దిల్ రాజుకే సినిమా చూపిస్తున్న పొలిటిషన్స్

రాజకీయాలు, సినిమాల రెండు సమాంతరంగా వెళ్తూనే ఎక్కడో చోట కలిసి విడిపోతూంటాయి.;

Update: 2025-01-01 07:01 GMT

రాజకీయాలు, సినిమాల రెండు సమాంతరంగా వెళ్తూనే ఎక్కడో చోట కలిసి విడిపోతూంటాయి. ఈ రెండు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెడుతూ ఉంటాయి. అలాగే కొన్ని సమయాల్లో, సినిమాలు రాజకీయ అంశాలను ప్రదర్శించడానికి వేదికగా మారతాయి.ఈ రెండు సామాన్యుల జీవితాలను, ఆలోచనా విధానాలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఒకదానికొకటి సమస్యగా మారినప్పుడే వస్తుంది అసలు సమస్య. ఇప్పుడు తెలుగు సినిమా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాజకీయ సమస్యలో పడ్డాడంటున్నారు.

కరెక్ట్ గా చెప్పాలంటే ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ గా దిల్‌ రాజు(Dil Raju) ఎంపికైన నాటి నుంచి రోజుకో సమస్య ఎదురవుతోంది. మీడియా భాషలో చెప్పాలంటే రోజుకో అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్ విషయంలో ఆచి,తూచి మాట్లాడాల్సి వస్తోంది. దానికి తోడు తన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రత్యేకమైన సౌకర్యాలు అడగలేని పరిస్దితి.

కొంతకాలం క్రితం వరకూ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు మిగతా సినిమా వాళ్ళతో పాటు దిల్ రాజు సైతం వారితో సన్నిహితంగా ఉండేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తో సన్నిహితంగా ఉండాల్సి వస్తోంది. అలాగని డైరెక్ట్ గా ఫేవర్స్ ఏమీ అనలేని పరిస్దితి.

తన ఒక్కడి పనులు అయితే ఎలాగైనా తన పరిచయాలతో పొలిటిషియన్స్ తో చేయించుకోగలరు దిల్ రాజు. కానీ తను ఇప్పుడు ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ కావటంతో అందరితోను,ముఖ్యంగా ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాల్సిన పరిస్దితి. ఎంతలా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తో సన్నిహితంగా ఉండాల్సి వస్తున్న నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీపై దిల్‌రాజు కౌంటర్స్ ఇవ్వాల్సి వస్తోంది.

రీసెంట్ గా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) మాట్లాడుతూ... సినీ నటుడు అల్లు అర్జున్‌ వ్యవహారంపై మరోసారి స్పందించారు. కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అలా మాట్లాడారని పేర్కొన్నారు. అటెన్షన్‌, డైవర్షన్‌ కోసమే సీఎం పాకులాడుతున్నారన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి.. సినిమా వాళ్ళతో సెటిల్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ హోదాలో దిల్‌ రాజు స్పందించక తప్పలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) చేసిన కామెంట్స్ బాధాకరమని దిల్‌ రాజు (Dil Raju) ట్వీట్‌ చేశారు.

దిల్ రాజు ట్వీట్ లో ...‘‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటు మాటున జరిగిన వ్యవహారం కాదు.. అందరికీ తెలిసే జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారు.

అలాగే హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

ఇలా దిల్ రాజు మాట్లాడటం వెనుక.. వందల కోట్లు బడ్జెట్‌తో జరిగే సినిమా వ్యాపారం మొత్తం ఉంది. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు, వందల కోట్లతో వ్యాపారం చేస్తున్నప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరినీ గట్టిగా వ్యతిరేకించడం మంచిది కాదని ఇలా స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. ‘నొప్పింపక తానొవ్వక’ అన్నట్లుగా దిల్ రాజు సర్దుకుపోతున్నారు. కొన్ని సందర్బాల్లో తాను ఓ పార్టీకి లేదా వర్గానికి వ్యతిరేకం అవుతాను అని తెలిసినా మాట్లాడటం తప్పటం లేదు.

ఇదంతా ఒకెత్తు అయితే 2025 కొత్త ఏడాది థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' రిలీజ్ తో సందడి షురూ కాబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 10న పొంగల్ కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, దిల్ రాజు నిర్మించారు. అయితే రీసెంట్ గా తెలుగు పరిశ్రమలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ సినిమాకు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల సంగతి ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా 'గేమ్ ఛేంజర్' విషయంలో టికెట్ రేట్లు కీలకంగా మారబోతున్నాయి.

రీసెంట్ గా సంధ్య థియేటర్ విషాద ఘటన దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేట్ల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లకు తెలంగాణలో అనుమతి ఇవ్వను అని ఆయన తేల్చారు. దీంతో రానున్న పెద్ద సినిమాల నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి. కాకపోతే రీసెంట్ గా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలంతా ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News