హారర్ కామెడీ : “థామా” మూవీ రివ్యూ

ప్రేమ, రక్తం, రహస్యం

Update: 2025-10-22 02:30 GMT

జర్నలిస్ట్ అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) — ఏదైనా వైరల్ అయ్యే వార్త దొరుకుతుందేమో అని హిమాలయల దగ్గరలో ఉన్న అడవికి వెళ్తాడు . అక్కడ అడవిలో ఓ ఎలుగుబంటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడతాడు. అతను మేల్కొన్నప్పుడు అతని ఎదుట కనిపించే ముఖం — తడ్కా (రష్మిక మందన్నా) ది. ఆమె మనిషి కాదు, బేతాళ జాతికి చెందిన యువతి. మనుష్యుల రక్తం ఆమెకు ఆహారం.

ఇక అక్కడే దాదాపు 75 ఏళ్ల గా బందీగా ఉన్న యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) అనే మహా రాక్షసుడు అలోక్ ను బలి తీసుకోబోతున్న సమయంలో అతణ్ని రక్షిస్తుంది. ఆ క్రమంలో అతనితో పాటు దిల్లీకి వచ్చేస్తుంది తడ్కా. కొంతకాలానికి ఆమె మామూలు మనిషి కాదని నెమ్మదిగా అలోక్ కు అర్థమవుతుంది. ఆమెతో అప్పటికే ప్రేమలో పడతాడు అలోక్.

ఇక దిల్లీ నగరంలోకి అడుగుపెట్టిన తడ్కా, తన చుట్టూ మారిన ప్రపంచాన్ని, తనలో మారుతున్న మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అలోక్‌తో గడిపిన ప్రతి క్షణం ఆమెకు సుఖం కాదు — శాపమే. ఎందుకంటే ఆమె ప్రేమించినంతగా, అతనికి ప్రమాదం పెరుగుతుంది. తన వల్ల అలోక్‌కి ప్రమాదమని గ్రహించిన తడ్కా… అతన్ని వదిలి తిరిగి అడవిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.

కానీ అప్పుడే ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ పరిణామం ఏంటి.. దాని వల్ల అలోక్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. చివరికి అలోక్-తడ్కా కలిశారా లేదా.. ఇంతకీ యక్షాసన్ కథ ఏంటి.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ

ఇది "ట్వైలైట్" లాంటి వాంపైర్‌ కాన్సెప్ట్‌ కాదు. వీళ్లకు సూర్యకాంతి భయం లేదు, చెక్క సుత్తితో గుండెల్లో పొడవడం వల్ల చనిపోయే రూలు కూడా లేదు. నిరెన్ భట్, సురేశ్ మాథ్యూ, అరుణ్ ఫలారా రాసిన ఈ కథ ప్రేక్షకుడిని గందరగోళంలో పడనీయదు. "ట్వైలైట్" ఫ్రాంచైజీ నుండి కొన్ని ప్రధాన అంశాలను తీసుకున్నప్పటికీ, వాటిని పూర్తిగా తమదైన పంథాలో మలచుకున్నారు.

సినిమా మొదటి భాగం చాలా సజావుగా నడుస్తుంది. తడ్కా – అలోక్ ప్రేమకథ సహజమైన సీన్స్ తోనే ముందుకు కదులుతుంది. మధ్యలో కామెడీ దెబ్బ తీసినా....ఆయుష్మాన్ – రష్మిక మధ్య కెమిస్ట్రీ దాన్ని పెద్దగా హైలెట్ కానివ్వదు. అలా ఇంటర్వెల్ పాయింట్ కు వెళ్తుంది. ఆ తర్వాత రెండో భాగం పూర్తిగా రోలర్‌ కోస్టర్ లా వెళ్ళాలి. అయితే అక్కడ తడబడుతుంది. సెకండాప్...యాక్షన్‌, మాంత్రిక గజిబిజి, కార్టూన్‌లా కనిపించే హింసా దృశ్యాల మిశ్రమంగా మారిపోతుంది.

