విశ్వక్ సేన్ లెక్కే వేరు!

సినిమా అంటేనే కొంత అదృష్టం కొంత టైమింగ్ కుదరాలి. మంచి ప్లానింగ్ తో సినిమా ఎంపిక చేసుకోవాలి. ప్రేక్షకుల్లో మంచి హీరో గా తనను తాను ఎలివేట్ చేసుకునే..

By :  491
Update: 2024-11-22 05:05 GMT

(శృంగవరపు రచన)

సక్సెస్ స్టోరీ డిజైన్ చేసుకున్న హీరో

సినిమా అంటేనే ఓ రకంగా గాంబ్లింగ్. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిన రంగం. ఆ అదృష్టం తెచ్చే పెట్టే సక్సెస్ రేట్ కూడా ఉండాలి. ఎక్కడో కొందరు నటులు మాత్రమే ఈ లెక్కను దాటి తమ స్టైల్ లో సక్సెస్ అవుతారు. తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను కూడా సృష్టించుకుంటారు. అలాంటి కొద్ది నటుల్లో ఒకరే విశ్వక్ సేన్.

విశ్వక్ సేన్ సినిమాల్లో పాతుకుపోయిన నేపథ్యం వాడు కాదు. మాములుగా స్థాయి నుండి వచ్చిన వాడే! గొప్ప కథలు కూడా పడ్డ హీరో కాదు. సక్సెస్ రేట్ 'వావ్' అనే దశలో ఉన్నవాడు కూడా కాదు. కానీ తన డిమాండ్ ని సినిమా రంగంలో సృష్టించుకున్నాడు. ఒక లెక్కతో తన సక్సెస్ స్టోరీ డిజైన్ చేసుకుంటున్నవాడు.
స్పెషల్ మ్యాజిక్
విశ్వక్ సేన్ 29 ఏళ్ళ వాడు. ఈ వయసు హీరోలకు లేని ఒక స్పెషల్ మ్యాజిక్ ఇతనిలో ఉంది.ఆ మ్యాజిక్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండాలన్న తపన ఉండటం మాత్రమే కాక, దాన్ని తనకు తానే మార్గం సృష్టించుకోగల స్పష్టత ఉండటం!
ప్రమోషన్ స్టైలే వేరు!
సొంత పేరు దినేష్ నాయుడు అయినా స్క్రీన్ పేరు మాత్రం విశ్వక్ సేన్. 'ఫలక్ నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. అలాగే తన ప్రతి సినిమా ప్రమోషన్ ను విభిన్నంగా చేస్తాడు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తప్పక ఉంటుంది ఆ ప్రమోషన్ లో. తన ప్రతి సినిమాకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఒక బజ్ ని క్రియేట్ చేసుకుంటాడు. విశ్వక్ సేన్ నటించిన సినిమాల్లో దర్శకులు ఎవరైనా అందరికీ గుర్తుండిపోయేది మాత్రం విశ్వక్ సేన్ మాత్రమే.
మాస్ నాడి పట్టుకున్న హీరో
ప్రేక్షక అభిరుచి ఏదైనా నటుడికి ఎక్కువ స్కోప్ ఉండి, కనక్ట్ అయ్యేది మాత్రం మాస్ సినిమాలే. ఎక్కువ రీచ్ ఉండే ఈ సినిమాలు మినిమమ్ సక్సెస్ రేట్ ను ఎప్పుడు సొంతం చేసుకుంటాయి. కాకపోతే మాస్ సినిమా అంటే కమర్షియల్ ఫార్ములాలో హింస, భీభత్స నేపథ్యంలో హీరో నరుకుడు, భారీ డైలాగ్స్, అతితో కూడిన హీరోయిజం గా మారిపోయింది. నిజానికి ఈ ఫార్ములా లో హిట్ కొట్టడానికి దాదాపు స్టార్ హీరోలతో సహా అందరూ ప్రయత్నించారు. సత్యదేవ్, రాం పోతినేని లాంటి క్లాసీ హీరోలు కూడా ఈ ఫార్ములా ట్రై చేశారు. కానీ మాస్ అపిల్ లో గొప్పగా కనిపించడం చాలా కష్టమైన విషయం.


