రజనీ జీవితంలో కనిపించని శక్తి 'బహదూర్', ఎవరీ వ్యక్తి?
రజనీ పుట్టిన రోజు సందర్భంగా ఈ వ్యాసం;
ఇవాళంటే రజనీకాంత్ తెలియనివాళ్లు లేరు. ఈ పేరులో ఏదో ఆకర్షణ ఉంది, అనుబంధం ఉంది అంటారు. మాటలకందని భావముందని పొగుడుతారు. అయితే రజనీకాంత్ అనే పేరుకు తగ్గట్టు కోట్లాది మనసుల ఆశీర్వాద బలం సంపాదించటం వెనుక చాలా కథ ఉంది. అభిమానుల ఆరాధన వెనక ఉన్న ప్రేమకు కారణం ఉంది. అది రజనీకాంత్ చేసిన కృషి అని ఒక్క మాటతో కొట్టేయొచ్చు. అయితే బెంగళూరులో సిటీబస్ ఆర్డినరీ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుని, సినీ పరిశ్రమకి వచ్చి, ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, ఆ సమయంలో అనేక రకాల అవమానాలను అనుభవించి, చివరికి స్వయంకృషితో భారతీయ చిత్రరంగంలో సూపర్ స్టార్ అనిపించుకోవడం ఉంది చూశారూ. అద్భుతం. నమ్మలేం, కానీ తప్పనిసరిగా నమ్మాల్సిన వాస్తవం.. ఏ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుంది. అలా రజనీ అనే సూపర్ స్టార్ తయారవటానికి సహకరించిన పరిస్థితులు, అందివచ్చిన క్షణాలు ఏమిటి, అన్నిటి కన్నా ముఖ్యంగా ఆయన్ని సినిమాల వైపుగా ప్రయాణింప చేసి, నిలదొక్కుకునేలా చేసిన బహదూర్ ఎవరు.. ?
అది 1969వ సంవత్సరం.....
బెంగళూరులో 10, 10 A నంబర్ శ్రీనగర్ - మెజెస్టిక్ రూట్ సిటీబస్ కండక్టర్ గా చేరాడు శివాజీరావ్ గైక్వాడ్. అతని బస్ డ్రైవర్ బహదూర్. ఇద్దరూ కలిసి పనిచేసేది ఒకే బస్ లో కాబట్టి వారి స్నేహం ముందుకు వెళ్ళింది. ఉదయం షిస్ట్ కాబట్టి ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడం, కబుర్లు, టిఫిన్ కాఫీలు - ఇలా ఇద్దరి మధ్య స్నేహ బంధం బలపడింది. అప్పటి రజనీకాంత్ కు హాబీ నాటకాల్లో నటించడం. ఈ హాబీకి బలం చేకూర్చేలా తన బస్సు డ్రైవర్ బహదూర్ ప్రోత్సాహంతో రజనీ బిటిఎస్ నాలుగవ డిపోలోని నాటక రంగ కళాకారుల బృందం లో చేరాడు. పగటి పూట డ్యూటీ అతని నాటక సాధనకు కలిసొచ్చింది. వరప్రసాదమయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు కండక్టర్గా టికెట్ టికెట్ అంటూ తోలుసంచీ పట్టుకు తిరిగే రజనీ, సాయంత్రమయేప్పటికి నాటక కళాకారుడిగా వేషం మార్చేసేవాడు.
ఆ రోజుల్లో రజనీ ఆడేవన్నీ 'సదారమె', 'కురుక్షేత్ర', 'పచ్చమనాయక లాంటి పౌరాణిక, చారిత్రకనాటకాలే. అందులోనూ రజనీ నటిస్తున్నవి కర్ణ, దుర్యోధన, ఎచ్చమనాయక లాంటి బరువైన పాత్రలే. ఆ రోజుల్లోనే అతను గదను సాధారణంగా ఎత్తగలిగినా అలాచేసేవాడుకాదు. దానిని ఎడమనుండి కుడివైపుకి, కుడివైపునుండి ఎడమవైపుకి తిప్పుతూ, హఠాత్తుగా ఊహించని వేగంతో దాన్ని తన భుజంపైకి ఎత్తేవాడు. అది చూసేవాళ్లకు ఒక విధంగా గొప్ప స్టైల్ అనిపించేది. తోటి కళాకారులు, చూడవచ్చిన ప్రజలు ఆ విన్యాసాన్ని చూసి ఈలలేసి, చప్పట్లు కొడుతూ, ఎగిరిగంతు లేసేవారు, అహర్నిశమూ అతనితో నే వున్న డ్రైవర్ బహదూర్ కు ఓ కొత్త ఐడియా వచ్చింది.
