ కరత్‌, బృందా కరత్‌, అశోక్‌ ధావలే, నీలోత్పల్‌ బసు, జోగీందర్‌ శర్మ వంటి సీనియర్‌ నాయకులు నడుస్తుండగా. పరిసరాల్లో ఉన్న కార్యకర్తలంతా పిక్కటిల్లేలా సీతారాం అమర్‌ రహే... రెడ్‌ సెల్యూట్‌ రెడ్‌ సెల్యూట్‌ రెడ్‌ సెల్యూట్‌ టు కామ్రేడ్‌ అంటూ జోహార్లప్పించటం మొదలు పెట్టారు. సాయంత్రం మూడు గంటలకు సీతారాం ఏచూరి భౌతికకాయం తానుగా ఎంచుకున్న తుది గమ్యమైన ఎయిమ్స్‌కు బయలు దేరే వరకూ కార్యాలయం ఆవరణలో ఈ నినాదాలు మారుమోగుతూనే ఉన్నాయి.



ప్రకాష్‌ కరత్‌ తో మొదలు పెట్టి పొలిట్‌ బ్యురో సభ్యులు, తర్వాత కేంద్ర కమిటీ సభ్యులు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర కమిటీల ప్రతినిధులుగా వచ్చిన పార్టీ నాయకులు పుష్పగుఛ్చాలతో తమ సన్నిహిత నాయకుడికి నివాళులు అర్పించారు. తర్వాత వరుసగా పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. భౌతికకాయానికి తలవైపున సీనియర్‌ పొలిట్‌ బ్యురో సభ్యులు కూర్చున్నారు. పార్టీ సీనియర్‌ పొలిట్‌ బ్యురో సభ్యులు బిమన్‌ బసు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగటం లేదు. తలవంచుకుని నిగ్రహం పాటించటం కోసం గుప్పిళ్లు బిగబట్టి కూర్చున్నారు. బౌతికకాయం పక్కనే ఏచూరి భార్య సీమా చిస్తీ, కూతురు అఖిల, కొడుకు దానిష్‌లు కూర్చున్నారు. వాళ్లను ఓదారుస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ కూడా పక్కనే ఉన్నారు.

