''పుష్ప-2' మూవీ రివ్యూ

సినిమాలో ఎన్ని పాత్రలున్నా కనిపించేది 'పుష్ప'యే: శృంగవరపు రచన మూవీ రివ్యూ

Update: 2024-12-05 04:26 GMT

ఇప్పుడు దేశమంతా సౌండ్ చేస్తున్న సినిమా 'పుష్ప'...

పాట్నా ప్రమోషన్స్ ఓ వైపు...

'పుష్ప' అంటే నేషనలా అనుకుంటివా కాదు...ఇంటర్ నేషనలూ...

లాంటి భారీ డైలాగ్స్....

మూడేళ్ళ కష్టం....

ఎన్నో వాయిదాలు... పంచాయితీలు....

ఫ్యాన్ వార్స్, పొలిటికల్ వార్స్...

ఇంకో పక్క వేలల్లో టికెట్లు...

స్టేజిల మీద కృత్రిమం అనిపించే హైపులు...

ఇంత రచ్చ రచ్చ చేసిన పుష్ప విడుదలైంది. ఇది నిజంగానే అంత దమ్మున్న సినిమానా లేక 'పుష్ పుష్ పుష్పా 'అంటూ పైకి లేపిన సినిమానా...చూద్దాం ఈ రివ్యూలో!!

పుష్ప -1 గొప్ప సక్సెస్ అయినా....

పుష్ప-1 నిజంగానే గొప్ప ప్రయత్నం, గొప్ప హిట్ కూడా. దానికి కారణం ఒక్కటే కథను బలంగా ప్రెజెంట్ చేయడం! నేచురల్ గా పుష్పని, శ్రీవల్లిని చూపిన తీరు, పుష్ప బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్.... ముందు ఎక్కకపోయినా, మెల్లగా ప్రేక్షకులకు బాగా ఎక్కింది. సుకుమార్ అల్లు అర్జున్ ని చూపించిన స్టైల్ ఓ 'మాస్ మానియా'లా మారిపోయింది. ఎన్నో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతున్న వారితో, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే అనేక రెట్ల వేగంతో అల్లు అర్జున్ కి గుర్తింపు తెచ్చింది ఈ 'పుష్పా కింగ్ డం.' సరే, ఇదంతా ఒక ఎత్తు, సిఖ్వెల్ లు తీసి హిట్ కొట్టడం అంత సులభం కాదు. అందులోనూ స్మగ్లిలింగ్ స్టోరీ అంటేనే ఓ రేంజు అంచనాలు ఉంటాయి. కానీ సుకుమార్ ఆ అంచనాలు అందుకోవడం పక్కన పెడితే, సుకుమార్ ఎన్నో మెట్లు దిగిపోయి ఇంకా చెప్పాలంటే కొంత కమర్షియల్ దిగజారుడుతనంతో తీసిన సినిమా ఇది.

కథ ఏంటి?

దాదాపు మూడున్నర గంటల సేపు పుష్ప ఎలివేషన్ ప్రధానంగా, అదే షెకావత్ విలన్ గా ఉన్న రొటీన్ సినిమా. ఎర్ర చందనం దాటించడం, అడ్డు కోవడం, హీరోయిజం కథలో ఒక భాగం. ఇంకో భాగం సినిమాలో ఉన్న మూడు ఎమోషన్స్... భార్య కోసం ఏదైనా చేయడం, పుష్ప ఇంటిపేరు లేదని బాధపడటం, ఆడపిల్ల పుట్టాలని కోరుకోవడం' చిన్నాన్న' ఎమోషన్...పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి కథలో పెద్దగా ఈ ఎమోషన్స్ కనిపించవు. కంప్లీట్ మాస్ హీరోయిక్ ఫార్ములా పాటిస్తూ, అప్పుడప్పుడూ పై పూతలా ఎమోషన్స్ పూసిన సినిమా ఇది!

