ఈ శుక్రవారం తెలంగాణా సినిమా థియేటర్స్ క్లోజ్
హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు. మీరు చదివింది నిజమే. అయితే ఇలా హఠాత్తుగా సినిమా ధియేటర్లను మూసివేయటాకి కారణం ఏమిటి..
హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు. మీరు చదివింది నిజమే. అందుతున్న సమాచారం మేరకు మే 17వ తేదీ అంటే శుక్రవారం నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. అయితే ఇలా హఠాత్తుగా సినిమా ధియేటర్లను మూసివేయటాకి కారణం ఏమిటి..ఏమన్నా స్ట్రైక్ జరుగుతోందా అనే సందేహం వస్తుంది. అయితే కారణం వేరు.
సాధారణంగా ఈ సమ్మర్ సీజన్ లో థియేటర్ లు హౌస్ ఫుల్స్ తో ఉంటాయి. అందుకు మేజర్ కారణం స్టార్ హీరోల పెద్ద సినిమాలు రిలీజ్ అవటం,అలాగే చాలా మంది సినిమా ఎలా ఉన్నా ఏసి కోసమైనా థియేటర్స్ కు వస్తూండటం. అయితే గత కొంతకాలంగా పరిస్దితిలు మారాయి. సినిమాకు అద్బుతమైన టాక్ ఉంటే తప్ప థియేటర్ మొహం చూడటం లేదు. దానికి తోడు ఎన్నికలు ప్రధాన కారణం, ఐపీఎల్ ఎఫెక్ట్ తో ఈ వేసవి శెలవుల్లో కొత్త సినిమాలు థియేటర్ కు వెళ్లి మరీ చూసేవి రిలీజ్ కావటం లేదు. దాంతో ఓటిటిలో చూసేస్తున్నారు. ఇక ఏసి కోసం థియేటర్ కు వచ్చే జనం మాగ్జిమం తగ్గిపోయారు. ఇప్పుడు దాదాపు చాలా మంది ఇళ్లల్లో ఏసిలు మెయింటైన్ చేస్తున్నారు.
తెలంగాణా టౌన్ లోని ఓ సినిమా హాల్ యజమాని ఇలా అన్నారు: “ మా సినిమా హాల్ లో ఈ మధ్యకాలంలో నైట్ షోలు తప్పించి ఏమీ నడవలేదు , చాలా సార్లు ఒక్క ప్రేక్షకుడు కూడా లేకపోవడంతో మ్యాట్నీ మరియు ఈవినింగ్ షోలు కూడా తరచుగా నిలిపివేయబడుతున్నాయి. ”
"ఇతర షోలలో కూడా మేము కొన్నిసార్లు 1 నుండి 2% ఆక్యుపెన్సీని చూస్తున్నాము, అందువల్ల మేము హాల్ ను ఓపెన్ చేయాలంటేనే భయపడుతున్నాము . కోవిడ్ రోజులు గుర్తు వస్తున్నాయి, అటువంటి ఆదాయంతో మేము జీతాలు చెల్లించలేము, GST, DMC హోల్డింగ్ టాక్స్ మొదలైనవి చెల్లించలేము" అని చెప్పారు. "మేము ఇంతకుముందు చాలాసార్లు ప్రభుత్వానికి లేఖలు వ్రాసాము, కానీ ఎటువంటి స్పందన లేదు" అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఆ థియేటర్ యజమాని ఆవేదనతో ఆరోపించారు.
ఈ క్రమంలో మల్టిప్లెక్స్ లు కొద్దో గొప్పో షాపింగ్ కాంప్లెక్స్ ల వల్ల బ్రతికి బట్టకడుతున్నాయి. దానికి తోడు అక్కడ మిగతా భాషల చిత్రాలు సబ్ టైటిల్స్ తో వేస్తూంటారు. మల్లిప్లెక్స్ లు ఎగ్రిమెంట్ తో మళయాళ,తమిళ,హిందీ సినిమాలు మల్టిప్లెక్స్ లు వస్తూంటాయి. కానీ సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ శాతం తెలుగు సినిమాలపైనే వాటి నుంచి వచ్చే ఆదాయంతోనే ఆధారపడేవి. మినిమం ఆరు నుంచి పది మంది ఉంటేకానీ సింగిల్ స్క్రీన్స్ లో షోలు వేయలేని పరిస్దితి. ఎందుకంటే కరెంట్ ఛార్జ్ కూడా రికవరీ కాదు.
అప్పటికీ కొన్ని సింగిల్ స్క్రీన్ వాళ్లు రీరిలీజ్ లతో నెట్టుకొద్దామని ట్రై చేసారు. కానీ వాటికి మొదటి రోజు తప్పించి ఓపినింగ్స్ ఉండటం లేదు. ఇటు ఓటిటిల దెబ్బ, అటు పెద్ద సినిమాలు మార్కెట్ లో రిలీజ్ లేకపోవటంతో ఏ చేయాలో తోచని పరిస్దితి ఏర్పడింది. ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్స్ కళ్యాణమండపాల కానూ, అపార్టమెంట్స్ గానూ మారిపోయాయి. మారిపోతున్నాయి.
ఈ క్రమంలో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలను చూడటానికి జనం థియేటర్స్ రాకపోవటంతో అసలు చాలా చోట్ల మినిమం షోలు కూడా పడటం లేదు. ఈ క్రమంలో ధియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవటం.. నష్టాలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో.. ధియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులని సమాచారం. ఇప్పటికైతే తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆంధ్రాలో పరిస్దితి ఏమిటో తెలియాల్సి ఉంది.