'ఉల్లోళుక్కు' తప్పక చూడాల్సిన మలయాళం చిత్రం...

ఇది రివ్యూ కానే కాదు. సినిమా చూశాక కలిగిన అనుభూతి నాలుగు ముక్కల్లో అంతే...

By :  Admin
Update: 2024-08-18 03:14 GMT


-రామ్. సి

ఈ మద్యే మలయాళంలో విడుదలై, ఊర్వశి, పార్వతి తిరువోతు ముఖ్య భూమికలు పోషించిన అందరి ప్రశంసలు అందుకున్న సినిమా ఉల్లోళుక్కు (Ullozhukku)    దీని అర్ధం 'అంతః ప్రవాహం' అని. ఓ విపత్కర పరిస్థుతులలో ఓ అత్తా-కోడలి మధ్య నెలకొన్న సంఘర్షణతో సతమవుతూ చెప్పుకోవాలని, అడగాలని, పంచుకోవాలని, తేల్చుకోవాలనికున్నా, ఏమి చెయ్యలేని, తేల్చుకోలేని, తెమలని ఆలోచనలే ఆ గజిబిజి అంతర్ ప్రవాహం.

ఈ కధలో ప్రకృతి(విపత్తు స్థాయి జోరున కురిసే వర్షం), సమాజం (గ్రామంలోని జనం బంధు మిత్రులు), ఆత్మలు(ముఖ్య పాత్రలదారుల), కాలం(అతి నెమ్మదిగా సాగడం) అన్ని ఆ స్థితిఃలో ఒకేలాగా, ఒకదానికి ఒకటి పరీక్షగా, సహకరించకుండా సాగే అంతర్మథన ప్రవాహం ఈ సినిమా.

ముందుగా ఈ సినిమా చూస్తున్నంత సేపు, చలంగారి కథ లాగా మాత్రమే కాదు, మాటలు, స్క్రీన్ ప్లే కూడా ఆయనే అమర్చరా అన్నట్టు తోచడం ఒక వైపైతే, కుటుంబంలో ఉండే చాలా చిన్న చిన్న విషయాలు, సంగతులు ప్రత్యేకంగా చెప్పదగినవి కాకపోయినా, ఓ చావు జరిగిన ఇంట్లో మానసికంగా, శారీరకంగా, గతం, ప్రస్తుతం, భవిష్యత్తు మధ్య జరిగే బేరీజు, మీమాంసే ఈ సినిమా కథనం. చూసి దాదాపు యాబై రోజులైనా,అనుభవంలో అలా నిలిచిపోయింది.

ఈ ఝంఝాటం అందరు ఎక్కడో ఒక చోట అనుభవించే ఉంటాము,ముఖ్యంగా శవం ముందు పెట్టుకొని జరిగేవి కొంచెం జీర్ణించుకోలేనివి.ఆ చావులో పుట్టుకొచ్చే నిజాలు జీవితాలను మార్చేసేంతగా ఉంటాయి,తారుమారు చెయ్యడంలో సందేహం లేదు.సినిమా చూసిన తరువాత వెంటాడే వర్షపు హోరు శబ్దం చెవిని, మనసును ఆ ముసురు అంత తొందరగా విడిచిపెట్టదు.పైగా నన్ను మొదటిసారిగా, ‘అసలు వర్షం అంటే ఏంటి’ అని ఆలోచింప చేసిన సినిమా Ullozhukku.

నాకెందుకో పక్కవారి స్వార్దం కష్ట పెట్టినా,చిరాకు పెట్టినా, వారిని, వారి ఆలోచనల పంధాను తెలుసుకోనెందుకు నాకు చాలా ఉపయోగపడ్డాయ్. నన్ను నేను కాపాడుకోగలిగాను, నెగ్గుకు రాగాలిగాను.’స్వార్ధం స్వేచ్చకు తాళంచెవి’ అని గ్రహించాను.ఎందుకంటే ఆ తాళం సమర్ధవంత వాడుక అందరికి అంత సులభంగా అబ్బదని నాకు బాగా తెలిసిన విషయం,నాకు వ్యక్తిగతంగాను,వృత్తిపరంగాను ఎంతో పనికొచ్చింది.

మీరేమైనా అనుకోండి స్త్రీకి స్వార్థం ఓ వరం, అందం. ఎంతో బలం కూడాను. జీవిత హెచ్చు తగ్గులను స్వార్ధంతో కూడిన నేర్పుతో ప్రయత్నస్తే తప్పక కోరుకున్నది జరుగుతుందని నా అనుభవం. స్వార్ధం ఎక్కడైనా తప్పోవ్వొచ్చేమో, కానీ ఓ స్త్రీ తన జీవితానికి సంబందించిన విషయాలకు అదే కేంద్రం, పరిష్కారం అని నమ్ముతాను. ఎవరిని వారిగానే గుర్తించే అవకాశం స్వార్ధం మాత్రమే ఇవ్వగలుగుతుందని ,నేను నమ్ముతాను. ఎవరో ఒకరి స్వార్దానికి మోసపోయామని తెలిసిన తరువాత, వీరు కూడా అదే స్వార్థం ఆధారంగా, అంతే పట్టుదలతో, తీక్షణతో ఎంత తొందరగా ఆ కసి తీర్చుకొంటామాని ఆలోచిస్తుంటారు, సంధర్భోచితంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇది సహజం.దర్శకుడు ఆ స్వార్ధ పార్శ్యలే చూపే ప్రయత్నం చేసాడు.