నటుల నటన :

స్క్రీన్ మీద పుష్పరాజ్ తప్ప ఎవ్వరూ కనిపించకుండా సుకుమార్ రాసిన స్క్రీన్ ప్లే ఇది. అజయ్, జగపతి బాబు, సునీల్ (మంగళం సీను ), రావు రమేష్ లాంటి మంచి కాస్టింగ్ ఉన్నా పార్ట్ -1 లో ఉన్నట్టు ఎవ్వరికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. ఇది పుష్ప వన్ మేన్ షో గా ఉండటం కోసం రాయడం వల్ల మాత్రమే ఈ నటులకు నటించే అవకాశం లేదు. ఈ సినిమాలో కనిపించే నటుడు పుష్ప, ఆ పుష్పని ఎలివేట్ చేయడానికి శ్రీవల్లి, షెకావత్ ; మిగిలిన వాళ్లు అరకొర సీన్లలో కనిపించినా హీరో కోసమే పుట్టిన పాత్రలు తప్ప కథ కోసం ఉన్నవారు కాదు.

మొత్తం మీద ఈ సినిమాలో ఎన్ని పాత్రలున్నా కనిపించేది 'పుష్పా'నే!

తెలిపోయారా పుష్ప -షెకావత్?

సినిమా జపాన్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ అల్లు అర్జున్ జపాన్ బాష డైలాగ్ డెలివరీ కృతకంగా ఉంది. ఓపెనింగ్ లోనే సినిమా పక్కా కమర్షియల్ స్టైల్ అన్న క్లారిటీ వస్తుంది. పోనీ కమర్షియల్ అయినా, కొంత 'హీరో -విలన్ 'ల రేంజ్ పెరిగితే ఆ ఫార్ములాలో అయినా ఒదిగిపోయేది. కానీ 'పుష్ప-షెకావత్ ' కాంబినేషన్ తో విలనిజం కనిపించే సిఖ్వెన్సెస్ అన్ని కూడా కామిక్ గా ఉండటంతో అటూ పుష్ప, ఇటూ షెకావత్ ఇద్దరూ తేలిపోయారు.

రొమన్సా?? బూతా?

శ్రీవల్లి పుష్ప-1 కి బలం. కథలో స్మగ్లింగ్ అనేక చోట్ల కనక్టింగ్ గా అనిపించకపోయినా, పుష్ప-శ్రీవల్లి లవ్ ట్రాక్ సినిమాను లేపేసింది. ఇద్దరూ చదువుకొని వాళ్లు. పల్లెటూరి మొరటు ప్రేమ, సహజమైన ప్రేమ అది. దాన్ని పెళ్ళి తర్వాత నెక్స్ట్ లెవల్ లో ఎస్టాబ్లిష్ చేయాలంటే 'భార్య' మీద భర్తకు ఉండే ప్రేమను సున్నితంగా, అలాగే కొంత భార్య వ్యక్తిత్వాన్ని బాగా చూపించేలా,ఆ భర్త ఆమెను మాత్రమే ఇష్టపడటానికి ఆమెలో ఉన్న మంచి విషయాలు ఏంటో, భర్త కోసం ఎంత బలంగా నిలబడగలదో వంటివి ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ 'శ్రీవల్లి' చేత పదే పదే ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పించి, ఆ 'లైంగిక వాంఛ'ను చూపించడం కమర్షియల్ దిగజారుడుతనానికి నిదర్శనం.

పుష్పరాజ్ డీల్స్ చేస్తూ మధ్యలో కూరలో ఉప్పు ఎక్కువ విషయం గురించి అనడం, ఆ సదరు భార్య కోపంతో కూర పారేయ్యడం....పుష్ప కి పెట్టిన ఈ 'భార్య ఎమోషన్'స్ట్రాంగ్ గా కాదు చీప్ గా ఉంది!

షోకిల్లా హీరో -బుర్ర లేని విలన్ :

షెకావత్ ఈ సినిమాలో మెయిన్ విలన్. సెకండ్ పార్ట్ లో కూడా బుర్ర లేని పాత్ర ఇది. ఒక్క ఇగో తప్ప ఏమి లేని కేరెక్టర్ ఇది. షెకావత్ -పుష్ప కాంబినేషన్ లో ఉండే 'ఫైర్ 'లేనే లేదు.