 


చూడటానికి ఎంత సింపుల్ గా కనిపిస్తుందో, సినిమా నుంచి కథ కన్నా కూడా హీరోతో ఒక ఎమోషన్ ను కోరుకునే ఈ రకం సినిమాల్లో ప్రేక్షకులకు పర్సనల్ గా కనక్ట్ అవ్వడం చాలా కష్టం. నిజానికి ఎంత మంది మాస్ సినిమాలు తీసినా సీనియర్ నటులు బాలకృష్ణ తప్ప ఎవ్వరూ కూడా ఆ ఇమేజ్ ను ఊహించిన స్థాయిలో అందుకోలేకపోయారు. అలాగే ఆయనకు వర్క్ అయిన ఫార్ములా ఇంకే హీరోకి పని చేయలేదు కూడా!
ఈ సందర్బంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ 'మాస్ హీరో ఇమేజ్' మీద దృష్టి పెట్టాడు విశ్వక్ సేన్. అప్పటి వరకూ కొంత ప్రేమ కథలు,రొటీన్ కథలు, 'గామి'లాంటి విభిన్న సినిమాలు చేసినా,'దాస్ కా ధమ్కీ' మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. కొంత మధ్యలో విభిన్నత ప్రయత్నిస్తూ ఉన్నా, తన 'మాస్ ఇమేజ్' మాత్రమే తన సక్సెస్ ఫ్యాక్టర్ అవుతుందని గ్రహించాడు, దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు కూడా!
సెన్సిటివ్ మాస్ అపీల్
స్వయంగా డైరెక్టర్ అవ్వడం వల్ల, నటన మీద అవగాహన ఉండటం వల్ల, తనకంటూ ఒక ప్రత్యేక మానరిజం, బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా కళ్ళ హావభావాలతోనే కనక్ట్ అయ్యేలా నటించగలగడం విశ్వక్ కి ప్లస్ పాయింట్. యాక్షన్ కన్నా కూడా ఈ బాడీ లాంగ్వేజ్, మానరిజంతో మాసిజంను పలికించడంతో మాస్ స్టైల్ లో ఒక సున్నితత్వం కూడా విశ్వక్ వల్ల కథలో చోటు చేసుకుంటుంది అన్నది కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవమే!
సినిమా ఏదైనా....
సినిమా ఏదైనా సరే విశ్వక్ సేన్ తన పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కథ ఏదైనా, అది సక్సెస్ అయినా కాకపోయినా తన పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకునేలా నటిస్తాడు, అలాగే అలాంటి అవకాశం ఉన్న పాత్రలే ఎంచుకుంటాడు. అందుకే సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో పాటు ఎదుగుతున్న హీరో విశ్వక్ సేన్.
బాడీ షేమింగ్...
విశ్వక్ సేన్ కొంత బాడీ షేమింగ్ ను కూడా ఎదురుకున్నాడు. కానీ దేన్నీ లెక్కచేయడు. తను అనుకున్నది చేస్తాడు. మాట్లాడేటప్పుడు తన మనసులో ఉన్నది ఆలోచించకుండా అనేస్తాడు. కానీ తన నటన విషయంలో మాత్రం ఎవరూ వంక పెట్టకుండా నటిస్తాడు కాబట్టి ఇప్పటి వరకూ అవి తన సినిమాలకు ప్లస్సే తప్ప మైనస్ కాలేదు.
మొత్తం మీద తన సక్సెస్ లెక్కతో జోరుతో సాగిపోతున్న విశ్వక్ సేన్ ఈ లెక్కతో టాలీవుడ్ లో ఏ అద్భుతాలు త్వరలో సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే!



Tags:    

Similar News