'అఖండ'ను దెబ్బకొట్టిన ఈరోస్, అసలేం జరిగిందంటే..

ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ నటించిన అఖండ-2 రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది.

Update: 2025-12-05 04:23 GMT
దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన బాలకృష్ణ (Balakrishna) తాజా చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై నిన్నంతా కొనసాగిన డ్రామాకి గురువారం రాత్రి తెర పడింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్లాన్‌ చేసిన ప్రీమియర్స్‌ను చిత్ర బృందం రద్దు చేసింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ ప్రకటించింది.


 ఈ మేరకు 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ షెడ్యూల్‌ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైనది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చిత్ర నిర్మాత‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
విడుదలపై కోర్టు స్టే
గతంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థతో కలసి ఈరోస్‌ సంస్థ మహేశ్‌బాబు నటించిన ‘వన్‌ నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాలను నిర్మించింది. ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తోంది. 14 రీల్స్‌ సంస్థ నుంచి తమకు రావాల్సిన రూ.28 కోట్లు బకాయిలు ఇప్పించాలని మద్రాస్‌ హైకోర్టును ఈరోస్‌ సంస్థ ఆశ్రయించింది.
14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో భాగస్వాములైన రామ్‌ ఆచంట, గోపీ ఆచంటనే 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టు దృష్టికి తెచ్చింది. తమకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించే వరకు ‘అఖండ’ విడుదలను నిలిపివేయాలని హైకోర్టును కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో గురువారం రాత్రి పడాల్సిన ప్రీమియర్‌ షోలు రద్దు అయ్యాయి. విదేశాల్లోనూ షోలు ఆగిపోయాయి.
Tags:    

Similar News