‘శారీ’ మూవీ రివ్యూ
ఈ సినిమా కథేంటి, ఎలా ఉంది, ఈ సినిమాతో వర్మ హిట్ కొట్టారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
సమాజానికి తన సినిమాలకు మధ్య గ్యాప్ మెయింటైన్ చేసే రామ్ గోపాల్ వర్మ ...సోషల్ మీడియాతో వచ్చే సమస్యలను బేస్ చేసుకుని ఓ సినిమా చేస్తున్నా అనగానే ఉలిక్కిపడ్డారు. ఆయన ఏమిటి ..సోషల్ మెసేజ్ ఏమిటి అని సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టుకున్నారు. అయితే ఆ డిస్కషన్ పెట్టుకున్న జనాలైనా టిక్కట్లు కొన్నారా లేదా అనేది ప్రక్కన పెడితే ఈ సినిమా కథేంటి, ఎలా ఉంది, ఈ సినిమాతో వర్మ హిట్ కొట్టారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీలైన్
చీరకట్టుకోవడం అంటే ఇష్టం ఆరాధ్య (ఆరాధ్య దేవి) . వాటితో రీల్స్, వీడియోలు చేస్తూంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంటుంది. ఆరాధ్య అన్నయ్య రాజ్ (సాహిల్ సంభవాల్) కి తన చెల్లి ఇలా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఇష్టం ఉండదు. ఆమెను తరచూ హెచ్చరిస్తూ ఉంటాడు.
ఇదిలా ఉంటే అందమైన చీర కట్టులో ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్ కిట్టు (సత్య యాదు) పిచ్చెక్కిపోతుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని, ఆమెతో ఫోటో షూట్ చేస్తానని చెబుతాడు.కిట్టు కోరిక మేరకు ఆరాధ్య ఫోటో షూట్ కు ఓకే చెప్తుంది. అయితే కిట్టు చూపుల్లోని కామాన్ని గమనించిన రాజ్ అతనికి వార్నింగ్ ఇస్తాడు.
తనకు ఆరాధ్యకు మధ్య రాజ్ అడ్డుగా నిలబడడానికి కిట్టు తట్టుకోలేకపోతాడు. సైకో గా మారిపోయి.... రాజ్ ను హతమార్చాలనుకుంటాడు. ఆరాధ్య కోసం పిచ్చివాడిగా మారిపోయిన కిట్టు ఏం చేశాడు? అతని విపరీత ధోరణికి ఏ ఫలితం దొరికింది. చివరకు ఏమైంది, ఆరాధ్య అతన్ని ఆపగలిందా? చివరకు ఏమైంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ
రామ్ గోపాల్ వర్మ వరుస పెట్టి తీస్తున్న అర్థం పర్థం లేని సినిమాగానే ఉంది. పాయింగ్ ఎత్తుకున్నది ఇప్పటి సొసైటీలో ఎదుర్కొంటున్న పెద్ద సమస్యే కానీ దాదాపు అందరికీ తెలుసున్న సమస్య. దాంతో ఇవన్నీ మాకు తెలుసులే, మాకు ఎందుకీ క్లాస్ లు అన్న ఫీలింగ్ వస్తుంది. పోనీ తెలుసున్నదో, తెలియనదో ఏదో ఒకటి చెప్తున్నారు కదా అని సర్ది చెప్పుకుందామనుకున్నా, సినిమాలో ఎక్కడా ఆసక్తికరమైన సీన్ ఏదీ కనపడదు. ఏదో మొక్కుబడిగా రాసిన సీన్స్, బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే ఈ సినిమాని ముందుకు నడిపిస్తాయి.
ఇది చాలదన్నట్లు కిట్టూ పాత్ర సైకోయిజం, మితిమీరిన హింస, రక్త ప్రవాహం ఇబ్బంది పెట్టాయి. సినిమాలో సాగతీత విసిగిస్తుంది. రామ్ గోపాల్ వర్మ మ్యాజిక్ కనపడదు. ప్రతి పావుగంటకు ఊహల్లో ఓ సాంగ్ వేసుకున్నారు. అవన్నీ ఎరోటిక్ సాంగ్స్. వాటిలో రామ్ గోపాల్ వర్మ ఊహాసుందరిని చూసుకున్నట్లు ఉన్నారు. అలా ఆరాధ్య దేవుని రకరకాలుగా ఊహించుకుంటూ చూపించారు. అంతేగాని ప్రేక్షకులకు ఇవన్నీ నచ్చుతాయా లేవా అన్నది పట్టించుకోలేదు.
టెక్నికల్ గా..
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఒకప్పుడు టెక్నికల్ గా హై స్టాండర్డ్ కు కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవి. అయితే ఈ సినిమాలో అవేమీ కనపడవు. అన్ని జస్ట్ ఓకే అన్నట్లు ఉంటాయి. ఉన్నంతలో ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ మనస్సు పెట్టి చేసారని పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త సౌండ్ తగ్గిస్తే బాగుండేది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ చుట్టేసినట్లు తెలిసిపోతుంది.
నటీనటుల్లో ...
హీరోయిన్ గా ఆరాధ్య వర్కవుట్ కాలేదు. ఆమెలో నటి అయితే కనపడదు. ఏదో పాటల్లో చూడడానికి బాగుందని సెలెక్ట్ చేసి తీశారు. సత్య యాదు బాగా చేసాడు. హీరోయిన్ అన్నగా సాహిల్ శంభావల్, హీరోయిన్ తల్లిదండ్రులుగా కల్పలత, అప్పాజీ అంజరీష్ బాగానే చేశారు.
చూడచ్చా
చివర్లో హీరోయిన్ తన శారీని తగలబెట్టే సీన్ చూసి మనకీ ఈ సినిమాని ఎందుకు తగలబెట్టకుండా రిలీజ్ చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ కోసమైతే సినిమా చూడాలి.