అమాయకత్వం కోల్పోయే క్షణం : ది ఫ్లారిడా ప్రాజక్ట్
నన్ను వెంటాడిన సినిమాలు-4 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);
-రామ్.సి
పిల్లలకు ఓ వయసొచ్చేనంత వరకు అమ్మ నాన్నల జీవనోపాధి ఏంటో ,ఎలా సంపాదిస్తుంటారో తెలియదు. తెలిసినా అది న్యాయబద్దమైనదో కాదో తెలియదు. అదీ గ్రహించినా ఎంత అసాంఘిక, అమానవీయమైనదో తెలియదు. వారు వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నా, చెత్తకుప్పలోనివి ఏరుకుంటున్నా, నేరాలు, దొంగతనాలు, మోసాలు చేస్తున్నా,పాచిపని చేస్తున్నా ఏదైనా సరే, వారికి ఓ వయసు, అనుభవం, అవగహన రావడానికి సమయం పడుతుంది. పిల్లలు అలాంటి అమాయకత్వ కాలాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి, దాటి వచ్చి ప్రపంచాన్ని చూసే క్షణమే The Florida Project.
2025లో 5 ఆస్కార్లు పొందిన 'Anora' చిత్రపు దర్శకుడు Sean Baker ఓ డైనమైట్ డైరెక్టర్ అని తెలుసుకోవడానికి నాకు The Florida Project తోడ్పడింది. అవునండి, ఆ పేలుడు ముందు ‘సుర్’ మంటూ కాలే ఒత్తిలా సాగే కథనం,ఎప్పుడు ఏమైతుందో, ఎలాంటి భయంకరమైన శబ్దం వస్తుందో అంటూ మనం చెవులు, కళ్ళు మూసుకొంటూ, 'అబ్బా! ఇంకా పేలలేదేంటి' అని ఆలోచింపచేస్తూ, ‘ఇది తుస్ అనేలా ఉందే’ అని అనుకొంటున్న తరుణంలో, జరిగే విస్ఫోటనం మనల్ని చిన్నాభిన్నం చేస్తుంది.
కరోనా సమయంలో The Florida Project హృదయాన్ని పిండేసే చిత్రం చూసాను. ఫ్లోరిడా ప్రాంతంలోని Walt Disney World అందించే మాయాజాలానికి అతి సమీపంలో ఉండే ఓ సమూహంను, దాని మిరుమిట్లు గొలిపే కాంతులు తాకలేని అక్కడ నివసించే చిన్నారుల జీవితాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.ఆరేళ్ల Moonee తన తల్లి Halleyతో కలిసి ఓ చీప్ మోటెల్‌లో నివసిస్తూ, తన చిన్న ప్రపంచాన్ని మధురంగా అనుభవిస్తూ రోజువారీ తన సరదాలు వెతుక్కుంటూ గడిపేస్తుంటుంది. తన తల్లి జీవన విధానాలు, సమాజం వారిని ఎలా పక్కన పెట్టిందో తెలియకుండానే, Moonee తన బాల్యాన్ని పూర్తి స్వేచ్ఛతో అక్కడే ఉండే ఇంకొంత మంది పిల్లలతో ఆస్వాదిస్తోంటుంది.
కానీ ఈ అమాయకత్వం ఎంతకాలం నిలుస్తుందో అన్నది సినిమా ప్రారంభించిన క్షణం నుంచే మనకు తెలియని వేదనను గుర్తుచేస్తూనే ఉంటుంది. ‘ఇదిగో ఇప్పుడా, కాదులే’ అంటూ నాకెందుకో సినిమా మొదటిసారి ప్రేక్షకుడితో కాలక్షేపం చేస్తునట్టుగా తోచింది. ఈ కథలోని ప్రధాన భావం పిల్లల అమాయకత్వం మరియు పెద్దల వ్యథల మధ్య తీవ్రమైన వ్యత్యాసం. Moonee దృష్టిలో ఆమె ప్రపంచం రంగురంగుల కట్టుదిట్టమైన కలల రాజ్యం, కానీ ప్రపంచం ఏంటో తెలిసిన ప్రేక్షకుడికి అదో కేవలమైన, చెత్త జీవితం.
