శివరాజ్ కుమార్ ' భైరతి రణగల్' మూవీ రివ్యూ
ఈ చిత్రం కథేంటి, తెలుగు వాళ్లకు నచ్చే అంశాలతో రూపొందిందా వంటి విషయాలు చూద్దాం.;
"ఓ గ్యాంగ్‌స్టర్ ఎప్పుడు జన్మించడు. అతన్ని తయారు చేస్తారు' . అనే ట్యాగ్ తో వచ్చిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.21 కోట్లు వసూలు చేసింది. 2017లో వచ్చిన మఫ్తీ మూవీకి ఇది ప్రీక్వెల్ . రుక్మిణి వసంత్ ఫిమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా రూ.18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా కన్నడతోపాటు తెలుగులోనూ రిలీజైనా ఇక్కడి ప్రేక్షకులు ఈ మూవీని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం కథేంటి, తెలుగు వాళ్లకు నచ్చే అంశాలతో రూపొందిందా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్:
ఓ బాధ్యత గల, చట్టాన్ని గౌరవించే లాయర్ ఓ డాన్ గా ఎలా ఎదిగాడన్నదే ప్రధాన కథ. ఈ కథ 1985లో మొదలవుతుంది.రోనాపురం ఊరి ప్రజలు పడుతోన్న కష్టాలను పరిష్కరించే క్రమంలో భైరతి (శివరాజ్‌కుమార్) జైలుపాలవుతాడు. అక్కడే కష్టపడి చదివి లాయర్ అవుతాడు. 21 ఏళ్లపాటు శిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలవుతాడు.
ఈ లోగా తను పుట్టిన పెరిగిన ఊరు పూర్తిగా మారిపోతుంది. భైరతి రణగల్ అడ్వకేట్ గా పనిచేస్తూ, పేదవాళ్లకు అండగా నిలబడతాడు. రోనాపురం భూముల్లో కోట్ల విలువైన ఖనిజాలు బయటపడతాయి. మైనింగ్ బిజినెస్ పేరుతో ఊరిలోని భూములను బిజినెస్‌మెన్ పరండే (రాహుల్ బోస్) ఆక్రమించుకోవడం మొదలుపెడతాడు. పరండే అక్రమాలను కోర్టు ద్వారా అడ్డుకోవాలని చూస్తాడు. కానీ పరండే అధికారం, డబ్బు ముందు భైరతి ఓడిపోతాడు.
పరండే (రాహుల్ బోస్) తో భైరతి రణగల్ గొడవపడతాడు. కార్మికులను బెదిరించడానికీ .. వాళ్లతో పని చేయించుకోవడానికి భైరతి రణగల్ అడ్డుగా ఉండటాన్ని వాళ్లు తట్టుకోలేకపోతారు. ఓ ఘటనలో వాళ్లిద్దరి మధ్యా వివాదాలు మొదలవుతాయి.
భైరతి మంచితనం చూసి, డాక్టర్ వైశాలి(రుక్మిణి వసంత్) ఆరాధిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. అప్పుడు పరండే ఏం చేస్తాడు? ఫలితంగా భైరతి రణగల్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? స్వార్థరాజకీయాలు ఆయనను ఎలా మారుస్తాయి? , రోనాపురాన్ని పరండే బారి నుంచి భైరతి ఎలా కాపాడాడు? ఈ పోరాటంలో అతడికి అండగా నిలిచిన వైశాలి (రుక్మిణి వసంత్) ఎవరు అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది.
ఎలా ఉంది?
మప్టీ సక్సెస్ అయ్యిన తర్వాత దర్శకుడు నర్తన్...అదే సినిమాకు ప్రీక్వెల్ తో మన మందుకు వచ్చాడు. మప్టీ ఎలాంటి టోన్ లో నడుస్తుందో అదే టోన్ లో, స్టైల్ లో ఈ సినిమా నడుస్తుంది. అవినీతితో నిండిపోయిన సిస్టమ్ భైరతి మరోమారు యుద్దం ప్రకటిస్తాడు. అదే గెటప్, అదే లుక్ మెయింటైన్ చేయటంతో మఫ్టీ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది. చట్టాన్ని నమ్మి లాయిర్ అయిన హీరో ఎందుకు అదే చట్టాన్ని ఎదురించే వ్యవస్దగా మారతాడు అనేది ఆసక్తికరంగా నడిపారు. సినిమాలో కావాల్సినంత డ్రామా, హింస ఉంది. ఫస్టాఫ్ స్లో గా నడిచినా,సెకండాఫ్ కు వచ్చేసరికి ఇంటెన్స్ తో పరుగెత్తించాడు. అయితే క్లైమాక్స్ మాత్రం ప్రెడిక్టబుల్ గా మారిపోయింది.
ఈ సినిమా మొదలు, చివర మొత్తం శివరాజ్‌కుమార్. ఆయన ఫెరఫార్మెన్స్ సినిమాని నిలబెట్టింది. తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యావరేజ్ సీన్స్ ను కూడా ఇంటెన్స్ గా మార్చేస్తాడు. భావోద్వేగాలు బలంగా అల్లుకోవటంతో సినిమా కథ రొటీన్ అయినా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే మరో ప్లస్ ఏమిటంటే ఈ సినిమా భారీ డైలాగ్‌లపై ఆధారపడదు. ఏదైమైనా ఈ సినిమా శివరాజ్ కుమార్ అభిమానులకు ఎమోషనల్ బూస్ట్ ఇస్తుంది.
ఎవరెలా చేసారు?
శివరాజ్‌కుమార్ కళ్ళలో ఇంటెన్సిటీ భైరతి అంతర్గత పోరాట తెలియజేస్తాయి. ఆ కళ్లలో కోపం, ధిక్కరణ నుండి మరింత మానవత్వం ఉన్న వైపు, భైరతి యొక్క సంక్లిష్ట ప్రయాణాన్ని న్యాయవాది నుండి తిరుగుబాటుదారుగా ముందుకు తీసుకెళ్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కు ఫెరఫెక్ట్ కథ ఇది. ఇక రుక్మిణి వసంత్ పాత్రకి సింపుల్ గా కనిపిస్తూనే ఆకట్టుకుంది. రాహుల్ బోస్ విలనిజం ఈ సినిమాలో సరిపోలేదు.
అలాగే డైరక్టర్ చాలా జాగ్రత్తగా వర్తమాన భారతాన్ని స్క్రిప్టులోకి తెచ్చే ప్రయత్నం చేసారు. గ్రామాలను కార్పొరేట్ సంస్థలు ఎలా ఆక్రమిస్తున్నాయి? అందుకు స్వార్థ రాజకీయ నాయకులు ఎలా సహకరిస్తున్నారు?అనేది క్లారిటీగా దర్శకుడు చెప్పగలిగాడు.
చూడచ్చా?
తెలుగులో శివరాజ్ కుమార్ కుమార్ సిమిమాలు పెద్దగా ఆడలేదు లేదు కాబట్టి ఆయనతో కనెక్ట్ అవ్వటం కష్టమే. అయితే ఒక్కసారి ఆ స్క్రీన్ ప్రెజన్స్ కు అలవాటు పడి, ఆ ఎమోషన్స్ పట్టుకుంటే సినిమా నచ్చుతుంది. ఓ సారి చూసేయచ్చు.
ఎక్కడుంది?
ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో ఉంది