ఓ తండ్రి స్వార్దానికి బలై, ఇష్టపడ్డ వాడ్ని పెళ్లి చేసుకోలేక, వేరొకకిరిని పెళ్లి చేసుకొన్న యువతికి, అతనికి అనారోగ్యం ఉందని, దాని దాచిపెట్టి పెళ్లి చేసారని,తన తల్లికి తెలిసినా చెప్పకపోవటం, అతను పెళ్ళైన కొన్ని నెలలకే చనిపోవడంతో ఆ గుట్టు విషయం బయట పడటంతో తెలుసుకొని,ముందు కుమిలిపోయి తరువాత రగిలిపోయి, అతని శవం ఖననాంతరం, ప్రియుడికి తాడు బొంగరం లేకున్నా, వాడినే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకోవడంతో,ఒకేసారి అందరి మీదా కసి తీర్చుకోవచ్చు అని భావించి సిద్దమైన యువతికి,అలా జరగడానికి వీల్లేదని ఆ నిర్ణయం వల్ల తమ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందిని,తమ స్వార్ధం వల్ల జరిగిన తప్పుకు ఇలా చెయ్యడం భావ్యం కాదనీ అమ్మ నాన్నలు ఓ వైపైతే.


ఇంకో పక్క అత్తగారు తన స్వార్థంతో అనారోగ్యంతో ఉన్న కొడుకు మంచి జరుగుతుందనే ఆకాంక్షతో పెళ్లి చేస్తున్నానని అనుకొంటుంది తప్ప, కోడలిని మోసం చెయ్యాలని కాదు అని చెప్పుకొంటుంది.ఈ అనారోగ్య విషయం తను సంబంధం కుదిర్చిన చర్చి ఫాదర్తో చెప్పానని,తను దాచలేదని చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు పుట్టబోతున్న వారసునితో ఆ కొడుకు జ్ఞాపకాలు కొనసాగించవచ్చని కోరుకొంటుంది, తన యావదాస్తి కోడలికే రాసివ్వాలని కూడా నిర్ణయించుకొన్నానని చెప్పినా, తనకవసరం లేదని తిరస్కరించి కోడలు తన నిర్ణయానికే కట్టుబడి ఉండడాన్ని అత్తగారు జీర్ణించుకోలేక పోతూన్నా, ఉహకందని విధంగా దర్శకుడు ఆవిడచే వియ్యంకులతో, ఇప్పటికైనా స్త్రీ మనసును గుర్తించాలని,వారి అమ్మాయి నిర్ణయాన్ని పూర్తిగా ఆహ్వానించాలని, గౌరవించాలని చెప్పడం,ఓ మంచి దృశ్యం చూసిన ఆనందం చెప్పలేను. కాని, అప్పటికే సమయం చేయిదాటి పోతుంది.

ఇక్కడ సినిమా మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసే వాన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ వైపు, ఊరంతా మోకాలి లోతు నీళ్లతో అందరు పడే అవస్థలు, శవాన్ని పూడ్చడానికి కూడా వీలుపడక మునిగిపోయిన స్మశానం ఓ గట్టి నిర్బంధం సృష్టించడంతో, ఈ సంఘర్షణకు కావాల్సినంత పరిధి దొరుకుతుంది. మునిగిన ఊరు, నిండా మునిగిన జీవితాలు ఎలా ఈదుకొస్తారని చెప్పిన విధానం, స్త్రీ స్వార్థాన్నే ఆధారంగా చేసుకొని మలచిన దర్శక ప్రతిభకు అద్దిన వెండి వర్షపు ధార ఈ సినిమా.

అంతటితో ఆగకుండా,క్షమాపణను కధలోకి తీసుకొచ్చి, దానితో అల్లిన విధానం,ప్రజ్ఞ చలం గారినే స్ఫురణకు తెస్తుంది.సినిమాను అంత వరకు చూసిన కళ్లకు కొత్త అద్దాలు ఇస్తాడు దర్శకుడు.తను మోసం చేసానని అనుకుంటే అత్తగారు కోడలిని క్షమించమని అడగడం,ఆ క్షమాపణలోని తడి మన్సుని గుర్తించిన కోడలు, అదే స్పూర్తితో తను కూడా చనిపోయిన భర్తను తాను తీసుకున్న నిర్ణయానికి అతను క్షమించాలని, ఎందుకంటే తనకు సమస్య చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు, ఇప్పుడు తాను కూడా అతనిని మన్నించాననడం, మనిషి మనిషిని స్వార్ధంతో నిర్బందించుకున్న, కట్టడి చెయ్యబడ్డ సందర్బాల నుండి 'క్షమాపణ'తో ఎలా విముక్తి చేసుకోవచ్చో, వర్షంను మనిషి జీవిత హోరుకు ఉన్న పరమార్థం ఆవిష్కరించిన శైలి తడిసి ముద్ద చేసిందనే చెప్పాలి.

జీవితంలో పలు విషయాల్లో మోసపోయాం అనుకొనే ఈ రెండు స్వార్ధాలు ఎలా తమ సమస్యల్ని పరిష్కరించుకొంటాయన్న సందిదగ్ధం మనలని పాత్రలకు దగ్గర చేస్తాయి.అలా వారిద్దరు తీసేసుకున్న నిర్ణయం ఎలా గమ్యం చేరుకుంటాయో అనేదే సినిమా క్లైమాక్స్. ఆ రస సారాన్ని పాత్రల అంతర్మధన సంద్రంను అనుభవించి తీరాలి. ఆ స్వార్ద సౌందర్యాన్ని ఆస్వాదించాలంతే. వేరే మార్గం లేదు.ఈ ముగింపు వాఖ్యం చలం గారి ప్రభవమే,’స్వేచ్ఛ ఇవ్వడంలో లేదు, తీసుకోవడంలో లేదు,గుర్తించడంలో ఉందని’.


Tags:    

Similar News