2025 సంక్రాంతి సినిమా : ఎన్ని కోట్లు బిజినెస్ జరిగింది.? టిక్కెట్ రేట్ల పరిస్థితి ఏమిటి
తెలుగు సినిమాకు సంక్రాంతి ప్రత్యేకం. ఈ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమా ఏ మాత్రం బాగుందనిపించినా అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చేసుకుంటాయి.;
తెలుగు సినిమాకు సంక్రాంతి ప్రత్యేకం. ఈ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమా ఏ మాత్రం బాగుందనిపించినా అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చేసుకుంటాయి. అందుకే స్టార్స్ అందరూ మాగ్జిమం సంక్రాంతికే టార్గెట్ చేస్తూంటారు. 2025 సంక్రాంతికి మరికొద్ది రోజులే ఉంది. ఈ నేపథ్యంలోసంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్స్ గేర్ మార్చేసారు దర్శక,నిర్మాతలు. అదే సమయంలో ఈ సినిమాల బిజినెస్ లు అన్నీ క్లోజ్ అయ్యాయి. సంక్రాంతి సినిమాలు ఏ రేటుకు లాక్ చేసి బిజినెస్ క్లోజ్ చేశారు. ఏ సినిమాలు ఎంతెంత రేటుకు అమ్మగలిగారు అనే విషయాలు చూద్దాం.
ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మూడు సినిమాలు (గేమ్ చేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతి వస్తున్నాం) బరిలో దిగుతున్నాయి. ఈ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జానర్లు, మూడు సినిమాల్లోనూ డిఫరెంట్ ఇమేజ్ ఉన్న ముగ్గురు హీరోలు నటించారు. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్ స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి. ఏదే విధంగా బిజినెస్ కూడా మూడు సినిమాలకు మూడు రకాలుగా అయ్యింది. రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj), వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు వరుసగా 10, 12, 14న రాబోతున్నాయి.
సంక్రాంతి బిజినెస్ 200 కోట్లు
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దిల్ రాజు నిర్మించిన భారీ సినిమా గేమ్ చేంజర్, మీడియం సినిమా సంక్రాంతికి వస్తున్నాం రెండూ కలిసి కాంబో లెక్కన ఇచ్చారు. ఆంధ్ర (సీడెడ్ మినహా) మిగిలిన ఏరియాలు అన్నీ కలిపి 80 కోట్లకు ఇచ్చారు. ఇందులో గేమ్ ఛేంజర్ 65 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా 15 కోట్ల లెక్కన ఇచ్చారు. ఏపీ లో వైజాగ్ ఏరియాను నిర్మాత దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు.
అలాగే రెండు సినిమాలు కలిపి సీడెడ్ ఏరియాకు 27 కోట్లకు అమ్మారు. 22 కోట్లు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం 5 కోట్లకు ఇచ్చారు. ఈ సినిమా నైజాం ఏరియాలో నిర్మాత దిల్ రాజే స్వయంగా విడుదల చేసుకుంటున్నారు. బాలయ్య నటించిన డాకూ మహరాజ్ సినిమాను నైజాం ఏరియాకు 18 కోట్లకు విక్రయించారు. ఏపీ ఏరియాను (సీడెడ్ మినహా) 40 కోట్లకు ఇచ్చారు. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద మూడు సంక్రాంతి సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగానే బిజినెస్ సాధించాయని సమాచారం.
సినిమాల విషయానికి వస్తే..
మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది . రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రంకావడం, ఆయన ద్విపాత్రాభినయంతో విభిన్న గెటప్పుల్లో కనిపించనుండడం, శంకర్ తెరకెక్కించిన తొలి సినిమా కావడం.. ఇలా పలు అంశాల్లో ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
బాలయ్య సినిమా అంటే ఆ లెక్కే వేరు. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు బాబీ ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)ను తీసుకురానున్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా మూవీ అది. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ అనే డైలాగ్, మునుపెన్నడూ చూడని లుక్‌లో బాలకృష్ణని పరిచయం చేసిన టీజర్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి రేకెత్తించిందనేది నిజం. జనవరి 12న మూవీ రిలీజ్ అవుతుంది.
ఇక వెంకటేష్ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రాణం. అందుకే టైటిల్‌తోనే ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రం. వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకీ- అనిల్ కాంబోలో వస్తుండడంతో ఈ యాక్షన్ కామెడీ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. పేరుకు తగ్గట్టే పండగ వాతావరణం ఉట్టిపడేలా రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న వస్తుంది.
పెంచిన టిక్కెట్ రేట్లు
ఈ రేట్లు గిట్టుబాటు కావాలంటే టిక్కెట్ రేట్లు పెంచాలి. దీంతో టికెట్ రేట్లను పెంచుకుని కాస్త క్యాష్ చేసుకుందామని నిర్మాతలు ప్లాన్ చేసారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు ఖరారు అయ్యాయి అని సమాచారం. త్వరలో జీవోలు జారీ అవుతాయి అని టాక్. కొత్త రేట్ల ప్రకారం అయితే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు మొదటి వారం ప్రస్తుత టికెట్ రేట్లపై రూ.135 నుండి రూ.175 అదనంగా పెంచేందుకు అనుమతి వచ్చిందని సమాచారం. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా విషయానికొస్తే.. రూ.110 నుండి రూ. 135 అదనంగా పెంచుకునే ఏర్పాటు చేస్తున్నారట. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.75 నుండి రూ.100 పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందని టాక్.