"లవ్ మీ" మూవీ రివ్యూ

ఉత్సాహం ఎక్కువ, అనుభవం తక్కువ ఉన్న దర్శకుడు సినిమాను తీసిన పద్ధతి కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ మొత్తంగా క్లారిటీ తక్కువ కన్ఫ్యూజన్ ఎక్కువ.

By :  Vanaja
Update: 2024-05-25 12:04 GMT

ఇది చిన్న సినిమాల కాలం. వాయిదాల కాలం. థ్రిల్లర్ ల కాలం. చాలామంది యువ దర్శకులు కొత్త కొత్త పాయింట్లతో తమ టాలెంట్ ను తెరమీద ఆవిష్కరింపచేయడానికి ప్రయత్నిస్తున్న కాలం. ఈసారి మరో యువ దర్శకుడు అరుణ్ భీమవరపు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇది చిన్న సినిమా అయినప్పటికీ దిల్ రాజుకు చెందిన పెద్ద బ్యానర్ లో ఆయన కుటుంబ సభ్యులు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి ఈ సినిమాని నిర్మించారు. చివరికి ఈ సినిమా ఈరోజు (25 మే) రిలీజ్ అయింది.

ఈ సినిమా టీజర్లు కూడా ఇంప్రెస్సివ్ గానే ఉన్నాయి. కొత్త దర్శకుడు అయినప్పటికీ, ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ సినిమా పిసి శ్రీరామ్ పని చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీజర్లు, ట్రైలర్లు, మీడియా కవరేజ్ లు లాంటి వాటితో ఈ సినిమాను బాగానే ప్రచారం చేశారు. ఇంకో విశేషమేమంటే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు. అంటే మొదటి సినిమా "లవ్ మీ" "ఇఫ్ యు డేర్" అనే ట్యాగ్ లైన్ తో వచ్చింది. తెలుగులో చెప్పాలంటే "నన్ను ప్రేమించు" "నీకు ధైర్యం ఉంటే" అని చెప్పుకోవచ్చు. రెండో సినిమా "కిల్ మీ" "ఇఫ్ యు లవ్" అనే ట్యాగ్ లైన్ తో వస్తుందని దర్శకుడు కన్ఫర్మ్ చేశాడట. దాన్ని తెలుగులో "నన్ను చంపెయ్" నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, అని చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే రెండు సినిమా టైటిల్స్, ట్యాగ్ లైన్లు కొంచెం ఇంట్రెస్టింగా ఉన్నాయి అనిపిస్తుంది. సరే ఇక మొదటి సినిమా గురించి చూద్దాం.

దయ్యం ఉన్నా భయపెట్టలేదు

ఈ సినిమాకు పెద్ద తారలు లేరు గాని, మొదటి సినిమాతోనే తమ ప్రతిభను నిరూపించుకున్న ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా గురించి ముందుగానే కొన్ని విషయాలు బయట పెట్టారు. ఒకటి ఇది దయ్యం సినిమా. అది కూడా దయ్యానికి మనిషికి మధ్య జరిగే ప్రేమ కథ. ఒక విధంగా చెప్పాలంటే రొమాంటిక్, హారర్ థ్రిల్లర్.

సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని, ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ అని, సినిమా రెండవ భాగంలో హారర్ తో పాటు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, పనిలో పనిగా ఒక మెసేజ్ కూడా ఇందులో ఇచ్చారని, ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని, ఈ సినిమా ముందే చూసిన కొంత మంది ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పుష్ప 2 సినిమాలో అవకాశం వచ్చినా, డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో, ఈ సినిమా వదులుకున్నానని. అయితే ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని, కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని, ఈ సినిమా మేకర్స్ భరోసా ఇచ్చారని రవి కృష్ణ చెప్పడం విశేషం.

మొదట్లో అలరించినా-చివర్లో తేలిపోయింది

ఈ సినిమా ఒక దయ్యం కత్తి పట్టుకొని ఒక వ్యక్తిని చంపే ముందు, ఆ వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఈ కథలో హీరో దయ్యాన్ని ప్రేమిస్తాడని ముందే తెలిసింది కాబట్టి, ప్రేక్షకులు కొంతవరకు బిగినింగ్ తో ఇంప్రెస్ అవుతారు. ఫ్లాష్ బ్యాక్ లో కథ గురించి వస్తే, అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవి కృష్ణ) స్నేహితులు. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారు. అందులో అడ్వెంచర్స్, థ్రిల్ల్స్, నమ్మలేని నిజాలు, దయ్యాలు వంటి వాటి మీద వీడియోలు తీస్తుంటారు. అర్జున్,ప్రతాప్ వాళ్ళ ఊరిలో దివ్యవతి అనే ఒక దయ్యం ఉందని, అది తనను చూసిన వాళ్ళని చంపేస్తూ ఉంటుందని తెలుసుకొని ఆ మిస్టరీ ఛేదించడానికి వెళ్తాడు. చివరికి దయ్యం ఉందా లేదా? అన్న విషయం తెలుస్తుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది. దాంతో పాటే దీన్ని సీక్వెల్ "కిల్ మీ- ఇఫ్ యు లవ్" ఉందని ప్రేక్షకులకు తెలుస్తుంది.

