‘ఆన్ ది రోడ్’ మూవీ రివ్యూ
మూడు హృదయాలు, ఒక రహస్యం
కెనడా స్కైలైన్ మధ్య ఒంటరిగా బ్రతుకుతున్న వరుణ్ (రాఘవ్ తివారీ) కి జీవితం అంటే ఇప్పుడు కేవలం — శృతి (స్వాతి మెహ్రా)ని గుర్తు చేసుకుంటూ నిట్టూర్చటమే, బాధపడటమే. ఆమె వెళ్లిపోయినప్పటి నుండి అతని రోజులు జ్ఞాపకాల స్మశానమైపోయాయి. ఆ వెంటాడే గతం నుంచి తప్పించుకోవటానికి ఇండియా వస్తాడు. అయితే కొన్నిసార్లు గతం నుంచి పారిపోవాలనుకుంటే, అదే గతం నీ ముందే ఎదురుగా నిలబడుతుంది. ఇప్పుడు అదే జరిగింది.
శృతి ఇప్పుడు పెళ్లయిన మహిళ. భర్త రోహన్ (కరణ్ శాస్త్రి) తో కలిసి లడఖ్‌లో తన సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ ఉంటుంది. మంచు లోయల్లో ప్రేమను మరోసారి గుర్తు చేసుకోవాలనుకునే ఆ జంటకు — గతం ఒక కొత్త చలిని తెస్తుంది.
అదే లడఖ్ లోయల్లోకి అనుకోకుండా వీళ్ల ముందుకు వస్తాడు వరుణ్.
ఒక క్షణం — షాక్.
తర్వాత — నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దంలో దాగి ఉంది చెప్పలేని భావం, చెప్పకూడని జ్ఞాపకం.
“ఇప్పుడు మనం అపరిచతులం కదా…” అని శృతి చెప్పినా — ఆమె కళ్లలో ఇంకా ఆ పాత ప్రేమ కాంతి వదలిపోవటం లేదు. రోహన్ ఉనికిలో కూడా, గతపు ఆకర్షణను ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇది తెలియని ఆమె భర్త..అతన్ని కూడా తమతో పాటు ట్రిప్ కు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో ముగ్గురూ కలిసి ఒక ట్రిప్‌కి బయలుదేరుతారు. అదే కారు, అదే దారి, కానీ గమ్యం మాత్రం అనుకోని మలుపు.
కారు మధ్యలో పెట్రోల్ అయిపోతుంది. రోహన్ బయటికి వెళ్తాడు.
మిగిలిపోతారు — గత ప్రేమికులు.
మంచుతో కప్పుకున్న ఆ లోయలో, దాచిపెట్టిన ఎమోషన్‌లకు మంట అంటుతుంది.
ప్రేమ మరోసారి పుడుతుంది… కానీ అదే క్షణం, ఆ లోయలో తిరుగుతున్న డెడ్‌లీ గ్యాంగ్ వారి జీవితాల్లోకి దూసుకొస్తుంది.
తర్వాత ఏం జరిగింది అంటే…
లడఖ్ మంచు రాత్రి రక్తంతో రంగు మార్చుకుంది.
వారిద్దరి మధ్య ఏం జరిగింది?
రోహన్ తిరిగివచ్చేసరికి ఏం చూసాడు?
తన భార్య గతం తెలిసిన భర్త ఏం చేశాడు?
మరి చివరికి – ఎవరు బ్రతికారూ, ఎవరు మిగిలారు?
ఆ ప్రశ్నలన్నీ ఒక్కటే సమాధానం చెబుతాయి —
“లడఖ్ లోయల్లో గతం ఒక్కసారి తిరిగి వస్తే… ప్రేమకీ, ప్రాణానికీ మధ్య తేడా ఉండదు.” .దీని అర్దం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...
“లడఖ్ లోయల్లో డ్రామా, సైలెన్స్, గిల్టీ లవ్ — ఈ రోడ్ ట్రిప్ థ్రిల్లర్ కొత్త అనుభవం” ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. వాస్తవానికి ఈ సినిమాలో చెప్పుకోదగిన కథ ఏమి లేకపోయినా, దాన్ని నిలబెట్టింది పాత్రల మధ్య ఉన్న కాంప్లిక్ట్ . వరుణ్ – శృతి – రోహన్ అనే త్రికోణం మధ్య ఉండే ఎమోషనల్ టెన్షన్, ఆంతరంగిక ఉద్వేగాలు, గిల్ట్ – డిజైర్ – ఫియర్ మిక్సింగ్ — ఇవే ఈ కథని ముందుకు నడిపిస్తాయి.
సినిమా మొత్తం లడఖ్ లోయల్లోనే సెట్ కావడంతో, విజువల్ వేరియేషన్ తక్కువగా ఉన్నా, ఆ ఆర్కిటెక్టురల్ సైలెన్స్ సినిమాకి ఒక సౌండ్‌ట్రాక్‌లా పని చేస్తుంది. అయితే పెద్దగా మలుపులు లేకపోవటం, కథ ఒక్కే లొకేషన్‌లో తిరుగుతూ ఉండటం వల్ల, తెరపై పెద్దగా ఏం “జరిగినట్లుగా” అనిపించదు. నేరేషన్ కూడా నిదానంగా సాగుతుంది.
