రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’రివ్యూ
రామ్ చరణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ఈ శుక్రవారం సంక్రాంతి కానుకగా విడుదలైంది.;
రామ్ చరణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ఈ శుక్రవారం సంక్రాంతి కానుకగా విడుదలైంది. కాంబినేషన్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచిన చిత్రం ఇది. భారీతనానికి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకి పెట్టింది పేరైన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన మొదటి చిత్రం ఇదే. అలాగే గ్యాప్ తర్వాత రామ్‌చరణ్ సోలో హీరోగా ఇదే కావడం... దిల్‌రాజు భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. మరి ఆ అంచనాలు, ఆసక్తికి తగినట్లుగా ఉందా?
స్టోరీ లైన్
అప్పన్న(రామ్ చరణ్) ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి. అతను పూర్తి స్థాయి మార్పు కోసం ఓ రాజకీయ పార్టీని పెడతాడు. అయితే కొందరు తనవాళ్లే అనుకున్న వాళ్లు అనుకున్న సత్యమూర్తి (శ్రీకాంత్) చేత వెన్నుపోటు పొడవబడతాడు. రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు సత్యమూర్తి ముఖ్యమంత్రి. అతన్ని తప్పించి అతని కొడుకు బొబ్బిలి మోపిదేవి(ఎస్ జే సూర్య) సీఎం అవుదామనుకుంటాడు. అలాగే అప్పన్న కుమారుడు రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఇప్పుడు ఐపీఎస్ పాసై కలెక్టర్ గా తన ప్రాంతానికే వస్తాడు. అతని తన తండ్రి ఎవరు, ఆయనకు ఏమైందనే విషయం తెలియకుండానే పెరుగుతాడు. కానీ ఓ రోజు అనుకోకుండా అసలు విషయం తెలుస్తుంది. అప్పుడు మోపిదేవి..రామ్ నందన్ ని ఎలా అడ్డుకున్నాడు. చివరకు ఏమైంది, తండ్రి ఆశయాన్ని రామ్‌నందన్ ఎలా తీర్చగలిగాడు అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉంది
ఎన్నికల సంఘం పూర్తి పవర్ వాడితే ఎలక్షన్ లో ఎంత పకడ్బందీగా నిర్వహించవచ్చో అనే అంశాన్ని చెప్పాలనేది దర్శకుడు శంకర్ తాపత్రయం. అయితే అది మాత్రం హైలెట్ కాలేదు. రిలీజ్ కు ముందు అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఊరించిన శంకర్... సినిమాని మాత్రం పూర్తి ప్రిడిక్టబుల్ గా తీశారు. సినిమా అంతా ఎనభైలు, తొంభైలలో తీసినట్లు అనిపిస్తుంది. ఎక్కడా ఈ కాలానికి తగినట్లు అప్డేట్ సీన్స్ కనపడవు. అలాగే నేచురల్ గా నేరేషన్ సాగదు. అంతేకాదు సినిమా గతంలో వచ్చిన శంకర్ సినిమాలు ఒకే ఒక్కడుని గుర్తు చేస్తుంది. ఉన్నంతలో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికీ, రామ్‌నందన్‌కీ మధ్య యుద్ధం ఇంట్రస్టింగ్ గా ఉంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ ప్లాష్ బ్యాక్ సినిమాలో హైలెట్ గా ఉంది. మిగతా ఎపిసోడ్స్ అన్నీ సోసోగా ఉన్నాయి.
ఎక్కడ సినిమా ఎమోషనల్ డ్రైవ్ తీసుకోదు. హీరో పాత్ర ప్యాసివ్ గా సాగుతూ విసిగిస్తుంది. హీరోయిన్ తో ఎపిసోడ్ కూడా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో మలిచారు. అలాగే ఒక ఎలక్షన్ ఆఫీసర్ ... ఓటర్లను ...ఓటుకు ఇంత అని చెప్పి డబ్బు తీసుకోమని చెప్పడం, ఓటర్లకు పంచిపెట్టడానికి డబ్బుని తరలిస్తున్నారని చెప్పినా వదిలేయమని ఆదేశాలు ఇవ్వడం, రౌడీలకు భయపడి, వాళ్ల నుంచి ఈవీఎంలని కాపాడుకోవడానికి డ్రోన్‌లు ఉపయోగించడం...వంటివి ఆ పాత్ర విలువను తగ్గించేసాయి. పాత్రకు ఓ నిబద్ధత లేకపోవడం, తన డ్యూటీ చేస్తున్నాడా, తండ్రి ని చంపిన వారిపై పగ తీర్చుకుంటున్నాడా క్లారిటీ లేనట్లు కథనం సాగటం విసిగిస్తుంది. ఏదైమైనా స్క్రిప్టుపై మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది.
టెక్నికల్ గా
గేమ్ ఛేంజర్ చిత్రంలో పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. అయితే అదే సమయంలో థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు థమన్.మంత్రి మోపిదేవికి వచ్చే బీజీఎం బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ..ఎమోషన్స్ ని కట్ చేసేసిందేమో అనిపించింది. దిల్‍రాజు, శిరీష్ నిర్మాణవిలువలు తెరపై బాగా కనపడ్డాయి. శంకర్ దర్శకత్వం కొత్తగా లేదు. ఆయన అప్పటి శంకరే. ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నారు.దర్శకుడు శంకర్.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందనిపిస్తుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి.
నటీనటుల్లో ...
రామ్‍నందన్, అప్పన్న రెండు పాత్రల్లోనూ రామ్‍చరణ్ మెప్పించారు. విలన్ గా ఎస్‍జే సూర్య తన మార్క్ నటనతో రెచ్చిపోయారు. ఈ సినిమాలో అంజలిని స్పెషల్ గా మెన్షన్ చేయాలి. కియారా అడ్వానీ చూడటానికి బాగున్నా..తెరపై చేసిందేమీ లేదు. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్ అలవాటైన నటనతో చేసుకుంటూ వెళ్లిపోయారు.
చూడచ్చా
ఈ సినిమాని చరణ్ అభిమానులకు ఆ స్టైల్స్ నచ్చవచ్చు. అలాగే శంకర్ సినిమా కదా ఎక్సపెక్ట్ చేసి వెళితే మాత్రం నిరాశ పడతారు.