విడదీయని చిక్కుముడులు

ఈ సినిమా ఒక రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. దర్శకుడు మొదటి సినిమా నే ఒక కొత్త పాయింట్ తో తీశాడు. అయితే హారర్ థ్రిల్లర్లు తీసేటప్పుడు ప్రేక్షకుల కు అర్థం కాకుండా సినిమా నడిపినప్పటికీ, చివర్లో అన్ని విషయాలు తేటతెల్లమ్ చేయాలి. అలా చేయనప్పుడు మొదటినుంచి సినిమా చూసిన ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని సీన్లు పెడతారు, కొంత సస్పెన్స్ కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మొదట్లో చిక్కుముడి చూపించినప్పుడు, చివర్లో దాన్ని విడదీయాలి. దర్శకుడు ఈ విషయంలో కొంత తప్పటడుగు వేశాడు. పోనీ ఇది మొదటి సినిమా, అనుభరాహిత్యం అని సరిపెట్టుకున్నప్పటికీ, కథలో కొంత క్లారిటీ లేకపోవడం, కథనంలో కన్ఫ్యూజన్ ఉండడం, ముఖ్యమైన ఒకటి రెండు పాయింట్లు చివర్లో నైనా సరే, కనీసం అర్థం చేసుకోలేని ప్రేక్షకులకు క్లియర్ చేసి ఉంటే బాగుండేది.

కీరవాణి మ్యూజిక్- మ్యాజిక్

అయితే ఈ సినిమా కొంత వరకు చూడదగ్గదిగా ఉండడానికి కావలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. . అందులో దయ్యంతో ప్రేమలో పడడం అనేది మొదటిది. రెండోది తమ తమ రంగాల్లో దిగ్గజాలైన ఎం. ఎం. కీరవాణి, పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేయడం. ఈ సినిమాలో పాటలు సో సో గా ఉన్నప్పటికీ, నేపథ్య సంగీతం ఇలాంటి సినిమాకి ఎలా ఉండాలో అలా ఉంది. ఇక సినిమా మొత్తం చిత్రీకరణ టోన్ బాగుంది. పిసి శ్రీరామ్ దీనికి కారణం. అయితే సినిమా సంగీతం, ఫోటోగ్రఫీ మాత్రమే బాగుంటే సరిపోదు అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి.

రాణించిన ఆశిష్-వైష్ణవి

పోతే రెండో కారణం హీరో హీరోయిన్లు. హీరోగా ఒక సినిమానే చేసినప్పటికీ, ఆశిష్ మెచ్చుకోదగ్గ నటన ప్రదర్శించాడు. బేబీ సినిమాతో తన టాలెంట్ చూపించిన వైష్ణవి చైతన్య డిఫరెంట్ షేడ్స్ లో ప్రశంసించదగ్గ నటన ప్రదర్శించింది.ఈ సినిమా కోసం పుష్ప2 సినిమాను వదిలేసుకున్న రవికృష్ణ అంతగా రాణించలేదు.

మొదటి సినిమానే హారర్ థ్రిల్లర్ ను ఎన్నుకున్న దర్శకుడు భీమవరపు అరుణ్, ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించదు. సినిమా కొన్నిచోట్ల అనుభవజ్ఞుడైన దర్శకుడిలా తీసినప్పటికీ, మొత్తంగా సినిమాను హారర్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కేవలం ఇంతవరకు రాని పాయింట్ మీదమాత్రమే మొత్తం సినిమా నడవదు. ఈ సినిమా చాలా చోట్ల ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుంది. మరికొన్ని చోట్ల గందరగోళం గా ఉంటుంది. దర్శకుడు దృష్టి అంత సీక్వెల్ మీద పెట్టినట్లు అనిపిస్తుంది. మొదటి సినిమాలో ప్రేక్షకులకు అర్థం కాని వాటిని, సీక్వెల్లో క్లారిఫై చేస్తానంటే కుదరదు. మొదటి సినిమా తేలిపోతుంది. దాని ఎఫెక్టు రెండో సినిమా మీద కూడా పడుతుంది.

నవల వేరు- సినిమా వేరు

ఉత్సాహం ఎక్కువ, అనుభవం తక్కువ ఉన్న దర్శకుడు సినిమాను తీసిన పద్ధతి కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఇలాంటి సినిమాలకు ఆయువు పట్టు అయిన చిక్కుముడులను చివర్లో అవసరమైన చోట విప్పక పోతే సినిమాలో థ్రిల్లర్, హారర్ లేకుండా పోయి, సినిమా సాధారణ సినిమాగా మారిపోతుంది. నవల రచయిత అయిన ఈ సినిమా దర్శకుడు, సినిమాను నవల లాగా తీయడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి సినిమాలకు అలా కుదరదు. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఒక పకడ్బందీ అయిన షార్ట్ స్టోరీ లాగ చివర్లో ట్విస్ట్ తో (ఓ హెన్రీ కథల్లో లాగ) ఉండాలి. దర్శకుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని, కథనాన్ని పకడ్బందీగా రాసుకుని తీసిఉంటే, సినిమా మరికాస్త బాగుండేదేమో.

సీక్వెల్లో దర్శకుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాడని ఆశిద్దాం...

నటీ నటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి

రచన, దర్శకత్వం: అరుణ్ భీమవరపు

సంగీతం: ఎం.ఎం. కీరవాణి

సినిమటోగ్రఫి : పీసీ శ్రీరామ్

ఎడిటింగ్: సంతోష్ నాయుడు కామిరెడ్డి

ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

నిర్మాతలు: నాగ మల్లిడి,హన్షిత రెడ్డి,హర్షిత్ రెడ్డి

నిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్

సమర్పణ: శిరీష్

విడుదల: మే 25, 2024

Tags:    

Similar News