'అర్జున్ చక్రవర్తి' మూవీ రివ్యూ!

ఓడి ..గెలిచిన మనిషి కథ!

Update: 2025-10-28 02:30 GMT

1980–96 మధ్య కాలం… ఆ ఊళ్లో అర్జున్ చక్రవర్తి (విజయ్ రామరాజు) బతుకుదెరువు కోసం తిరుగుతున్న అనాథ. ఒక రోజు అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య (దయానంద్ రెడ్డి). ఓడిపోయిన ఆటగాడిగా రంగయ్యకు ఒకటే తపన . తన ఊర్లోంచి ఓ చాంపియన్ పుట్టాలి. అదే కలను అర్జున్‌లో నాటేస్తాడు. అంతేకాదు అతన్ని చేరదిసి కబడ్డీ క్రీడలో తిరుగులేని ఆటగాడుగా చేస్తాడు.

జిల్లా స్థాయిలో ఆడుతున్న సమయంలో తన గ్రామానికి చెందిన అగ్ర కులానికి చెందిన దేవిక ( సిజా రోజ్)‌తో ప్రేమలో పడుతాడు. అయితే ఓ కీలక మ్యాచ్‌ కోసం దేవకిని దూరం పెడతాడు. దేశం తరపున ఆడి బంగారు పతకం సైతం సాధించి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ అతను కబడ్డీ ఆటను దూరం పెట్టి తాగుడుకు బానిసవుతాడు.

కబడ్డీనే ప్రాణంగా భావించే అర్జున్‌.. ఆ ఆటకు ఎందుకు దూరంగా జరుగుతాడు? కోచ్‌ కులకర్ణి (అజయ్‌) రాకతో అర్జున్‌ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అతని ప్రేమ కథ ఏమైంది... కబడ్డీ నుంచి విరమించుకొన్న తర్వాత మళ్లీ అర్జున్ బరిలోకి దిగాడా? వంటి అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున్ చక్రవర్తి సినిమా కథ. విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయంటే మాటలు కాదు. ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత విషయం ఉండే ఉంటుందనేది నిజం. అయితే థియేటర్స్ లో పెద్దగా వర్కవుట్ కాలేదు. కారణాలు స్టార్ క్యాస్ట్ లేకపోవటం కావచ్చు. ఇప్పుడు ఓటిటిలోకి వచ్చినప్పుడు జనం చూస్తూంటారు. అయితే ఇందులో నిజంగా గుర్తుంచుకుని మాట్లాడుకునేటంత ఎలిమెంట్స్ ఉన్నాయా?

వాస్తవానికి ఇలాంటి కథలకు కొత్తగా చెప్పేందుకు,చూపేందుకు ఏమీ ఉండదు. ట్విస్ట్ లు, మలుపులు అసలే ఉండవు. ఉన్నంతలో అవి చాలా వరకు ఊహకు అణుగుణంగా సాగుతాయి. అక్కడే దర్శక,రచయితలు జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే తెలిసిన కథే, తెలిసిన నేరేషన్ లో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. మనల్ని పెద్దగా కదిలించలేదు. అదే చాలా వరకూ జరిగింది. అయితే దర్శకుడు తన బలం అయిన ఎమోషన్స్ ని బాగా ప్లే చేయటం కొంతవరకూ వర్కవుట్ అయ్యింది.

“గెలవడం ఒక్క లక్ష్యం కాదు... గౌరవంతో నిలబడటం నిజమైన క్రీడ” 1980ల నుండి 90ల మధ్య సాగిన “అర్జున్ చక్రవర్తి” అనే ఈ కథ, బయటికి చూస్తే కబడ్డీ నేపథ్యమని అనిపిస్తుంది. కానీ లోపల ఇది ఓ క్రీడాకారుని ఆత్మకథ. ఇది ఆట గురించి కాదు. ఆ కాలం నాటి గ్రామీణ నేపథ్యంలోని యువకులకు పేదరికం, అధికారుల అవినీతే ప్రధానమైన శత్రువులుగా నిలిచింది.ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రూపొందించారు.

అలాగే ఈ సినిమాలో కొన్ని క్లాసికల్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ వాడారు. Reverse narration ద్వారా అర్జున్ గతాన్ని విప్పి చూపడం . అతని ఎదుగుదల, ప్రేమ, ఆత్మవిశ్వాసం అన్నీ మెల్లగా కూలిపోతున్నట్టు చూపించటం..తిరిగి ప్రేరణ పొందటం చూపెట్టారు. అయితే అందుకు ఎంచుకున్న రొటీన్ సీన్స్ ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉండే రాజకీయాలను కొత్త కోణంలో ఆవిష్కరించకుండా..మనకు బాగా తెలిసిన రెగ్యులర్ కాన్‌ఫ్లిక్ట్‌తో ముందుకెళ్లడం ఈ సినిమాని రొటీన్‌గా మార్చింది.

ఏదైమైనా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కథ రొటీన్ అయినప్పటికీ, దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చిన విధానం బాగా వర్కవుట్ అయ్యింది. అయితే, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కొన్ని సీన్స్ సాగదీతగా సాగినట్లు అనిపిస్తాయి.

ఎవరెలా చేసారు

‘అర్జున్ చక్రవర్తి’ గా విజయ్ రామరాజు అర్జున్‌గా వంద శాతం న్యాయం చేశాడు. ఈ పాత్ర కోసం అతను పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. లుక్ మార్పు, శరీర భాష, కళ్లలో కనిపించే నొప్పి – అన్నీ నిజంగా ఫీలయ్యేలా చేశాడు. రంగయ్యగా దయానంద్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సిజా రోజ్ స్క్రీన్‌పై కనిపించేది కాసేపే అయినా, ఆమె అందమైన ఎక్స్‌ప్రెషన్స్ మిగిలిపోతాయి. అజయ్ కోచ్ పాత్రలో బాగానే చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల్లో నెరవేర్చారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. విఘ్నేష్ బాస్కరన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాడు. పాటలు కూడా మనసుకు దగ్గరగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది — 80, 90ల వాతావరణాన్ని సహజంగా చూపించారు. ఎడిటింగ్ సరైన రీతిలో ఉంది, నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.

చూడచ్చా

స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.

ఎక్కడుంది

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది

Tags:    

Similar News