రహస్యమే రచ్చ చేస్తోంది, రాజమౌళి స్ట్రాటజీ అదేనా?

రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కుతున్న విషయం తెలిసిందే..;

Update: 2025-01-04 06:22 GMT

స్టార్ డైరక్టర్ రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)ల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. SSMB 29 గా ఇది ప్రచారంలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారు. చిత్ర టీమ్ తోపాటు మహేశ్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ పలు వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫోటోలు, వీడియోలు వెలువడలేదు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మాదిరిగానే పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి, రాజమౌళి ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోవటం ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ సినిమా ప్రారంభంపై మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్క ఫోటో కూడా బయటకు వదలక పోవడం ఆశ్చర్యాన్ని, షాక్ ని, నిరాశని కలిగిస్తోంది. సినిమా ప్రారంభం అనేది దాచుకోవాల్సిన విషయం కాదని చాలా మంది భావిస్తున్నారు. అదే చెప్తున్నారు. ఇది శుభవార్త కాబట్టి, అందరితో పంచుకోవాలి. మొత్తానికి సినిమా నిర్మాతల కోసమే కాకుండా ప్రేక్షకులు, అభిమానుల కోసం రూపొందుతోంది అనేది నిజం.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో, హోస్ట్ సుమ ఈ సినిమా లాంచ్ గురించి ప్రస్తావించి, ఫోటోలు గురించి అడిగినప్పుడు, రాజమౌళి దానిపై సమాధానం ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాధారణంగా రాజమౌళి ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు, కానీ ఇలా చేయడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఓ చిన్న లాజిక్ చెప్తున్నారు. కొన్నిసార్లు మీడియా నుంచి కొన్ని దాచిపెట్టడం కూడా కలిసి వచ్చే విషయం. ఇలాంటి స్ట్రాటజీలు కూడా అరుదుగా మంచి ఆదరణ పొందుతాయి. అందుకే ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించ లేదు అంటున్నారు.

సాధారణంగా తన సినిమా పూజా కార్యక్రమాల్లో మహేశ్‌ పాల్గొనరు. ఈసారి కూడా ఇదే సెంటిమెంట్‌ ఫాలో కాలేదు. మహేష్ వచ్చారు. అందుకే మహేష్ గెటప్ ,లుక్ బయటకు వస్తుందని భావించే ఫోటోలు వదలలేదు, మీడియాని పిలవలేదు అంటున్నారు. అదే ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జనం అంతా చాలా ఆసక్తిగా ఈ సినిమా గురించి చర్చిస్తున్నారు.

#ssmb29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రాజమౌళి బొర్రా గుహలతో పాటు, ఒడిశాలోనూ పలు లొకేషన్లు చూసి వచ్చారు. నిధి వేట నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ మూవీ కావడంతో అందుకు తగిన లొకేషన్లు చూసి ఆయా ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ సినిమాకు సంబంధించిన కీలక సెట్స్‌ను దాదాపు పూర్తి చేశారు. పూజా కార్యక్రమం కూడా అక్కడేనని సమాచారం.

రాజమౌళి సినిమా అంటే భారీ తారాగణం కూడా ఉంటుంది. ఇప్పటివరకూ చిత్ర టీమ్ కేవలం మహేశ్‌బాబు పేరును మాత్రమే ప్రకటించింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. జనవరి చివరి వారంలో రెగ్యులర్‌ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఇండియన్ సినీ పరిశ్రమ ఇప్పటివరకు చూపించని, సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి (SS Rajamouli) ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో దీనిపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించుకున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సరికొత్త లుక్‌లో మహేశ్‌ (Mahesh Babu) కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం గత కొంతకాలంగా ఆయన సన్నద్ధమవుతున్నారు. ఇవన్నీ సినిమాపై ఖచ్చితంగా అంచనాలు పెంచే విషయాలే. అయితే ఫోటోలు, వీడియోలు రాకపోయినా ఈ కాంబినేషన్ గురించి నిరంతరం జనం మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి అసలు నిర్మాతలకు కానీ, డైరెక్టర్ రాజమౌళి కి కానీ ఈ సినిమా హైప్ , క్రేజ్ గురించి అసలు బెంగలేదు. అయినా అక్కడ ఉన్నది సూపర్ స్టార్ మహేష్. మహేష్ సినిమాని ఎవరైనా ఇగ్నోర్ చేయగలరా?

Tags:    

Similar News