కులం, ప్రేమ, ఆత్మగౌరవం — ఈ మూడు ఒకే బంధంలో చిక్కుకున్నప్పుడు జీవితమే ఒక యుద్ధరంగం అవుతుంది. ‘డ్యూడ్’లో గగన్ (ప్రదీప్ రంగనాథన్) అదే యుద్ధం చేస్తాడు — తన మనసుతో, తన కుటుంబంతో, తన విధితో.
గగన్(ప్రదీప్ రంగనాథన్) ,మరదలు కుందన(మామితా బైజు) చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. గగన్ ‘సర్ప్రైజ్ డ్యూడ్’ పేరుతో ఓ బిజినెస్ చేస్తూ ఉంటాడు. కుందన కూడా ఆ బిజినెస్లో అతనికి సాయిం చేస్తూ ఉంటుంది. ఇక గగన్ ఆముద అనే అమ్మాయి (నేహాశెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ ఆమె నో చెప్తుంది. అతను ఆ బ్రేకప్ లో ఉండగానే...కుందన వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు గగన్ నేను నిన్ను స్నేహితురాలిగా చూసా... నీపై నాకు అలాంటి ఫీలింగ్ లేదని రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఆమె దూరం అయ్యిపోతుంది.
దాంతో కొద్ది రోజులకు తన జీవితంలో కుందన లేని లోటుని ఫీలైన గగన్.. ఆమెకు తెలీకుండానే ప్రేమిస్తున్నట్టు గమనిస్తాడు. ఇదే విషయం వాళ్ళింట్లో వాళ్లకి చెప్పి.. వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అదే టైంలో వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పి.. గగన్ కి షాక్ ఇస్తుంది కుందన. అతను పార్థు (హ్రిందు హరూన్). అతనితో కాస్త ముందుకు వెళ్లి నెల తప్పుతుంది.
అయితే అందుకు ఆమె తండ్రి ..మినిస్టర్ అయిన ఆదిశేషు(శరత్ కుమార్)..ఒప్పుకోడు. ఆస్తి లేకపోయినా ఫరవాలేదు , అలాగే అనాథ అయినా నా కూతురికి భర్తగా ఒప్పుకుంటాను కానీ.. కులం కానివాడితో పెళ్లి చేయనని చెప్పి కూతుర్నే చంపుకోవడానికి సిద్ధపడతాడు.
ఇలాంటి పరిస్దితుల్లో మేనల్లుడు గగన్ స్వయంగా వచ్చి నీ కూతుర్ని ని చేసుకుంటాను అంటాడు. దాంతో ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే అక్కడే అసలైన కథలో మెలిక...గగన్ అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాడో రివీల్ అవుతుంది. తన మరదలుతో, తను ప్రేమించిన వాడిని ఒక్కటి చేయడానికి గగన్ డిసైడ్ అయ్యాడు అన్నమాట. అప్పుడు ఆ మామయ్య ఒప్పుకుంటాడా..ఈ క్రమంలో అతను ఎలాంటి సాహసం చేశాడు? వాళ్లిద్దర్నీ ఒక్కటి చేయడానికి అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అన్నదే డ్యూడ్ మిగిలిన కథ.
విశ్లేషణ
ఈ సినిమాలో సుఖం ఏమిటంటే...పెద్దగా టెన్షన్ పడుతూ ఏం జరుగుతోందో ఎదర అని వెయిట్ చూస్తూ కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే చాలా భాగం మనం ఊహించినట్లుగానే సాగుతుంది. అదే డ్యూడ్ మేజిక్కు..ఆవేశపడిన మన లక్కు.
