షేక్ హసీనాను వెంటనే అప్పగించాలి: యు-టర్న్‌ తీసుకున్న యూనస్‌

"ప్రతి హత్యలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. దేశం వీడిన షేక్ హసీనాను వెనక్కి పంపమని భారతదేశాన్ని కోరుతున్నాం" - ముహమ్మద్ యూనస్‌

Update: 2024-11-18 10:40 GMT

బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ యూ టర్న్ తీసుకున్నారు. గత నెలలో UK బెస్డ్ ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో..షేక్ హసీనాను వెంటనే బంగ్లాదేశ్‌కు పంపించాలని భారత్‌ను కోరమని చెప్పారు. ఇప్పుడేమో షేక్ హసీనాను అప్పగించాలని తాత్కాలిక ప్రభుత్వం కోరుకుంటోందని చెబుతున్నారు. మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనస్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మైనార్టీలతో పాటు పౌరులందరికీ భద్రత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయితే మైనారిటీ కమ్యూనిటీలో "అనవసర భయాన్ని" వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, వాస్తవానికి కొన్ని హింసాత్మక ఘటనలు మాత్రమే జరిగాయని చెప్పుకొచ్చారు.

"ప్రతి హత్యలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. దేశం వీడిన షేక్ హసీనాను వెనక్కి పంపమని కూడా మేము భారతదేశాన్ని అడుగుతాము" అని ప్రభుత్వ-అధికార BSS వార్తా సంస్థతో యూనస్ అన్నారు.

గతంలో అలా..

గత నెలలో UK బెస్డ్ ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో..షేక్ హసీనాను భారతదేశం నుంచి వెంటనే బంగ్లాదేశ్‌కు పంపించాలని కోరమని యూనస్ చెప్పారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో విద్యార్థులు, కార్మికులు సహా సుమారు 1500 మంది మరణించగా, 19,931 మంది గాయపడ్డారని ఆగస్టు 8వ తేదీన అధికారం చేపట్టిన యూనస్ తెలిపారు. ప్రతి మరణంపై సమాచారాన్ని సేకరించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఢాకాలోని 13 ఆసుపత్రులతో సహా వివిధ ప్రత్యేక ఆసుపత్రులలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని గుర్తుచేశారు.

అసలు హసీనా బంగ్లాదేశ్‌ను ఎందుకు వీడారు?

ప్రభుత్వ ఉద్యోగాల్లో వివాదాస్పద కోటాపై హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై-ఆగస్టులో విద్యార్థులు, పౌరులు భారీ నిరసన చేపట్టారు. ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని షేక్ హసీనా, ఆమె పార్టీ నాయకులు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు. ఆగస్ట్ 5న ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. ఆమెను అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తరలించారు. ఇక అప్పటి నుంచి ఆమె బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు.

అనవసర భయాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు: యూనస్

షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి ఘటనపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని యూనస్ చెప్పారు. "హిందూ కమ్యూనిటీ సభ్యులే కాకుండా దేశంలోని ఏ పౌరుడు హింసకు గురికాకుండా ఉండేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాం" అని ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ పూర్తిగా అభద్రతా దేశంగా ఉండేదన్నారు.

‘దుర్గాపూజ ఉత్సవాలే సాక్ష్యం’

మతం రంగు పులిమి దేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే అందరి సహకారంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని యూనస్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 32 వేల మండపాల్లో దుర్గాపూజలు జరిగాయని, హిందూ సంఘాలు సజావుగా జరుపుకునేలా ప్రభుత్వం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

‘‘170 మిలియన్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మాత్రమే ఉన్నారు. మైనారిటీ, హిందూ కమ్యూనిటీ సభ్యుల వ్యాపారాలను నాశనం చేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. ఫలితంగా ప్రధాని హసీనా బహిష్కరణకు గురయ్యారు.’’ అని చెప్పారు.

త్వరలో ఎన్నికలు..

ఎన్నికలు ఎప్పుడనే ప్రశ్న అందరిలో మెదులుతోందని, త్వరలో ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తామని యూనస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు ప్రారంభించిందని చెప్పారు.

Tags:    

Similar News