టీ20 వరల్డ్ కప్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులా?
జూన్ 2 నుంచి అమెరికా- వెస్టీండీస్ వేదిక గా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ట్రినిడాడ్ ప్రధాని ప్రకటించి కలకలం రేపారు.
By : Praveen Chepyala
Update: 2024-05-06 11:45 GMT
అమెరికా- కరేబియన్ దేశాల వేదికగా వచ్చే నెల నుంచి జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ట్రినిడాడ్ ప్రధాని డాక్టర్ కీత్ రౌలీ ఇదే వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. ఈ వార్తలపై ఐసీసీ కూడా స్పందించింది. ప్రమాదాలను తగ్గించడానికి సమగ్రమైన, పటిష్టమైన భద్రతా ప్రణాళికలు అమలులో ఉన్నాయని ప్రకటించింది.
జూన్‌లో టోర్నమెంట్
ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో సహా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లన్నీ తొమ్మిది వేదికల్లో ఈ మ్యాచ్ లు ఆడే విధంగా ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. వాటిలో ఆరు వేదికలు కరేబియన్ దీవుల్లోనే ఉన్నాయి. అమెరికా వేదికగా ప్రారంభ మ్యాచ్ జరగనుంది. జూన్ 2 న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 29 ముగుస్తుంది.
ఉగ్రవాద దాడుల ముప్పు ప్రత్యేకంగా కరేబియన్ దీవుల వేదికగా జరిగే మ్యాచ్ లకు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కొన్ని ప్రారంభ మ్యాచ్‌లను పక్కన పెడితే, సూపర్ 8 దశ, సెమీ ఫైనల్స్, జూన్ 29 న జరిగే ఫైనల్ మ్యాచ్ లకు కరేబియన్ దేశాలే ప్రధాన వేదికలు.
ట్రినిడాడ్ డైలీ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం .. ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లు వెల్లడించింది. అందులో భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఓ వీడియో సందేశం ద్వారా ఈ ఉగ్రవాద దాడుల హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్నిపత్రికా నేరుగా ప్రస్తావించలేదు.
ఐసీసీ ప్రకారం..
ఈ పరిణామంపై ఐసీసీ స్పందించింది. టోర్నమెంట్, ఆటగాళ్ల భద్రతకు హమీ ఇచ్చింది. "ఈవెంట్‌లో ప్రతి ఒక్కరి భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. మేము ఒక సమగ్రమైన, పటిష్టమైన బలమైన భద్రతా ప్రణాళికలకు హమీ ఇస్తున్నాం." అని గ్లోబల్ బాడీ ప్రతినిధి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
"మేము మా అతిథ్య దేశాల్లోని అధికారులతో సన్నిహితంగా పని చేస్తాము. మా ఈవెంట్‌లో గుర్తించబడిన ప్రమాదాలను తగ్గించడానికి తగిన ప్రణాళికలు ఉన్నాయి. గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తాము." భద్రత కోసం అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో వస్తున్న బెదిరింపులను సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు. మ్యాచ్ లు జరిగే దేశాల్లో వేదికలను పర్యవేక్షించడానికి ఇంటలిజెన్స్, ఇతర భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.
కరేబియన్‌లో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆంటిగ్వా, బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడా, ట్రినిడాడ్ - టొబాగోలో జరుగుతాయి. అమెరికా వేదికగా ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్‌లలో మ్యాచ్ లు జరగనున్నాయి. జూన్ 9న జరిగే ఇండియా-పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది.
బెదిరింపులపై క్రికెట్ వెస్టిండీస్ స్పందన..
ఈమెగా ఈవెంట్‌లో ఫూల్‌ప్రూఫ్ భద్రతను నిర్ధారించడానికి ప్రతిదీ చేస్తున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. "మేము అతిథ్య దేశాలు - నగరాల్లోని అధికారులతో సన్నిహితంగా పని చేస్తాము. ప్రమాదాలను ఎదుర్కొవడానికి సదా సిద్ధంగా ఉన్నాం. అందుకోసం తగిన ప్రణాళికలు ఉన్నాయి. " అని CWI CEO జానీ గ్రేవ్స్ 'Cricbuzz'తో అన్నారు.
"ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్‌లో ప్రతి ఒక్కరి భద్రత మా ప్రథమ ప్రాధాన్యత అని అన్నిదేశాలకు, ఆటగాళ్లకు హామీ ఇవ్వాలనుకుంటున్నాము. మేము సమగ్రమైన, బలమైన భద్రతా ప్రణాళికను కలిగి ఉన్నాము" అని ఆయన చెప్పారు