క్రైమ్ థ్రిల్లర్ 'విస్ఫోట్' OTT మూవీ రివ్యూ!

థియోటర్ రిలీజ్ లేని కొన్ని సినిమాలను తీసుకుని అన్ని భాషల్లోకి డబ్ చేసి తమ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు జియో సినిమా వారు.

Update: 2024-09-13 03:00 GMT

 థియోటర్ రిలీజ్ లేని కొన్ని సినిమాలను తీసుకుని అన్ని భాషల్లోకి డబ్ చేసి తమ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు జియో సినిమా వారు. అలా గత రెండేళ్లుగా థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేసి, అది జరగక ఇప్పుడు జియో సినిమా ద్వారా విస్ఫోట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితీష్ దేశ్ ముఖ్ తాజా చిత్రాలు వర్కవుట్ అవుతున్న నేపధ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ పై కొద్దిగా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే స్దాయిలో ఈ సినిమా ఉందా. రితేశ్ దేశ్‍ముఖ్, ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుంది వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

పైలట్ గా పనిచేసే ఆకాశ్ ( రితేశ్ దేశ్ ముఖ్) కి భార్య తార (ప్రియా బాపట్) తో మంచి అనుభంధమే ఉన్నట్లు కనపడుతుంది . కానీ వారి బంధంలో ఓ తెలియని లోటు కనపడుతుంది . వారి ఒక్కగానొక్క సంతానమే ప్యాడీ. నిరంతరం తన కుటుంబం కోసం పాటుపడే అతనికి ఓ రోజు తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉండటం చూస్తాడు. వాళ్లిద్దరని అనుసరించి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుని నిలదీయాలనుకుంటాడు. అయితే తన దగ్గర ఉన్న కొడుకుని అలాంటి సీన్ కు దూరం పెట్టాలని భావిస్తాడు.

తనకు తెలిసిన రెస్టారెంట్ లో పనిచేసే లక్కీ (క్రిస్ట్లేడిసౌజా) కి కొడుకుని అప్పగించి వెళతాడు. ఆ తర్వాత ఆకాశ్ వెళ్లి తన భార్య తారను నిలదీస్తాడు. అయితే ఆమె ఊహించని విధంగా తను తనతో వచ్చిన జావేద్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు క్లారిటి ఇచ్చేస్తుంది. ఏం చేయాలో, ఏం చెప్పాలో అర్దం కాని స్దితిలో తిరిగి వచ్చి తన కొడుకుని తీసుకువెళ్దామంటే అక్కడ తను ఎవరికైతే అప్పగించాడో ఆమె కానీ, తన కొడుకు కానీ కనిపించరు.

ఇక లక్కీ విషయానికి వస్తే ఆమె.. షోయబ్ (ఫర్దీన్ ఖాన్) ప్రేమలో ఉంటుంది. గతంలో 'తాయ్' గ్యాంగ్ తో కలిసి పనిచేసిన షోయబ్, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజున ఆ గ్యాంగ్ వాళ్లు ఖరీదైన డ్రగ్స్ తో కూడిన జాకెట్ ను షోయబ్ దగ్గర ఉంచుతాడు. తాను దాచిన చోటున అది లేకపోవడంతో షోయబ్ కంగారు పడతాడు. ఆ జాకెట్ కోసం 'తాయ్' రంగంలోకి దిగితే తనతో పాటు లక్కీ ప్రమాదంలో పడతారని షోయబ్ అర్దం చేసుకుంటాడు.

అందుకే రెస్టారెంట్ కి వెళ్లి లక్కీని వెంటబెట్టుకుని బయల్దేరతాడు. కానీ అంతకు ముందే లక్కీ కు ఆకాశ్ తన కొడుకుని అప్పగించి ఉంటాడు. దాంతో అతని కొడుకు ప్యాడీని కూడా తనతో పాటు తీసుకుని ఇంటికి వెళుతుంది. ఈ లోగా తాయ్ వచ్చేస్తుంది. డ్రగ్స్ జాకెట్ కనిపించడం లేదని తెలిసి, లక్కీ ముఖం పై యాసిడ్ పోయడానికి తాయ్ రెడీ అవుతుంది. లక్కీని ఏమీ చేయవద్దనీ, ప్యాడీని అడ్డుపెట్టుకుని ఆ డ్రగ్స్ ఖరీదును ఆ కుర్రాడి తండ్రి నుంచి రాబట్టుకోమని షోయబ్ చెబుతాడు. దాంతో రెండు కోట్లు తీసుకుని రమ్మనమని షోయబ్ తోనే ఆకాష్ కు ఆమె కాల్ చేయిస్తుంది. అప్పుడు ఏమైంది. ఆకాశ్ తన కొడుకుని ఎలా రక్షించుకున్నాడు. లక్కీ,షోయబ్ ఆ క్రైమ్ వలయం నుంచి ఎలా తప్పించుకున్నారనేది మిగతా కథ.

ఎలా ఉంది

వెనుజువెలా మూవీ ‘రాక్, పేపర్, సిజర్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబై బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని మార్చి రూపొందించారు డైరెక్టర్ కూకీ గులాటీ. సినిమా చూడటానికి బాగానే ఉంటుంది. అయితే థియేటర్ మార్కెట్ కు అనువుగా ఉండేటంత కమర్షియల్ యాస్పెక్ట్ ఈ సినిమాలో కనిపించకపోవటంతో 2022 లో షూట్ పూర్తైనా ఇప్పటి ఓటిటి వాళ్లు తీసుకునేదాకా మోక్షం కలగలేదు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమా ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఈ చిత్రంలో ఈ రెండు కథలు ఏకకాలంలో సాగుతుంటాయి. వీరి కథలు ఒకే చోట కలుస్తాయి. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అయితే రెండు కథలు కలిసి ఓ మలుపు వచ్చేదాకా ఏమీ జరిగినట్లు అనిపించదు. ఆ మలుపు వచ్చాక సినిమా పరుగెడుతుంది. సినిమాలో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ను బాగా డిజైన్ చేసారు.

టెక్నికల్ గా ...

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా ఆ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. శిఖర్ భట్నాగర్ ఫొటోగ్రఫీ .. అంజద్ నదీమ్ ఆమిర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. మనీశ్ మోర్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

క్రైమ్ థ్రిల్లర్ లు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్యామిలీతో చూసేటప్పుడు జాగ్రత్త. ఫ్యామిలీలకు ఇబ్బందిగా రెండు మూడు అభ్యంతరకరమైన సన్నివేశాలైతే ఉన్నాయి.

ఎక్కడ చూడచ్చు

జియో సినిమా ఓటిటిలో తెలుగులో ఉంది

Tags:    

Similar News