షాహిద్, పూజా హెగ్డే 'దేవా' రివ్యూ
ఓ యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోయిన ఓ పోలీసు అధికారి కథ ఇది.;
ఓ యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోయిన ఓ పోలీసు అధికారి కథ ఇది. మలయాళంలో విజయం సాధించిన ‘ముంబై పోలీస్’ కథని క్లైమాక్స్ ట్విస్ట్ మార్చి, మిగతాదంతా యధావిధిగా హిందీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం జరిగింది. అయితే మలయాళంలో ఈ సినిమా వచ్చి ఒక పన్నెండేళ్లు గడిచింది. కోవిడ్ తర్వాత కథని ప్రేక్షకులు చూసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దశాబ్దం క్రితం సంచలనం అనుకునే అంశం.. ఈ రోజు కామన్ గా అనిపించవచ్చు. ముంబై పోలీస్ కథ చివర్లో ఒక సంచలనమైన ఎలిమెంట్ వుంది. అది మళ్ళీ తెలుగులో కూడా వర్క్ అవుట్ అవుతుందని నమ్మకంతో రెండేళ్ల క్రితం సుధీర్ బాబుతో హంట్ తీశారు. కానీ ఆ సంచలనం తేలిపోయింది. నీరుగారిపోయింది. ఇప్పుడు రిస్క్ ఎందుకులే అని దేవాలో ఆ ఎలిమెంట్ ని తీసేసి మిగతా కథతో ముందుకు వెళ్లిపోయారు. ఇంతకీ ఏమిటా కథ. హిందీలో ఒరిజినల్ ని ఏమి మార్చారో చూద్దాం.
స్టోరీ లైన్
ముంబై క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూంటాడు నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి దేవ్ (షాహిద్ కపూర్). అతని కొలీగ్ రోహన్ డిసిల్వ (పావైల్ గులాటి) ని ఎవరో కాల్చి చంపేయటంత రగిలిపోతాడు. దాంతో ఆ కేసుని దేవ్ డీల్ చేయటం ప్రారంభిస్తాడు. కేసుని విచారించిన దేవ్.... మర్డర్ చేసింది ఎవరో తెలుసుకుంటాడు. హత్య చేసిన వాడి పేరు కమిషనర్ ఫర్హాన్ (పర్వేశ్ రాణా)కు కి చెప్పేలోగా అర్జున్ కారు యాక్సిడెంట్ కి గురి అవుతుంది. ఈ ప్రమాదంలో దేవ్ తన గతం మర్చిపోతాడు. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ కేసు ని విచారించి హత్య చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మళ్ళీ దేవ్ కే అప్పగిస్తాడు కమిషనర్. గతం మర్చిపోయిన దేవ్.. ఈ కేసుని మళ్ళీ రీ ఓపెన్ చేసి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు రోహన్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ? దేవ్ చివరికి హంతకుడిని పట్టుకున్నాడా ? ఇందులో జర్నలిస్ట్ గా కనిపించే పూజా హెగ్డే పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.
కథా, కథన విశ్లేషణ
పైన చెప్పుకున్నట్లు ఈ సినిమా ముంబై పోలీస్ అనే మళయాళ సినిమాకు రీమేక్. ఇదే డైరెక్టర్ హిందీలో ఇప్పుడు చేశారు. తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'హంట్' సినిమా కూడా ఈ సినిమా రీమేక్. తెలుగులో డిజాస్టర్ అయ్యింది. అందుకు కారణం సినిమా చివర్లో సుధీర్ బాబు గే అని తేలటం అని తేల్చారు. మళయాళంలో పన్నెండేళ్ల క్రితం వర్కవుట్ అయ్యి హీరో గే అనే ఎలిమెంట్ తెలుగులో పో బే అన్నట్లు గా మార్చేసింది. దాంతో ఇప్పుడు హిందీ లో ఆ ఎలిమెంట్ ని తీసేసి, మిగతా స్క్రీన్ ప్లే,స్టోరీని అలాగే ఉంచి నడిపారు. అయినా అనుకున్న స్థాయిలో సినిమా కిక్ ఇవ్వలేదు. పదిహేనేళ్ల క్రితం సినిమాని చూస్తున్న ఫీల్ నే తీసుకొచ్చింది. కొత్త కథ అనిపించలేదు. ఇప్పుడు కాలానికి తగినట్లు అప్డేట్ కాలేదనిపించింది.
