‘ఒకే ఒక్కడు’ తెర వెనక కథ

ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సినిమా 'ఒకే ఒక్కడు'. ఈ సినిమాను హిందీలో రజనీ, షారుఖ్ చేద్దామనుకున్నారు. కానీ ఆఖరు నిమిషంలో నో చెప్పారు. ఎందుకో తెలుసా..

Update: 2024-06-16 10:34 GMT

సినిమాకు ఓ కథ అనుకుని సీన్స్ రాయడం మొదలెట్టాక ఫలానా వాళ్లు హీరోగా ఉంటే బాగుండును అనిపిస్తుంది. కానీ రకరకాల కారణాలతో అనుకున్నవి అనుకున్నట్లు సాగవు. వేరే హీరోతో సినిమా తీసి హిట్ కొట్టాక నాలుక కరుచుకునే హీరోలు కథలు చాలా వింటుంటాం. అలా అర్జున్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఒకే ఒక్కడు’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని మొదట రజనీతో అనుకున్నారు. అలాగే హిందీ వెర్షన్‌కు షారూఖ్ ని ఫిక్స్ అయ్యారు. అయితే అది జరగలేదు. ఎందుకని..తెర వెనక ఏం జరిగింది?

ప్రముఖ తమిళ దర్శకుడు సూపర్ హిట్ చిత్రాలలో ఒకటి ‘ఒకే ఒక్కడు’. ఈ సినిమా అప్పట్లో సౌత్‌లో సృష్టించిన కలెక్షన్స్ సునామి మామూలుది కాదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి షాక్ ఇచ్చింది. కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లే 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చి చెప్తారు. ఇదే చిత్రాన్ని శంకర్ హిందీలో అనిల్ కపూర్‌తో నాయకన్ టైటిల్‌తో పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ మాత్రం ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ఫ్లాఫ్ అవుతుందని షారుఖ్ ముందే ఊహించారు. అందుకే ఆయన మొదట ఈ రీమేక్ సైన్ చేసినా తర్వాత విరమించుకున్నారు.

అప్పట్లో శంకర్ సినిమా అంటే ఓ సెన్సేషన్. ఈయన తీసిన ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘జీన్స్’ , ‘ప్రేమికుడు’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని కొల్లగొట్టాడు. ఈ క్రమంలో శంకర్‌తో పనిచేయాలని అన్ని భాషల్లో హీరోలు ఉవ్విళ్లూరేవారు. అయితే ఆయన తమిళంలోనే సినిమాలు చేసేవారు. ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ క్రమంలో షారుఖ్ దృష్టి సైతం శంకర్‌పై పడింది.

ఈలోగా శంకర్.. ఒకే ఒక్కడు చిత్రం తీసి సూపర్ హిట్ కొట్టారు. అమెరికాలో పాపులర్ టీవీ రిపోర్టర్ నిక్సన్‌కి అమెరికన్ ప్రెసిడెంట్‌కి మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూని ఆధారంగా తీసుకొని ఈ చిత్రం స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడు డైరెక్టర్ శంకర్. ఒక్క రోజులో ముఖ్యమంత్రి అయ్యే వెసులుబాటు ఉందా అనే అంశం మీద హై కోర్టు జడ్జిని కలిసి, అనేక పాయింట్స్ రాసుకొని దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని తయారు చేయించాడు. చాలా మంది హీరోలను ఈ సినిమా కోసం కలిశారు. చివరకు అర్జున్‌తో తీసి పెద్ద హిట్ కొట్టారు. పాటలు అయితే సెన్సేషన్ అయ్యాయి.

 

ఇక ఈ సినిమా రీమేక్‌లో షారూఖ్ అయితే బాగుంటుందని శంకర్ భావించి కలిశారు. ఈ మేరకు సైనింగ్ ఎమౌంట్‌గా కేవలం రూపాయి మాత్రమే షారూఖ్ తీసుకుని సైన్ చేశారు. ఎందుకంటే షారూఖ్‌కు ఎప్పటినుంచో శంకర్‌తో సినిమా చేయాలని ఉందిట. ఈ విషయాలు షారూఖ్ ఓ వెబ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. రూపాయి తీసుకుని ఓ స్టార్ హీరో, బాలీవుడ్ బాద్షా బల్క్ డేట్స్ ఇస్తాను అనడం శంకర్‌ని గాల్లో తేలేలా చేసింది.