అయితే — ఇదే పాయింట్‌ని ఈ సినిమా తన బలంగా మార్చుకుంది. ఇది “ఈవెంట్స్” గురించి కాదు, ఇది “ఇంటర్నల్ స్ట్రగుల్” గురించి.
ప్రతి పాత్ర లోపల ఏం జరుగుతుందో, ఆ సైలెన్స్‌లోనే కథ నడుస్తుంది.
అలాగే తెలియని ఆర్టిస్టులైనా, వారు తెరపై నేచురల్‌గా కనిపించడం వలన — ఈ లోయల్లో జరిగే డ్రామా ఆథెంటిక్‌గా అనిపిస్తుంది. అడల్ట్ సీన్స్ కొద్దిగా ఉన్నా, అవి ఎక్స్ప్లాయిటేషన్ కాదు — పాత్రల గందరగోళం, ఆకర్షణ, నైతికత మధ్య ఉన్న టెన్షన్‌ని అండర్‌లైన్ చేస్తాయి.
ఇక రోడ్-ట్రిప్ థ్రిల్లర్స్‌కి సాధారణంగా ఉండే కీలక లక్షణం అయిన జర్నీ ఆర్క్ – భౌతిక ప్రయాణం ఒక అంతర్గత మార్పుకు రూపకంగా చూపెట్టారు. వరుణ్, శృతి, రోహన్ లడఖ్ ప్రయాణం అనేది వారి మనసులోని గతాన్ని ఎదుర్కొనే ప్రయాణం కూడా కావటం విశేషం.
మరో ముఖ్యమైన విశేషం..విస్తారమైన లొకేషన్‌లు, కానీ మనుషులు ఒంటరిగా ఉండటం. ఈ సినిమాలో అది స్పష్టంగా కనపడుతుంది. లడఖ్ లోయలు కేవలం బ్యాక్‌డ్రాప్ కాదు; అవి ఈ పాత్రల మనసులంతే ఖాళీగా, చల్లగా ఉంటాయి.– చివర్లో భౌతిక ముగింపు కన్నా భావోద్వేగ క్లైమాక్స్‌కి ప్రాధాన్యత ఇచ్చారు.
టెక్నికల్ గా
దర్శకుడు సూర్య ప్రకాష్ లక్కోజు ఈ సినిమాను టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా తీర్చిదిద్దారు. సినిమాకు ఉన్న లుక్, టెక్స్చర్ చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది.
గిఫ్టీ మెహ్రా కెమెరా వర్క్ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్. లడఖ్ మంచు లోయల అందాలను కేవలం బ్యాక్‌డ్రాప్‌లా కాకుండా, పాత్రల ఎమోషనల్ స్పేస్‌లా చూపించారు. ఫ్రేమ్‌లలో చల్లదనం, ఒంటరితనం రెండూ కలిపి ఉన్నాయి.
సుర్భిత్ మనోచా కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు పుల్స్ లాంటిది. పెద్ద థ్రిల్లర్ సినిమాలకు ఇచ్చిన రేంజ్‌లో రాసి, చిన్న సినిమాకి భిన్నమైన మూడ్ సృష్టించాడు. నవీన్ కుమార్ వుడ్‌విండ్స్ వర్క్ సీక్వెన్స్‌లలో సౌల్ఫుల్ టచ్ ఇచ్చింది.
మందార్ సావంత్ ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది, స్లో నరేషన్ ఉన్నప్పటికీ సీన్ ట్రాన్సిషన్స్ స్మూత్‌గా మెలిపెట్టారు. సి.వి. రాజు సౌండ్ డిజైన్, అజింక్య వి. లల్ముండే మిక్సింగ్ వర్క్ సినిమాకు ప్రొఫెషనల్ ఫినిష్ ఇచ్చాయి.
మొత్తానికి — తక్కువ ఖర్చుతో తీసినా, టెక్నికల్ క్వాలిటీ మాత్రం హై ఎండ్ లెవల్‌లో ఉంది.
చూడచ్చా
అందరికీ ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ కొత్త తరహా సినిమాలు, ముఖ్యంగా హాలీవుడ్ లో వచ్చే రోడ్ ట్రిప్ థ్రిల్లర్స్ చూసేవారికి నచ్చుతుంది. ఫ్యామిలీలకు కాస్త కష్టమే.
ఫైనల్ థాట్
తెలుగులో “రోడ్ ట్రిప్ థ్రిల్లర్” అనే జానర్ చాలా అరుదు. మన సినిమాలు సాధారణంగా ఈవెంట్-డ్రివన్‌గా, డైలాగ్-డ్రామాగా ఉంటాయి. కానీ ఇక్కడ నెమ్మదైన నరేషన్, సైలెన్స్, స్నో ల్యాండ్‌స్కేప్‌లు, మోరల్ అంబిగ్యువిటీ — ఇవన్నీ హాలీవుడ్ థ్రిల్లర్‌లను గుర్తు చేస్తాయి (Into the Night, Before the Fall, The Invitation లాంటి). ఈ సినిమా కథ సింపుల్‌గా ఉంటుంది, కానీ పాత్రల సైలెన్స్‌కి లోతు ఉంది. ఇది రోడ్ మీద నడిచే డ్రామా కాదు, మనసులో జరుగుతున్న రోడ్ యాత్ర.