ఇక పుష్ప సక్సెస్ ని చూపించడానికి, అతని స్ట్రాటజిస్ట్ గా చూపించడానికి బదులు ఒక షోకిల్లాలా చూపించాడు సుకుమార్. పవర్ ఫుల్ డైలాగ్స్ లేవు, కథ లేదు, మసాలాతో మ్యాజిక్ చేయడానికి మాత్రమే తీసిన సినిమా ఇది.

పుష్ప వన్ మ్యాన్ షో చేశాడా? లేదా?

వన్ మాన్ షో అంటే సినిమా మొత్తానికి హీరోనే ప్రధాన ఆకర్షణగా ఉండటం. ఈ సినిమాలో అల్లు అర్జున్ మానరిజం పార్ట్ -1 కి కొనసాగింపు అంతే!అలాగే కొన్ని చోట్ల డైలాగ్స్ పర్లేదనిపించినా, పెద్ద పవర్ఫుల్ డెలివరీ మాత్రం లేదు. విలన్ మారలేదు, విలన్ కేరెక్టర్ స్ట్రాంగ్ అవ్వలేదు, ఇంకా చెప్పాలంటే స్విమ్మింగ్ సీన్ తో పుష్ప హీరోయిజం లాంటివి ఎస్టాబ్లిష్ చేసినా, పండలేదు. అలాగే లాజికల్ గా కాకుండా, ప్యూర్ హీరో సెంటర్డ్ సినిమా ఇది.అది అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేసినట్టు కన్నా అతి చేసినట్టు అనిపించేలా చేసింది!అలాగే పుష్ప ఎమోషనల్ పర్సనాలిటీ చూపించినప్పుడేమో అప్పటికే వెయ్యి మెట్లు పైన ఉన్న పుష్ప ఒక్కసారిగా ఒకటో మెట్టులో ఉన్నట్టు వీక్ అయిపోయాడు.తన బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ కి నచ్చ్చొచ్చు. కానీ మూడున్నర గంటల సేపు అదే స్టైల్ చివరకు బోర్ కొట్టేసింది. పాత చింతకాయ కథలైన కుటుంబంలో ఒకర్ని కిడ్నాప్ చేయడం, హీరో విడిపించడం... ఇలాంటివి కూడా పరమ చెత్తగా అనిపించడంతో పుష్ప ఇమేజ్ ని ఇలాంటి రొట్ట ఫార్ములా దెబ్బ తీసింది.

సుకుమార్ డిసప్పాయింట్ చేశాడా?

ఈ మధ్య 'కల్కి'సినిమా వచ్చింది. ఒరిజినాలిటీ లోపించిన సినిమా అయినా, హాలీవుడ్ ఛాయలు ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న సినిమాగా నిలిచింది. సుకుమార్ అంటేనే ఎంతో కేర్ ఫుల్ గా స్టోరీని క్రాఫ్ట్ చేసే డైరెక్టర్. అల్లు అర్జున్ తో చేసిన ఆర్య అయినా, రామ్ చరణ్ తో చేసిన 'రంగస్థలం'అయినా, ఎన్ టీ ఆర్ తో చేసిన 'నాన్నకు ప్రేమతో'అయినా.... ఏ సినిమా అయినా సరే మెయిన్ కేరెక్టర్స్ విషయంలో ఆయన రూటే వేరు! కానీ ఈ సినిమాలో ఆ 'సుకుమార్ మార్క్'మిస్ అయ్యింది. కనీసం ఈ కథలతో వచ్చిన హాలివుడ్ సినిమాలను అనుకరించినా , పుష్ప -ద రూల్ ఇంకా బాగుండేది. పుష్ప-1 లో కథ ఉంది. ఇందులో కథ లేదు. మొదటి నుండి చివరి వరకూ పుష్ప ఆ లోకల్ ఐడియాలతో, పగ, ప్రతీకారాలతోనే ఉంటాడు. అంతర్జాతీయ స్థాయి ఆలోచన ఉన్న పుష్ప మిస్ అయిన సినిమా ఇది. హీరోని ఎత్తేసే సీన్లన్నీ కూడా సుకుమార్ తన మార్క్ పక్కన పెట్టి, తూతూ మంత్రంగా తీసిన సినిమాగా అనిపిస్తుంది.

'పెద్దగా ఆలోచించాలి....'

