డిటెక్టివ్ సీరిస్ : 'శేఖర్ హోమ్' వెబ్ సిరీస్ రివ్యూ!

రాసి ఇన్నేళ్లు అయినా ఇప్పటికి ఇంట్రస్టింగ్ గా చదివించే గుణం ఆర్ధర్‌ కానన్‌డయల్‌ ‘అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లాక్‌ హోమ్స్‌’కి ఉంది.

Update: 2024-08-24 09:10 GMT

రాసి ఇన్నేళ్లు అయినా ఇప్పటికి ఇంట్రస్టింగ్ గా చదివించే గుణం ఆర్ధర్‌ కానన్‌డయల్‌ ‘అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లాక్‌ హోమ్స్‌’కి ఉంది.‘ద సైన్‌ ఆఫ్‌ ఫోర్‌’, ‘ఎ స్టడీ ఇన్‌ స్కార్లెట్‌’, ఎ స్కాండల్‌ ఇన్‌ బొహీమియా వంటివి వాటిల్లో ఫలానా ట్విస్ట్ అని తెలిసినా పదే పదే చదువుతూంటారు. అదే విధంగా షెర్లాక్ హోమ్స్ పాత్రను బేస్ చేసుకుని ప్రతీ సంవత్సరం సినిమాలు ,సీరిస్ లు ప్రపంచ దేశాల్లో వస్తూనే ఉన్నాయి. కొన్ని ఉన్నది ఉన్నట్లు తీస్తే, కొన్ని కొత్త కథలురాసి కొనసాగింపు అని చెప్పి తెరకెక్కిస్తూంటారు. ఇప్పుడు ఆ కథలకు అనుకరణగా వచ్చిన శేఖర్ హోమ్ అనే సీరిస్ జనాలను ఆకట్టుకుంటోంది. ఆ సీరిస్ లో ఏముంది..అసలు ఆ సీరిస్ లో కథ ఏముంది వంటి విషయాలు చూద్దాం.

కథేంటి

పశ్చిమ బెంగాల్ లోని 'లోన్ పూర్' లో ఓ డిటెక్టివ్. అతని పేరు శేఖర్ ( కేకే మీనన్). అద్దె ఇంట్లో ఉంటూ, చాలా సాదా సీదాగా ఉంటూ.. ఊహించని , క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. శేఖర్ పేరు ఓ వర్గంలో చాలా పాపులర్ అవుతుంది. స్థానికంగా జరుగుతున్న వరుస హత్యలను గురించి పరిశోధించిన శేఖర్, హంతకులను పట్టుకుని చట్టానికి అప్పగించటంతో అందరి దృష్టీ శేఖర్ పై పడుతుంది. దాంతో శేఖర్ ప్రతిభకు ఆకర్షితుడై అతన్ని వెతుక్కుంటూ వస్తాడు జయ్ వ్రత్ (రణ్ వీర్ షోరే). శేఖర్ ని ఒప్పించి అతనితో కలిసి పనిచేయడం మొదలుపెడతాడు. అయితే క్రిమినల్స్ పట్టుకునే విషయంలో .. కేసులను పరిష్కరించే విషయంలో శేఖర్ స్పీడ్ ను జయ్ వ్రత్ అందుకోలేకపోతుంటాడు.

శేఖర్.. జయ్ వ్రత్ ని తీసుకుని ఓ కేసు నిమిత్తం 'బీహార్' వెళతాడు. అక్కడ అధికారంలో ఉన్న కొంతమంది పొలిటీషన్స్ సీక్రెట్ లను వీడియో రూపంలో ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర ఉంటాయి. తాను కోరినంత డబ్బు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి వాళ్లకి హెచ్చరికలు పంపుతూ ఉంటాడు. ఆ గండం నుంచి గట్టెక్కించమని వారు కోరడంతో శేఖర్ రంగంలోకి దిగుతాడు. ఇదిలా ఉండగా అక్కడ శేఖర్ కి 'ఇరాబతి' (రసిక దుగల్)తో పరిచయమవుతుంది. ఆమె అతణ్ణి వెంటబెట్టుకుని ఒక గ్రామానికి తీసుకుని వెళుతుంది.