నాటకాల్లోనే ఇన్ని స్టైల్స్ చేస్తున్న ఇతను సినిమాలో చేరితే మరెంత గొప్ప స్థాయికి ఎదగగలడో ? అతడు తన అభిప్రాయాన్ని రజనీకి తెలిపాడు. రజనీకి ఆ అభిప్రాయంవున్నా, చేసే ఉద్యోగాన్ని వదిలి ఎలా వెళ్ళడం? తిండికోసం తిప్పలు పడాల్సి వస్తుందా ? కానీ, అతని ఆలోచనలను దూరంచేశాడు బహదూర్, 'నువ్వేం దిగులు పడకు బ్రదర్! కండక్టర్ పనికి సెలవు పెట్టు. కొన్ని రోజులక్కడ, కొన్ని రోజులిక్కడ పనిచేయి. నీకేదైనా తక్కువైతే నేను సర్దుతాను. నాకెలాగూ పాలడైరీవుంది. కాబట్టి ఈ డ్రైవర్ ఉద్యోగాన్నే నమ్ముకుని కూచోలేదు. నువ్వు ధైర్యంగా ప్రయత్నం చేయి!' అని హామీ ఇచ్చి ఆశ్వీరదించి చెన్నై ట్రైన్ ఎక్కించాడు.
ఆ సమయంలోనే చెన్నై ఫిల్మ్ చేంబర్లో లో ప్రారంభమయింది నటనలో శిక్షణనిచ్చే ఒక సంస్థ. అందులో చేరడానికి దరఖాస్తుతో బాటు మూడు ఫోటోలు కావాలి. అయితే వాటిని తీస్కోడానికి రజనీకి కావలసిన పన్నెండు రూపాయలు కూడా అతని వద్దలేదు. బహదూర్ అతనికి సాయం చేయడంతో వారి స్నేహానికి మరో పార్శ్వం మొదలైంది. అక్కడ అభ్యర్థుల ఇంటర్వ్యూ పూర్తయింది. 'మీరు సెలక్ట్ అయినారు' అని కబురు వచ్చింది. అది విన్న రజనీకి కంగారు. ఏదోరాయి విసిరితే నిజంగానే సెలెక్ట్ చేశారే? అని టెన్షన్. ఏం చేయాలి? వెళ్లాలా వద్దా? వెళితే డబ్బెలా ? రజనీ ఆలోచనలు ఇలా సాగుతుండగా, అతని సాయానికి మరోసారి వచ్చాడు బహదూర్. తను నెలకో రెండువందల రూపాయలు పంపిస్తాననీ, ఎవరి ఇంట్లోనైనా పేయింగ్ గెస్ట్ గా వుండమని సలహా ఇచ్చాడు బహదూర్.
ఆ ధైర్యంతో చెన్నై వచ్చేసాడు రజనీ, అతనికి సహాధ్యాయులుగా చేరారు అశోక్, రఘునందన్, రవీంద్రనాథ్ మొదలైన వారు. బతుకు బండి ఎలాగో సాగుతోంది. ఒక నెలమాత్రం అనుకున్న విధంగా డబ్బును పంపించలేకపోయాడు బహదూర్. సమయానికి చేతికి డబ్బందక రజనీ ఆందోళన చెందాడు. వస్తులు ఉండాల్సి వచ్చింది. 'ఇలాంటి పరిస్థితి మరోసారి నీకు రాకూడదు. ఇదుగో ఈ బంగారు గొలుసు నీ వద్ద ఉంచుకో. అవసరమైతే మార్వాడి వద్ద తాకట్టుపెట్టి డబ్బులు తీసుకో. డబ్బు చేతికందగానే విడిపించుకో' అంటూ బహుదూర్ రజనీని మరోమారు ఆదుకున్నాడు.