ఈ సినిమాలు పదేపదే పుష్ప 'పెద్దగా ఆలోచించాలి...'అంటాడు.సుకుమార్ ఆ డైలాగ్ ఊరికే కాకుండా స్టోరీ విషయంలో 'think big ' ఫార్ములా పాటిస్తే బావుండేది! అందుకే పుష్ప -2,పుష్ప -1 ముందు చిన్నబోయింది!

ప్రిఖ్వెల్ వాల్యూ -ప్లస్సా? మైనస్సా?

పుష్ప -1 వల్లే పుష్ప -2 కి మార్కెట్ పెరిగింది. అందుకే ఈ సిఖ్వెల్ ని విడిగా చూడలేము. ఆఖరికి ఏ సినిమా ఐటమ్ సాంగ్ కి లేని క్రేజ్ 'ఊ అంటావా...'పాటకు వచ్చింది. అదే కాదు ప్రతి పాటా అంతే! ఆ పోలికతో చూస్తే ఒక్క 'సుసేకి'పాట తప్పించి ఏది ఆ స్థాయిలో లేవు!

ఇక పుష్ప -1 స్టోరీ సహజంగా ఉంది. స్టోరీ ఇంటెన్స్ గా మాత్రమే కాదు, ఎమోషనల్ గా కూడా ఉంది. పుష్ప-2 లో ఈ రెండు లేవు. పుష్ప-1 నే వేరే వెర్షన్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఇది చూస్తుంటే! ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే రన్ టైం, డ్రామా పండకపోవడం, ఎబ్బెట్టు శృంగారం అన్నీ పుష్ప-1 తో పోలిక వచ్చేలా చేస్తాయి. పుష్ప-1 లో ఎక్కువ ఎమోషన్స్ లేవు, ఒక్క శ్రీవల్లే పెద్ద ఎమోషన్! కానీ ఇందులో ఎమోషన్స్ వెతుక్కుంటే అనేకం కనిపిస్తాయి. కానీ ఒక్కటి స్ట్రాంగ్ కాదు. పుష్ప -2 విడిగా చూస్తే, మాస్ సినిమా ఫార్ములాతోనే నడిచింది. కానీ ఆ 'మాస్ ఫైర్ ' కాల్చింది కథతో కాదు ధరలతో మాత్రమే!

ఏం బావున్నాయి?

జాతరలో ఫైట్, శ్రీవల్లి డైలాగ్ డెలివరీ సినిమాకు ప్లస్ పాయింట్.

ఇలాంటి స్ట్రాంగ్ సీన్స్ ఒక 4-5 ఉన్నా సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండేదేమో!

పర్లేదనిపించినవి :

ఇంటర్వెల్ తర్వాత ఫైట్ పర్లేదనిపిపించింది.

'సూసేకి'పాట లిరిక్స్ బావున్నాయి, అలాగే పిక్చరైజేషన్ కూడా కొత్తగా బావుంది. ఇక పీలింగ్స్, కిస్సిక్, టైటిల్ సాంగ్ పెద్ద కిక్కివ్వలేదు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదనిపించింది.

ఒక అన్ ఫినిషెడ్ స్క్రీన్ ప్లే...

వల్గర్ రొమాన్స్...

చీప్ హీరో -విలనిజం...

కలిస్తే పుష్ప -ద రూల్!

ఫ్యాన్స్ కొంత, టికెట్ రేట్స్ కొంత, హైప్ కొంత...కలిసి 'పుష్ పుష్ పుష్పా 'అంటే తోస్తే హిట్ అవ్వొచ్చేమో!కథ పరంగా హిట్ అవ్వడం ఎవడికి కావాలి...అఫ్ కోర్స్ నిన్న దాదాపు 60 పైనే ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినా, రన్ అయిన ప్రీమియర్ లు, ఇక ఈ రోజు నుండి టికెట్ కి 550 కి పైగా టికెట్ల రేటుకి....ఏ సినిమా అయినా కమర్షియల్ హిట్టే కదా!

'No publicity is better than bad publicity!' కాబట్టి ఇది కూడా పుష్పకి కలిసొచ్చినా ఆశ్చర్యం లేదు.


Tags:    

Similar News