దైవం, దెయ్యం, నిధి.: ‘జటాధర’ రివ్యూ

కానీ ఎమోషన్ మిస్సింగ్!

Update: 2025-11-07 12:15 GMT

శివ (సుధీర్ బాబు) కార్పోరేట్ కంపెనీలో పనిచేసే సాధారణ ఉద్యోగి. రోజూ ఆఫీస్‌కి వెళ్లి, తన పని చూసుకునే అతనికి వ్యాపకంగా మరో ప్రపంచమే ఉంటుంది . అది దెయ్యాలు లేవని నిరూపించడమే ! భయానక బంగ్లాలు, మూసి ఉన్న చర్చి, పాడుబడిన హవేలీలు... ఇవే అతని ప్రయోగశాలలు. ఆత్మలు, పిశాచాలు అన్నీ కేవలం మనిషి భయమేనని నమ్మకం.

అలా భయానికి భయం పుట్టించాలనుకునే శివని మాత్రం ఒక కల వెంటాడుతోంది — ఒక ఊయలలో పసిబిడ్డ… దాని వైపు కత్తి పట్టుకుని పరుగెత్తే నీడ…!ఆ కల ప్రతిరోజూ అతన్ని వణికిస్తుంది. మొదట దాన్ని లైట్‌గా తీసుకున్న శివ, తరువాత అది తన గతంతో సంబంధముందని గ్రహిస్తాడు.

ఆ క్రమంలో తన నిజమైన మూలం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు శివకు ఒక పేరు వినిపిస్తుంది — “రుద్రారం”. ఆ గ్రామం పేరు విన్నంత మాత్రాన తల్లిదండ్రులు, సితార (హీరోయిన్) భయపడిపోతారు. కానీ శివ మాత్రం ఆగడు. ఎందుకంటే అక్కడే అతని కలకు అక్కడే ఆ ఊళ్లోనే సమాధానం ఉందని అతనికి నమ్మకం.

రుద్రారం చేరిన శివకు వరుసగా రహస్య మరణాలు ఎదురవుతాయి. ఒక మాంత్రికుడితో కలసి జరిగిన నిధి వేట, ఆ నిధిని కాపాడే భయంకర శక్తి… అదే ధనపిశాచి (సోనాక్షి సిన్హా).

దెయ్యాలు లేవని ప్రపంచానికి చెప్పిన శివ ఇప్పుడు ఆ పిశాచం ఉందని నమ్మి, దాని ముందు ఎదురు తిరిగి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ క్రమంలో జరిగే సంఘటనల సమాహారమే మిగతా చిత్రం.

విశ్లేషణ

"నిజాలు చాలా కలిపేస్తే అది తత్త్వం కాదు… గందరగోళం అవుతుంది."

— క్వెంటిన్ టారంటినో

"దెయ్యాలు లేవు" అని నమ్మే వ్యక్తి చివరికి పిశాచి ఎదుట నిలబడటం అనేది ఈ సినిమా కోర్ ఐడియా.. దీన్ని ప్రపంచ సినిమాటిక్ హారర్‌లో చాలా అరుదైన థీమ్ అని దర్శక,నిర్మాతలు నమ్మచ్చేమో కానీ రొటీన్ వ్యవహారమే. మరీ ముఖ్యంగా రైటింగ్ , మౌంటింగ్, సన్నివేశాల నిర్మాణం… ఇవన్నీ గందరగోళంగా సాగిపోవడంతో ఆ ఫిలాసఫీ ప్రేక్షకుడి మనసుకి చేరదు.

అలాగే కథలో మూడు ప్రధాన లేయర్లు ఉన్నాయి:

నిధి / లంకెబిందెలు, ధనపిశాచి అనే శక్తి, శివుడి కలలు, అతని గతం. కానీ ఈ లేయర్లు ఒకదానిని మరొకటి సపోర్ట్ చేయకుండా, పరస్పరంగా తాకుతున్నట్లుగా మాత్రమే ఉన్నాయి.