మొదటి సగం ఒక పూర్తిగా GenZ వైబ్ తో నడుస్తుంది. గగన్ & కుందన మధ్య ఇన్నోసెంట్ కెమిస్ట్రీ, ఫన్ బాగానే వర్కవుట్ అయ్యింది. అదే సమయంలో ఆ క్యూట్‌నెస్ వెనుక గిల్ట్ ని ఎస్టాబ్లిష్ చేసారు. గగన్ కుందనని ప్రేమించకపోయినా ఆమె ఫీలింగ్స్‌ని నిర్లక్ష్యం చేసిన తప్పు,
తరువాత తనని తానే శిక్షించుకోవాలనుకునే మానసిక స్థితికి నెట్టినట్లు అర్దమవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా బిల్డ్ అయింది —
కానీ అదే బ్లాక్‌లో “ఆర్య 2” déjà vu స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచే “ప్రేమలో గెలవడం కాదు, ప్రేమను కాపాడడం” అనే థీమ్ మొదలవుతుంది.
సెకండ్ హాఫ్ లో సినిమా సీరియస్‌గా మారుతుంది. గగన్ ఒక “మోరల్ వారియర్” లా కనిపిస్తాడు. తన ప్రేమని త్యజించి మరొకరి ప్రేమని నిలబెట్టాలనుకోవడం తాత్వికంగా గొప్పగా ఉన్నా, సినిమాటిక్‌గా సేఫ్ రూట్. రిపీట్ రూట్. ప్రతీ సన్నివేశం — గిల్ట్, త్యాగం అనే సర్కిల్‌లో తిరుగుతుంది. మొదటి సగంలోని స్పాంటేనియిటీ పోయి, రెండవ సగం నైతిక లెక్చర్ లా కనిపిస్తుంది.
“Conflict is the heartbeat of drama. Once the heart stops, the story dies.” – Sid Field
రెండవ సగంలో కథలో అసలు సంఘర్షణ బయటపడిన వెంటనే, హార్ట్‌బీట్ స్లో అయిపోతుంది. క్లైమాక్స్ ప్రెడిక్టబుల్— కానీ భావోద్వేగపరంగా నిజాయితీగా ఉంటుంది. అదే ఈ సినిమాకు బలం , బలహీనత కూడా.గగన్ పాత్రలో అసలు బ్యూటీ — అతను హీరోలా కాదు, హీలర్‌లా రాయబడింది. తన బ్రోకన్ ఎమోషన్స్ ని, ఇతరుల జీవితంలో closure తీసుకురావడం ద్వారా నయం చేసుకోవాలనుకుంటాడు. ఆది శేషు పాత్ర “సమాజ గౌరవం”కి ప్రతీక. గగన్ పాత్ర “వ్యక్తిగత గౌరవం”కి ప్రతీక.
టెక్నికల్ గా..
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం — ఇది సినిమాకు అదనపు “pulse” ఇచ్చింది. స్క్రిప్టు పరంగా స్క్రీన్ ప్లే కాన్వర్షేషన్ లలో కొన్ని షార్ప్ డైలాగులు ఉన్నా, సన్నివేశాల స్థాయిలో కొత్తదనం తక్కువ. దర్శకుడు ప్రయత్నం చేసాడు కానీ కొత్తగా చేయలేదు. సినిమా ఎమోషన్‌తో నడుస్తుంది కానీ లాజిక్‌తో తడబడుతుంది. కులం, ఆత్మగౌరవం వంటి బలమైన థీమ్‌లు surface levelలోనే తేలిపోయాయి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో రిపీట్ సీన్స్ ని షాప్ప్ చేయచ్చు అనిపించింది. చాలా వరకు సినిమా లోపాలను ప్రదీప్ రంగనాథన్ నటన కవర్ చేసింది. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు సహజంగా నటించింది. నేహా శెట్టి స్క్రీన్ స్పేస్ తక్కువ. అలాగే నిర్మాణ విలువలు టాప్ గా ఉన్నాయి.
ఫైనల్ థాట్
‘డ్యూడ్’ అనే పేరు చూసి “జెన్ Z లవ్ డ్రామా” అనుకుని వెళ్లిన వాళ్లు కొంచెం షాక్ అవుతారు — ఇది లవ్ స్టోరీ కాదు, ఒక గిల్ట్ స్టోరీ.ఇదో సేఫ్ మోరల్ లెస్సన్. ఈజీగా చూసేయచ్చు. ఈజీగా మర్చిపోవచ్చు. చూడదగ్గ సినిమా... కానీ ఎక్సపీరియన్స్ చేయదగ్గ కథ కాదు.