‘ఆర్ఆర్ఆర్’, కేజీఎఫ్ -2 రికార్డులు గల్లంతు చేసిన ‘పుష్ఫరాజ్’
బాహుబలి-2, దంగల్ రికార్డులను అధిగమిస్తుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విశ్లేషకులు
By : Praveen Chepyala
Update: 2024-12-17 12:58 GMT
అల్లు అర్జున్ యాక్షన్ డ్రామా పుష్ప-2 ది రూల్ రికార్డుల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా ‘‘ ఆర్ఆర్ఆర్’’, ప్రశాంత్ నీల్- యష్ కాంబోలో వచ్చిన ‘ కేజీఎఫ్-2’ సాధించిన వసూళ్ల రికార్డును అధిగమించింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది.
పుష్ప - ది రైజ్ కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించారు. సినిమా విడుదల కాగానే రికార్డు స్థాయిలో ఒపెనింగ్స్ సాధించింది. ఇంతకుముందు అత్యధిక ఒపెనింగ్స్ సాధించిన జవాన్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్, 165 కోట్ల నికర వసూళ్లను సంపాదించింది.
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకారం.. 'పుష్ప 2', ప్రపంచవ్యాప్తంగా ₹1,409 కోట్లు వసూలు చేసింది. ఈ వారంలోనే రూ. 1500 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
'బాహుబలి 2-ది కన్‌క్లూజన్'ని పడగొడతారా?
ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ దూకుడు చూస్తుంటే, SS రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన'బాహుబలి 2-ది కన్‌క్లూజన్' భారత్ లో నెలకొల్పిన ఆల్ టైం రికార్డు వసూళ్లు 1790 కోట్లను దాటేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే పుష్ప -2 దేశంలో సుకుమార్ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలుస్తుంది. దంగల్ సినిమా చైనా లో సాధించిన వసూళ్లతో కలిపి రూ. 2070 కోట్లను కొల్లగొట్టింది. అక్కడే సినిమా ఏకంగా రూ. 400 కోట్లను పైగా సాధించింది.
బాక్సాఫీస్ కలెక్షన్‌లను ట్రాక్ చేసే Sacnilk వెబ్‌సైట్ ప్రకారం, 'పుష్ప సీక్వెల్ SS రాజమౌళి 'RRR' (₹1,230 కోట్లు), యష్ నటించిన 'KGF చాప్టర్ 2' (₹1,215 కోట్లు) జీవితకాల కలెక్షన్‌లను అధిగమించింది.
భారతీయ బాక్సాఫీస్
ఇండియన్ బాక్సాఫీస్‌లో ఇంకా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హైదరాబాద్‌లో చిత్ర హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడంతో సినిమాకి మరింత ప్రచారం లభించింది. శనివారం, ఆదివారం ఈ సినిమా హిందీ మార్కెట్ లో వరుసగా వంద కోట్లగా పైగా వసూళ్లు రాబట్టింది.
12వ రోజు ముగిసే సమయానికి, 'పుష్ప 2-ది రూల్' భారతీయ బాక్సాఫీస్ వద్ద ₹930 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం దంగల్ రికార్డులను ఈ సినిమా అధిగమించగలదా అని సిని విశ్లేషకులు ఉత్కంఠగా చూస్తున్నారు.
హిందీ వెర్షన్ తెలుగును మించిపోయింది
'పుష్ప 2-ది రూల్ హిందీ వెర్షన్ తెలుగు ఒరిజినల్ కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని పలు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రం రెండవ ఆదివారం (11వ రోజు) హిందీ వెర్షన్‌లో ₹500 కోట్ల నికర వసూళ్లను సాధించింది. నార్త్ ఇండియాలో రూ. 500 కోట్లు సాధించిన ఏడో చిత్రం పుష్ప ది రూల్. ఇంతకుముందు షారుక్ ఖాన్ నటించిన జవాన్ 18 రోజులకి రూ. 500 కోట్లు వసూలు చేయగా, అల్లు అర్జున్ సినిమా 12 రోజుల్లోనే ఆ రికార్డులను అందుకుంది.