Halley అనేక తప్పుదారులు తొక్కినా, తన కూతురిని పసిప్రాయంలోనే ఆ బాధలను మోపకుండా కాపాడాలని, చిన్న చిన్న ఉద్యోగాల మధ్య, అప్పుడప్పుడు ఆకలికి తట్టుకోలేక, గదికి అద్దెలు చెల్లించలేక వ్యభిచారం కూడా చేస్తూ జీవితాన్ని మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తూంటుంది. Mooneeకి ఆవిడ చేసే పనులు అర్థం కావు,కానీ వాటిని తన మాటల చాతుర్యంతో గడిపేస్తుంటుంది. పిల్లలు ఆర్థిక కష్టాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలని మనం భావించినప్పటికీ, వారి బాల్యమే ఓ వ్యర్థమైన పోరాటంగా మారడం ఎంత దురదృష్టకరం!
Disney World వంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సమీపంలో ఉన్నప్పటికీ, Moonee లాంటి పిల్లలకు దాని సందర్శన కలగానే మిగిలిపోతుంది.వారి కోసం ఏదైనా అద్భుతం జరగబోతుందన్న నమ్మకం మనకు ఉంటుంది, కానీ జీవిత సత్యాలు అలా అనుమతించవు.ఈ సినిమా కేవలం ఒక కుటుంబ కథ కాదు; అది మనం చూడకూడదనుకొంటూ దాటిపోతున్న ఎందరో జీవితాల మౌన ఆర్తనాదం.
ఈ కథలో మోటెల్ మేనేజర్ గా కనిపించే Willem Dafoe ఈ పిల్లల్ని ప్రమాదాల నుండి కాపాడడం, వారితో అట్లాడుకోవడం, తన వంతు సహాయం చేయడం, వీటన్నింటిలో అతని మానవత్వం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, చివరికి అతను ఒక పరిమితులున్న వ్యక్తి మాత్రమే అని, ఈ పాత్ర మనకు గుర్తు చేస్తుంది. బహుశా ఈ పాత్ర ప్రేక్షకుడనుకొంటాను నేను.
చివర్లో వచ్చే క్లైమాక్స్ సినిమా మొత్తం ఇచ్చిన ఆ మధురపు అమాయకత్వాన్ని చీల్చి చెండాడి, మన డొక్కలో ఎవరో తన్నినట్టుగా,గట్టిగా గొంతు నొక్కేసినట్టుగా, మన గుండెల్లో ఓ భారంలా మిగిలిపోతుంది. అక్కడి Child Protective Services వారు Halley తల్లిగా తన కర్తవ్యం సరిగా నిర్వహించట్లేదని నిర్దారించుకొని, పై చర్య తీసుకుంటూ, Moonee ని వేరు చేసేందుకు వస్తుంది. ఆ క్షణం వరకూ ధైర్యంగా, శక్తివంతంగా కనిపించిన Moonee, తొలిసారి పూర్తిగా వీగిపోయి, తల్లికి దూరమైపోతున్నానని గ్రహించి, ఓ అతి భయోత్పాతమైన అనుభవానికి లోనై, అమాయకత్వాన్ని వదిలి పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తుంది. ఇది నేను ఇప్పటి వరకు చూసిన అతి దుఖవంతమైన సన్నివేశం.నా చెవుల్లో నేటికి వినిపిస్తూనే ఉంది.
సినిమా మొత్తం, తల్లి వుంది కదా అని నిర్బయంగా ఆడుతూ పడుతూ జీవించేస్తున్న Moonnee కి ఆ ఘట్టం మింగుడుపడదు. ఎదో శాశ్వతంగా తరలి వెళ్ళిపోతున్నట్టు, తన కింద భూమి కంపిస్తున్నట్టు తోచి ప్రదర్శించిన భావం,ఆ పసి మనసు కృంగిపోతుంది. ఆ ఆఫీసర్స్ నుండి తప్పించుకొని, ఏమి చెయ్యాలో తోచక తన మోటెల్ లోనే ఉండే మిత్రురాలు Jency దగ్గరకు పరిగెత్తి చెప్పే చివరి మాటలు, తన వర్ణనాతీత బాధను, అసహాయతను గుర్తించిన ఆ అమ్మాయి Moonnee చేయి పట్టుకొని డిస్నీ వరల్డ్ వైపు పరుగెత్తుతారు.మనం ఆగిపోతాం.