‘తుడరుమ్‌’ ఓటిటి మూవీ రివ్యూ

ఇందులో దర్శకుడు సక్సెస్ అయ్యారా..ఈ చిత్రం కథేంటి, అంత పెద్ద హిట్ అవటానికి గల కారణమేంటి?;

Update: 2025-06-09 11:57 GMT

'తుడరుమ్' మళయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం. కేవలం కేరళ బాక్సాఫీసు వద్దే రూ. 100 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా ‘తుడరుమ్‌’ రికార్డు నెలకొల్పింది. ఇదే టైటిల్ తో నే దీన్ని తెలుగులో డబ్ చేశారు. ఇప్పుడు ఓటిటిలోకి వచ్చింది. ఈ టైటిల్ కు అర్థం 'సశేషం',తుడిచివేయడం, కొనసాగడం అని!ఈ టైటిల్‌లోనే ఉంది దాని సినిమా కాన్సెప్టు అంతా. ఇది ఒక చూపుకు అందని మానసిక గాయాన్ని శుద్ధి చేసే ప్రయాణం. ఇది ఒక స్పష్టమైన ‘ఆరంభం-అంతం’ గల కథ కాదుకాదు — ఇది మనసులో మిగిలిపోయే ఒక తీవ్ర అనుభూతి గా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇందులో దర్శకుడు సక్సెస్ అయ్యారా..ఈ చిత్రం కథేంటి, అంత పెద్ద హిట్ అవటానికి గల కారణమేంటి?

స్టోరీ లైన్

ఓ నిశ్శబ్ద గ్రామంలో, నగర శబ్దాలకి దూరంగా, తన పాత అంబాసిడర్ టాక్సీతో నిదానంగా జీవిస్తున్నాడు షణ్ముగం. అతన్ని ఊరంతా ప్రేమగా “బెంజ్” అని పిలుస్తుంది. అతనికి బెంజ్‌ కారుతో సంబంధం లేదు. తన పాత అంబాసిడర్‌నే అతను బెంజ్‌ లా ప్రేమిస్తూంటాడు. ఆ కారుకి గతానికి చెందిన స్మృతి ఉంది.

చాలా ఏళ్ల క్రితం బెంజ్ చెన్నైలోని సినిమా ఫీల్డ్ లో ఫళణిస్వామి (భారతీరాజా) అనే స్టంట్ మాస్టర్ దగ్గర పని చేశాడు. కానీ ఓ సంఘటన తరువాత, ఆ వృత్తిని వీడి తన గ్రామానికి తిరిగి వచ్చి, టాక్సీ డ్రైవర్‌గా జీవితం మొదలుపెట్టాడు. అప్పుడు తన గురువు ఇచ్చిన కారు అది. అందుకే ప్రాణం.

బెంజ్ ది ఒక సాధారణ జీవితమే — భార్య లలిత (శోభన), ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా ఉండే కుటుంబం. కానీ ఈ నిశ్శబ్ద జీవితం ఓ సంఘటనతో తారుమారు అవుతుంది. అతను ఊరులో లేని సమయంలో అతని ప్రాణంగా భావించే అంబాసిడర్ కారుని ఒక వ్యక్తి గంజాయి రవాణాకు వాడతాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుంటారు. బెంజ్, తన కారును పోలీస్ ల తిరిగి తెచ్చుకోవడానికి నరకాన్ని అనుభవిస్తాడు. అతనిని కించపరిచి, నీచంగా ట్రీట్ చేస్తారు.

చివరికి నానా యాతనా పడి కారును తిరిగి తెచ్చుకుంటాడు. కానీ ఇంటికొచ్చేసరికి ఇంజినీరింగ్ చదివే కొడుకు కనిపించడు. ఇక్కడినుంచి కథ మరింత లోతులకు వెళ్తుంది. షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత తను సొంతంగా అన్వేషణ మొదలుపెడతాడు. ఆ క్రమంలో కొన్ని నిజాలు తెలుస్తాయి. ఓ వ్యవస్దే తనను అన్యాయం చేసుకుందని అర్దం చేసుకుంటాడు. అందరూ అతనిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ అతని మౌనంలో ఉన్న విస్ఫోటనాన్ని వారెవరూ గ్రహించరు. అది ఏ స్దాయిలో బ్రద్దలు అవుతుందో,దాని పరిణామాలు ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

"Good screenplays don’t have ‘twists’... they have tonal evolutions."