ఉదాహరణకు — నిధి కథ ఒక పురాతన మిస్టరీ థ్రిల్లర్ అవ్వాలి. పిశాచం ఒక సైకలాజికల్ ఫియర్‌గా ఉండాలి.శివుడి కలలు ఒక ఎమోషనల్ లింక్ ఇవ్వాలి. ఇవన్నీ ఒకే లైన్‌లో అల్లితే — అది “ఫిలాసఫికల్ హారర్” అయ్యేది. కానీ ఈ సినిమా వాటిని మూడు వేర్వేరు జానర్లుగా చూపించింది. ఫలితంగా కథ భయపెట్టదు, ఆకట్టుకోదు, కదిలించదు.

అలాగే శివ (సుధీర్ బాబు) పాత్రకు అంతరంగం లేదు. అతని నమ్మకం, భయం, ప్రేమ, అన్వేషణ — ఇవన్నీ డైలాగ్‌లో మాత్రమే ఉన్నాయి, ప్రవర్తనలో కాదు. ప్రేక్షకుడు అతని భావాన్ని ఎక్సపీరియన్స్ చేయకూడదు, గమనించాలి అనే బలహీనత రైటింగ్‌లో కనిపిస్తుంది.

నారేటివ్ పేస్ & టెంపో ఇలాంటి సినిమాలకు తగ్గ స్దాయిలో లేదు. ఇక శివుడి కలలలో కనిపించే ఊయల, పసిబిడ్డ, కత్తి — ఇవన్నీ అద్భుతమైన సింబాలిక్ టూల్స్. కానీ ఆ ఇమేజ్ రికరెన్స్ (visual motif) ని ప్లాట్ పాయింట్‌గా ఉపయోగించలేదు. ప్రతి సారి ఆ కల వచ్చింది అంటే కథలో ఒక internal revelation రావాలి. కానీ ఇక్కడ అది కేవలం జంప్ కట్ ఎఫెక్ట్ గా మిగిలిపోయింది.

హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో తాండవ సీక్వెన్స్ — ఆలోచన గ్రాండ్!. కానీ సెట్‌అప్ లేకుండా సీన్ వర్కౌట్ కాలేదు. హీరో భౌతికంగా కాకుండా ఆత్మస్థాయిలో పిశాచాన్ని ఎదుర్కోవాల్సింది.

ఏదైమైనా “ధనపిశాచి” ఒక ఆలోచనగా వజ్రం, కానీ స్క్రీన్‌ప్లే దానిపై మట్టి కప్పేసింది.

“It’s not a ghost story. It’s a ghost of a story.”

ఎవరెలా చేసారంటే...

రచన, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్ — అన్నీ తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. కథ సాగుతున్నంత సేపూ ఏదో టీవీ సీరియల్ చూస్తున్న ఫీల్ వస్తుంది.

సుధీర్ బాబు మాత్రం తనవంతు కష్టపడ్డాడు, ముఖ్యంగా చివరి యాక్షన్ బ్లాక్‌లో అతని ఇన్‌టెన్సిటీ కనిపిస్తుంది. కానీ రోల్‌కి ఇన్‌వాల్వ్ అవ్వడానికి స్పేస్‌నే లేదు. స్క్రీన్‌ప్లే అతనిని ముందుకు,వెనక్కి వెళ్లనివ్వకుండా కట్టేసినట్టుంది. సోనాక్షి సిన్హా తెలుగు తెరపై ధనపిశాచిగా ఆకట్టుకోవాలి, కానీ బలహీనమైన పాత్ర రాత, ఇంపాక్ట్‌ లేని ప్రెజెంటేషన్ వల్ల ఆమె ఎంట్రీ కూడా కేవలం ఫ్లాష్‌లా మారిపోయింది.

ఫైనల్ థాట్:

“జటాధర” దేవుడి సినిమా కాదు, దెయ్యం సినిమా కాదు — ఇది నిద్రలోకి దింపే సినిమా! పూర్తయ్యేలోపు మీరు భయపడేది పిశాచం కోసం కాదు… మీ సమయం వృథా అయిపోతుందేమోనని!

తెలుగులో దెయ్యాల కథలు, నిధి అన్వేషణ కథలు, దేవతా శక్తులు కలిసిన మైథికల్ థ్రిల్లర్లు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. “ధనపిశాచి” కూడా అదే మూడు అంశాల మేళవింపు — కానీ సెట్‌అప్ ఎంత బలంగా ఉన్నా, స్టోరీటెల్లింగ్‌లో తేడా ఒక్కటే సినిమా మొత్తాన్ని దెబ్బకొట్టింది.

Tags:    

Similar News