దెయ్యం,పెళ్ళాం... వర్మను వదిలేలా లేరే
మరోసారి పెళ్ళాం, దెయ్యం కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సంచలనాల దర్శకుడు ఆర్‌జీవీ సిద్ధమయ్యారు. మరి ఈసారైనా సక్సెస్ అవుతారా..
ఎందుకనో రామ్ గోపాల్ వర్మకు దెయ్యం అంటే అబ్సెషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి సినిమాలు వరస పెట్టి తీస్తూనే ఉన్నారు. హిట్, ఫ్లాప్‌లతో ఆయనకు అసలు సంబంధం లేదు. ఆ లెక్కలేవో నిర్మాత చూసుకుంటాడు. వర్మే నిర్మాత అయినప్పుడు కూడా నాకు తోచిందేదో నేను తీస్తాను..మీకు నచ్చితే వచ్చి చూడండి అని ప్రకటనలు చేసి మళ్లీ మాట్లాడనివ్వకుండా చేశారు. అసలు ఆయన మొదట సినిమా హారర్ కాన్సెప్టుతోనే తీద్దామనుకున్నారు. అయితే అప్పుడు అక్కినేని వెంకట్.. ‘‘అబ్బాయ్... ఇలాగైతే నీ కెరీర్ అక్కడే ఆగిపోతుంది. ఎవరూ నీకు లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. మేము కూడా పట్టించుకోము. కాబట్టి నీకు డైరక్షన్ కావాలంటే మావోడితో వేరే సబ్జెక్టు తీయి. లేదంటే వేరే నిర్మాతను వెతుక్కో’’ అని నిర్మొహమాటంగా చెప్పేయబట్టే అప్పటికప్పుడు ‘శివ’ అనే కథ ఒకటి రాసుకుని ఒప్పించి తన మొదటి సినిమాని పట్టాలు ఎక్కించారు. కానీ ఆయనకు ఆ సినిమా పెద్ద సెన్సేషన్ అయినా దెయ్యాల సినిమాల పిచ్చ పోలేదు.
ఎప్పటికైనా జనాలను తన దెయ్యం సినిమాతో భయపెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా అది తీరినట్లు కనపడదు. పోనీ జనం అయినా పోనీలే ఈయన మనం భయపడితే.. ఇలాంటి సినిమాలు తీయడమైనా ఆపేస్తాడని భావించి భయపడినట్లు నటించలేదు. దాంతో రాత్రి, దెయ్యం, భూత్, పూంక్, రక్ష ఇలా బోలెడు దెయ్యం సినిమాలు వరస పెట్టి తీసేశారు. తన దగ్గరకు ఎవరైనా కుర్రాడు అసెస్టెంట్‌గా జాయిన్ అయితే ఓ దెయ్యం కథ ఇచ్చి డైరెక్ట్ చేయమనేవాడంటారు. అదేం ఖర్మో కానీ జనం కూడా వర్మ దెయ్యం సినిమా అంటే పని గట్టుకుని వెళ్లి మరీ ఆ హారర్ సీన్స్‌కు, ఎఫెక్ట్‌లకు నవ్వేసి వచ్చేయటం మొదలెట్టారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే కొంతకాలం ఆ దెయ్యాలకు బ్రేక్ ఇవ్వాలని ఆయన ఫిక్స్ అయ్యేటంత.
ఇక దెయ్యాల గొడవ పక్కన పెడితే.. మొగుడు, పెళ్ళాల రిలేషన్ అన్నా వర్మకు పడదు. పవిత్రంగా తాళి మెడలో వేసుకుని మొగుడుని టార్చర్ పెడుతుంటారని ఆయన వేళాకోళాలు చేస్తూంటారు. ఆయనకు ఈ భార్యలు అంటే ఎంత కసి అంటే మధ్యాహ్నం హత్య అనే సినిమా తీసేటంత. ఆ సినిమాలో జెడీ చక్రవర్తి తన భార్య ఆమని పోరు భరించలేక ఆమెను చంపేస్తాడు. "మీకు ఎప్పుడైనా మీ భార్య చనిపోతే బాగుండనిపించిందా" అన్న వాక్యం వివాదాలకు కూడా దారితీసింది. మహిళలపై హింసను, ప్రత్యేకించి గృహ హింసను ప్రోత్సహించేలా, సాధారణీకరించేలా ఈ వాక్యం ఉందంటూ మహిళా సంఘాలు ఉద్యమించాయి.