రెండేళ్లు గడిచాయి. ఒకసారి రజనీకాంత్ ని ప్రముఖ చిత్ర దర్శకుడు కె. బాలచందర్ ఒక సీన్ నటించి చూపమని కోరడమూ, రజనీ 'తుగ్లక్'' నాటకంలోని ఒక దృశ్యాన్ని నటించి చూపడమూ జరిగింది. అది చూసిన కె. బాలచందర్ ' నువ్వు వీలైనంత త్వరగా తమిళ భాష నేర్చుకో' అన్నారు. బహదూరుకి తమిళం బాగా వచ్చు. ఇద్దరూ తమిళంలోనే మాట్లాడుతున్నా, అక్షరాలు నేర్చుకోలేదు. బహదూర్ తమిళం, కన్నడ అక్షరాలను పోలుస్తూ రజనికి తమిళం నేర్పించాడు. రజనీ శ్రమ ఫలించింది. బాలచందర్ తమ 'అపూర్వ రాగంగన్' చిత్రంలో నటించడానికి రజనీకి ఒక అవకాశం ఇచ్చారు. ఆయనే నటనలోని మెళకువలు నేర్పించారు. 'నీకు శుభం కలుగుతుంది' అని ఆశీర్వదించారు. కానీ భవిష్యత్తులో ఆ కుర్రాడు భారతదేశ చిత్రరంగంలో సూపర్ స్టార్ అవుతాడు అని బాలచందర్ కలలో కూడా ఊహించి వుండరు.
ఆ సినిమా క్లిక్ కావడంతో రజనీకి మరో అవకాశం 'మూన్రాం ముడిచ్చు' (తెలుగులో - చిలకమ్మ చెప్పింది)లో విలన్ పాత్ర. ఒక్కో చిత్రం విజయవంతం కావడంతో రజనీకాంత్ క్రమంగా ఎదిగారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళ చిత్రరంగంలో సూపర్ స్టార్ అనే సింహాసనంపై అధిరోహించారు. పద్మభూషణ్ (2000), పద్మ విభూషణ్ (2016), దాదా ఫాల్కే (2019) అవార్డులు అందుకున్నారు రజనీ. ఇక ఫాల్కే అవార్డును తన గురువు, దర్శకుడు బాలచందర్, మిత్రుడు (బస్ డ్రైవర్) రాజ్ బహుదూర్, తనతో సినిమాలు చేసిన వారికి, తమిళ ప్రజలకు అంకితమిచ్చారు.
రజనీలో గొప్పతనం ఏమిటంటే తనకు నెలనెలా డబ్బు పంపి ఆదుకున్న స్నేహితుడు బహదూరు మరవలేదు. తరచుగా అతడిని చూడడానికి బెంగళూరు వెళుతుంటారు. ఇద్దరూ కలిసి నలుగురెదుటా సరదాగా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. 'విద్యార్థి భవన్'లో నేతి దోశ పార్శల్ కట్టించుకుని కృష్ణారావ్ పార్కులో కూర్చుని తింటారు. రజనీ ఒరిజనల్ వేషంలో వస్తే కష్టం. కానీ అతనలా రాడు. మారువేషం వేసుకుని వస్తాడు. ఒకసారి ఎనభై ఏళ్ళ వృద్ధుని వేషంలో వచ్చాడు. మరోసారి మరొకటి. ఆ తర్వాత ఏం జరింగిది..జరుగుతోంది అనేది అప్రస్తుతం. స్నేహం అనేది రజనీకాంత్ ని సూపర్ స్టార్ చేసింది అనటంలో సందేహం లేదు.
ఏదైమా బెంగుళూరు కారణంతో రజనీకాంత్ అనగానే, ఆ పేరు వినగానే, 'అరె, అతను మా వాడండీ'. 'రజనీకాంత్ అసలు కన్నడవ్యక్తి ' అని కన్నడిగులు ఆనందపడతారు. 'రజనీసార్ నమ్మ తలైవర్ (రజనీకాంత్ సార్ మానాయకుడు) అని తమిళనాడులోని ప్రజలు సగర్వంగా చెప్పుకుంటారు. గొప్పగా సాధించాలనే పట్టుదల, అపారమైన సహనం, పనిలో శ్రద్ధ, పెద్దలపట్ల భక్తి ఈ సుగుణాలున్నవారికి దైవబలం తోడుగా వుంటుందనే మాటకు రజనీకాంత్ జీవితమే సాక్ష్యం.