‘నిజంగా నిజామాబాద్ బిడ్డనే అన్న దిల్ రాజు’

ఫక్తూ వ్యాపారవేత్తల మాట్లాడి, ఆపై క్షమాపణ;

Update: 2025-01-11 11:06 GMT

టాలీవుడ్ సినీ ప్రముఖుడు, అగ్ర నిర్మాత ‘దిల్’ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఈ మధ్య ఆయన నిర్మాణంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా ఈవెంట్ ను నిజామాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ‘‘మటన్, తెల్లకళ్లు’’ అంటే ఇష్టమని, ఆంధ్ర వారికి సినిమా అంటే ఇష్టమని అక్కడ ఫంక్షన్ నిర్వహిస్తే ఓ వైబ్ వస్తుందని కామెంట్ చేశారు.

దీనిపై విమర్శలు చెలరేగడంతో ఆయన ఈ రోజు ఓ వీడియో విడుదల చేశాడు. తను తెలంగాణ కల్చర్ ను ఎక్కడా అవమానించలేదని, తనకు ఆ ఉద్దేశం లేదని అన్నారు. నా సొంత జిల్లా నిజామాబాద్ అని చెప్పుకొచ్చారు. సొంత రాష్ట్రం వాడిగా ఎలా తెలంగాణని అవమానిస్తా అని ప్రశ్నించారు.

ఇంతకుముందు ఫిదా, బలగం వంటి హిట్ చిత్రాలు తీసానని గుర్తు చేశారు. వాటిని తెలంగాణ ప్రజలు తమ కుటుంబం కథగా ఆదరించారని అన్నారు. ముఖ్యంగా కుటుంబ కథగా వచ్చిన బలగం సినిమాను తెలంగాణ ఎలా ఆదరించిందో ప్రత్యేకంగా ప్రస్తావించారు. నా ఉద్దేశంలో ఎక్కడైనా మిస్ కమ్యూనికేషన్ అయి ఎవరైన బాధపడి ఉంటే తనను క్షమించాలని అన్నారు.
విమర్శలు చెలరేగడంతో వెనక్కి..
దిల్ రాజు మాట్లాడిన మాటల్లో ఓ నిజం మాత్రం ఉంది. అదే, తెలంగాణలో సినీ స్టార్లకు అంత క్రేజ్ లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే.. ఆంధ్రలో ఉన్నట్లుగా వెర్రిగా ఆరాధించే అభిమానులు ఇక్కడ ఎవరూ లేరు. ఉన్న వేళ్లమీద లెక్కపెట్టేంతా మంది ఉండవచ్చు, అంతే.. అంతకుమించి ఉండరు. ‘‘ మాకు సినిమాలు అంటే కేవలం కళాకారులు మాత్రమే. అంతే భూమి మీది నుంచి కిందికి వచ్చిన తారల్లా చూడం’’ అని ఓయూకి చెందిన ఓ విద్యార్థి నాయకుడు ఫెడరల్ తో మాట్లాడుతూ చెప్పిన మాట.

దిల్ రాజు తెలంగాణ సంస్కృతి మర్చిపోయినట్లు కనిపిస్తోంది. పొద్దున్న పేపర్ ఎలా ఇంటికి వస్తుందో.. సాయంత్రం తెలంగాణలో కల్లు ఇంటికి వస్తుంది. ఇలా కల్లును గౌడ అన్నలు తీసుకురావడాన్ని వాడుక లేదా కల్లు వాటిక అంటారు. ఇవి ప్రతి ఊరిలో కనపడుతుంది. తాను తెలంగాణ వాడిననే చెప్పుకునే దిల్ రాజు ఈ విషయాన్ని ఎలా మాట్లాడాడు. 