ఆ సినిమా ఆడి ఉంటే మరిన్ని భార్య భాదితుల సినిమాలు వచ్చేవని, ఆ అవకాశం లేకుండా పోయిందని అప్పట్లో కొందరు భార్య బాధితులు సీక్రెట్‌గా కలిసి వాపోయారట. అలా పాపం ఆయన ఓ వర్గానికి నచ్చే సినిమాలు తీద్దామని ప్రయత్నించారు. అయితే అలాంటి సినిమా చూడాలన్నా తమ భార్య పర్మిషన్ అవసరమైందేమో మరి జనం థియేటర్స్‌కు కదిలి రాలేదు. వాస్తవానికి అప్పటికి రామ్ గోపాల్ వర్మ ప్రభ బాగానే వెలుగుతోంది. ఆయన పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీస్తున్నారు. ఇప్పటిలాగా నాశిరకం చిత్రాలు తీయడం లేదు. అయినా కలిసొచ్చిందేమీ లేదు. కానీ ఆయనలో దెయ్యం, పెళ్లాం ఈ రెండు వదిలి వెళ్లలేదు. సబ్ కాన్షియస్ మైండ్‌లో మరీ గట్టిగా తిరిగేస్తున్నట్లున్నాయి.
ఇంతకాలానికి ఆ రోజులు గుర్తొచ్చినట్టున్నాయి. భార్యని, దెయ్యాన్ని కలిపి ఒకే దెబ్బతో సినిమాకు పట్టిన దెయ్యం వదిలిద్దామని ఫిక్స్ అయ్యినట్లున్నారు. ‘నా పెళ్లాం దెయ్యం’ పేరుతో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కిచెన్‌లో నిల్చున్న మహిళ ఫోటో బ్లర్‌గా కనిపిస్తుండగా.. తాళి ఫొటో మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. ఎప్పటిలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై క్యూరియాసిటీని కలిగించే ప్రయత్నం చేశారు ఆర్జీవి. అలాగే పోస్టర్ రిలీజ్ చేసిన రెండో రోజే..టైటిల్ మార్చానని ఇంకో పోస్టర్ వదిలారు. ‘నా పెళ్ళాం దెయ్యం..నీ పెళ్ళాం కాదా’ అని రెచ్చగొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు బార్యలపై కామెంట్ చేసేటంత ఖాళీగా మగాళ్లు ఉన్నారా… అనేది ప్రశ్న. ఏమో పెళ్ళాన్ని పబ్లిక్‌గా తిట్టుకోలేని చాలా మంది ఈ సినిమాకు పనిగట్టుకుని వస్తారనే ఆలోచన ఆయన చేసుండొచ్చు. లేదా వాళ్లంతా ఓటీటీలలో రహస్యంగా చూసే అవకాశం ఉందనే వ్యూహమూ కావచ్చు.
ఇక కొన్నాళ్ల క్రితమే ఆర్జీవీ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. నా పెళ్ళాం దెయ్యం పేరుతో ఓ సినిమా తీయబోతున్నానని తెలిపారు. ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని.. ఆ తర్వాత తన పెళ్ళాం దెయ్యంగా మారుతుందని తెలుసుకుంటాడనేది స్టోరీ లైన్ అని చెప్పారు వర్మ. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు తమ పెళ్లాం దెయ్యమనే అంటారని చెప్పుకొచ్చారు వర్మ. ఆయన అభిప్రాయాలు ఆయనవి. తెలుగు సినిమాకు దెయ్యంలా పట్టాడని ఆయన్ను కొందరంటారు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. ఏదేమైనా దెయ్యాలైన పెళ్ళాలు అయినా కదిలి వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తే అంతకు మించి కావాల్సింది ఏముంది.