'KILL' తెలుగు రీమేక్ , డైరక్టర్ నే కిల్ చేసేలా ఉన్నారే ?ఇదేం రచ్చ
దర్శకుడు రమేష్ వర్మ హిందీ 'కిల్' రీమేక్ చేస్తే కిల్ చేసినట్లే అని సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.
By : జోశ్యుల సూర్యప్రకాశ్
Update: 2024-09-16 09:59 GMT
మన దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లోకి రీమేక్ లుగాతెగ వెళ్తున్నాయి. కానీ అక్కడ సినిమాలు ఇక్కడ రీమేక్ గా రావటం తగ్గిపోయింది. కానీ రీసెంట్ గా కిల్ అనే హిందీ చిత్రం సూపర్ హిట్టైంది. ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా మంది ట్రైల్స్ వేస్తున్నారు. జూలై 5న రిలీజైన ఈ సినిమా అక్కడ తెగ ఆడుతోంది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది.ఇప్పటికే హాలీవుడ్ ఫిల్మ్ ‘జాన్ విక్’ను తెరకెక్కించిన దర్శకుడు ఛార్లెస్ ఎఫ్. స్టాహెల్స్కీ ఇంగ్లీష్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ‘జాన్ విక్’మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో యాక్షన్ ప్రియులకు బాగా తెలుసు. అలాంటి మూవీని తీసిన ఛార్లెస్ ఇందులోని స్టంట్స్‌కు ఫిదా అయ్యాడంటే అవి ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడీ సినిమా తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ కాబోతోందనే వార్త వైరల్ అవుతోంది. అయితే అందులో వింతేమీ లేదు కానీ ఆ చిత్రం చేయబోయే డైరక్టర్ ని, నటించబోయే హీరోని అందరూ విమర్శలు చేస్తున్నారు. పూర్తి స్దాయి యాక్షన్ సినిమాగా వచ్చిన కిల్ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలని అందుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో విజయవంతమైన మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారంటూ టాక్ మొదలైంది. ‘కిల్’ రీమేక్ రైట్స్ కోసం ప్రస్తుతం అనేకమంది పోటీ పడుతున్నారు. సుధీర్ బాబు (Sudheer Babu) లేదా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పేర్లు బాగా వినిపించాయి. అయితే దర్శకుడు రమేష్ వర్మ ఈ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారనేది అందరినీ ఆశ్చర్య పరిచింది.
అలాగే ఈ చిత్రాన్ని లారెన్స్ తో ఈ సినిమాని రీమేక్ చేయబోతున్నారనేది మరో షాకిచ్చే న్యూస్. కిల్ సినిమా అంతా దాదాపుగా ట్రైన్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే కంప్లీట్ గా సీక్వెన్స్ తో ఉంటుంది. అలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని లారెన్స్ తో తీయడం ఎంతవరకూ సబబు అంటున్నారు. అలాగే యాక్షన్ ఫ్లేవర్ తగ్గకుండా తెలుగు వర్షన్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు రమేష్ వర్మ. తెలుగులో పూర్తి యాక్షన్ మూవీ అంటే వర్కవుట్ కాకపోవచ్చు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ జానర్‌లో ప్రేక్షకుల కు నచ్చాయి.
అలాగని ‘కిల్’లాంటి చిత్రంలో కామెడీ, పాటలు జొప్పిస్తే, కిచిడీ అయి కూర్చొంటుందనేది నిజం. బాలీవుడ్ మూవీలో ఉన్న యాక్షన్ ఫ్లేవర్ తగ్గకుండానే ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నాడంటున్నారు. లారెన్స్ తమ ఇమేజ్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు చేయాలనుకుంటున్నారట. అది ఎంత వరకూ సాధ్యమో తెలియాల్సి ఉంది. అయితే రమేష్ వర్మ కిల్ రీమేక్ చేస్తే కిల్ చేసినట్లే అని సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. మరో ప్రక్క రమేష్ వర్మ చేస్తోంది కిల్ సినిమా కాదు. రీమేక్ రైట్స్ తీసుకున్నారు కానీ ఆ సినిమా రీమేక్ మాత్రం ఇప్పుడు లారెన్స్ చేస్తున్న చిత్రం కాదు అని కొందరంటన్నారు. ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఏదైమైనా కోనేరు సత్యనారాయణతో కలిసి రమేష్ వర్మ ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నారనేది మాత్రం నిజం అంటున్నారు.
ఇక లక్ష్ లాల్వానీ (Lakshya)కథానాయకుడిగా నిఖిల్ నగశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’. తాన్యా మనక్తిలా (Tanya Maniktala)హీరోయిన్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యాక్షన్ ప్రియులు ఇందులో స్టంట్స్‌కు ఫిదా అవుతున్నారు. ఆయా సన్నివేశాలను సరికొత్తగా తీర్చిదిద్దారంటూ కితాబిస్తున్నారు.
'కిల్' చిత్రం కథేంటంటే..
ఎన్‍ఎస్‍జీ కమాండోగా పని చేస్తున్న అమిత్ రాథోడ్ ( లక్ష్ లాల్వానీ) ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్‍లో బయలుదేరి వస్తూంటాడు. అమిత్‍తో పాటు తోటి కమాండో తన స్నేహితుడు వీరేశ్ (అభిషేక్ చౌహాన్) కూడా ఉంటాడు. రాత్రిపూట ప్రయాణం. అమిత్ ఆలోచనల నిండా ఒకటే. తను ప్రేమించిన అమ్మాయి కోటీశ్వరరాలు అయిన తులికా (తాన్య మనక్తిలా)కు వేరే అబ్బాయితో ఎంగేజ్‍మెంట్ చేసేసారు. వాళ్లకు కమెండో గా పనిచేసే అమిత్ ఆనడు. దాంతో ఆమె తల్లితండ్రులు ఇలా వేరే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసేసారన్నమాట. అదే ట్రైన్ లో ఆమె తన ఫ్యామిలీతో ఉంది. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనేది అమిత్ ఆలోచన.
ఇదిలా ఉండగా...ఊహించని విధంగా ఆ ట్రైన్ పై బందిపోట్ల దాడి జరుగుతుంది. ఫణి (రాఘవ్ జుయల్), బేని (ఆశిష్ విద్యార్థి) లీడ్ చేస్తున్న ఓ బందిపోట్ల ముఠా ఆ ట్రైన్ లోని ప్రయాణికులపై దాడి చేస్తుంది. ప్రయాణికులను ఆ బందిపోట్లు దోచుకునేందుకు వస్తారు. ఆ బందిపోట్లు కేవలం దోచుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా తీస్తుంటారు. బయిటకు కాల్స్ వెళ్లకుండా జామర్లు పెట్టి ఎవరి ఫోన్లు పని చేయకుండా చేస్తారు. ఈ క్రమంలో ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణీకుల తో పాటు తులికా కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అప్పుడు అమిత్ రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడు వీరేశ్ సాయింతో కమెండో స్కిల్స్ తో ఆ బందిపోట్లపై సునామీలా విరుచుకుపడతాడు. అప్పుడు ఏం జరిగింది. తులికా ఫ్యామిలీని, ప్రయాణీకులను రక్షించగలిగారా....అనేది మిగతా కథ.