వాస్తవానికి షారూఖ్‌కు ఒరిజనల్ ఒకే ఒక్కడు చిత్రం తెగ నచ్చింది. అయితే సినిమా చూశాక తను ఈ సినిమా చేయలేను అన్నారు. అందుకు కారణం షారూఖ్ మాటల్లోనే... కథ ప్రకారం ఒక రోజు.. ఓ జర్నలిస్ట్.. ముఖ్యమంత్రిగా ఉండటం అనేది తమిళ, తెలుగులో వర్కవుట్ అయ్యింది. కానీ నార్త్ ఇండియాకు వచ్చేసరికి అది పెద్ద విషయం కాదు. సౌత్‌లో వర్కవుట్ అయ్యినట్లుగా హిందీలో వర్కవుట్ కాదు. ఇక్కడ జనం దీన్ని పెద్ద విషయంగా సీరియస్‌గా తీసుకోరు అని ఎనాలసిస్ చేసారట. కాన్సెప్టు ఉన్నది ఉన్నట్లుగా హిందిలో వర్కవుట్ కాదు అని తేల్చి చెప్పారట. తర్వాత శంకర్ తో డిస్కషన్ జరిగింది కానీ నేను కన్వీన్స్ కాలేకపోయాను అంటారూ షారూఖ్. దాంతో ఆ ప్రాజెక్టుని అనీల్ కపూర్‌తో చేశారు శంకర్. అయితే షారూఖ్ అన్నట్లుగానే కమర్షియల్ గా ఈ సినిమా నార్త్‌లోపే చెయ్యలేదు.

అయితే ఇప్పటికీ నేను శంకర్ దగ్గర తీసుకున్న సైనింగ్ ఎమౌంట్ అడ్వాన్స్‌గా నా దగ్గరే ఉంది. నేను ఎప్పుడు అడిగినా శంకర్‌కు బల్క్ డేట్స్ ఇస్తాను. నేను ఖచ్చితంగా పనిచేయాలనుకునే డైరక్టర్స్‌లో శంకర్ ఒకరు. నా వరకూ ఆయన ఇండియన్ జేమ్స్ కామెరన్. అయితే మేమిద్దరం కలిసి పనిచేసే రోజు ఎప్పుడు వస్తుందో అంటారూ షారూఖ్.

ఇక్కడే మరో విషయంలో ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్‌ని అనుకున్నారు శంకర్. అయితే ఆయనకీ వెళ్లి కథ చెప్తే , ఇది మన తమిళనాడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నట్లుంది, ఈ సినిమా నేను చేస్తే చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి నేను చెయ్యలేను అని చెప్పాడట. ఆ తర్వాత కమల్‌హాసన్‌ దగ్గరకు వెళ్తే, ఆయన అప్పటికే ‘హేరామ్‌’ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. విక్టరీ వెంకటేష్, విజయ్ వంటి హీరోలను కూడా సంప్రదించాడట శంకర్. కానీ ఎవ్వరూ ఓకే చెయ్యలేదు. ఇక తనతో అప్పటికే ‘జెంటిల్‌మేన్‌’ చేసిన అర్జున్‌తో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ‘ఒకే ఒక్కడు’ చిత్రానికి అర్జున్‌ హీరోగా ఎంపికయ్యారు చివరికి అర్జున్‌తో ఈ చిత్రాన్ని తీసి సౌత్ ఇండియాని షేక్ చేశాడు.

1999 నవంబరు 7న ‘ముదావలన్‌’ పేరుతో తమిళంలో విడుదల కాగా, తెలుగులో నవంబరు 9న ‘ఒకే ఒక్కడు’ పేరుతో విడుదలైన ఘన విజయం సాధించింది.ఈ సినిమా విడుదల సమయంలో తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. తమ పరిపాలనను విమర్శిస్తూ సినిమా తీశారని వివాదం చెలరేగింది. అందుకు తగినట్లు కరుణానిధిని గుర్తు తెచ్చేలా రఘు వరన్‌ డైలాగులు చెప్పటం కూడా ఇందుకు ఓ కారణం. ఇక అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘ఒకే ఒక్కడు’ శంకర్‌ స్పెషల్‌ షో వేశారు.

Tags:    

Similar News