ఈ సినిమాకు స్క్రీన్ ప్లేనే బలం. ఎక్కడో మొదలైన కథ, ఎక్కడో ముగుస్తుంది. అయితే హింట్స్ ఇస్తూనే ఉంటారు. అవి పే ఆఫ్ అయ్యినప్పుడు మనకు అర్దమవుతాయి. సినిమా ప్రారంభానికి చివరకు అసలు సంభంధం ఉండదనిపిస్తుంది. అంత కూల్ గా మొదలై, అంత వైలెంట్ గా ముగుస్తుంది.

‘తుడరుమ్‌’ ఫస్టాఫ్... ఫీల్ గుడ్ సైటర్ లో చక్కటి ఫన్ తో ముందుకు వెళ్తుంది. కానీ అసలు కథ ఇందుకు భిన్నమైన లోతుల్లో ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత స్క్రీన్‌ప్లే పూర్తిగా ఒక ఎమోషనల్-యాక్షన్ మిక్స్‌లా మారుతుంది. ఈ సినిమాలో బ్యూటీ ఏమిటంటే.. షణ్ముగం పాత్ర స్క్రీన్‌ప్లే ముందుకు వెల్తూంటే మెల్లిగా reveal అవుతుంది.

మొదట్లో ఒక స్వచ్చమైన జీవితం, తర్వాత ఆ జీవితం నెమ్మదిగా చెదిరిపోతూ బయటపడే ఓ నిజం. చివరికి అది ఒక redemption-psychological thriller‌గా మారిపోతుంది. అయితే మెలోడ్రామా చివరిభాగంలో ఎక్కువ అయ్యిందనిపిస్తుంది. అలాగే ఫాదర్-సన్ ట్రాక్ మొదట్లో కొంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.

టెక్నికల్ గా..

దర్శకుడు తరుణ్ మూర్తి ఈ సినిమాను చాలా బాలెన్సెడ్ గా తీసారు. ముఖ్యంగా దృశ్యం సినిమా ట్రాప్ లో పడకుండా ఉండటానికి శతవిధాల ప్రయత్నం చేసారు. అలాగే షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సెకండాఫ్ లో విశ్వరూపం చూపిస్తుంది. టైటు ఫ్రేమ్స్, సిల్హౌట్ షాట్లు, షాడోస్ — ఇవన్నీ కలిసి షణ్ముగం పాత్రకు ఒక అనిశ్చితమైన, మానసిక ప్రపంచాన్ని సృష్టిస్తాయి. అలాగే నిషాద్ యూసఫ్, షఫిక్ వి.బి. చేసిన ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద అస్సెట్. ముఖ్యంగా, షణ్ముగం యొక్క రెండో యాంగిల్ — అతనిలోని మార్పు, నిద్రలేచే క్రూరత్వం — వీటిని చిన్న చిన్న కట్‌లతోనే అద్భుతంగా చూపెట్టారు. జేక్స్ బీజోయ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఫోక్ ఎలిమెంట్స్ అనిపిస్తాయి. డబ్బింగ్ డైలాగులు బాగున్నాయి.

నటీనటుల్లో మోహన్ లాల్, శోభన గురించి ప్రత్యేకించి మాట్లాడుకునేదేమీ లేదు. అయితే ఈ పాత్ర, మోహన్‌లాల్ సినీ జీవితం మీద ఒక ఆర్ట్‌ గ్యాలరీ లాంటిది. మొదట playful, lovable. తరువాత unstable, unpredictable. ఆఖర్లో… dangerous, yet human. అయితకే ఈ సినిమాలో నాకు నిజమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది ఒకరైతే అతడే – ప్రకాశ్ వర్మ. ఒక నిర్దయమైన విలన్‌గా స్క్రీన్‌పై మెరిశాడు.

ఫైనల్ థాట్

సినిమా గా బాగుందనిపించినా చివర్లో కోర్ ఎమోషన్ ని వదిలేసి ఎలివేషన్ కు ప్రయారిటీ ఇవ్వటంతో ఓ మామూలు థ్రిల్లర్ గా మిగిలిపోయింది. అయితేనేం ఓ సగటు సినిమా అభిమానికి కావాల్సినన్ని దినుసులు ఈ సినిమాలో ఉన్నాయి. ఫ్యామిలీలతో కూడా కూర్చుని చూడచ్చు.

ఎక్కడుంది

‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో తెలుగులో ఉంది

Tags:    

Similar News