ఇక్కడే సినిమా MHCU (Monster-Horror Cinematic Universe) లోని ఇతర సినిమాలతో (భేడియా, ముంజ్యా, స్త్రీ 2 వంటివి) మెలకువగా మిళితమవుతుంది. కథను రక్తబీజ పురాణంతో కలపడం మాత్రం బాగుంది. కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడే యక్షసన్‌ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) పాత్ర అంతగా కిక్ ఇవ్వదు. అతను ఇంగ్లీష్ మాట్లాడుతూంటాడు. ఎందుకంటే అతను బ్రిటిష్ కాలనీ సైనికుల రక్తం తాగిన రాక్షసుడు అన్న సబ్టెక్స్ట్ ఉంది!. అయితే అతని ప్లాష్ బ్యాక్ ని సీక్వెల్ కోసం దాచేశారు. ఓవరాల్ గా అలా అలా వెళ్లిపోతుంది. ప్రత్యేకమైన ముద్ర వేయదు. అలాగని తీసి పారేయలేము. అలాగే హార్రర్ థ్రిల్లర్ అన్నారు కానీ భయపెట్టే అంశాలైతే అంతగా లేవు.

టెక్నికల్ గా..

ఈ సినిమాలో అసలు హీరో ఎవరంటే — డైలాగ్స్. క్లారిటీతో కూడిన , ఇంటిలిజెంట్ వన్ లైన్స్ బాగా ప్లస్ అయ్యాయి. మనుషులు విషపూరితులు… అందుకే ఇక మనం వారి రక్తం తాగం వంటి కొన్ని డైలాగులు బాగున్నాయి. సచిన్–జిగర్ సంగీతం సినిమాకి నిజమైన ప్రాణం. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా సోల్‌లా పలికింది.

ఎడిటింగ్‌ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ గా అనిపిస్తుంది — కొన్ని సీన్స్ కత్తిరించి ఉంటే పేస్ ఇంకా పటిష్టంగా ఉండేది. సినిమాటోగ్రఫీ మాత్రం క్లాస్ వర్క్ — హిమాలయాల అడవుల్లో కెమెరా కదలికలు, చీకటిలో కాంతి ఆడిన తీరు విజువల్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్‌కి మిస్టిక్ లేయర్ ఉంది.

ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే — మ్యాడాక్ ఫిల్మ్స్ ఎప్పటిలాగా బాగా ఖర్చు పెట్టింది. విజువల్ రిచ్‌నెస్, సౌండ్ డిజైన్, సెట్స్ అన్నీ టాప్-గ్రేడ్‌. దర్శకుడు ఆదిత్య సర్పోద్కర్ కథను ఆసక్తికరంగా నడిపించినా, ముందుభాగంలో వేసిన లింకులు చివర్లో అంతగా పేలలేదు. కాన్సెప్ట్ బలంగా ఉన్నా, ఆ ఎమోషనల్ డెప్త్ మిస్సయింది.

మొత్తానికి, “థమ్మా” టెక్నికల్‌గా పర్ఫెక్ట్‌గా మెరవగా, స్క్రిప్ట్‌ మరింత టైట్‌గా ఉంటే ఇది ఒక స్టాండౌట్ ఫాంటసీ లవ్ డ్రామా అయ్యేది.

ఆయుష్మాన్ ఖురానా కామెడీతో పాటు యాక్షన్ బాగా చేసాడు. రష్మిక మందన్న గ్లామర్ షోతో పాటు బాగా నటించింది కూడా. నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఉన్నది కాసేపే కానీ అదరకొట్టాడు.

ఫైనల్ థాట్

మన తెలుగు వాళ్ళకు ఇది జస్ట్ ఓకే అనిపించవచ్చు. నార్త్ వాళ్లకు కొత్తగా అనిపిస్తే మాత్రం నెక్ట్స్ లెవిల్ లో ఉంటుంది. స్క్రీన్‌ప్లే కొద్దిగా తడబడింది. కానీ కొత్తదనం కోసం వెతికే వారికి “థామా” ఒక ప్రయత్నించదగిన మిస్టిక్ లవ్ ఎక్స్‌పీరియన్స్‌.

Tags:    

Similar News