ప్లాస్టిక్‌ను ఇలా కూడా వాడొచ్చా.. ఏం ఐడియా బాస్!

ప్లాస్టిక్.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. దీనిని పూర్తిగా నిషేధించలేం. పర్యావరణ సహిత ప్రొడక్ట్‌గానూ మార్చలేం. కానీ ప్లాస్టిక్ వల్ల..

Update: 2024-05-27 12:22 GMT

ప్లాస్టిక్.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. దీనిని పూర్తిగా నిషేధించలేం. పర్యావరణ సహిత ప్రొడక్ట్‌గానూ మార్చలేం. కానీ ప్లాస్టిక్ ద్వారా మానవాళికి జరుగుతున్న మేలు కంటే కీడే అధికంగా ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థలు పెరుగుతున్న కొద్దీ మన వాతావరణంలో, మన తినే ఆహారంలో, కూరగాయల్లో, మన శరీర అవయవాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి తోడు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు.. దీనికి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్, ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని నిపుణులు చెప్తున్నారు.

ఆంక్షలు పెట్టిన దేశాలు

ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు ప్లాస్టిక్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడంతో పాటు పేపర్ కప్స్, పేపర్ స్ట్రాలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మనదేశంలో కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లపై నిషేధం విధించిన ప్రభుత్వం వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్, క్లాత్ బ్యాగ్‌లను వాడాలని వాటిని అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యవర్థాలు ఓ మహమ్మారిలా మారాయి. పంచభూతాలను కాలుష్యం చేస్తున్న ఆరోభూతంలా ప్లాస్టిక్ మారింది. వాటర్ బాటిల్స్, కప్పులు, గ్లాసులు, కార్డ్‌లు ఇలా మరెన్నో రూపాల్లో ప్లాస్ట్ వ్యర్థాలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి.

 

మూడింతలు పెరగొచ్చు

ఒక్క భారతదేశమే రోజుకు 26వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 350 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్ట్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 2060 నాటికి మూడు రెట్లు పెరిగి రోజుకు బిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు ఉత్పన్నమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 0.5 శాతం వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఏడాదికి ఇది 1 నుంచి 2 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని తాజా అధ్యయనాలు చెప్తున్నారు. అయితే ఈ ప్లాస్టిక్ వేస్ట్ సమస్యకు అనేక సంస్థలు వివిధ రకాల పరిష్కారాలు ఆలోచించాయి. వాటిలో ఎకోలైన్ కూడా ఒకటి.

ప్లాస్టిక్ వేస్ట్ ఇక వేస్ట్ కాదు

ఈ సంస్థలో ప్లాస్టిక్ వేస్ట్‌ను సరైన క్రమంలో రీసైకిల్ చేసి కొత్త వస్తువులను తయారు చేస్తారు. వాటిలో దుస్తులు, టైల్స్, బ్యాటరీ కేస్‌లు ఇలా పలు రకాల పరికరాలు తయారు చేయడానికి వాడుతున్నారు. ఈ కంపెనీ తయారు చేసిన ప్లాస్టిక్ దుస్తులనే ప్రధాని మోదీ, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ కూడా ధరించారు. ఈ సంస్థ ప్రతి రోజూ దాదాపు 15 లక్షల బాటిళ్లను రీసైకిల్ చేస్తుంది. బాటిళ్ల మూతలతో బ్యాటరీ కేస్‌లు వంటి గట్టి వాటిని, మిగిలిన బాటిల్ బాడీతో బట్టలు, నేలపై పరిచే బ్లాక్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు.

 

‘‘మాది రూ.100 కోట్ల విలువైన బిజినెస్. మన దేశంలో ప్రతి రోజు 17 కోట్ల వాటర్ బాటిళ్లను వాడి పడేస్తారు. వాటన్నింటిని మా వెండర్ పార్ట్‌నర్స్ కలెక్ట్ చేస్తారు. ఈ బాటిళ్లను ముందుగా మూతలు, బాటిళ్లుగా వేరు చేస్తాం. వాటిలో బాటిళ్లను ముందుగా చిన్నచిన్న ముక్కలు చేస్తాం. ఆ తర్వాత వాటిని పొడి మాదిరిగా మార్చి దాని ద్వారా దారంలా తయారు చేస్తాం. వాటితో దుస్తులు రెడీ చేస్తాం. ప్లాస్టిక్ డ్రస్ అంటే మొత్తం ప్లాస్టిక్ ఉండదు. కానీ ఒక్క టీ షర్ట్‌కు ఆరు బాటిళ్లు వినియోగిస్తాం. ఈ దుస్తులను మరింత సురక్షితంగా, బయో అండ్ ఎకో ఫ్రెండ్లీగా మార్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ షర్ట్స్ అతి త్వరగా భూమిలో కలిసిపోయేలా సిద్ధం చేయడానికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ సెంథిల్ శంకర్ వివరించారు. వీళ్ల ప్రొడక్ట్స్ చూసిన తర్వాత ప్లాస్టిక్ సమస్యకు ఒక పరిష్కారం లభించిందని పర్యావరణ నిపుణులు సంతోష పడుతున్నారు. కానీ భూమిపై ఇప్పటికే పేరుకుపోయి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ రీసైకిల్ కావాలంటే ఇలాంటి కంపెనీలు వేల సంఖ్యలో రావాల్సి ఉంటుందని, అయినా ఉత్పత్తి అవుతున్నంత ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం అసాద్యమని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News