ఓ పోలిట్‌ బ్యురో సభ్యులు నీలోత్పల్‌ బసు తనతో ఉన్న బెంగాల్‌ మిత్రులతో గత ఆరేడేళ్లుగా సీతారాం ఏచూరి ఈ దేశ రాజీకీయాలను ఏ కోణంలో నడపాలనుకున్నారో ఆ కోణంలో పరిణామాలు రూపు దిద్దుకుంటున్న వేళ ఈ ప్రయాణానికి తలుపులు తీసుకుంటూ వెళ్లాల్సిన ఏచూరి ఇలా అర్థాంతరంగా ఎవరికీ అందనంత దూరం బహుదూరపు బాటసారిగా ప్రయాణం మొదలు పెట్టడంకన్నా ప్రకృతి వైపరీత్యం ఏముంటుందంటూ కళ్లు చెమర్చారు.
ఇంతలో కాంగ్రెస్‌ అధ్యలు సోనియాగాంధీ, సిడబ్య్లుసి సభ్యులు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, మాజీ కేంద్రమంత్రి సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబ్బల్‌, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ శరద్ పవార్, డి రాజా,అఖిలేష్ యాదవ్, కనిమోళి, ఆశోక్ గెహ్లోత్ లు ఏచూరికి నివాళులు అర్పించారు లు ఏచూరికి నివాళులు అర్పించారు. కారు దిగేసరికే సోదరుడిని కోల్పోయానన్న భావన తో భావోద్వేగాన్ని అదుపు చేసుకుంటూ వచ్చారు సోనియా. సోనియా గాంధీ, సీతారాం ఏచూరి మధ్య ఉన్న సంబంధం కేవలం రెండు పార్టీ నాయకుల మధ్య ఉన్న సంబంధం కాదు. చదవరులంటే ఏచూరికి చాలా ఇష్టం. ఎన్నో పుస్తకాలు ఇచ్చి వాళ్ల ప్రాపంచిక దృక్ఫధాన్ని విస్తరింపచేయటానికి కృషి చేస్తారు. సోనియాకు కూడా అటువంటి పుస్తకాలు పదుల సంఖ్యలో ఇచ్చారు. రాజకీయ పరిచయం కాస్తా మేధో పరిచయంగా మారింది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తులతో వచ్చిన పరిచయాలను సొమ్ము చేసుకోవడానికి ఎలా వాడుకోవాలా అని ఆలోచించే నాయకులున్న ఈ రోజుల్లో తాను ఆ తానులో ముక్క కాదనీ, స్పేషల్లీ మేడ్‌ టు సర్వ్‌ ఇండియా అండ్‌ ఇట్స్‌ పీపుల్‌ అని చెప్పుకోగల దమ్మున్న గుండె ఏచూరిది. రాజీవ్‌ గాంధీ చనిపోయినప్పుడు చిదంబరం, సిబ్బల్‌లు కన్నీళ్లు పెట్టారో లేదో నేను చూడలేదు కానీ ఏచూరి భౌతికకాయాన్ని అశ్రుతర్పణం గావించిన సంఘటన భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఎంతో మంది కవులు, కళారంగ ప్రముఖులు, సినీ యాక్టర్లు, రచయితలు ఏచూరి ఆఖరి చూపు కోసం సాధారణ కార్యకర్తలతో పాటు క్యూలో నిల్చున్నారు. అంతే సంఖ్యలో దాదాపు ఢల్లీిల్లో వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేసిన సీనియర్‌ పాత్రికేయులు కూడా ఉండటం ఏచూరికి మీడియా మిత్రులకు ఉన్న సంబంధం లోతును తెలియచేస్తుంది. ఎంతో మంది రాజకీయేతర ప్రముఖులు ఏచూరిని చివరిసారి చూసుకోవడానికి వచ్చారు. మాజీరాజ్యసభ సభ్యులు తారిక్‌ అన్వర్‌ సీమా చిస్తీని ఓదారుస్తూ చనిపోయిన తర్వాత కూడా ఆయన ముఖంలో చిరునవ్వు చెదరలేదంటూ చూపిస్తుంటే శిబిరంలో ఉన్న వాళ్లంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. అక్కడకు వచ్చిన ఎంతో మంది రాజకీయేతర ప్రముఖుల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చరిత్రకారులు రొమిల్లా థాఫర్‌ వయో భారంతో కదల్లేని స్థితిలో కూడా తన మేధో సహచరుడికి శ్రద్ధాంజలి ఘటించేందుకు రావటం ఏచూరికి సిద్ధాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీ శ్రేణుల్లో ఉన్న ఆదరణతో పాటు మేధో రంగంలో ఫస్ట్‌ ర్యాంకర్లు అని చెప్పగలిగిన వారందరితోటీ అంతే సాన్నిహిత్యం ఉందన్నది మరో సారి.... చివరి సారి... తెలియచెప్పిన సన్నివేశం ఆయన అంతిమ సందర్శన సందర్భం. అనంతరం సాయంత్రం మూడుగంటల ప్రాంతంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రదర్శనగా బయలుదేరి కేరళ భవన్‌ వరకూ వెళ్లి కామ్రేడ్‌కు కడసారి రెడ్‌ శాల్యూట్‌ చెప్పగా అక్కడ నుండి భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు తరలించి అక్కడ పరిశోధనా విభాగం వైద్య బృందానికి అప్పగించటంతో భారత రాజకీయాల్లో ఓ నిర్ణయాత్మక నేత దేశం ఓ కీలక మలపుతో ఉన్నప్పుడు నేను చూపిన దారిలో నడవడమే ఈ దేశ శ్రేయస్సు అంటూ సందేశమిచ్చి తరలిపోయారు. ఈ బహు భాషా మేటికి అశ్రుతర్పణం చేసే సమయంలో హిందీ, బంగ్ల, తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో నినాదాలు చేశారు. అంతిమంగా భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు అప్పగించేందుకు తరలించే సమయంలో బెంగాలీలో అంతర్జాతీయ కమ్యూనిస్టు గీతాన్ని ఆలాపించారు విద్యార్దులు, యువకులు.

పీడిత విముక్తి పోరాటంలో ఒక యోధుడి మరణం లక్షల మందిలో పోరాట స్పూర్తిని రగిలిస్తుంది.


Tags:    

Similar News