పన్నెండేళ్ల క్రితం కథ
ఏదైమైనా పన్నెండేళ్ల క్రితం సంచలనం అనుకున్న ఓ పాయింట్ నమ్ముకొని, కేవలం ఒక ట్విస్ట్ పై ఆధారపడి పోయి తీసిన సినిమా ఇది.. షాహిద్ కపూర్ కోరుకునే విజయాన్ని ఇచ్చే చిత్రమైతే కాదు.ఒక మర్డర్ మిస్టరీకి మెమరీ లాస్ ని కలపగా ఈ కథ మొదలవుతుంది. మర్డర్ మిస్టరీలో క్రైమ్ సీన్ బలంగా ఉండాలి. దేవా లో క్రైమ్ సీన్ చాలా బలహీనంగా వుంటుంది. మర్డర్ కేసును విచారణ చేస్తున్నప్పుడు వివిధ పాత్రల పై అనుమానాలు రేకెత్తించేలా సీన్లు అల్లుకుంటారు. . ఇందులో కూడా అలాంటి సీన్స్ వుంటాయి. కానీ అవి ఇంట్రెస్టింగ్ గా వుండవు. చూసేవాడు మెదడుకి కిక్ ఇచ్చే ఒక్క ఎపిసోడ్ కూడా ఇందులో లేదు. సీన్లు అన్నీ అలా సాగుతుంటాయి.
స్క్రిప్టే మైనస్
ముఖ్యంగా కీ సీన్స్ సినిమాటిక్ గా వుంటాయి. ప్రేక్షకులని డైవర్ట్ చేయడానికి మధ్యలో డాన్ అతని ముఠా ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. ఇదీ పెద్ద ఆసక్తికరంగా వుండదు. సెకండాఫ్ పై ఎలాంటి ఇంట్రస్ట్ కలిగించకుండానే ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ మరీ బలహీనంగా తయారైయింది.ఇంట్రవెల్ తర్వాత కూడా కేసు విచారణ ముందుకు సాగదు. నిజానికి ఇందులో విచారించడానికి కేసే లేదని మనకు అర్థమవుతుంది. పన్నెండేళ్ల కింద వచ్చిన కథని యధావిధి ఫాలో కావడం పెద్ద మైనస్. మలయాళం సినిమాలు మామూలుగానే నిధానంగా సాగుతాయి. అలాంటిది పన్నెండేళ్ళ కింద వచ్చిన కథపై మరింత వర్క్ చేయాల్సింది.
టెక్నికల్ గా ...
ప్రొడక్షన్ పరంగా సినిమా డీసెంట్ గా వుంది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ నేపధ్య సంగీతం ఓకే. అమిత్ రాయ్, కెమెరా పనితనం బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి కానీ, అద్బుతమైతే కానీ కాదు. ప్రమోషన్స్ లో చెప్పినంత ఎఫెక్ట్ అయితే ఇందులో కనిపించలేదు.
ఎవరెలా చేసారు
షాహిద్ కపూర్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. అయితే సినిమా చూసిన తర్వాత ఇది అనవసరమైన కష్టం అనిపిస్తుంది. షాహిద్ కపూర్ ఇమేజ్ కి సరిపడే ప్రయత్నమే కానీ కథ కాదు అనిపిస్తుంది. తన పాత్ర వరకూ చక్కగా చేసినప్పటికీ .. ఆ పాత్రని ప్రభావంతంగా మలచడంలో దర్శకుడి వైఫల్యం చెందారని పిస్తుంది. యాక్షన్ సీన్స్ లో షాహిద్ అదరగొట్టారు. మిగతా కీలక పాత్రలు కూడా బలంగా లేవు. పూజ హెగ్డే చేయడానికి పెద్దగా ఏమీ లేదు. సినిమాటిక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ , స్క్రీన్ టైమ్ తక్కువ. పర్వేష్ రానా పాత్రతో ప్రేక్షకులను మిస్ లీడ్ చేయాలనుకునే ప్రయత్నం కొంతమేరకు వర్క్ అవుట్ అయ్యింది.
చూడచ్చా
షాహిద్ కపూర్ అభిమాని అయితే ఓ లుక్కేయచ్చు. అలాగే ముంబై పోలీస్, హంట్ సినిమాలు ఇప్పటికే చూడకపోయి ఉంటే ఈ థ్రిల్లర్ నచ్చే అవకాశం ఉంది.
బ్యానర్: జీ స్టూడియోస్, రాయ్ కపూర్, ఫిల్మ్స్
నటీనటులు: షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పవైల్ గులాటీ, పర్వేష్ రానా తదితరులు
సినిమాటోగ్రఫి: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
పాటలు: విశాల్ మిశ్రా, జేక్స్ బిజోయ్
దర్శకత్వం: రోషన్ అండ్రూస్
నిర్మాత: సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కే ఆర్ బన్సల్
రిలీజ్ డేట్: 2025-01-31