నిధి వేట : 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్' వెబ్ సిరీస్ రివ్యూ!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిధి చుట్టూ తిరిగే కథ ఇది.;
ఓటిటిలు వచ్చాక యాక్షన్ అడ్వెంచర్స్ కథలకు మంచి రోజులొచ్చాయి. అనగనగా ఒక నిధి.. అని మొదలయ్యే ఈ తరహా కథలు జనాల్ని ఓటిటిల వైపు తమ తలలు తిప్పేలా చేస్తున్నాయి. ది ఇండియానా జోన్స్, నేషనల్ ట్రెజర్ వంటి అడ్వెంచర్, ట్రెజర్ హంట్ తరహా సినిమాలు, సీరిస్ లు చూడటానికి ఎప్పుడూ సరదాగానే ఉంటాయి. ఇలాంటి ఫార్మెట్ లో వచ్చే సినిమాలు, వెబ్ సీరిస్‌లను ఓటిటిలు కూడా బాగానే ప్రోత్సహిస్తున్నాయి. రీసెంట్ గా ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సీరిస్ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిధి చుట్టూ కథ తిరుగుతుంది. ఆదిత్య సర్పోర్టదార్ దర్శకతం వహించిన సిరీస్ ఇది. గతంలో ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన 'ముంజ్యా' హిట్ కావడంతో, సహజంగానే ఈ సిరీస్ పై అంచనాలు ఉన్నాయి. ఆ కథ ఏమిటి...ఇందులో సాహసాలు ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
రవి భట్ (రాజీవ్ ఖండేల్వాల్) ఓ అనాథ. తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కారు ప్రమాదంలో కోల్పోతాడు. చిన్నప్పటి నుంచి కూడా శివాజీ గురించిన కథలను వింటూ పెరుగుతాడు. అతనికి ఒక రోజున జస్టీస్ కృష్ణ దీక్షిత్ (దిలీప్ ప్రభావల్కర్) కనపడతంతో అతని జీవితం టర్న్ తీసుకుంటుంది. జస్టీస్ కృష్ణదీక్షిత్ కదలికలను కొంతమంది వెంబడిస్తూంటాడు. అలాంటి పరిస్థితుల్లోను ఆయన ఒక పుస్తకాన్ని కష్టపడి తీసుకొచ్చి రవి భట్ కి అందజేస్తాడు.
అలాగే మరో విషయం రవికు చెప్తాడు ఆయన . శివాజీ మహారాజు తదనంతరం ఆయనకి సంబంధించిన నిధిని ఔరంగజేబు సొంతం చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ నిధిని కొంతమంది మరాఠా వీరులు ఒక చోట దాచారనీ .. అప్పటి నుంచి వారి వారసులే ఆ నిధిని రక్షిస్తూ వస్తున్నారనీ .. వారినే శీలేదార్లు అంటారని కృష్ణదీక్షిత్ చెబుతాడు. రవి భట్ కూడా శీలేదార్ల కుటుంబానికి చెందినవాడేనని కృష్ణ దీక్షిత్ చెబుతాడు. అలాగే రవి తాత .. తండ్రి ఆ నిధిని కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయారని వివరిస్తాడు. ఇకపై ఆ నిధిని రక్షించవలసిన బాధ్యతను అతనిదే అంటాడు. అయితే అదే సమయంలో కృష్ణ దీక్షిత్ హత్యకు గురి అవుతాడు. రవి అనుమానితుడుగా మారతాడు. దాంతో పోలీస్ లు వెంటాడతూంటారు.
దాంతో ఆ నిధి ఎక్కడ ఉందనేది తెలుసుకుని, దానిని సంరక్షించడానికి రంగంలోకి దిగుతారు. అయితే ఈ నిధిని కాజేయడానికి ఒక బ్యాచ్ ప్లాన్ చేస్తుంది. అప్పుడేం జరిగింది. ఆ నిధి విషయంలో ఎవరికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ. ఇంతకీ ఆ నిధి ఎక్కడ ఉంటుంది? దాని జాడను రవి భట్ ఎలా కనుక్కుంటాడు? ఆ నిధిని దొంగలించటానికి ప్రయత్నిస్తున్న వారెవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.
ఎనాలసిస్ ...
నిధి వేటకు వెళ్ళే సామాన్యుడి కథలకు కాస్తంత యాక్షన్ అడ్వెంచర్ కలగలిపితే ఇంట్రస్టింగ్ తయారవుతాయని సినిమావాళ్లు నమ్ముతూంటారు. అయితే ఆ నిథి వేటకు నేపధ్యం సరైనది సెట్ కావాలి. అలాగే ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ వెబ్ సిరీస్ కు మంచి నేపధ్యమే సెట్ అయ్యింది. ఆ నిధిని చేరే క్రమంలో హీరోకి సవాళ్లు, ట్విస్టులు ఎదురవుతాయి. చిక్కుముడులను వివ్పుతూ నిధికి చేరేందుకు ప్రయత్నిస్తారు.
అంతా బాగానే ఉంది కానీ చాలా వరకూ ఇంతకు ముందు చూసేసినట్లు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని సంకేతాలను హీరో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడం బాగానే అనిపిస్తుంది. అయితే రహస్యాలను హీరో వెంటనే కనిపెట్టేస్తూ ఉండటం కాస్త నిరాశ పరుస్తుంది. అయితే ఈ సీరిస్ కు పెద్ద ప్లస్ డీసెంట్ గా సాగే స్టోరీ టెల్లింగ్. ఆడియన్స్ కు తర్వాత ఏం జరుగుతుందనే విషయం తెలిసినా ఇంట్రస్ట్ గా చూసేలా డిజైన్ చేసారు.
నిర్మాణం పరంగా చూసుకుంటే ఈ సిరీస్ బాగానే ఖర్చుపెట్టారు. ఆ రిచ్ నెస్ కనపడుతుంది. అయితే ఈ సీరిస్ ముగింపులో ఒక లోపం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. హీరో తన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత తన చుట్టూ వున్న పాత్రల్లో కానీ చూస్తున్న ప్రేక్షకుల్లో కానీ ఎదో ఒక ఇంపాక్ట్ కలిపించలేకపోయారు. టెక్నికల్ గా సినిమాకి మంచి మార్కులు పడతాయి. విజువల్స్ లో మంచి క్యాలిటీ వుంది. ఎడిటర్ స్పీడుగా పరుగెత్తించాడు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మరీ అద్భుతం అని చెప్పడం కాదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా చేశారు.
చూడచ్చా
యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్స్ చూసేవారికి ఈ సీరిస్ ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే శివాజీకి చెందిన చాలా చారిత్రక అంశాలు, మరాఠాల సంస్కృతి ఈ సిరీస్‍లో ఉన్నాయి. అవి కూడా ఇంట్రస్ట్ గానే ఉన్నాయి. ఓ లుక్కేయదగ్గదే.
ఎక్కడ చూడచ్చు
'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.