ఆ ఊళ్లో జమీందారు కుటుంబానికి చెందిన వ్యక్తులు కొందరు హత్యకి గురవుతారు. అదంతా దెయ్యం పనే అని అంతా అనుకుంటారు. కానీ శేఖర్ రంగంలోకి దిగుతాడు. దెయ్యం పేరు చెప్పి ఎవరు హత్యలు చేస్తున్నారో కనుక్కోవటానికి సిద్దపడతాడు. ఆ ఫ్యామిలీకు మాత్రమే కాకుండా ఆ విలేజ్ ని సైతం భయపెడుతున్న ఆ అదృశ్యశక్తి ఎవరనేది తన తెలివితేటలతో తెలుసుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఏమైంది... పొలిటిషన్స్ కేసుని ఎలా పరిష్కరించాడు. అలాగే ఆ ఊరిని భయపెట్టే దెయ్యం సంగతి ఏం తేల్చాడు వంటి విషయాలు తెలియాలంటే ఈ సీరిస్ చూడాల్సిందే.

ఎలా ఉంది

ఇది ఓ కథ కాదు. కొన్ని కథలు సమాహారం. అలాగే 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ తెరకెక్కించారు. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని సమయంలో డిటిక్టివ్ పూర్తిగా తెలివితేటలతో కేసులను సాల్వ్ చేయడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. వాస్తవానికి షెర్లాక్‌ హోమ్స్‌ కథలన్నీ పారిశ్రామిక విప్లవ ఫలితంగా జరిగిన ఘటనలే, హోమ్స్‌ మిత్రుడు వాట్సన్‌ చెప్పే ఈ కథలన్నీ ప్రథమ పురుషలో సునిశిత హాస్యంతో ఇంట్రస్టింగ్ టర్న్ లతో ముందుకు వెళ్తాయి. అలాగే హోమ్స్‌ పాత్ర మొదటిసారి ప్రత్యక్షమయ్యే ‘ఎ స్టడీ ఇన్‌ స్కార్లెట్‌’ ఒక డిటెక్టివ్‌ భూతద్దాన్ని పరిశోధనలకు వాడడాన్ని మొట్టమొదటిగా చెప్పిన నవల. అలాంటి పాత్రను బేస్ చేసుకుని రాసుకున్న ఈ స్క్రిప్టు కొంతవరకూ ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే కొత్తగా మాత్రం అనిపించదు. క్లైమాక్స్ లో వచ్చే కథలో ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే ఈ సీరిస్ లో మరో విషయం ఏమిటంటే..కథ మారినప్పుడల్లా తెరపైకి కొత్త పాత్రలు వస్తాయి. ఆర్టిస్టులు మారిపోతూంటారు. శేఖర్ ,జయ్ వ్రత్ పాత్రలు రెండు మాత్రమే కంటిన్యూగా ఉంటాయి. వాళ్లిద్దరు మాత్రమే ఒక కేసులో నుంచి మరో కేసులోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి.

టెక్నికల్ గా ...

ఈ సీరిస్ కు ప్రధానంగా తొంభైలలో జరుగుతుంది కాబట్టి అప్పటి కాలం రీక్రియేట్ చేయటంలో టీమ్ చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక మెయిన్ క్యారక్టర్స్ వేసిన ఆర్టిస్ట్ లు అంతా నిజంగానే ఈ పాత్రలు ఉన్నాయేమో అన్నంతలా చేసారు. అలాగే కేసులు, నేపధ్యాలు మనకు తెలిసినవే తీసుకోవటం వల్ల ప్లస్ ..మన మనస్సుకు దగ్గరగా అనిపించటం, మైనస్ ..ప్రెడిక్టబులిటి వచ్చేయటం. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని బాగా చేసారు. ఈ డిటెక్టివ్ డ్రామా సిరీస్, రణవీర్ షోరే, రసిక దుగల్ కీర్తి కుల్హారి నటించారు, దీనికి రోహన్ సిప్పీ శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. శేఖర్ హోమ్ ప్రముఖ బ్రిటిష్ రచయిత ఆర్థర్ కోనన్ డోయల్ సాహిత్య రచనల నుండి ప్రేరణ పొందింది. ఇవి పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని మేకర్స్ ప్రెస్ నోట్‌లో తెలిపారు. కెకే మీనన్ శేఖర్ హోమ్ అనే టైటిల్ రోల్‌ని చేశాడు.

చూడచ్చా

డిటిక్టివ్ సీరిస్ లు చూడటం ఆసక్తి ఉన్నవాళ్లు, సహజత్వానికి దగ్గరగా కథలు చూడాలనుకునే వాళ్లు ఈ సీరిస్ పై ఓ లుక్కేయచ్చు.

ఎక్కడ చూడచ్చు

ఈ సిరీస్ JioCinema ఓటీటిలో తెలుగులో చూడచ్చు.

Tags:    

Similar News