ఇక్కడ వాతావరణం వేరు. పైగా సినిమా వాళ్లను అంతగా నమ్మదగిన వ్యక్తుల్లా తెలంగాణ వాసులు పరిగణించరు. లోకల్ వారికి అవకాశాలు ఇవ్వరు. చాలా కాలం పాటు స్థానిక ప్రజల భాషను ఎలా ఉపయోగించి అవహేళన చేశారో ఇంకా వారికి గుర్తు ఉంది. ఎన్టీఆర్, చిరంజీవి పార్టీలు పెట్టి తెలంగాణ ప్రజలను అడ్డంగా మోసం చేశారు. ఇవన్నీ 30 ప్లస్ ఉన్న యువకులకు బాగా తెలుసు. అందుకే సినిమాను కేవలం వినోద సాధనంగానే చూస్తారు. పోనీ మా వాడు అని ఓన్ చేసుకోవడానికి కనీసం ఓ పదిమంది హీరోలు కూడా లేరు.
టాలీవుడ్ అంటే కేవలం ఆంధ్ర చిత్రపరిశ్రమ అని ఓ ముద్ర స్థానిక ప్రజల మెదళ్లలో ఉండిపోయింది. కాదు పోయేలా వాళ్లే చేసుకున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీని తెలంగాణ వాళ్లు పట్టించుకోరు. ఆంధ్రలో చిన్న ప్రకృతి విపత్తు రాగానే టాలీవుడ్ పెద్దలు ఏదో భూకంపం బద్దలు అయిపోయనట్లు హడావుడి చేసేవారు.
అదే తెలంగాణ రైతాంగం మీద ఎలాంటి ప్రేమ కనపరిచారో తెలంగాణ ఉద్యమం సందర్భంగా చాలా బాగా ప్రచారం అయింది. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన ప్రాంతంగా అప్పట్లో తెలంగాణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ టాలీవుడ్ నుంచి కనీసం మాట సాయం కూడా రాలేదు. ఇది అక్కడ వారి మనస్తత్వం. అందుకే సినిమా వాళ్లంటే ఇక్కడ మంచి అభిప్రాయం లేదు.
సొంత రాష్ట్రమైనా.. అదే విధానం..
తెలంగాణ లో పండగల సందర్భంగా కూడా ఓ స్పష్టమైన విభజన రేఖ కనపడుతుంది. టీవీల్లో చేసే ప్రోగ్రాంల్లో స్థానిక యాంకర్లు గానీ, ఇతర బుల్లి తెర స్టార్లు లేకపోవడంతో బతకమ్మ పండగల సందర్భంగా వాటిని సరిగా నిర్వహించలేక నానా అవస్థలు పడటం కనపడుతుంది.
అదే సంక్రాంతికి ప్రసారం అయ్యే స్టోరీలు అయితే మాత్రం అక్కడికి వెళ్లి షూట్ చేసుకుని వచ్చి ప్రసారం చేస్తారు. అన్ని ఛానెల్లు ఆంధ్ర యాజమాన్యంలో ఉండటంతో ఈవిధంగా జరుగుతోంది. ఇదంతా తెలంగాణ సమాజం బాగా గమనిస్తోంది. అందుకే సినిమా ప్రొగ్రాంల విషయంలో మా దగ్గర వైబ్ రాదు.
మటన్ దుకాణం పెట్టుకో.. దేశపతి శ్రీనివాస్
దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ రాజు లో ‘రాజు’ మాత్రం ఇక్కడ ఉంటారని, ఆయన దిల్ లో ఆంధ్ర ఉంటుందని విమర్శించారు. తెలంగాణ సమాజంలో చేసే ప్రతిపండగలో కల్లు, మటన్ ఉంటాయని, అవి మా సంస్కృతి అని పేర్కొన్నారు.
దేవతలకు సైతం ఇక్కడ కల్లుశాఖ పేరుతో పోస్తారని, ఎల్లమ్మ దేవత సందర్భంగా కల్లు ప్రాధాన్యం వివరించే ప్రయత్నం చేశారు. దిల్ రాజు కేవలం ఆంధ్రలో సినిమా వ్యాపారం నిర్వహించడానికి తెలంగాణ సంస్కృతి హేళన చేస్తున్నారని రసమయి విమర్శించారు.
తెలంగాణలో సినిమా రేట్ల పెంపు ఉండదని భీషణ ప్రతిజ్ఞ చేశారని, కానీ రెండు రోజుల్లోనే తమ మాట మార్చుకున్నారని దేశపతి శ్రీనివాస్ అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రికి ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో తీసుకొచ్చిన జీవోపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దిల్ రాజు నమ్మదగిన వ్యక్తి కాదని, ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా మాటకు సాయం కాలేదని అన్నారు.
సినిమాకు తెలంగాణలో వైబ్ లేకపోతే వ్యాపారం మానుకుని, నీకు వైబ్ అనిపిస్తున్నా..కల్లు, మాంసం దుకాణం పెట్టుకోవాలని కోరారు. వైబ్ లేనప్పుడూ ముఖ్యమంత్రిని పట్టుకుని నైజాంలో ఎందుకు టికెట్ రేట్లు పెంచుకున్నారని అన్నారు. రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారని ప్రశ్నించారు. తన మాటలను తానే అవలంభించడం లేదని, పూటకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News